తపస్కాల ఐదవ
ఆదివారము, Year B
యిర్మియా
31:31-34, భక్తికీర్తన
51:1-2, 10-13, హెబ్రీ 5:7-9, యోహాను
12:20-30
ఓ సర్వేశ్వరా! మా విరోధులగు దుర్మార్గులమధ్య చిక్కుకొనియున్న నన్ను రక్షించి, మీ ధర్మ తీర్పులను వెల్లడి చేయుడు. పాపాత్ములు, మోసగాండ్రు, తంత్రకాండ్రనుండి విడుదల చేయుడు. ఎందుకన, నాకు శక్తి సామర్ధ్యములిచ్చు దేవుడు మీరే!
నేడు 5వ తపస్కాల ఆదివారమును
కొనియాడుచున్నాము. ఈ తపస్కాల ప్రయాణములో ప్రాముఖ్యమైన ఘడియలకు అతిసమీపమునకు
చేరుకుంటున్నాము. నేటి పఠనాల సారాంశం: క్రీస్తు మన రక్షణకై తన సమస్తాన్ని త్యాగము
చేయడానికి సిద్ధపడుచున్నాడు. కనుక, మనము కూడా మన జీవితాలను క్రీస్తు కొరకు, ఇతరుల
కొరకు అర్పించు కోవడానికి సిద్ధపడాలి.
ఈనాటి మొదటి పఠనములో
యిర్మియా ప్రవక్త గ్రంథము నుండి వినియున్నాం. దేవుడు యిర్మియాను పిలచి తన
ప్రవక్తగా నియమించారు. యావే ప్రభువు ఇస్రాయేలు ప్రజలతో సీనాయి పర్వతముపై చేసికొన్న
ఒడంబడిక ప్రకారం వారు నడవలేదు, జీవించలేదు. ప్రభువైన దేవునిపై అధారపడటానికి బదులు
ఈజిప్టు పాలకులతో చేసికొన్న ఒప్పందము మీద ఆధారపడ్డారు. అందువలన, యావే ప్రభువు యొక్క
సంరక్షణ, సహాయం
వారు కోల్పోయారు. అందుకు ఫలితముగా ఇస్రాయేలీయులు అనేక కష్టాలకు గురైనారు. దేవాలయము
ధ్వంసము చేయబడినది. దివ్యమందసము కొనిపోబడినది. ప్రజలు నిరాశకు లోనైయ్యారు.
అయినప్పటికినీ, ఇస్రాయేలీయులపట్ల
ప్రభువైన దేవునికిగల ప్రేమ ఎంత అపారమైనదో యిర్మియా ప్రవక్తకు తెలుసు. వారిలో ఆశను,
నిరీక్షణను వారిలో కలుగజేయు చున్నాడు. కనుకనే, దేవుని ఆదేశం మేరకు భవిష్యత్తులో
దేవుడు ఇస్రాయేలీయులతో చేయనున్న “నూతన ఒప్పందం” గురించి యిర్మియా ప్రవక్త
ప్రవచించాడు. ఈ నూతన ఒప్పందము గురించియే ఈనాటి మొదటి పఠనములో చదువుతున్నాం. ఇది
ప్రజల హృదయాలపై లిఖింపబడును: “నేను నా ప్రజలతో నూతన నిబంధనము చేసుకొందును. వారి
పాపములను మన్నింతును. వానినిక జ్ఞప్తి యందు ఉంచుకొనను. నేను వారికి దేవుడనగుదును,
వారు నా ప్రజలగుదురు.” అవిశ్వాసముద్వారా కోల్పోయిన సంబంధాన్ని దేవుడు తిరిగి
నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఒప్పందం జీవమును, రక్షణను ఒసగును. కనుక, మనం
చేయవలసినది ఒక్కటే, క్రీస్తు యేసులో చేయబడిన ఈ నూతన ఒప్పందమును అంగీకరించుటకు
సిద్ధపడటమే! .
రెండవ పఠనములో
క్రీస్తు ప్రభువు తన జీవితములో (గెత్సేమని తోటలో) ఆవేదన, బాధలను ఎలా
అనుభవించారో చదువుతున్నాం. ఇది క్రీస్తు త్యాగాన్ని, త్యజింపును గుర్తుచేస్తుంది.
మొదటిగా, ఇది తండ్రి దేవుని చిత్తమును నెరవేర్చుటకు, రెండవదిగా, మనలను రక్షించుటకు
– “తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను... ఆయనకు విధేయులగు
వారి శాశ్వత రక్షణకు మూలమాయెను.” యేసు ప్రభువు ఎన్నడూ తన బహిరంగ జీవితములో పేరు
ప్రతిష్టలకోసం ప్రాకులాడలేదు. మానవాళి రక్షణార్ధమై, యేసు తననుతాను తండ్రి దేవునికి బలిగా
అర్పించాడు.
క్రీస్తు మరణం ద్వారా తననుతాను
సంపూర్తిగా అర్పించుకొన్నాడు. మానవులందరి తరుపున బలి అర్పించాడు. క్రీస్తు మనందరి తరుపున బలి అర్పించాడు.
గెత్సేమని తోటలో రక్తచమట చెమర్చుతూ యేసు ప్రభువు చేసిన ప్రార్ధన, అనంతరం
సిలువపై ఆయన అనుభవించిన శ్రమలు, మరణం వర్ణణాతీతం! ఈ విధముగా ఆయన మనకొక సుమాతృకను
నేర్పించారు. నిత్య జీవన మార్గమును చూపించారు. కనుక, క్రీస్తు యేసులో చేయబడిన నూతన
ఒప్పందం మన రక్షణను సాధించాలంటే, వినయము, విధేయత అను ఈ రెండు సుగుణాలను మన
జీవితములో అలవర్చుకోవాలి.
ఈనాటి సువార్త పఠనములో, యేరూషలేమునకు వచ్చిన
గ్రీకులతో యేసు మాట్లాడటం చూస్తున్నాము. యేసు వారితో, “మనుష్య కుమారుడు (= మెస్సయ్య,
అభిషిక్తుడు) మహిమ పొందవలసిన గడియ వచ్చినది” అని చెప్పెను. తాను మహిమపరపబోవు సమయం
ఆసన్నమైనది: శ్రమలు, మరణం, ఉత్థానము. శ్రమలలో ఏమి మహిమ? తాను త్వరలో బంధీగావింప
బోవుచున్నాడు, శిక్షకు గురికాబోవుచున్నాడు, మరణింపబోవుచున్నాడు. అయినను, యేసు మహిమ
గురించి మాట్లాడుచున్నాడు. శ్రమల వెనుక ఉన్న మహిమను, అనగా నిత్యజీవితాన్ని ప్రభువు
చూస్తున్నారు. తన శ్రమలు, మరణం అనేకుల విముక్తికి కారణమగునని ప్రభువుకు తెలుసు!
తనను విశ్వసించు వారందరికి నలిగిన సంబంధాన్ని పునరుద్దరింప బోవుచున్నారు. అందుకే
ప్రభువు ఇలా అన్నారు: “గోధుమగింజ
భూమిలోపడి నశించునంత వరకు అది అట్లే ఉండును. కాని అది నశించిన యెడల విస్తారముగ ఫలించును.”
గోధుమగింజ భూమిలో పడవలసినదే! తగిన మార్పు చెందవలసినదే! కానిచో, అది గింజగానే
ఉంటుంది. గింజ నలిగి రూపు లేకుండా చనిపోయినప్పుడే దానిలోనుండి జీవముగల మొక్క పైకి
వస్తుంది. క్రీస్తు ప్రభువు కూడా అట్టి గోధుమ గింజయే! మనమీద ప్రేమకోసం, మన
రక్షణార్ధమై, యేసు ఇష్టపూర్తిగా శ్రమలను పొందాడు. తన జీవితముకన్న, మన రక్షణకు ఎక్కువగా
ప్రాముఖ్యతను ఇచ్చియున్నారు.
తన ప్రాణమును ప్రేమించువాడు
దానిని కోల్పోవును, కాని, ఈ లోకమున తన
ప్రాణమును ద్వేషించువాడు,
దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును అని ప్రభువు పలుకుచున్నాడు. అనగా, తననుతాను పరిత్యజించు
కొనుటయే రక్షణ మార్గమని మనము నేర్చుకోవాలి. తనలో ఉన్న గర్వమును అణచుకోవడము చేత, ఈ లోకపు ఆశలను
వదలి పెట్టడం చేత మాత్రమే రక్షణ కలదు. కాని, తన జీవితాన్ని ఈ లోకానికి అంటి పెట్టుకొనుట ద్వారా
కాదు. ఈ లోకములో జీవించినంత కాలం, ఈ ప్రపంచ జీవితము కంటే, నిత్యజీవము మేలైనదని మనము గ్రహించడానికి సిద్దముగా
ఉండాలి. ఇతరుల కొరకు సేవలో, ప్రేమలో జీవించాలి. ఉప్పు నీటిలో కరిగి రుచిని
అందిస్తుంది. క్రొవ్వొత్తి తననుతాను కరిగించుకొని ఇతరులకు వెలుగును ఇస్తుంది.
అలాగే, మన క్రైస్తవ జీవితాలుకూడా ఉండాలి. ఇతరులకోసం మనం శ్రమలను అనుభవించినప్పుడు,
మనలను మనం అర్పించుకున్నప్పుడు, నిత్యజీవితమును పొందగలము. ఇది కష్టతరమైనను, ఇదే
క్రైస్తవ పిలుపు, క్రైస్తవ జీవితం. ఈ పరిత్యాగము లేని క్రైస్తవ జీవితం అర్ధరహితము,
శూన్యము. ఇతరులకోసం నేను ఏమైనా త్యాగం చేసానా? ఇతరులకు సహాయం చేయడానికి నా సౌకర్యాలను
వదులుకున్నానా? మాక్సిమిలియన్ కోల్బే క్రీస్తు అడుగుజాడలలో నడుస్తూ, తన తోటివాని
కొరకు తన ప్రాణాలను అర్పించారు. ఎంతటి వీరోచిత త్యాగం! ఇలాంటి వీరోచిత త్యాగం చేసే
నాయకులు, గురువులు మనమధ్య ఉన్నారా? త్యజించే జీవితం, పరిత్యజించే జీవితం, త్యాగమయ
జీవితం మనం జీవించనప్పుడు, సిలువలో క్రీస్తు మరణం మనకు హృదాయే అవుతుంది! మన
త్యాగపూరిత సేవా కార్యాలద్వారా లోకాన్ని మనం మార్చవచ్చు! క్రీస్తు శ్రమలకు ఎంతో
అర్ధమున్నట్లుగా, ఇతరులకోసం పాటుబడినప్పుడు, మన శ్రమలకు కూడా సంపూర్ణ అర్ధం
చేకూరుతుంది! అలాంటి జీవితానికి ప్రతిఫలమే నిత్యజీవితము.
నేటి సమాజములో అన్ని రంగాలలో
అభివృద్ధిని చూస్తున్నాం. నేటి సమాజం అన్ని విధాలుగా మనిషిని తన వైపునకు
ఆకర్షిస్తుంది. మనిషి ఈ లోకం ప్రసాదించే భోగాలకు బానిసయై, ఈ లోకాశలకు
దగ్గరై కళ్ళకు కనిపించే ఈ ప్రపంచాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రపంచముకంటే, నిత్యజీవితం
మేలైనదని గ్రహించలేక పోతున్నాడు. కనుక, ఈ లోకములో ఎవరైతే తన జీవితాన్ని
అసహ్యించుకొంటారో, నిత్యజీవితానికి
దానిని కాపాడు కుంటారు. తపస్కాల ఐదవ ఆదివారమున క్రీస్తు ప్రభువు, ఈ పిలుపును
మనకు ఇస్తున్నాడు. త్యాగపూరితమైన జీవితమును జీవించడంద్వారా తనను వెంబడించి తన
మహిమను పొందుటకు మన సిలువను ఎత్తుకొని తనతో నడువ మంటున్నాడు.
తండ్రిని విధేయించి, క్రీస్తు
ప్రభువు సిలువ బాధలలో భాగం పంచుకోవడానికి సంసిద్ధులైన వారికి దేవుని మహిమలో
భాగముంటుంది. విధేయత అంటే - స్వార్ధాన్ని వదులుకోవడం. సుఖభోగాలకు స్వస్తి
చెప్పడం. క్రీస్తు రక్షణలో భాగస్తులమవడం.
No comments:
Post a Comment