పునీతులు జ్వాకీము, అన్నమ్మ – జూలై 26

పునీతులు జ్వాకీము, అన్నమ్మ జూలై 26
మరియమాత తల్లిదండ్రులు, దైవభక్తులు (క్రీ.శ. 1వ శతాబ్దం)


సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 44:1-2: “ఇక సుప్రసిద్ధులను సన్నుతింతము. వారు మనకెల్లరికి పూర్వవంశకర్తలు. ప్రభువు వారిని మహిమాన్వితులను చేసెను. వారిద్వారా సృష్ట్యాదినుండి ఆయన కీర్తి వెల్లడైనది.”

జ్వాకీము, అన్నమ్మలు పుణ్య దంపతులు. మరియమాత తల్లిదండ్రులు. యేసు ప్రభువునకు అమ్మమ్మ తాతలు. బైబులులో వీరిరువురు గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఇతర ఆధారాల ప్రకారం, అన్నమ్మ, బెత్లెహేములో జన్మించారు. అన్నమ్మ తల్లిదండ్రులు ఆరోను వంశములోని భక్తులు ఎమరెన్షియా, స్తోల్లానుస్. అన్నమ్మ లేదా హీబ్రూ భాషలో హన్నా, అనగా వరప్రసాదం’, ‘దేవుని కృపఅని అర్ధం.

జ్వాకీము గలిలీయ ప్రాంతములోని నజరేతు నివాసులు. గొర్రెల కాపరి. జ్వాకీము అనగా దేవుడు సిద్ధపరుస్తాడుఅని అర్ధము. జ్వాకీము, అన్నమ్మలు సామాన్య కుటుంబీకులు. గొర్రెల మంద నుండి వచ్చే ఆదాయములో, ఒక భాగం దేవాలయమునకు, రెండవ భాగం పేదలకు మరియు యాత్రికులకు, మూడవ భాగం స్వంత అవసరాల కోసం ఉపయోగించేవారు.

వీరికి చాలా సంవత్సరముల వరకు, అనగా వృద్ధాప్యము వరకు సంతానము కలుగలేదు. సంతానము కొరకు ప్రతీరోజు ఓపిక, నమ్మిక, ఏకాగ్రతతో ప్రార్ధించేవారు. ఒకరోజు జ్వాకీము యెరూషలేము దేవాలయములో గొర్రెలను కానుకగా సమర్పించడానికి వెళ్ళగా, ఆ రోజు ప్రధాన యాజకుడిగానున్న రూబేను, సంతానము లేనివారు బలి ఇవ్వకూడదని కానుకలను స్వీకరించలేదు. యూదులు సంతానలేమిని దేవుని శాపముగా భావించేవారు. ఆ బాధతో, జ్వాకీము కొండ ప్రాంతమునకు వెళ్లి, భక్తితో, విశ్వాసముతో, కన్నీటితో ఉపవాస ప్రార్ధనలు చేసాడు. అదే సమయములో, అన్నమ్మ, భర్త ఇంకా ఇంటికి రాలేదని వేదనతో నిరీక్షణతో ఎదురుచూస్తూ ఉపవాసముతో యావే దేవునకు మొరపెట్టుకొన్నది. 

దేవుడు వీరి ప్రార్ధనలను, మొరను ఆలకించి, పరలోకము నుండి ఇద్దరు దేవదూతలను చేరొకరి దగ్గరకు పంపారు. “దేవుడు మీ ప్రార్ధనలను ఆలకించారు. మీకొక కుమార్తె కలుగును. ఆమెకు మరియ’ (మిరియం) అను పేరు పెట్టుము” అని ఇరువురికి దేవుని సందేశాన్ని అందించి ఆ దూతలు అదృశ్యమయ్యారు.

జ్వాకీము తనకు పిల్లలు లేని కారణముగా తన చుట్టూ ఉన్నవారందరి నుండి ఒంటరివాడయ్యాడు. అందువలన, అతనిని ఓదార్చడానికి ప్రభువు ఆయన యొద్దకు తన దూతను పంపారు. జ్వాకీము నగరము వెలుపల విచారముతో ఉండగా, ప్రభువు దూత అతనికి కనిపించి, “జ్వాకీము, జ్వాకీము! నీ ప్రార్ధనను ప్రభువు ఆలకించారుఅని తెలిపినది. గియోత్తో అనే చిత్రకారుడు, తాను గీసిన ఒక ప్రసిద్ధ చిత్ర పటములో ఈ సంఘటనను రాత్రిపూట జరిగినట్లుగా చిత్రీకరించాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆందోళన, జ్ఞాపకాలు, కోరికలతో నిండిన జ్వాకీమును ఆ పటములో చూడవచ్చు.

ఈవిధముగా, వృద్ధాప్యములో పవిత్రాత్మ వరముతో మరియమమ జన్మపాపము లేకుండా జన్మించినది. కన్య మరియను వర పుత్రికగా జ్వాకీము, అన్నమ్మలు ఈ లోకానికి అందించారు. మరియను ప్రేమానురాగాలతో, భక్తితో పెంచారు. అయితే, దేవునికి వాగ్ధానము చేసిన విధముగా, మరియమ్మకు మూడు సంవత్సరములు నిండగానే, యెరూషలేము దేవాలయములో సమర్పించారు. పాత నిబంధన గ్రంథములో 'హన్నా' తన కుమారుడు సమూవేలును దేవాలయములో సమర్పించిన విధముగా, అన్నమ్మ, జ్వాకీములు మరియమ్మను దేవాలయములో సమర్పించారు. దేవుని రక్షణ ప్రణాళికలో, మరియమ్మ ముఖ్య పాత్ర పోషించ బోవుచున్నదని దీని అర్ధం.

అన్నమ్మ, జ్వాకీముల సమాధి 1889లో యెరూషలేములో కనుగొనబడింది. వీరిని మనం పునీతులుగా గౌరవిస్తున్నాము. పునీత జ్వాకీము, అన్నమ్మల పండుగ 4వ శతాబ్దము నుండియే ఉన్నను, విశ్వశ్రీసభ పండుగగా మాత్రం 15 లేదా 16వ శతాబ్ధములోనే ప్రారంభమైనది. వారు ఒకరిపై ఒకరు చూపించిన ప్రేమ, ఇరువురు మరియమ్మపై చూపిన ప్రేమానురాగాలు మనకు ఆదర్శం. వారి విశ్వాసం, పట్టుదలతో కూడిన ప్రార్ధనా జీవితం మనకు ఆదర్శం.

“దేవుని యందు భక్తి విశ్వాసములతో వేచి ఉన్నవారు ప్రసిద్ధులు, మహిమాన్వితులు అవుతారని మనమందరమూ అన్నా, జ్వాకీముగారలను చూసి గుర్తించాలి. గొప్ప ధన్యతను మనం కూడా పొందుకోవాలంటే, దేవుని యందు వేచి ఉండే భక్తి, విశ్వాసాలు మనలో ఉండాలి.

దేవుని సృష్టిలో కొందరిని, వారి విశ్వాసాన్ని బట్టి, వారి భక్తిని బట్టి, మహిమాన్వితులుగా, సుప్రసిద్ధులుగా దేవుడు ఆశీర్వదించారు. అటువంటి వారి ద్వారా దేవుని కీర్తి ఇప్పటికీ, ఎప్పటికీ వెల్లడి అవుతూనే ఉంది.

మనము కూడా మన విశ్వాస భక్తి జీవితంలో గొప్ప ధన్యతను పొందాలంటే, దేవుని యందు వేచి ఉండే భక్తి, విశ్వాస జీవితం మనలో ఉండాలి. అన్నా, జ్వాకీములు తమ విశ్వాస జీవితాన్ని మన ముందు సుమాతృకగా ఉంచారు. దేవుడు వారికి ఇవ్వబోతున్న మహిమయందు వారు విసుగు చెందక, వేచియుండి పొందారు.

మనం ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో జీవిస్తూ, ఆయన యందు వేచి ఉండి, ఆయన మనకు ఇచ్చే మహిమాన్వితత్వంతో జీవించగలిగినప్పుడు, మనల్ని చూసి నలుగురూ దేవుని యందు భక్తి విశ్వాసములలో వేచి జీవించేవారిగా మంచి మార్పు చెందినప్పుడు, మన సుమాతృక జీవితం ద్వారా కూడా దేవుడు కీర్తింపబడతారు.

పైగా, వారి భక్తి, విశ్వాసం, దేవుని యందు భక్తిశ్రద్ధలతో వేచి ఉన్నవారికి అసాధ్యమైన వాటినన్నింటినీ దేవుడు సుసాధ్యం చేస్తారని మన ముందు నిలిచారు. అన్నా, జ్వాకీముగారల నుండి మనం వేచి ఉండే భక్తి విశ్వాసాలను అలవర్చుకుందాం. ఆ విధంగా జీవించే భక్తి విశ్వాసాలను మన హృదయాలకు కూడా దయచేయమని ఆ దేవాధిదేవుణ్ణి ప్రార్థించుకుందాం.

అన్నా, జ్వాకీముగారలను, "దేవుని యందు మీ వలె మాకునూ మీవంటి విశ్వాసాన్ని, వేచి ఉండే సుగుణాలను అలవరచమని" వారి ప్రార్థనా సహాయాన్ని కోరుకుందాం.

పునీత జ్వాకీము, అన్నమ్మలు వివాహితులకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలు లేనివారికి, అమ్మమ్మ, నానమ్మ, తాతలకు పాలక పునీతులు. కష్ట సమయములో, ఈ పునీతుల ప్రార్ధన సహాయాన్ని వేడుకుందాం. కుటుంబాలలో శాంతి, సమాధానం, ఆరోగ్యం కొరకు ప్రార్ధన చేద్దాం.
 

1 comment: