దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు
బుధవారం, ఆగమన కాల మొదటి వారము
యెషయా 25:6-10; మత్తయి 15:29-37
ధ్యానాంశము: వ్యాధిగ్రస్తులకు యేసు స్వస్థత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “వీరికి తినుటకు ఏమియు లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది”(మత్తయి 15:32).
ధ్యానము: ఎంతోమంది ఆహారం లేక, దొరకక, ఆకలితో అలమటిస్తుండగా, దేవుడు మనకు తినడానికి కావలసిన అనుదిన ఆహారాన్ని ఒసగుచున్నాడు. దేవునకు స్తోత్రాలు చెల్లించుకోవాలి. ఆహారం లేనిచో ప్రాణాలను కోల్పోతాము. దేవుని ఆశీస్సులు పొందాలంటే, ఇతరులపట్ల ఉదారస్వభావముతో ఉండాలి. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. యేసు హృదయం జాలితో నింపబడి యున్నది. మూడు రోజులనుండి ప్రజలు యేసు బోధనలను వింటూ అక్కడే ఉన్నారు. పస్తులతో ప్రజలను పంపివేయడం ఇష్టము లేక, యేసు తన శిష్యులతో వారికి సహాయము చేయమని చెప్పెను. వారి వద్ద నున్న ఏడు రొట్టెలను, చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి, త్రుంచి శిష్యులకు ఈయగా జనసమూహమునకు పంచిరి. మొదటి పఠనంలో యెషయా, అభిషిక్తుడు వేంచేయు కాలమున జరుగు విందు గురించి ప్రస్తావించారు. ప్రభువు సకల జాతులకు విందు సిద్ధము చేయును. అది ప్రశస్త మాంస భక్ష్యములతో, మధువుతో కూడి యుండును (యెషయా 25:6). పరలోక విందు గురించి అద్భుతముగా ప్రవక్త వర్ణించాడు. పరలోకం మన నిజమైన నివాసం. కనుక, దానికై తగువిధముగా జీవించాలి. అలాగే, నేటి సువార్తలో యేసు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడం గూర్చి వింటున్నాం. యేసును దివ్య వైద్యునిగా చూస్తున్నాం. మన ఆధ్యాత్మిక ప్రయాణములో కూడా యేసు మనతో ఉంటారు. మనలను శోధనలలో పడిపోనివ్వడు. ఆధ్యాత్మిక ఆహారంతో (తన శరీర రక్తములు) మన ఆత్మలను పోషిస్తాడు. అందుకే దివ్యపూజలో పాల్గొని, యోగ్యరీతిగా దివ్యసత్ర్పసాదమును స్వీకరించుదాం.
No comments:
Post a Comment