తపస్కాలము, విభూతి పండుగ 17 ఫిబ్రవరి 2021

తపస్కాలము, విభూతి పండుగ 17 ఫిబ్రవరి 2021
యోవేలు 2:12-18, 2 కొరింతు 5:20-6:2, మత్తయి 6:1-6, 16-18

ఓ సర్వేశ్వరా! మమ్మందరిని కరుణించుము. మీరు సృజించిన దానిలో దేనిని మీరు ద్వేషించరు. పశ్చాత్తాపము చూపినపుడు మానవుల పాపములను క్షమించి వారిని విముక్తులను చేసి, మీరు సర్వాధికారియగు దేవుడనని వెల్లడి చేసికొంటిరి.

తపస్కాలము
తపస్కాలము, ఓ నూతన ఆరంభం. మరణముపై క్రీస్తు విజయానికి సూచన. ఉత్థాన మహోత్సవమునకు 40 దినాల ఆయత్తము. తద్వారా మనలను క్రీస్తు ఉత్థానము (మరణముపై క్రీస్తు విజయం)నకు నడిపించును. ఈ కాలము తక్షణ మారుమనస్సుకు పిలుచును. “పూర్ణ హృదయముతో” (యోవేలు 2:12) దేవుని చెంతకు వచ్చు కాలము. మనలను మన్నించుటకు ఎదురుచూచు చున్నాడు. “దేవునితో సఖ్యపడుము” (2 కొరి 5:20) అని పౌలుగారు క్రీస్తు పక్షమున మనలను బ్రతిమాలుచున్నాడు.

తపస్కాలము విభూతి పండుగతో ప్రారంభమవుతుంది. ఈ కాలములో యేసు ప్రభువుతో ఎడారిలో ప్రయాణము చేస్తూ ఆయన జీవితము, త్యాగము, మరణము, సమాధి మరియు ఉత్థానము గూర్చి ధ్యానిస్తూ ఉంటాము. తపస్కాలము, క్రైస్తవ జీవిత పరమ రహస్యాన్ని (ప్రేమ) ధ్యానించుటకు మనము పొందిన మరో గొప్ప అవకాశము. దైవవాక్కు, దివ్య సంస్కారముల సహాయముతో, మన విశ్వాస (ఆధ్యాత్మిక) యాత్రను పునర్మించుటకు, పునరుద్ధరణకు మరో చక్కటి అవకాశం. తపస్కాల యాత్ర ప్రార్ధన, ఉపవాసం మరియు దానధర్మములతో కూడి ఉంటుంది.

తపస్కాలము, పశ్చాత్తాపము, మారుమనస్సు పొందు సమయము. మారు మనస్సు అనగా, మన ఆలోచనలు, కార్యాలు దైవచిత్తముతో ఏకమై ఉండటము. దేవున్ని, ఆయన చిత్తాన్ని మన జీవితములో మొదటి స్థానాన్ని ఇవ్వటం. దానికోసం సమస్తాన్ని త్యాగం చేయడానికి సంసిద్ద పడటము.

మనము స్వార్ధముతో అన్నీ మన స్వాధీనములో ఉండాలని కోరుకుంటాం. ఇతరులపై అధికారాన్ని చేలాయించాలని చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాలను మరచి, లోకాశలకు లోనై జీవిస్తూ ఉంటాం. పేరు ప్రతిష్టలకోసం, ధనంకోసం, పలుకుబడికోసం, అధికారంకోసం జీవిస్తూ ఉంటాం. స్వార్ధముతో, మోహపు తలంపులతో, అన్యాయపు ఆలోచనలతో, ఇతరులను భ్రష్టుపరచాలనే ఉద్దేశములతో జీవిస్తూ ఉంటాము. వీటన్నింటితో దేవునికి, ఇతరులకు చివరికి మనలకు మనం ఏమివ్వగలుగుతున్నాం? వీటితో మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం?

దైవకుమారుడైన క్రీస్తు వీటన్నింటి నుండి మనలను విముక్తులను చేయుటకు, మనమధ్యలోనికి వచ్చాడు. మనలో సహోదర భావాన్ని పెంపొందించుటకు, అందరు కలసి మెలసి జీవించునటుల చేయుటకు, మనలో ప్రేమను నింపుటకు ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. విభేదాలు లేకుండా, అందరూ సమానులే అన్న భావన మనలో కలుగ జేస్తున్నాడు. మరియు దేవుడు అందరికీ తండ్రీ అని నేర్పిస్తున్నాడు.

“మనము ఒకరికి ఒకరము సహాయ పడుచు ప్రేమను ప్రదర్శించి, మేలు చేయుటకు పరస్పరము ప్రేరేపించు కొనుటకు దారులు కనుగొందము” (హెబ్రీ 10:24). దీనికి తపస్కాలము ఓ మంచి దారియే కదా!

ఒకరికి ఒకరము సహాయ పడుదాం: తోటి వారి పట్ల బాధ్యత కలిగి జీవించుదాం. ముందుగా, మన హృదయాలను యేసు వైపునకు త్రిప్పాలి. “దేవునిచే పంపబడిన యేసును చూడుడు” (హెబ్రీ 3:1). ప్రభువు నుండి పొందే శక్తితో, తోటివారిని చూడగలం. వారి పట్ల బాధ్యతగా ఉండగలం. జక్కయ్య అన్యాయముగా తోటివారిని మోసం చేస్తూ ధనం కూడబెడుతూ జీవించేవాడు. కాని, ప్రభువును చూసిన తర్వాత తన జీవితములో మార్పు కలిగింది. మారు మనస్సు పొందాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాప పడ్డాడు. అన్యాయముగా మోసం చేసిన తోటివారికి వారి ధనాన్ని తిరిగి ఎక్కువగా ఇచ్చేసాడు. తన జీవితములో, మొట్టమొదటి సారిగా, సంతోషమును, ఆనందమును అనుభవించాడు. తను కూడా దేవుని కుమారుడనే అని గుర్తించాడు. తను కూడా, సహోదరులలో ఒక సహోదరుడనే అని గుర్తించాడు. దేవున్ని చూసి, మారుమనస్సు పొందిన హృదయం దేవునితో, తనతో మరియు ఇతరులతో సఖ్యతలో, సహవాసములో జీవించును. “ఎవరికిని ఏమియును బాకీ పడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అన్యోన్యము ప్రేమించుకొనుటయే” (రోమీ 13:8).

తోటివారికి మేలు చేద్దాం: తోటివారిపై తీర్పు చేయక, వారిని భ్రష్టు చేయక, పరస్పర ప్రేమ కలిగి జీవించుదాం. “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ జేయు విషయములనే ఆసక్తితో అనుసరించుదము” (రోమీ 14:19). తపస్కాలము, ప్రాయశ్చిత్తము, ధ్యానము, ఉపవాసముతో కూడినటు వంటిది. ఈ తపస్కాలములో, మన జీవితములో మార్పు కోసం ఆశిద్దాం. దానికై కృషి చేద్దాం. విభూతి పండుగ రోజున, మనం స్వీకరించే విభూతి దేవునిపై మన సంపూర్ణ అధారతను, దేవుని దయ, క్షమను సూచిస్తుంది. ‘సిలువ మార్గము’ పవిత్రాత్మచే ఏర్పాటు చేయబడిన గొప్ప మార్గము. దీని ద్వారా, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ, ఆయన శ్రమలలో భాగస్తులమవుతున్నాము.

విభూతి పండుగ
నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలసి పోవుదువు (ఆ.కాం.3:19). విభూతిని వాడే ఆచారం, పాత నిబంధన కాలము నుండియే ఉన్నది. విభూతి దు:ఖమును, మరణమును, ప్రాయశ్చిత్తమునకు చిహ్నం. అహష్వేరోషు రాజు యూదులను కుట్రపన్ని చంపడానికి రాజ శాసనమును చేసాడని విని, మొర్దేకయి సంతాపముతో బట్టలు చించు కొనెను. గోనె తాల్చి తల మీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చెను (ఎస్తేరు 4:1). యోబు తాను పలికిన పలుకులకు సిగ్గుపడి దుమ్ము బూడిద పైని చల్లుకొని పశ్చాత్తాప పడెను (యోబు 42:6). ఇజ్రాయేలు ప్రజల బాబిలోను బానిసత్వమును గూర్చి ప్రవచిస్తూ దానియేలు ఇలా పలికాడు, “నేను ప్రభువునకు భక్తితో ప్రార్ధన చేయుచు అతనికి మనవి చేసికొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని (దానియేలు 9:3). యేసు ప్రభువు కూడా, విభూతిని గూర్చి సూచించాడు, “మీ యందు చేయబడిన అద్భుత కార్యములు, తూరు సీదోను పట్టణములలో జరిగి యుండినచో, ఆ పుర జనులెపుడో గోనె పట్టలు కప్పుకొని, బూడిద పూసికొని హృదయ పరివర్తనము పొంది యుండెడివారే (మత్తయి 11:21).

శ్రీసభ ఈ ఆచారాన్ని తపస్కాల ఆరంభానికి, ప్రాయశ్చిత్తానికి గురుతుగా తీసుకొని యున్నది. తపస్కాలములో మన మరణము గూర్చి తలంచి, పాపాలకు దు:ఖపడుతూ ఉంటాము. గురువు విభూతిని ఆశీర్వదించి విశ్వాసుల నుదిటిపై శిలువ గురుతు వేస్తూ, “ఓ మానవుడా! నీవు ధూళి నుండి పుట్టితివనియు, తిరుగ ధూళిగ మారిపోవుదవనియు స్మరించుకొనుము" లేక "పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొనుము అని చెప్పును.

విభూతి యొక్క తాత్పర్యం ‘పశ్చాత్తాప పడి పాపాలకు ప్రాయశ్చిత్త పడటము’. మన రక్షణార్ధమై శ్రమలను పొంది, మరణించి ఉత్థానుడయిన ప్రభువునకు మన హృదయాలను అర్పించి మారుమనస్సు పొందటము. మన జ్ఞానస్నాన వాగ్దానాలను తిరిగి చేయడం. క్రీస్తులో పాత జీవితమునకు మరణించి, నూతన జీవితమునకు ఉత్థానమవడము. భూలోకములోనే, దైవ రాజ్యమును జీవించుటకు ప్రయాసపడి, పరలోకములో దాని పరిపూర్ణతకై ఎదురు చూడటము.

నినేవే వాసులు గోనె పట్టలు, బూడిదతో పశ్చాత్తాప పడిన విధముగా, మనము కూడా విభూతిని మన నుదిటిపై ధరించి మన పాపాలకోసం, చెడు జీవితముకోసం పశ్చాత్తాప పడుచున్నాము. ఈ లోక జీవితము శాశ్వతము కాదని గుర్తుకు చేసుకొంటున్నాము. మన హృదయాలను అణకువ పరచుకొంటున్నాము.

ప్రార్ధన, ఉపవాసము, దానధర్మములు

ప్రార్ధన, ఉపవాసము మరియు దానధర్మములు తపస్కాలములో ముఖ్యమైన మూడు స్తంభాల వంటివి. ఇవి మన మారుమనస్సును వ్యక్తపరచును. మన ప్రాయశ్చిత్తమునకు, పశ్చత్తాపమునకు, జ్ఞానస్నాన వాగ్దానములకు విశ్వాస జీవితాన్ని పునర్మించుటకు ఎంతగానో తోడ్పడతాయి.

ప్రార్ధన: తపస్కాలములో ఎక్కువ సమయాన్ని ప్రార్ధనలో గడపాలి. అది ప్రభువునకు మనలను దగ్గరగా చేస్తుంది. మన జ్ఞానస్నాన ప్రమాణాలను జీవించుటకు కావలసిన శక్తి కోసం ప్రార్ధన చేయాలి. ఉత్థాన పండుగ దినమున జ్ఞానస్నానము పొందు వారి కొరకు ప్రార్ధన చేయాలి. పాపసంకీర్తనము చేయు వారి కొరకు ప్రార్ధన చేయాలి.

ఉపవాసము: ఉపవాసము పవిత్రమైన కార్యము. ఉపవాసము కేవలం ఇంద్రియనిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమేగాక, ప్రార్ధన చేయుటకు సహాయ పడును. శారీరక ఆకలి, మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది. అయితే, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఇదే: “నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ఇతరుల మెడ మీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు. పీడితులను విడిపింపుడు. వారిని ఎట్టి బాధలకును గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు. బట్టలు లేనివారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు” (యెషయ 58:6-7). మన ఉపవాసము వలన, మన సమాజములో, ఎంతో మంది పేదరికము వలన రోజూ ఉపవాసము ఉంటున్నారని గుర్తించుదాం. సమానత్వము కొరకు, అందరూ క్షేమముగా ఉండటానికి కృషి చేద్దాం.

దాన ధర్మములు: దాన ధర్మాలు తోటి వారి పట్ల మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన వరములకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అవసరములో నున్నవారికి సహాయం చేయాలి, దాన ధర్మములు చేస్తూనే, మన సమాజములో నీతి, న్యాయ స్థాపనకు కృషి చేయాలి.

సిలువ మార్గము

తపస్కాలములో ‘సిలువ మార్గము’నకు ప్రత్యేక స్థానము ఉన్నది. తపస్కాలములో మనం ముఖ్యముగా క్రీస్తు శ్రమలను, మరణము గూర్చి ధ్యానిస్తూ ఉంటాము. సిలువ మార్గము ద్వారా, క్రీస్తు శ్రమలలో మనమూ పాలుపంచు కొనాలి. సిలువ మార్గము, క్రీస్తు శ్రమలను పొందిన విధముగా, దేవునకు విశ్వాస పాత్రులుగా ఉండాలంటే, మనము కూడా శ్రమలను పొందాలని గుర్తు చేస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment