6 వ సామాన్య ఆదివారం, Year B, 14 ఫిబ్రవరి 2021
లేవీకాండము 13: 1-2, 44-46, భక్తి కీర్తన 32: 1-2, 5-11, 1 కొరింతు 10: 3-11:1, మార్కు
1: 40-45
నా రక్షణ దేవుడవుగాను, నా
శరణముగాను ఉండి, నాకు రక్షణమును ప్రసాదింపుడు.
ఎందుకన మీరే నా ఆధారమును, నా శరీరమును, మీనామ గౌరవార్ధము నాకు నాయకులుగా ఉండి నన్ను
పోషించుచున్నారు.
క్రీస్తు మన ఆదర్శం
మన
సమాజములో అనేక మంది వ్యక్తులు తమను తాము ఎదుటి వారితో పోల్చుకొంటూ ఉంటారు. వివిధ
రంగాలలో పేరు గడించిన, ఆరితేరిన వ్యక్తులను చూసి, వారిని ఉదాహరణగా, ఆదర్శముగా చేసికొని, వారిలా
జీవితములో ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. క్రీడా రంగములో గొప్ప క్రీడాకారులను
చూసి చాలా మంది వారిలా ఆడాలని ఆశించి, నేర్చుకొని
జీవితములో పైకి ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. సంగీతరంగములో ఎంతోమంది గొప్ప
సంగీతకారులను చూసి, వారిని అనుసరించి, జీవితములో మంచి సంగీత విద్వాంసులుగా ఎదిగినవారూ ఉన్నారు.
రాజకీయ రంగములో కూడా మనకు అనేకమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారిని ఆదర్శముగా
తీసుకొని వారిలాగా రాజకీయములో ఎదిగినవారు ఉన్నారు. అదేవిధముగా, సినిమా రంగములో కూడా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ
విధముగా, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక విషయాన్నిగాని, వ్యక్తినిగాని చూసి వారిని ఒక ఆదర్శముగా తీసుకొని జీవితములో
పైకి ఎదగగలిగారు.
మంచి క్రైస్తవులుగా జీవించడానికి మనకు ఆదర్శముగా ఎంతో మందిని మనం శ్రీసభలో చూస్తూ ఉన్నాము. వారే పునీతులు, మరియు మంచి జీవితాన్ని జీవించేవారు. వారు, ఒక ప్రాంతానికి, ఒక కాలానికి చెందినా, వారు ఎల్లప్పుడూ కూడా మనకు మార్గదర్శకులుగా, ఆదర్శ మూర్తులుగా ఉన్నారు. ఈనాటి రెండవ పఠనములో, పునీత పౌలు, కొరింతీయులకు తనను ఆదర్శముగా తీసుకొనమని చెప్పుచున్నాడు: "నా వలెనే ప్రవర్తింపుడు. స్వార్ధములేక ఇతరుల మేలుకొరకై నేను చేయు పనులన్నింటి యందును అందరిని ఆనందింప చేయుటకు ప్రయత్నింతును" (1 కొరింతు 11:1). పౌలుగారు తననుతాను ఒక 'గురువు'తో పోల్చుకొంటూ ఉన్నారు. తన జీవితము ద్వారా, తాను అనేక క్రైస్తవ సంఘాలకు వ్రాసిన లేఖల ద్వారా మనకు ఒక ఆదర్శముగా ఉండగలిగారు, జీవించ గలిగారు.
పునీత
పౌలుగారు ఏవిధముగా మనకు ఆదర్శముగా ఉన్నారో, అదే విధముగా, తన ఆదర్శం "క్రీస్తు" అని చెప్పుచూ ఉన్నారు.
అందుకే, నేను ఏవిధముగా క్రీస్తును అనుసరిస్తూ ఉన్నానో, అదేవిధముగా మీరు కూడా నన్ను అనుసరించండి అని చెప్పారు.
"నాలో జీవించేది నేను కాదు, క్రీస్తే
నాలో జీవిస్తూ ఉన్నాడు," అని పౌలుగారు చెప్పగలిగారంటే, అతను ఎంతగా క్రీస్తును అనుసరించాలని ఆశించాడో
తెలియుచున్నది. అదేవిధముగా, పునీత బాప్తిస్మ యోహానుగారు కూడా, క్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందిన తరువాత, తన శిష్యులకు యేసును చూపుతూ, "ఇదిగో, నిజమైన గొర్రెపిల్ల, ఆయనను
అనుసరించండి" అని చెప్పాడు. కనుక క్రీస్తు మన అందరి ఆదర్శం.
క్రీస్తు
ప్రభువును మనం ఆదర్శముగా తీసుకున్నప్పుడు ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి. మనం
అందరం కూడా ఆయనలో సృష్టింపబడిన వారమని, కనుక మన
జీవిత దృష్టి అంతా కూడా ఆయన వైపే ఉండాలి. ఎందుకన, క్రీస్తే
మనకి జీవితాన్ని, జీవనాన్ని ఒసగుచున్నారు. ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు
రూపములో ఉన్నారు. తండ్రి దేవుని రూపం, అటు
క్రీస్తులో, ఇటు మనలో జీవాన్ని నింపుతూ ఉంది. అదే మన జీవితానికి, ఒక అర్ధాన్ని ఇస్తూ ఉంది.
మనలో
ఏ ఒక్కరు కూడా అనుకోకుండా, దేవుని దృష్టిలో ముందుచూపు లేకుండా
సృష్టింప బడలేదు. దేవుడు మనందరినీ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక ఉద్దేశము కొరకు క్రీస్తులో సృష్టించారు. అందుకే తండ్రి
దేవుడు మనలను క్రీస్తు ద్వారా, క్రీస్తులో ఎంతగానో ప్రేమిస్తూ
ఉన్నాడు. అందుకే క్రీస్తు మనందరికీ కూడా ఒకే ఒక ఉత్తమ ఆదర్శం.
ప్రతి
క్రైస్తవ విశ్వాసి, తననుతాను క్రీస్తుగా మలచు కోవాలి.
క్రీస్తు ఆదర్శం, మనలను ప్రేమలో, ఐక్యతలో, శాంతిలో జీవించడానికి మార్గం చూపుతూ ఉంది. ఈనాటి పఠనాలు, మనల్ని మనం క్రీస్తు రూపములోనికి మార్చుకొనమని ఆహ్వానిస్తూ
ఉన్నాయి. ప్రతీ ఒక్కరు బాహ్యముగా కాక, అంతరంగీకముగా
క్రీస్తు ఆదర్శాన్ని చూడగలగాలి. క్రీస్తులో ఒక నూతన జీవితానికి నాంది పలక గలగాలి.
క్రీస్తు వాక్యాన్ని గురించి తెలుసుంటే చాలదు. ఆ వాక్యాన్ని చెప్పటం, ప్రచారం చేయటం మాత్రమే చాలదు. కాని క్రీస్తు వాక్యం మన
జీవితాన్ని మార్చి,
నూతన జీవితానికి నాంది పలకాలి.
పరిశుద్ధాత్మ శక్తి మరియు మన సహకారం వలన సాధ్యం కాగలదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి
మనలో పని చేసినప్పుడు మనమూ అట్టి జీవితాన్ని పొందుతూ ఉన్నాము. క్రీస్తు ఆదర్శము
ద్వారా, మన క్రియలు, మాటలు, ఆలోచనలు క్రీస్తును పరిపూర్తిగా పోలియుంటే, మనం దేవునికి మహిమను, ఆరాధనను
చెల్లించిన వారం అవుతాము.
పరిపూర్ణ రూపము
మానవుడు
దేవుని రూపములో సృష్టింప బడ్డాడు. మానవుడు తన నిజమైన, పరిపూర్ణమైన రూపాన్ని కలిగి ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ
ఆశిస్తూ ఉంటాడు. కాని మానవుడు, నేటి ప్రపంచములో అభివృద్ది, ప్రాపంచికరణ, నిజమైన
స్వేచ్చ అను సిద్ధాంతాలను అనుసరిస్తూ తన పరిపూర్ణ రూపాన్ని, దేవుని రూపాన్ని, క్రీస్తు
రూపాన్ని పోగొట్టు కుంటున్నాడు. ఈ లోక వ్యామోహాలు, ఆశలు, అసూయ, ప్రేమలేమి, మనలో ఉన్న క్రీస్తురూపాన్ని చిందర వందర చేస్తున్నాయి.
మానసిక, శారీరక బాధలు, వివిధ రకాల
వ్యాధులు, జబ్బులు మనిషిని కృంగ దీస్తున్నాయి. ఈ ప్రపంచంలో చెడు
పెరిగేకొద్దీ, మనలో ఉన్న దేవుని రూపం పరిపూర్ణతను కోల్పోతూ ఉంది, నాశనం చేయబడుతూ ఉంది.
ప్రతి
మనిషిలో ఉన్న దేవుని రూపాన్ని కాపాడు కోవడానికి ఎప్పుడుకూడా ప్రయత్నం జరుగుతూనే
ఉంది. ఈ సృష్టిలో దేవుని రూపాన్ని కాపాడటానికి, చెదరిన
రూపాన్ని సరిచేయటానికి, తండ్రి దేవుడు క్రీస్తును ఈ లోకానికి
పంపాడు. క్రీస్తు చెప్పిన ప్రతీ మాట, చేసిన ప్రతీ
పని, చేసిన ప్రతీ అద్భుతం కూడా ఈ లోకములో కోల్పోయిన దేవుని
రూపాన్ని తిరిగి కల్పించడానికి చేసియున్నారు. మనలో ఉన్న క్రీస్తు రూపాన్ని ఎలా
క్షేమముగా కాపాడు కోవాలో యేసు తన జీవితం ద్వారా చూపించారు. అందుకే ఈనాటి
సువిశేషములో క్రీస్తుప్రభువు కుష్టివ్యాధితో ఉన్న వ్యక్తికి స్వస్థతను కలుగ జేసి, చెదరిన తన రూపాన్ని పరిపూర్ణం చేసారు. కుష్టి రోగి
యేసు వద్దకు వచ్చినప్పుడు, యేసు అతనిని చూచి జాలి పడ్డాడు. కారణం, వ్యాధి వలన దేవుని పూర్తి రూపాన్ని పొందలేక పోయాడు.
అదేవిధముగా, మనం కూడా, ముఖ్యముగా, మన పాప క్రియల ద్వారా, మన చెడు
నడవడిక ద్వారా, క్రీస్తు రూపాన్ని పోగొట్టు కున్నప్పుడు, క్రీస్తు మనలను చూసి కూడా జాలి పడతాడు. మనలో ఉన్న దేవుని
రూపాన్ని కాపాడు కోలేక పోయాము.
ప్రియులారా, మనలో కూడా వివిధ రకాలైన కుష్ఠ వ్యాధులు ఉన్నాయి. ఎంతో మంది
తమ అనుదిన జీవితములో, శారీరక, మానసిక, కుష్ఠ వ్యాధులతో భాదపడుతూ ఉన్నారు. వారందరు కూడా క్రీస్తు
నిజరూపాన్ని కోల్పోతూ ఉన్నారు. మనలో చెడుక్రియలు, ఆలోచనలు
ఎక్కువైనప్పుడు, క్రీస్తురూపం తగ్గుతూ ఉంది. ఈ చెడు ప్రపంచములో, మానవుని జీవితములో తారా స్థాయికి చేరితే అది మానవుని
జీవితాన్ని ప్రశ్నార్ధకం చేస్తూ ఉంది. అందుకే, యేసు
తనవంతుగా, కుష్టివానికి స్వస్థతను కలుగజేసి యున్నాడు. ఈ స్వస్థత
ద్వారా, ఆ వ్యక్తి మరల తిరిగి తన నిజరూపాన్ని పరిపూర్ణ జీవితాన్ని
కలిగి యున్నాడు.
కుష్టివాని
స్వస్థత, దేవుని పరిపూర్ణ రూపాన్ని మానవుడు పొందుటను సూచిస్తూ ఉంది.
అందుకే, క్రీస్తురూపం మనలో ఎల్లప్పుడూ పరిపూర్తిగా ఉండునట్లు
జాగ్రత్త పడాలి. తండ్రి దేవుడు క్రీస్తులో సంపూర్ణముగా ఉన్న విధముగా మన జీవితములో
కూడా క్రీస్తును సంపూర్ణముగా కలిగి ఉండాలి. దానికి క్రీస్తునే ఆదర్శముగా
తీసుకోవాలి. పునీత పౌలుగారు ఇలా అన్నారు: "ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు." ఈ మాటల ద్వారా, పౌలుగారి నరనరాల్లో క్రీస్తు ప్రభువే జీవించి యున్నారు. ఈ
కారణముగానే, పౌలు ఈనాటి రెండవ పఠనములో 'మీరందరు
నన్ను ఆదర్శముగా తీసుకొనండి' అని చెప్పాడు.
క్రీస్తు బిడ్డలుగా, శిష్యులుగా, మనం మంచి మాటలద్వారా, క్రియలద్వారా, చూపులద్వారా, మన చుట్టూ చెదరి పోయియున్న క్రీస్తు రూపాన్ని, కాపాడటానికి ప్రయత్నిద్దాం. నీతి, నిజాయితి కలిగిన జీవితం, స్వార్ధాన్ని, అసూయను వీడి సర్వమానవాళిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, క్రీస్తు ప్రేమను పంచుటద్వారా, ఈ లోకములో క్రీస్తు రూపాన్ని కాపాడ గలుగుతాము. చెదరి పోయిన క్రీస్తు రూపాన్ని, ప్రపంచములో, ప్రజలలో చూచి, దాన్ని సరిచేసి, క్రీస్తుకు నిజ బిడ్డలుగా జీవించుదాం. క్రీస్తు ఆదర్శాన్ని పాటించుదాం. మనలో ఉన్న క్రీస్తు రూపాన్ని కాపాడుకొను శక్తి కొరకు ప్రార్ధిద్దాం. ఆమెన్.
No comments:
Post a Comment