సామాన్య 7వ వారము - శనివారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 7వ వారము - శనివారం
యాకోబు 5:13-20; మార్కు 10:13-16

ధ్యానాంశము: చిన్నారులకు దీవెనలు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు:  "చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు. వారిని ఆటంక పరపకుడు. ఏలయన, అట్టి వారిదే దేవుని రాజ్యము. ఈ పసి బిడ్డలవలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించెను" (10:14-16).
ధ్యానము: వాస్తవానికి, నేటి పఠనం దైవరాజ్యము గురించి, దానిలో ఎవరికీ ప్రవేశం అన్న విషయంగూర్చి బోధిస్తుంది. కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకొని రాగా, శిష్యులు వారిని గద్దించారు. యేసు శిష్యులపై కోపించి, "చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు. వారిని ఆటంక పరపకుడు. ఏలయన అట్టి వారిదే దేవుని రాజ్యము" అని పలికారు. మరియు, "ఈ పసి బిడ్డలవలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను" అని చెప్పారు. ఆతరువాత, యేసు ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించారు.
ప్రజలు ఇప్పటివరకు స్వస్థత కొరకు రోగులను యేసు వద్దకు తీసుకొని వచ్చారు (మార్కు 3:10; 8:22). ఆయన అంగీ అంచునైనను తాకిన చాలు స్వస్థత పొందుతాము అనే ఆశతో వచ్చారు (మార్కు 5;28; 6:56). ఇచ్చట, కొంతమంది తమ పిల్లలను స్వస్థత కొరకుకాదుగాని, యేసు దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు, తమ పిల్లలను తీసుకొని వచ్చారు. కాని శిష్యులు వారిని ఆటంకముగా భావించారు. యేసుకు, ఆయన బోధనలకు భంగం కలిగించరాదని శిష్యులు వారిని వారించారు. ఇంతకు ముందే, ప్రభువు శిష్యుల సమక్షములో చిన్న బిడ్డల గురించి ప్రస్తావించారు - మార్కు 9:36-37: "యేసు చిన్న బిడ్డలను చేరదీసి వారి మధ్య నుంచి, వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో, "ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించిన వాడు నన్ను కాడు, నన్ను పంపిన వానిని స్వీకరించు చున్నాడు అని పలికెను." ఈ విషయాన్ని శిష్యులు అప్పుడే మరచిపోయారా? యేసు తన ప్రేషిత ప్రయాణములో ఎల్లప్పుడు బలహీనులపట్ల, పాపాత్ములపట్ల శ్రద్ధను చూపారు, కాని శిష్యులు ఈ విషయాన్ని గ్రహించలేక పోయారు! అందుకే, యేసు శిష్యులపై కోపపడ్డారు. చివరిగా, చిన్నారులను ఎత్తుకొని, కౌగలించుకొని వారిని దీవించారు.

చిన్న బిడ్డల మనస్తత్వం కలవారిదే దేవుని రాజ్యము! చిన్నబిడ్డలను యేసు శిష్యులకు మరియు ఇతరులకు ఆదర్శముగా చూపుచున్నారు. చిన్నబిడ్డల సుగుణాలను శిష్యులు, విశ్వాసులు పుణికిపుచ్చుకోవాలి. చిన్నారులు బలహీనులు, అమాయకులు, నమ్మదగినవారు, నిజాయితీపరులు. వారు ఇతరులపై ఆధారపడి జీవిస్తారు. ఇలాంటి సుగుణాలతో ప్రతీ ఒక్కరు జీవించాలి. చిన్న బిడ్డలకున్న నమ్మకం మనం కలిగి యుండాలి; చిన్నబిడ్డలవలె సంతోషముగా ఉండాలి.

మొదటి పఠనములో, యాకోబు ఒక మంచి సలహాను ఇస్తున్నారు. "మీలో ఎవరైన కష్టములో ఉన్నారా? ఐనచో ప్రార్ధన చేయవలెను. నీతిమంతుని ప్రార్ధన మహాశక్తి మంతమైనది. ప్రార్ధన విశ్వాసముతో చేయాలి. ఒకరికొరకు ప్రార్ధించు కొనుడు. సంఘము కొరకు ప్రార్ధన చేయాలి. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్ధన చేయాలి. విశ్వాసముతో చేసిన ప్రార్ధన వ్యాధిగ్రస్థుని రక్షించును.

చిన్నబిడ్డల విశ్వాసముతో యేసు అద్ధకు వెళదాం. ఆయన దీవెనలను పొందుదాం! అలాగే, చిన్నబిడ్డలను యేసు వద్దకు (దేవాలయానికి) తీసుకొనివద్దాం. యేసును వారికి పరిచయం చేద్దాం! వారిని క్రైస్తవ విశ్వాసములో పెంచుదాం!

No comments:

Post a Comment