సువార్తలు

 సువార్తలు

యేసు చేసిన బోధనలు, కార్యములన్నికూడా అపోస్తలులు, శిష్యులు మరియు అనాది క్రైస్తవ సంఘాలద్వారా మనకు అందించబడినవి. యేసు ప్రేషితకార్యం, శ్రమలు, మరణం, ఉత్థానం పొందిన చాలా సంవత్సరాల తరువాత సువార్తలు వ్రాయబడినవి. ఆరంభములో ఇవన్నియు కూడా మౌఖిక సాక్షాల (oral testimonies) ద్వారా ఇతరులకు తెలియజేయబడినవి. ఆతరువాత వీటిని వివిధ ప్రతులలో కూర్పుచేయబడినవి. ఈ మౌఖిక సాక్షాలను ‘యేసు సంప్రదాయాలు’ (‘Q’ source), శ్రమల కథనాలు, ఉపమానాలు, అద్భుతాలు, స్వస్థతలు మొదలగునవి వివిధ ప్రతులుగా కూర్పుచేయబడినవి. వీటిని ఆధారముగా చేసుకొనే నేడు నూతన నిబంధనములో మనము చూస్తున్న నాలుగు సువార్తలు కూడా వ్రాయబడినవి. ఈ నాలుగు సువార్తలు కూడా క్రీ.శ.65-100 మధ్యకాలములో వ్రాయబడినవి.

ఈ క్రమములో సువార్తల కూర్పులో మూడు ముఖ్యమైన దశలను చూడవచ్చు:

యేసు క్రీస్తు జీవితము, బోధనలు (క్రీ.పూ. 6-క్రీ.శ. 30): యేసు క్రీస్తును గూర్చిన చారిత్రక వాస్తవాలను క్రింది విధముగా చూడవచ్చు:

-       యూదయా దేశపు రాజగు హేరోదు కాలమున, పాలస్తీనా యూదుడైన నజరేయుడగు యేసు, బేత్లెహేములో యోసేపునకు ప్రధానము చేయబడిన మరియకు జన్మించెను (లూకా. 1:5; 2:1; మత్త. 2:1f.).

-       తిబేరియ చక్రవర్తి పరిపాలన కాలములో 15వ సంవత్సరము. యూదయా మండలమునకు పోంతు పిలాతు పాలకుడు. గలిలీయకు హేరోదు, ఇతూరయా, త్రకోనితిసు ప్రాంతములకు, అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు లిసాన్యా అధిపతులు. అన్నా, కైఫా ప్రధానార్చకులు. అప్పుడు స్నాపకుడగు యోహాను దేవుని వాక్కును ప్రకటించుచుండెను (లూకా. 3:1-2). యోహాను చెరసాలలో బంధింపబడిన తరువాత, యేసు గలిలీయ సీమలో దేవుని సువార్తను ప్రకటించెను (మార్కు. 1:14). అప్పుడు యేసు ప్రాయము రమారమి ముప్పది సంవత్సరములు (లూకా. 3:23).

-       యేసు బహిరంగ పరిచర్య మూడు దాదాపు సంవత్సరములపాటు కొనసాగింది. అతను దేవుని రాజ్యము గురించి ప్రకటించాడు (మార్కు. 1:14-15). అలాగే, ప్రజలకు ఎన్నో ఉపదేశాలను బోధించాడు, రోగులను స్వస్థపరచాడు, అనేకమంది పేద, ధనికుల జీవితాలను తట్టియున్నాడు.

-   బోధకుడు, గురువుగా (రబ్బీ) యేసు పిలువబడినాడు. ఆయనతో శిష్యుల సమూహము (అపోస్తలులు) ఉండేది (మార్కు. 3:13-19).

-       యేసు మరణ శిక్షకు విధింపబడి, గొల్గొతా (కపాల) అను స్థలమున సిలువ మరణము పొందారు (మార్కు. 14:43-15:6), కాని మూడవ దినమున ఉత్థానమయ్యి శిష్యులకు కనిపించారు (మత్త. 28:9f.; లూకా. 24:36f.; 1 కొరి. 15:5-8).

యేసు క్రీస్తు భూలోక జీవితములో జరిగిన సంఘటనలకు, మరణమునకు, ఆయన అపోస్తలులు, శిష్యులు ప్రత్యక్ష సాక్షులు (1 యోహా. 1:1-4). వారు క్రీస్తుచే ఆకర్షింపబడి, ఆయనను అనుసరించివారు కనుక, ఆయన పలుకులను, బోధనలను, ఉపమానములను వారు జ్ఞాపకము చేసుకొనిరి. వారు కూడా సువార్తను ప్రకటించుటకు పంపబడియున్నారు (మార్కు. 6:7-13,30) గనుక, యేసు బోధనలను చాలా సులువుగా నేర్చుకోగలిగారు. యేసు బహిరంగ సువార్త ప్రచారములో ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు కనుక, వారు యేసు చేసిన అనేక అద్భుతాలను, స్వస్థతలను, ఇతర కార్యములను జ్ఞాపకముంచుకోగలిగారు. వీటితోపాటు, యేసు మరణదండనకు, శ్రమలకు, మరణ ఉత్థానములకు వారు వ్యక్తిగతముగా సాక్షులు. కనుక, అపోస్తలులు, శిష్యులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు యేసు జీవితమును వంశపారపర్యముగా అప్పగించారు. ప్రాముఖ్యమైన సంఘటనలు (పాస్క పరమ రహస్యములు) అపోస్తలులు తమ బోధనలు (గ్రీకులో కెరిగ్మ), సువార్తలద్వారా తెలియజేయడం జరిగింది. యేసు బోధనల సారాంశం: దైవరాజ్య ఆగమనము. క్రీస్తుద్వారా మానవులు దేవుని బిడ్డలు అవడం. పాపాత్ములకు దేవుని మన్నింపు. దేవుని అంతమైన ప్రేమ, కరుణ. పశ్చాత్తాప ఆవశ్యకత.

అపోస్తలుల బోధన (క్రీ.శ. 30-65): ఉత్థానమైన తరువాత, తన అంతిమ సందేశముగా, లోకమంతటా సువార్తను ప్రకటించమని (మత్త. 28:18-20), తనకు సాక్షులై ఉండమని క్రీస్తు తన శిష్యులకు (అపోస్తలులకు) ఆజ్ఞాపించాడు. ఆవిధముగానే, అపోస్తలులు, వారి బోధనలద్వారా (కెరిగ్మ), వారు చూచిన దానికి, వినిన దానికి సాక్షము ఇచ్చియున్నారు (1 యోహా. 1:1-4). ఈవిధముగా, అపోస్తోలిక బోధనలు, ప్రకటనలద్వారా యేసు క్రీస్తు సువార్త విస్తరించినది.

సంఘాలు ఏర్పడిన తరువాత, నూతనముగా జ్ఞానస్నానము పొందిన విశ్వాసులకు, విశ్వాస సత్యాలు బోధింప బడినవి. వివిధ ప్రార్ధనలు, యేసు పలుకులు, అష్టభాగ్యాలు, సంఘ నియమాలు మొదలగునవి నేర్పించడం, అలాగే వాటిని జ్ఞాపకం ఉంచుమని సూచనలు చేయబడింది. ‘ప్రభు భోజనము’నకు కూడినప్పుడు, క్రీస్తు శ్రమలు, మరణం, ఉత్థానములను జ్ఞాపకం చేసుకొనెడివారు (అ.కా. 2:42-47; 4:32-35; 5:12-16).

అనాధి క్రైస్తవ సంఘాలు, వారి విశ్వాస జీవితమును ఎలా జీవించినది అపోస్తలుల కార్యములు గ్రంథములో చూడవచ్చు: (1). సువార్త ప్రకటన, స్వస్థతలు (2). దైవార్చన వేడుకలు (3). సత్యోపదేశాలు.

సువార్తలుకూడా అనాధి క్రైస్తవ జీవితమును సంగ్రహముగా తెలియజేయుచున్నాయి. మత్త. 5:13f. క్రైస్తవ జీవిత ప్రమాణాలను చూడవచ్చు.

యూదులు, వారి బోధన మరియు స్వస్థత పరిచర్యలో రెండు పద్ధతులను సంప్రదాయముగా అవలంభిస్తారు: ఒకటి హలఖా (Halakah) అనగా ‘చట్టం’ లేదా ‘శాసనము’. హలఖా హీబ్రూ పదమైన హలాక్ (halak) నుండి వచ్చినది. ఇవి యూద ప్రజల మతాచారాలను, అనుదిన జీవితమును, ప్రవర్తనను నియంత్రించుటకు నిర్దేషించబడిన చట్టాలు, శాసనాలు, సూక్తులు. ఇది తోరా కాదు. ఇది మౌఖిక సంప్రదాయాల (oral traditions) నుండి వచ్చినవి. పురాతాన కాలమునుండి ఉన్నట్లుగా తెలుయుచున్నది. రెండవది, హాగ్గడాహ్ (Haggadah) అనగా ‘చూపుట, చెప్పుట, ప్రకటించుట, సాక్షమిచ్చుట’. ఇది కథలు, ఇతిహాసాల ద్వారా తోరాను వివరించు రబ్బినిక్ సంప్రదాయము.

సువార్తికుల గ్రంథ రచనలు (క్రీ.శ. 65-100): బైబులులో చూస్తున్న నాలుగు సువార్తలకు కారకులు ఈ సువార్తికులే. అప్పటికే ఆచారములోనున్న సంప్రదాయాలను ఆధారముగా చేసుకొని, వారివారి వేదాంత దృక్పథములో సువార్తలను రచించారు. మౌఖిక, వ్రాతపూర్వక సంప్రదాయాలను, కాలక్రమ, వేదాంత పంక్తులతో ఆమోదయోగ్యమైన సువార్తలుగా రచించడం జరిగినది. సువార్తలు యేసు బహిరంగ పరిచర్య చుట్టూ రూపొందించ బడినవి: జ్ఞానస్నానము, గలిలీయలో సువార్త పరిచర్య, గలిలీయ బయట పరిచర్య, మరణము, ఉత్థానము. సువార్తికుని వేదాంత దృక్పథములో మరియు క్రైస్తవ సంఘాల ఆవశ్యకతను బట్టి సమాచారమును ప్రత్యేక క్రమములో ఉంచడం జరిగింది.

నాలుగు సువార్తలలో మొదటిగా రచించబడినది మార్కు సువార్తా గ్రంథము. ఇది క్రీ.శ. 65-70 మధ్య కాలములో రచించబడినది. అపోస్తోలిక సంప్రదాయం ప్రకారం, మార్కు సువార్తీకుడు పేతురుగారి శిష్యుడు లేదా అనుచరుడు. పౌలు మహాశయుని ప్రేషిత ప్రయాణములో మార్కు పౌలును వెంబడించాడు.

మత్తయి సువార్త క్రీ.శ. 80-90 మధ్యకాలములో రచించబడినది. లూకా సువార్తను, పౌలు అనుచరుడైన లూకా క్రీ.శ. 80-85 మధ్య కాలములో రచించ బడినది. అలాగే లూకా అపోస్తలుల కార్యములు అను గ్రంథమునుకూడా వ్రాసాడు.

యోహాను సువార్త క్రీ.శ. 90వ దశకములో వ్రాయబడినది. క్రీ.శ. 125వ సంవత్సరము వరకు ఏకైక సువార్త గ్రంథముగా పరిగణింపబడినది. క్రీ.శ. 125వ సంవత్సరము తరువాత “సువార్త గ్రంథాలు”గా పరిగణింపబడినవి.

No comments:

Post a Comment