బప్తిస్త
యోహాను శిరచ్చేదనము (ఆగష్టు 29)
క్రీస్తునందు
ప్రియ సహోదరీ సహోదరులారా! నేడు మనం బప్తిస్త యోహాను శిరచ్చేదనమును స్మరించు
కొంటున్నాము. మార్కు సువార్త 6:21వ వచనం నుండి ఆలకించుదాం: “హేరోదు జన్మదినోత్సవమున,
హేరోదియా కుమార్తె ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు హేరోదు ‘నీ ఇష్టమైన
దానిని కోరుకొనుము ఇచ్చెదను’ అని అనెను. ఆ బాలిక వెలుపలికి పోయి తన తల్లిని
అడిగెను. ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, బప్తిస్త యోహాను శిరమును ఇప్పుడే ఒక
పళ్ళెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందులకు రాజు అతిధుల ఎదుట శపథము చేసినందున
ఆమె కోరికను కాదనలేక పోయెను. కనుక అతడు యోహాను తలను తీసికొని రమ్ము అని వెంటనే ఒక
తలారికి ఆజ్ఞాపించెను.”
బప్తిస్త యోహాను జెకర్యా-ఎలిశబెతమ్మల కుమారుడు. యేసు ప్రభువుకు బంధువు. పాత, క్రొత్త నిబంధనలకు
వారధిగా, అనుసంధానకర్తగా, మెస్సయ్యకు మార్గదర్శిగా చరిత్రలో నిలిచిపోయారు. యేసు ప్రభువు స్వయంగా, “స్త్రీల
సంతానములో బప్తిస్త యోహాను కంటె అధికుడగు వాడెవడు లేడు”
(లూకా 7:28) అని బప్తిస్త యోహాను గురించి
గొప్పగా ప్రశంసించారు.
బప్తిస్త
యోహాను శిరచ్ఛేదనం ప్రాముఖ్యమైన, కీలకమైన
సంఘటన. ఇది యేసుక్రీస్తు మార్గమును సిద్ధపరచిన యోహాను వేదసాక్ష్యము. దీనిని
గూర్చిన వివరణ మార్కు 6:14-29; మత్త
14:1-12లో చదవవచ్చు. యోహాను శిరచ్చేదనము గావింపబడుటకు ప్రధాన కారణాలు: అతను దేవుని
రాజ్యము సమీపించినదని, హృదయపరివర్తన చెందాలని బోధించినందులకు హింసలపాలయ్యాడు. చెరసాలలో బంధించబడినాడు. ఆ తరువాత శిరచ్ఛేదనం కావింప బడ్డాడు. హేరోదు
మహారాజు కుమారుడు అయిన హేరోదు అంతిపాసు తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హేరోదియాను
వివాహమాడినందున అతనిని యోహాను హెచ్చరించాడు (మత్త 14:3-4; మార్కు
6:17-18); దీనితో హేరోదియాకు యోహానుపై ద్వేషం కలిగింది. అతనిని
ఎలాగైనా తుదముట్టించాలని అనుకున్నది; హేరోదు
పుట్టినరోజు వేడుకల్లో తన కుమార్తెతో నాట్యం చేయించి, ఆమె కోరిక నెరవేరేలా చేసింది. హేరోదియా
కుమార్తె బప్తిస్త యోహాను శిరమును పళ్ళెములో పెట్టి ఇవ్వుమని కోరింది (మత్త
14:6-11; మార్కు 6:21-28). ఈవిధంగా, హేరోదు తాగుబోతుతనంలో చేసిన ప్రమాణం, హేరోదియా ద్వేషం, ఆమె కుమార్తె కోరికతో కలిసి యోహాను శిరచ్చేదనమునకు, మరణానికి దారితీసింది.
బప్తిస్త
యోహాను శిరచ్ఛేదనంకు మరో ముఖ్యమైన కారణం. అతను సత్యాన్ని మాట్లాడాడు. సత్యం
చెప్పడం కష్టమైన పని. ఎందుకంటే సత్యం
మనల్ని బాధపెడుతుంది. చాలాసార్లు మనం ఇతరుల నుండి మనకు
నచ్చిన విషయాలను, మనల్ని సంతోషపెట్టే వాటిని మాత్రమే
వినాలని కోరుకుంటాం. మనం ఎంత మంచివారమో, మన గురించి మంచి
మాటలు చెబితే బాగుంటుందని అనుకుంటాం. కొందరు ఇతరులు చేసిన చెడు పనుల గురించి నిజం
చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే నిజం చెబితే తమ ఉద్యోగాలను, పదోన్నతులను కోల్పోవచ్చని లేదా ఆర్థిక సహాయం లభించదని వారికి భయం.
మరియు బప్తిస్త
యోహాను మరణం, రాజకీయ ఉద్రిక్తల నేపధ్యములో కూడా చూడాల్సి ఉంది.
యోహాను ప్రవక్తయని ప్రఖ్యాతి గాంచుటచే, గలిలీయ, పెరియ
ప్రాంతాలకు చతుర్దాంశాధిపతియగు [4 BC-39AD] హేరోదు,
ప్రజలకు భయపడెను (మత్త 14:5). “యోహాను నీతిమంతుడు, పవిత్రుడు
అని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతనిని కాపాడ చూచెను. అతని
హితోపదేశములకు హేరోదు కలత చెందినను వానిని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను” (మార్కు
6:20). కానీ యోహాను బోధనలను హేరోదు పెడచెవిన పెట్టాడు. తన
అధికారానికి, పాలనకు ముప్పుగా భావించాడు. భయముతో ఏమీ చేయలేక యోహానును
చెరసాలలో వేయించాడు. బహుశా, మెస్సయ్య రాకను ఆశించి చాలామంది ప్రజలు యోహానును
వెంబడించారు. కాని, స్వకీర్తికోసం యోహాను ఎప్పుడు ప్రాకులాడలేదు.
తప్పుడు గౌరవాన్ని ఎప్పుడూ అనుమంతించలేదు. తాను కేవలం “ప్రభువు మార్గమును
సిద్ధపరచుటకు” పంపబడినానని తెలిపి యున్నాడు. అందుకే,
సమయమాసన్న మైనప్పుడు, యోహాను తన శిష్యులకు యేసును “దేవుని గొర్రెపిల్ల”యని
పరిచయం చేయగా, వారు ఆయనను వెంబడించారు (యోహాను 1:35-37).
హేరోదు
క్రూరుడు, అహంకారి, గర్విష్టి. ఒకానొక సందర్భములో ప్రభువు
అతనిని “నక్క”గా సంబోధించారు (లూకా 13:32). కారణం హేరోదు కుతంత్రం మరియు మోసం, ఇతరులను నాశనం చేసే స్వభావం. అలాగే ప్రాముఖ్యత
లేని వ్యక్తి అని సూచిస్తుంది. యేసు హేరోదును “నక్క” అని సంబోధించడం ద్వారా అతని
దుర్మార్గమైన, మోసపూరితమైన మరియు బలహీనమైన
స్వభావాన్ని ఎత్తిచూపారు. ఈ వ్యాఖ్య హేరోదును భయపెట్టడానికి ఉద్దేశించినది కాదు,
కానీ దేవుని సంకల్పం ముందు అతని కుతంత్రాలు ఏ
మాత్రం పని చేయవని తెలియజేయడానికి ఉద్దేశించినది.
హేరోదు
చట్టబద్ధమైన భార్య, నాబటియన్ల పొరుగున ఉన్న అరేబియా
రాజవంశానికి చెందిన ఫాసెలిస్’ను - విడచి,
సోదరుని భార్య, తనకు మేనకోడలు అయిన హేరోదియాను వివాహ మాడాడు.
హేరోదియాతో సహా పలు భార్యలు, ఉంపుడు గత్తెలూ ఉన్నారు. అతను తన మొదటి భార్యతో వివాహంలో ఉండగానే, హేరోదు హెరోదియాను కలుసుకున్నాడు. వారు మొదట వ్యభిచారంలో జీవించారు,
తరువాత వారు వివాహం చేసుకోవడానికి వారిద్దరూ తమ
జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. “పాపం తరచుగా దానికి తగిన శిక్షను కొని తెచ్చుకుంటుంది.”
హేరోదు విషయంలోనూ అదే జరిగింది. నాబటియన్లు
తమ దేశస్థురాలైన తన మొదటి భార్యను అవమానించినందుకు హేరోదుపై ఆగ్రహం చెందారు. క్రీ.శ.
39వ సంవత్సరములో నాబటియన్లకు, హేరోదుకు మధ్య యుద్ధం జరిగింది. అది హేరోదు బహిష్కరణకు దారితీసింది.
పాత నిబంధన ప్రవక్తలు రాజుల అనైతికతను ఎలా ఎదిరించారో అదేవిధంగా,
బప్తిస్త యోహాను కూడా హేరోదును ఎదిరించాడు.
యోహాను హేరోదుకు వివాహంలో విశ్వాసం గురించి సత్యాన్ని బోధించాడు. అయితే, యోహాను బోధన హేరోదు మీద ఏమాత్రం ప్రభావం చూపలేదు, హేరోదు మరియు హెరోదియా కలిసి జీవించడం కొనసాగించారు. యూదుల
చట్టం ప్రకారముగా (లేవీ 18:16; 20:21) హేరోదు-హేరోదియాల వివాహమును యోహాను
ఖండించాడు. “ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు” (మార్కు
6:4) అని హెచ్చరించాడు.
యూదుల
ప్రమాణాల ప్రకారం, వారి వివాహం వ్యభిచారము, అక్రమ సంబంధముగా
పరిగణింప బడుతుంది. కుటుంబ ధర్మములను మీరినట్లు అవుతుంది. ఈవిధముగా, పాపమును,
అన్యాయమును, ఇతర దుశ్చర్యలను యోహాను ధైర్యముగా ఖండించాడు.
దానిపర్యవసానమే, చెరసాలలోనున్న [మృత సముద్రానికి వాయువ్యముగా,
ప్రస్తుత జోర్ధాను] బప్తిస్త యోహాను శిరచ్చేదనము గావింపబడటం (సుమారు
క్రీ.శ. 30). తన తలను పళ్ళెములో పెట్టి హేరోదియా కుమార్తెకు ఇవ్వగా, ఆ
బాలిక [సలోమి] తన తల్లికి ఇచ్చెను (మత్త 14:11; మార్కు
6:28). వెంటనే యోహాను శిష్యులు వచ్చి భౌతిక దేహమును తీసికొని పోయి సమాధి చేసారు.
పిమ్మట వారు యేసు యొద్దకు వెళ్లి ఆ విషయమును తెలియ జేసారు (మత్త 14:12-13; మార్కు
6:29).
ఈ
వార్త విని యేసు నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా వెళ్ళారు (మత్త 14:13). యోహాను శిరచ్ఛేదం చేయబడ్డాడు అన్న వార్త విని, యేసు చాలా బాధపడ్డారు. ఈ చర్య యేసు మానవత్వాన్ని, యోహానుపై ఆయనకు ఉన్న ప్రేమను సూచిస్తుంది. ఆ తరువాత
యేసు యోహానును గొప్ప ప్రవక్తగా, సత్యం కోసం ప్రాణాలను అర్పించిన వేదసాక్షిగా
గౌరవించారు (మత్త 11:11; లూకా 7:28). ఈవిధముగా, క్రీస్తుకు ముందు యోహాను జన్మించినట్లే, క్రీస్తు అనుభవించబోయే శ్రమలకు, మరణానికి కూడా ఆయనే ముందు నిలిచాడు. యోహాను మరణం యేసుకు ఒక సంకేతంగా
మారింది. అందుకే, యోహాను మరణం తర్వాత, యేసు తన పరిచర్యను వేగవంతం చేసారు.
బప్తిస్త
యోహాను శిరచ్ఛేదనం
సత్యమునకు సాక్ష్యముగా నున్నది. అతని మరణం తన అచంచలమైన విశ్వాసము కొరకు అంతిమ
త్యాగబలిగా సూచిస్తుంది. దేవుని చిత్తము పట్ల తనకున్న నిబద్ధతకు గొప్ప
నిదర్శనం. తాను పలికిన “ఆయన హెచ్చింప బడవలెను. నేను తగ్గింప
బడవలెను” (యోహాను 3:30) అన్న ప్రవచనం నెరవేరినది. యోహాను
మొదటి నుండి కూడా యేసు జీవితానికి ప్రతిబింబముగా ఉన్నాడు (మార్కు 1:2-14). అతని
శిరచ్చేదనము యేసు జీవితానికి, శ్రమలకు సూచనగా ఉన్నది. యోహాను మరణం, యేసు
మరణ పునరుత్థానములను సూచిస్తుంది.
బప్తిస్త
యోహాను, తనకు అప్పగింప బడిన ప్రేషిత కార్యమును, దైవచిత్తమును
వెనుకంజ వేయక, నిస్వార్ధముగా చివరి వరకు, మరణానికి
సైతం భయపడక సంపూర్ణముగా నెరవేర్చాడు. దేవుని ఆజ్ఞల పట్ల అతనికున్న విశ్వసనీయత
అమోఘం! వేదసాక్షి మరణం, శిష్యులకు, విశ్వాసులకు
ఏ సమయములోనైనా సంభవించ వచ్చును. బప్తిస్మ యోహాను శిరచ్చేదనము క్రైస్తవ జీవితం,
సువార్త పరిచర్య, దానిలో భాగముగా పొందవలసిన, శ్రమలకు
దర్పణముగాను, ఆదర్శముగాను ఉంటుంది. అలాగే, యోహాను
మరణం నిజమైన శిష్యరికానికి, దాని స్వభావానికి నిదర్శనం.
బప్తిస్త
యోహాను – గురువులకు ఆదర్శం: పునీత అగుస్తీనుగారు
తన ఉపదేశములో [సర్మన్ 293:1-3], బప్తిస్త యోహానును ఒక యాజకుని పాత్రకు ఒక ప్రతీకగా చూశాడు. పునీత అగుస్తీనుగారి
ప్రకారం, యోహాను ఒక ‘స్వరం’ అయితే, క్రీస్తు ‘వాక్యం’. యోహాను సువార్త ప్రకారం, క్రీస్తు వాక్యమై యున్నాడు. ఆ వాక్యం హృదయాల్లోకి ప్రవేశించడానికి
ముందు ఉన్న ‘స్వరం’ బప్తిస్త యోహాను.
గురువుల పాత్ర కూడా యోహాను మాదిరిగానే ఉండాలి. వారు దేవుని వాక్యానికి ఒక స్వరంగా
ఉండాలి. ఆ స్వరం ద్వారానే వాక్యం ప్రజల హృదయాల్లోకి చేరుతుంది. ఈ ప్రక్రియలో,
వాక్యాన్ని బోధించే గురువు తనలో ఉన్న
వాక్యాన్ని ఏ మాత్రం కోల్పోడు. ఆ స్వరం కేవలం ఒక మాధ్యమం మాత్రమే, వాక్యాన్ని ప్రజల హృదయాల్లోకి చేర్చే ఒక మార్గం.
పునీత అగుస్తీను ఉపదేశమును వివరిస్తూ, కార్డినల్ రాట్జింగర్, 16వ బెనెడిక్ట్ పోపుగారు, తన పుస్తకములో [పిల్గ్రిమ్ ఫెలోషిప్
ఆఫ్ ఫెయిత్: ది చర్చ్ యాజ్ కమ్యూనియన', పుట 164] ఇలా
రాసారు: గురువుయొక్క ప్రధాన విధి దేవుని వాక్యానికి
ఒక స్వరంగా ఉండటమే. “ఆయన హెచ్చింప బడవలెను. నేను తగ్గింప బడవలెను”
(యోహాను 3:30) అనే వాక్యం ప్రకారం, ఆ స్వరం యొక్క ఏకైక ఉద్దేశం వాక్యాన్ని ఇతరులకు చేరవేయడం. దీని
ఆధారంగా, గురువు సేవలోని గొప్పదనం, మరియు వినయం రెండూ స్పష్టంగా అర్థమవుతాయి. గురువు బప్తిస్తమిచ్చు యోహానువలె, కేవలం ఒక మార్గదర్శకుడు, వాక్యానికి సేవకుడు మాత్రమే. ఇక్కడ గురువు ముఖ్యం కాదు, క్రీస్తే ముఖ్యం.
యోహాను
ప్రధానముగా “హృదయ పరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని” ప్రకటించాడు
(మార్కు 1:4). అనగా దేవుని మార్గాలను పాటించాలని ధైర్యముగా బోధించాడు. నిజమైన
పశ్చాత్తాపము అనగా, శిష్యుడు ఉత్థాన క్రీస్తు స్వభావాన్ని ధరించడం. యోహాను
బోధించడం మాత్రమేగాక, తన జీవితాదర్శముద్వారా నిరూపించాడు. అతను ఎడారిలో
ఉపవాస ప్రార్ధనలతో, సాధారణ జీవితాన్ని జీవించాడు. ఆనాటి ప్రజల అనైతిక
జీవితాన్ని ఎండగట్టాడు.
నేడు
మనం యోహాను జీవితమునుండి అనేక విషయములను నేర్చుకొనవచ్చు. ఆయనవలె, మన
చుట్టూ ఉన్నవారికి యేసు మార్గమును సిద్ధపరచవచ్చు. ఈనాటి అనైతికత, అప్రజాస్వామ్యం
మొదలగు వాటి గురించి ధైర్యముగా మాట్లాడవచ్చు. యోహాను జీవితం నుండి మనం
నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, యేసుకు మార్గం సిద్ధం చేయడం: యోహాను, క్రీస్తుకు ముందు వచ్చి ఆయన మార్గాన్ని
సిద్ధం చేశాడు. మన జీవితంలో కూడా మనం యేసును అనుసరిస్తూ, మన చుట్టూ ఉన్నవారికి యేసు మార్గాన్ని చూపించవచ్చు. ఉదాహరణకు,
మన ప్రవర్తన, మాటల ద్వారా క్రీస్తు ప్రేమను, దయను ఇతరులకు తెలియజేయవచ్చు.
నిర్భయంగా సత్యం మాట్లాడటం: యోహాను హేరోదు రాజు అనైతికతను నిర్భయంగా ఖండించాడు. ఈ రోజుల్లో మనం
చూస్తున్న అనైతికత, అన్యాయం, అవినీతి వంటి వాటి గురించి ధైర్యంగా మాట్లాడటానికి యోహాను మనకు ఒక
ప్రేరణ. సత్యాన్ని చెప్పడానికి భయపడకూడదని యోహాను జీవితం మనకు నేర్పిస్తుంది.
వినయం: “ఆయన హెచ్చింప బడవలెను. నేను తగ్గింప బడవలెను”
అని యోహాను చెప్పాడు. ఇది యోహానులోని గొప్ప వినయాన్ని సూచిస్తుంది. మన జీవితంలో కూడా మనం
మన గొప్పతనం గురించి కాకుండా, దేవుని గొప్పతనం గురించి మాట్లాడాలి.
నమ్మకత్వం: యోహాను చివరి శ్వాస వరకు తన పనికి నమ్మకంగా ఉన్నాడు. ఎన్ని అడ్డంకులు
ఎదురైనా, సత్యం కోసం ప్రాణాలు అర్పించడానికి
కూడా వెనుకాడలేదు. మన నమ్మకాలను, విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి యోహాను
జీవితం మనకు ఒక ఆదర్శం.
గురువులకు ఆదర్శం: పునీత అగుస్తీను, కార్డినల్ రాట్జింగర్ వంటి మహానుభావులు
యోహానును గురువులకు ఆదర్శంగా వర్ణించారు. యోహాను ‘స్వరం’ అయితే, క్రీస్తు ‘వాక్యం’. గురువుల పాత్ర
కూడా యోహాను మాదిరిగానే ఉండాలి. వారు దేవుని వాక్యాన్ని ప్రజల హృదయాలకు చేరవేసే
మాధ్యమాలుగా ఉండాలి. ఇక్కడ గురువు ముఖ్యం కాదు, క్రీస్తే ముఖ్యం.
బప్తిస్త యోహాను మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. తన మనస్సులోని
అహంకారాన్ని, భయాన్ని పక్కన పెట్టి, కేవలం దేవుని వాక్యం, సత్యం మాత్రమే ఉన్నతంగా భావించాడు. మనం
కూడా మన చుట్టూ ఉన్న అనైతికత, అన్యాయం గురించి ధైర్యంగా
మాట్లాడటానికి యోహాను జీవితం నుండి స్ఫూర్తి పొందుదాం. దేవుడు మిమ్ములను దీవించును
గాక!
Exlent Swami
ReplyDelete