నూతన నిబంధన గ్రంథాలు: సేకరణ, కూర్పు

 నూతన నిబంధన గ్రంథాలు: సేకరణ, కూర్పు

నూతన నిబంధన గ్రంథాలకు సంబధించిన పట్టిక, మొదటి దశాబ్ద ముగింపులో ఉద్భవించినది. యేసు మరియు ఆయన బోధనల గురించి అనేక రచనలు ఉన్నప్పటికినీ, అన్ని గ్రంథాలు ఆమోదయోగ్యమైనవిగా నూతన నిబంధన పట్టికలో చేర్చబడలేదు. అనాధి క్రైస్తవ సంఘాలు ఏయే గ్రంథాలు పవిత్రమైనవో నిర్ణయించి, వాటిని మాత్రమే అంగీకరించారు.

ప్రమాణాలు

నూతన నిబంధన గ్రంథాలు పవిత్రమైన, ఆమోదయోగ్యమైన గ్రంథాలుగా అంగీకరించబడాలంటే, నాలుగు ప్రధాన ప్రమాణములను కొలమానముగా తీసుకొనబడినది. అవియే, అపోస్తోలిక మూలం, క్రైస్తవ సంఘాల అంగీకారం, విశ్వాస నియమంతో ధృవీకరణ, క్రైస్తవ దైవార్చనలో ఉపయోగించబడుట.

1. అపోస్తోలిక మూలం (Didache): గ్రంథాల రచన అపోస్తలులచేగాని లేదా వారికి దగ్గరి సంబంధముగల వారిచేగాని చేయబడియుండవలెను. అపోస్తలులు దేవునిచేత నియమింపబడినవారు, అభిషేకించబడినవారు, యేసు ప్రభువు అధికారములో వారుకూడా భాగస్తులైనవారు (మత్త. 10:40, 1 కొరి. 9:1-2).

2. క్రైస్తవ సంఘాల అంగీకారం (Universal acceptance): నూతన నిబంధన గ్రంథాలు క్రైస్తవ సంఘాలలో, సంఘాల కొరకు వ్రాయబడెను. స్థిర క్రైస్తవ సంఘాలు వాటిని గౌరవించి, విచక్షణతో పవిత్ర రచనలుగా భద్రపరచాయి.

3. విశ్వాస నియమంతో ధృవీకరణ (regula fidei): నూతన నిబంధన గ్రంథాలు పవిత్రమైన, ఆమోదయోగ్యమైన గ్రంథాలుగా అంగీకరించబడాలంటే, అవి విశ్వాస నియమముతో ధృవీకరింపబడవలెను.

4. క్రైస్తవ దైవార్చనలో ఉపయోగించ బడుట (Liturgical use): క్రైస్తవ సంఘ దైవార్చనలో ఉపయోగించబడి యుండవలెను.

పౌలు లేఖలు

నూతన నిబంధనలోని గ్రంథాలలో మొదటగా రచించబడినవి పౌలుగారి లేఖలే. పౌలు తన లేఖలను ఆయా సంఘాలకు వ్రాసాడు. అలాంటప్పుడు, పౌలుగారి లేఖలు ఎలా సార్వత్రిక గుర్తింపును పొందాయి? ఎలా ఆ లేఖలన్నింటిని ప్రోగుజేయడం జరిగింది?

మొదటిగా, ఆయా క్రైస్తవ సంఘాలు, పౌలు లేఖల సందేశాన్ని తోటి సంఘాలతో పంచుకోవడం జరిగింది (కొలొస్సీ. 4:16). ఈవిధముగా పౌలు లేఖల అధికారము క్రమముగా వ్యాప్తిచెందడం జరిగింది.

రెండవదిగా, పౌలు చేసిన విసృత ప్రేషిత ప్రయాణాలు ఆయనను ఓ గొప్ప అపోస్తలునిగా, క్రైస్తవ నాయకునిగా చేసాయి. అందులకే, క్రైస్తవ సంఘాలన్నికూడా పౌలు బోధనలు, వివరణలను కొరకు ఎదురు చూసాయి.

మూడవదిగా, అపోస్తలుల కార్యములు, పౌలు వ్యక్తిత్వమును మరింతగా ప్రాచుర్యము పొందులా చేసింది.

నాలుగవదిగా, పౌలు అనుచరులైన తిమోతి, సిలాసు, ఒనేసిమును, అక్విలా, ప్రిసిల్లా తమ గురువు లేఖలను కాపాడుకొనుటకు ఉద్దేశపూర్వకమైన ప్రయత్నాలు బహుశా చేసియుండవచ్చు.

క్రీ.శ. రెండవ దశాబ్ధముకల్ల, పౌలు లేఖల సేకరణ పూర్తయింది. శ్రీసభ పితరులు పౌలు లేఖలను వారి రచనలలో ప్రస్తావించారు.

సువార్తలు

పైన చెప్పబడిన ప్రమాణాల ఆధారముగా, క్రీ.శ. రెండవ దశాబ్ధము చివరికల్ల, నాలుగు సువార్తలు ఆమోదయోగ్యమైన గ్రంథాలుగా అంగీకరించబడినవి. మార్కు, లూకా పౌలుకు సన్నిహితులు. మత్తయి, యోహాను యేసు శిష్యులు (అపోస్తలులు). వీరందరు కూడా యెరూషలేములోని క్రైస్తవ సంఘముతోను, ఇతర ప్రముఖ సంఘాలతో సన్నిహిత సంబంధాలను కలిగియున్నారు. మార్కు రోమునగర సంఘముతో, లూకా అంతియోకు, రోమునగర సంఘాలతో, మత్తయి కైసరియా, అంతియోకు సంఘాలతో, యోహాను ఎఫెసు సంఘముతో సన్నిహిత సంబంధాలను కలిగియున్నారు. క్రీ.శ. రెండవ దశాబ్ధము చివరికల్ల, పౌలు లేఖలను, నాలుగు సువార్తలను (మార్కు, లూకా మత్తయి, యోహాను) మరియు మరికొన్ని గ్రంథాలను, అత్యంత ప్రభావితముగల క్రైస్తవ సంఘాలన్నికూడా పరస్పరం అంగీకరించాయి.

ఇతర నూతన నిబంధన గ్రంథాలు

ఇతర గ్రంథాలలో, అపోస్తలుల కార్యములు చాలా సులువుగా ఆమోదయోగ్యమైన గ్రంథముగా అంగీకరించ బడింది. దర్శన గ్రంథము మొదటిగా పశ్చిమదేశ సంఘాలచే అంగీకరించబడినది, తూర్పుదేశ సంఘాలు క్రీ.శ. నాలుగవ శతాబ్దంలో మాత్రమే అంగీకరించాయి. హెబ్రీయులకు వ్రాసిన లేఖ ముందుగా తూర్పుదేశ సంఘాలు అంగీకరించాయి. కాని, లేఖ రచయిత ఎవరో స్పష్టత లేని కారణముచేత మరియు ముఖ్యముగా, జేరోము వల్గేటులో హెబ్రీయులకు వ్రాసిన లేఖను చేర్చడము వలన, పశ్చిమదేశ సంఘాలు క్రీ.శ. నాలుగవ శతాబ్దంలో మాత్రమే అంగీకరించాయి. పేతురు వ్రాసిన మొదటి లేఖ, యోహాను వ్రాసిన మొదటి లేఖ, యూదా వ్రాసిన లేఖ సానుకూల ధృవీకరణతో అంగీకరించబడినవి. కాని, యోహాను వ్రాసిన రెండవ మరియు మూడవ లేఖలు, యాకోబు వ్రాసిన లేఖ తరచుగా వివాదాస్పదముగా మారాయి.

No comments:

Post a Comment