ఉపోద్ఘాతము:
నేడు సామాన్య మూడవ ఆదివారము. ఈరోజు మనము క్రైస్తవ
ఐఖ్యత ఆదివారమును కొనియాడుచున్నాము. యోహాను 15:1-17 ఆధారముగా “నా ప్రేమయందు
నెలకొని ఉండుడు, మీరు అధికముగ ఫలించెదరు” అను అంశము ఎంచుకొన బడినది. ఇది ప్రార్ధన,
సమాధానము, తిరుసభ మరియు మానవాళి కుటుంబ ఐక్యతకు క్రైస్తవ సంఘము యొక్క దైవపిలుపును
వ్యక్తపరచు చున్నది. ఇచ్చట దేవాలయములోను, ప్రపంచమంతట క్రైస్తవ ఐక్యత కొరకు ప్రార్ధించడానికి
మనమందరము సమావేశమైన సందర్భముగా, క్రీస్తుతోను, తోటివారితోను మనకున్న ఐక్యతను
జ్ఞాపకం చేసుకొనుచున్నాము. “నా ప్రేమయందు నెలకొని ఉండుడు” (యోహాను 15:9) అని
ప్రభువు తన శిష్యులతో చెప్పియున్నారు. తండ్రి ప్రేమలో క్రీస్తు నెలకొని యున్నాడు
(యోహాను 15:10). ఆ ప్రేమను మనతో పంచుకోవాలనేదే ఆయన ఏకైక కోరిక: “నేను మిమ్ములను
స్నేహితులని పిలచితిని. ఏలయన, నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచితిని”
(యోహాను 15:15b). ద్రాక్షావల్లియైన క్రీస్తుకు మనము అంటుకట్టబడిన వారము. మనము అధికముగా
ఫలించుటకు వ్యవసాయిగా తండ్రి దేవుడు కొమ్మలను కత్తిరించి సరిచేయునట్లుగా మనలను సరిచేయును.
ఇది ప్రార్ధనలో జరుగు విషయాన్ని విశదపరచు చున్నది. తండ్రి దేవుడు మన జీవితాలను
కేంద్రముగా మార్చు మూలాధారము. ఆయన మనలను సరిచేసి పరిపూర్ణులను చేయును. సమస్త
మానవాళి ఆయనకు మహిమను చేకూర్చును. మనము యేసు క్రీస్తును ఆలకించినప్పుడు ఆయన జీవం మనలో ప్రవహించును. ఆయన మాటలు మనలో నిలిచి యుండాలని
యేసు మనలను ఆహ్వానిస్తున్నాడు (యోహాను 15:7). అప్పుడు మనము ఏది కోరినను మనకు
ఒసగబడును. ఆయన వాక్కుద్వారా మనము ఫలించెదము. వ్యక్తులముగా, సంఘముగా, సర్వ
శ్రీసభగా క్రీస్తులో ఐక్యత కలిగియుండాలని కోరుకుందాం. తద్వారా “నేను మిమ్ము ప్రేమిచినటులనే,
మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు” అను క్రీస్తు ఆజ్ఞను పాటించగలము (యోహాను
15:12).
పూజా
పఠనాలు - ఉపోద్ఘాతము: నేడు సామాన్య కాలములో మూడవ ఆదివారము. ఈ
ఆదివార పఠనాలనే తీసుకోవడం జరిగింది.
మొదటి
పఠనము: యోనా 3:1-5,10: “నలువది
దినములు ముగియగానే నీనెవె నాశనమగును!” (యోనా 3:4). పాత నిబంధన గ్రంథములో, యోనా
ప్రవచనం చాలా వినసొంపైన ప్రవచనం. తీర్పు మరియు ఎంతో బాధాకరమైన నేరారోపణలతో కూడిన
ప్రవచనాలను ఎన్నింటినో ప్రవక్తల గ్రంథములలో చూస్తున్నాము. యోనా ప్రవచనం వాక్చాతుర్య నైపుణ్యము లేనటువంటిది.
అయినప్పటికిని, యోనా ప్రవచనం నీనెవె పట్టణం మొత్తాన్ని ఎంతగానో ప్రేరేపించినది
– అచటి నివాసులందరు మానవులు (మరియు జంతువులు సహా) పశ్చాత్తాప పడి, గోనె ధరించి,
ఉపవాసము చేసిరి. ఇలాంటి ఆశ్చర్యకరమైన, సానుకూలమైన ప్రతిస్పందన పాత నిబంధన గ్రంథములో
ఏ ప్రవక్తకు కూడా లభించలేదు!
రెండవ
పఠనము: 1 కొరి 7:29-31: క్రైస్తవ
జీవితము యొక్క ఆశను గురించి ఈ పఠనము తెలియజేయు చున్నది. వివాహితులైనను,
అవివాహితులైనను ప్రస్తుత జీవితములో నిర్దేషించ బడలేదు. మన జీవితము ఈ లోకములో స్వల్పకాలికమైనదని
పౌలు కొరింతీయులకు గుర్తుచేయు చున్నారు. ఈ లౌకిక జీవితం తాత్కాలికమైనది మరియు ఆవిరి
లాంటిది. తుదితీర్పు, అంతిమ దినము, ప్రభువు రాకడపై దృష్టి సారించాలని క్రైస్తవులను
ఈ పఠనము ఒక శంఖారావం వలె నున్నది.
సువిశేష
పఠనము: మార్కు 1:14-20: దేవుని రాజ్యములో భాగస్తులమగుటకు యేసు
మనలను పిలచుచున్నాడు. మొదటగా, హృదయ పరివర్తనము చెందాలని పిలుపు. ఈ పిలుపునకు
ప్రతిపిలుపు తన శిష్యరికమునకు పిలుపు. రెండవదిగా, సువార్తను విశ్వసించాలని పిలుపు.
ఈ పిలుపు క్రీస్తును విధేయతతో అనుసరించుటలో నిరంతర ప్రతిస్పందనను
వ్యక్తపరుస్తుంది. క్రీస్తు జీవితము, మరణ-ఉత్థానములో కొలువైయున్న దేవుని రాజ్య
సువార్తలో ఈ విశ్వాసమును ఉంచవలయును (మార్కు 1:15).
ప్రసంగము:
ప్రభువు శిష్యులను పిలవడం సువార్తయంతట చూస్తున్నాము. నేటి
సువిశేష పఠనము రెండు విధాలైన పిలుపును ప్రాముఖ్యముగా సూచిస్తున్నది. మొదటగా, హృదయ
పరివర్తనమునకు పిలుపు మరియు రెండవదిగా ప్రధమ శిష్యులకు పిలుపు. హృదయ
పరివర్తనమునకు మరియు శిష్యరికమునకు పిలుపు - రెండుకూడా పరస్పర సంబంధాన్ని కలిగియున్నాయి.
ఒకటి మరొకదానికి నడిపించును. క్రీస్తు శిష్యులముగా మారాలంటే మన పాత మార్గాలను
విడచి పెట్టాలి, పునరుద్ధరణ కలిగి యుండాలి, క్రీస్తులో నూతన సృష్టిగా జన్మించాలి. ప్రభువు
మనలను కేవలం చూపరులుగా ఉండటానికో లేదా కేవలం మంచి మనుషులుగా ఉండటానికో పిలవడం
లేదు. ఆయన పిలుపు ఆయనకు “శిష్యులు”గా ఉండుటకు. ప్రభువు శిష్యుడు ఎవరు? సాధారణ
మాటలలో చెప్పాలంటే, శిష్యుడు గురువు నుండి నేర్చుకొనువాడు. శిష్యరికం అనగా
ఏమిటి? పరిశుద్ధాత్మ శక్తిచేత ఒక వ్యక్తి తననుతానుగా సువార్తను ప్రకటించుకొనుట
వలన శిష్యరికమును అర్ధం చేసుకోవచ్చు. ఇది పరిశుద్ధాత్మ శక్తిచేత పునరుద్దరింప బడుట!
తద్వారా, మన జీవితములో ప్రతీ అంశము క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. మన
జీవితానుభవము ద్వారా తమకుతాము సువార్తను ప్రకటించుకోవడం కష్టతరమని మనకు తెలుసు.
అయినప్పటికిని, ఇది జరగనంత వరకు మనము క్రీస్తు శిష్యులము కాలేము.
శిష్యరికపు
లక్ష్యం ఏమిటి? ప్రతీ శిష్యుని ఉద్దేశం, ఇకనుండి
యేసును తన జీవితానికి ప్రభువుగా చేసుకోవడం. యేసు తన ప్రధమ శిష్యులను పిలచినప్పుడు,
“వారు వెంటనే తమ వలలను విడిచిపెట్టి, ఆయనను వెంబడించారు” (మార్కు 1:18). కొంతమంది...
“తమ తండ్రిని పనివారితో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించారు” (మార్కు 1:20).
అప్పటి వరకు వారి జీవితాలు పడవలు, వలల చుట్టూ తిరిగాయి. అదే వారి జీవిత సర్వస్వం
అయి ఉండినది. కాని ఇప్పటినుండి యేసే వారికి సర్వస్వం అయ్యాడు. యేసు జీవిత
విధానమును అనుసరించువాడు శిష్యుడు. “గురువు వలె శిష్యుడు ఉండుట చాలును” (మత్తయి
10:25). “నన్ను అనుసరింపుడు” అని యేసు వారిని ఆహ్వానించినప్పుడు, వారిని తన జీవిత
విధానమును అనుసరించుటకు పిలచియున్నాడు. యేసును అనుసరించుట ద్వారా, వారు ఆయన
గురించి తెలుసుకున్నారు. “వచ్చి చూడుడు” (యోహాను 1:39) అని యేసు పిలచుట ద్వారా తన
జీవిత విధానమువలె రూపాంతరం చెందుటకు వారిని పిలచి యున్నాడు. “ఆయన యందు జీవించు
చున్నానని చెప్పుకొనెడి వాడు యేసు క్రీస్తు వలె జీవింప వలెను” (1 యోహాను 2:6).
శిష్యుడు తన జీవిత విధానమును సంపూర్ణమైన
మార్పునకు పిలువబడి యున్నాడు. దీనిని గురించి పునీత పౌలుగారు ఇలా అంటున్నారు: “ఎవ్వడైనను
క్రీస్తు నందున్న యెడల అతడు నూతన సృష్టి! పాత జీవితము గతించినది. కొత్త జీవితము
ప్రారంభమైనది” (2 కొరి 5:17). పునీత పౌలుగారు చెప్పినట్లుగా, ఈ పిలుపు “క్రీస్తు
ప్రభువును పోలి జీవించుటకు” (ఎఫే 5:1). ప్రభువు అడుగుజాడలలో నడచుటకు, ఆయనవలె
జీవించుటకు, ఆయన మనకు ఆదర్శమును ఇచ్చెను. శిష్యుడు క్రీస్తునందు నెలకొని ఉండును.
క్రీస్తును అనుసరించువాడు ఆయన జీవిత విధానముద్వారా తప్పక రూపాంతరము చెందును, కీస్తు
ఆత్మను తనలో నింపుకొనును. “నేను మీ యందు ఉందును. మీరు నా యందు ఉండుడు” (యోహాను
15:4) అని పలికిన క్రీస్తును ఆధారముగా చేసుకొనును.
శిష్యుడు యేసుక్రీస్తుకు
ప్రేమతోను, కృతజ్ఞతతోను సేవ చేయును. అన్నింటికంటే, అందరికంటే, ఆయనను అమితముగా
ప్రేమించును. “నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు” (యోహాను
14:21) అని ప్రభువు పలికియున్నారు. శిష్యుడు గురువును సమస్తముకంటే అధికముగా
ప్రేమించును. తనకున్న సమస్తమును విడిచి గురువును అనుసరించును. తన జీవితమునకు ఆయననే
మూలుగా, ఆధారముగా, కేంద్రముగా చేసుకొనును. “ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు.
ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును. మరియొకనిని ప్రేమించును” (మత్తయి 6:24).
యేసు
మనలను ఎందులకు పిలచును? ఆయన పిలుపు లక్ష్యము ఏమిటి? తండ్రి
దేవున్ని బహిరంగ పరచుటకు. తండ్రి దేవునిని మనము ఎరిగియుండాలనేది కుమారుడైన యేసుక్రీస్తు
కోరిక. శిష్యుడు తప్పక త్రిత్వైక దేవునితో సంబంధాన్ని కలిగియుండాలి. యేసు, తండ్రి
దేవుని యొద్దకు మార్గము. “మీరు నన్ను ఎరిగి యున్నచో, నా తండ్రిని కూడా ఎరిగి
యుందురు” (యోహాను 14:7) అని యేసు పలికియున్నాడు.
యేసు తన ద్వారా మనం తండ్రిని
తెలుసుకొనుటకు, తండ్రియొక్క మృదువైన మరియు దయగల ప్రేమను అనుభవించుటకు మనలను
పిలుచును:
ఫలించుటకు
మనలను పిలుచును: ఆయన శిష్యులముగా ఉండుటకు మరియు
ఫలించుటకు మనలను పిలుచును. పండ్లను బట్టి చెట్టు స్వభావము తెలుయునట్లుగా,
అదేవిధముగా, ఫలించు ఫలమును బట్టి శిష్యుని స్వభావము తెలియును. “మీరు అధికముగా
ఫలించుట వలన నా శిష్యులగుదురు” (యోహాను 15:8).
గురువు
యొక్క సిలువను పంచుకొనుటకు పిలుచును: శిష్యుడు తన సిలువను ఎత్తుకొని
అనుసరించుటకు పిలువబడును. “క్రీస్తునందు విశ్వాసము కలిగి యుండుట మాత్రమేకాక, ఆయన
కొరకై శ్రమలను, హింసలను అనుభవించుటకు, మీకు విశేషమైన అవకాశము ప్రసాదింప బడినది”
(ఫిలిప్పీ 1:29) అని పౌలు తెలియజేయు చున్నాడు. శిష్యుడు సిలువనుండి పరుగెత్తడు,
పారిపోడు. ఎందుకన అంతిమముగా, “క్రైస్తవ సందేశ సారాంశము ఈ లోకానికి వేదసాక్షి మరణముద్వారా
బహిరంగ పరపబడును” (రెండవ జాన్ పౌలు జగద్గురువులు, ఎక్లేసియా ఇన్ ఆసియా, నం.49).
వేదమరణం అనగా సాక్షి జీవితం అని అర్ధం. వేదసాక్షి అని చెబుతూ ఉంటాం. క్రీస్తు
కొరకు తమ రక్తాన్ని చిందించిన వారు సువార్త విలువలకు సాక్ష్యమిచ్చు చున్నారు.
ఇతరులను
తనకు శిష్యులనుగా చేయుటకు పిలుచును: యేసు ప్రభువు కొంతమంది
బెస్తవారిని పిలచి తన శిష్యులనుగా చేసుకున్నాడు. తద్వారా వారు వెళ్లి అనేకమందిని
క్రీస్తుకు శిష్యులుగా చేయవలయును. క్రీస్తు స్పష్టమైన ఆజ్ఞను ఇచ్చియున్నారు: “మీరు
వెళ్లి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని
నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించిన దంతయు వారు ఆచరింప బోధింపుడు” (మత్తయి
28:19-20). “నీవు నన్ను ప్రేమించినచో, నా గొర్రెలను మేపుము” (యోహాను 21:15).
అదేవిధముగా, పునీత పౌలుగారు, “నీవు వినిన పలుకులను, ఇతరులకు గూడ బోధింపుము” అని
ఉపదేశించాడు (2 తిమోతి 2:2).
ఈవిధముగా, క్రీస్తానుకరణ ఓ
గొప్ప సవాలుతోను, రిస్కుతోను కూడుకున్నది. ఇది సమస్తమును విడనాడుటకై మన నిర్ణయమును
ఆశించును. క్రీస్తానుకరణ యనగా ఇరుకైన మార్గమున ప్రయాణము చేయుట మరియు ఇరుకైన
ద్వారమున ప్రవేశించుట. సమస్తమును త్యాగము చేసిననే తప్ప మరియు ప్రభువు స్వరమును
ఆలకించిననే తప్ప, మన జీవితములో దేవుడు ఆదేశించు ఉత్తమమైన దానిని సాధించలేము.
ప్రభువు మొదటగా తన పన్నెండుగురు శిష్యులతో మాట్లాడు చుండగా, వారి హృదయాలు
ప్రజ్వరిల్లాయి. వారికది నిర్ణయం తీసుకొను సమయం అని వారికి అర్ధమయినది. వారు
వెనుకకు వెళ్లి వారి పాత జీవితాలను జీవించడానికి నిర్ణయం చేయవచ్చు లేదా ముందుకు
వెళ్లి, వారి కుటుంబాన్ని, స్నేహితులను, సమస్తమును విడచి ప్రభువును అనుసరించుటకు
నిర్ణయం చేయవచ్చు.
ఆధునిక ప్రపంచములో మన ఆత్మకు
నిజ శత్రువు విభజింపబడిన మన హృదయమే! ప్రభువు తన శిష్యులను పిలచినప్పుడు
పాక్షికముగా అనుసరించుటకు పిలువలేదు, కాని ప్రతీ క్షణం అనుసరించుటకు వారిని పిలిచాడు.
తన సేవలో వారిని నిమగ్నము చేసాడు. వారి దృష్టి, శ్రద్ధ తనపై ఉండునట్లుగా చేసాడు.
కనుక, ఈ ఆధునిక కాలములో మన పనులతో ఎంతగా బిజీబిజీగా ఉన్నను, శిష్యరికములోనున్న
తీవ్రతను గ్రహించాలి. క్రీస్తు మనలనుండి ఆశించు విధముగా జీవించాలి. సవాళ్లు,
రిస్కులు ఉన్నప్పుడు మనం దేవునిపై ఆధారపడాలి. దేవునిపై ఆధారపడి జీవించాలని యేసు తన
శిష్యులను ఆజ్ఞాపించాడు. “మీరు ప్రయాణము చేయునప్పుడు ఏమియు తీసుకొని పోరాదు... (లూకా
9:3) అని యేసు తన శిష్యులకు ఉపదేశించాడు. “మీరు పొండు. ఇదిగో! తోడేళ్ళ మధ్యకు
గొర్రెపిల్లలవలె మిమ్ము పంపుచున్నాను” (లూకా 10:3). “మీ ఆస్తులను అమ్మి దానము
చేయుడు. (లూకా 12:33). యేసు ఈ లోకములో దైవ రాజ్యమును పునరుద్దరించు చున్నాడు. ఈ
గొప్ప దైవకార్యములో మనము కూడా భాగస్తులము కావాలని ఆహ్వానించు చున్నాడు. తరచుగా,
రాజ్యమును మన స్వశక్తితోను, మనకున్న వనరుల ఆధారముగాను, మన ప్రణాళిక ప్రకారముగాను
నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. యేసు తన ప్రేషిత కార్యమును తన శిష్యులకు
అప్పజెప్పాడు, కాని వారికి ఎలాంటి వనరులను ఇవ్వలేదు. కనుక సమస్తమునకు వారు
సంపూర్ణముగా దేవునిపై ఆధారపడాలి.
విశ్వాసుల
ప్రార్ధనలు:
గురువు: సహోదరీ సహోదరులారా! మన జీవితాలకు ఆధారమును, ఐఖ్యతకు చిహ్నముగాను ఉన్న పరలోక
తండ్రివైపుకు మన హృదయాలను, మనస్సులను ఎత్తుదాం. విరిగి నలిగి పోయిన మన సంఘాలను
దేవుని చెంత సమర్పించి, క్రీస్తు శరీరముపై కలిగించిన విభజన గాయాలను స్వస్థత పరచి,
ఐఖ్యత వరమును ఒసగమని ప్రార్ధించుదాం. అందరు: ఓ ప్రభువా! మా ప్రార్ధన ఆలకించండి.
క్రైస్తవుల ఐఖ్యత కొరకు కృషి చేయుచున్న
జగద్గురువులు పొప్ ఫ్రాన్సిస్ గారి కొరకు ప్రార్ధించుదాం. క్రైస్తవులందరినీ ఒకే
కాపరి చెంత, ఒక త్రాటిపైకి తీసుకొని రావాలనే వారి కృషి ఫలించాలని ప్రార్ధించుదాం. అందరు:
ఓ ప్రభువా! మా ప్రార్ధన ఆలకించండి.
క్రైస్తవులందరి ఐఖ్యత కొరకు తమ
జీవితాలను అంకితం చేసుకున్న వారి కొరకు ప్రార్ధించుదాం. వారి నిస్వార్ధ కృషిని
దేవుడు ఆశీర్వదించి, త్వరలో వారి కలలు నెరవేరాలని, క్రీస్తునందు విశ్వాసమును
ప్రకటించు వారందరి మధ్య ఐఖ్యత కలగాలని ప్రార్ధించుదాం. అందరు: ఓ ప్రభువా!
మా ప్రార్ధన ఆలకించండి.
క్రీస్తునందు విశ్వాసము వలన ప్రపంచములో
పలుచోట్ల హింసలను అనుభవించుచున్న ప్రతీ క్రైస్తవ బిడ్డకొరకు ప్రార్ధించుదాం. వారి
వేదసాక్షి మరణం ఇతర క్రైస్తవుల ఐఖ్యత కొరకు పాటుబడుటకు ప్రేరణ కలుగులాగున ప్రార్ధించుదాం.
అందరు: ఓ ప్రభువా! మా ప్రార్ధన ఆలకించండి.
భారత దేశములోనున్న సకల క్రైస్తవ
సంఘాల కొరకు ప్రార్ధించుదాం. ఆచారాలు, భాషలు, ప్రాంతాలు, కులాలు పేరున ఉద్భవించిన
విభజనలు నశించిపోవాలని, క్రీస్తు మనందరికి ఒకే ఒక్క ఏకైక కాపరియని అందరు తెలుసుకొనునట్లు
ప్రార్ధించుదాం. అందరు: ఓ ప్రభువా! మా ప్రార్ధన ఆలకించండి.
మన విచారణ సంఘము కొరకు ప్రార్ధించుదాం.
క్రైస్తవుల మధ్యననున్న విభజనల యొక్క బాధానుభూతిని మనమందరము పొంది, తద్వారా
క్రైస్తవుల ఐఖ్యత కొరకు ప్రార్ధించు అవసరతను మనము గుర్తించునట్లుగా ప్రార్ధించుదాం.
అందరు: ఓ ప్రభువా! మా ప్రార్ధన ఆలకించండి.
గురువు: మా ప్రేమగల తండ్రియైన దేవా, మీ బిడ్డలమైన మాపై కనికరము చూపుము. మీ దివ్య కుమారుని
శరీరములో మేమంతా, ముఖ్యముగా మా భారత దేశములో ఐఖ్యత పొందు వరముకై ప్రార్ధించుచున్నాము.
ఈ వారమంతయు మేము చేయు ప్రార్ధనలను ఆలకించండి. ముఖ్యముగా నేడు మేము విన్నవించిన ఈ
ప్రార్ధనలన్నింటిని దయతో ఆలకించమని వేడుకొంటున్నాము. మా ప్రభువైన క్రీస్తుద్వారా ఈ
మనవి చేయుచున్నాము.. అందరు: ఆమెన్.
No comments:
Post a Comment