యేసు శోధన పరమార్ధం
"యేసు ఆత్మప్రేరణ వలన ఎడారి ప్రయాణమునకు కొనిపోబడి సైతానుచే శోధింప బడెను"
ఈ లోకములో మనషి సంతోషం, వ్యామోహాల లేమిలో కాదు, కాని వాటిని జయించడములో ఉంది. తపస్కాలం దేవుడిచ్చిన ప్రత్యేక కాలం. యేసు ప్రభువు చేసిన ఉపవాసం, ప్రార్ధనలో పాలుపంచుకొని పరివర్తన పొందడానికి, తపస్కాలం ఒక మంచి అవకాశం.
నేటి సువిషేశములో యేసు ప్రభువు ఎడారిలో ఎదుర్కొన్న మూడు శోధనల గురించి చెప్పబడింది. ఆత్మ ప్రేరణ వలన ఎడారికి నడిపింపబడి, నలుబది దినములు గడిపినపుడు సైతానుచే శోధింపబడెను. సైతాను యేసు ప్రభువును శోధించినది. ఎందుకంటే, యేసు దేవునికి ప్రియమైన కుమారుడు, లోక రక్షకుడు. ప్రపంచముపై ఆధిపత్యం చెలాయించాలన్న కోరికతో సైతాను యేసు ప్రభువును శోధించడానికి వెదకని మార్గం లేదు. అయితే, మనం గమనించ వలసిన ముఖ్య విషయం, యేసు సాతాను శోధనలను త్రోసిపుచ్చిన తీరు. "సైతాను, నానుండి దూరముగా పొమ్ము!" అని గద్దించాడు. ఈ భావాన్ని యేసు పేతురుపట్ల చూపించాడు. "ఛీ, పో! సైతాను! నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవి కావు" (మార్కు. 8:33).
పునీత పౌలు హేబ్రీయులకు వ్రాసిన లేఖలో, అంత్యంత తీవ్రమైన శోధనలపై యేసు ప్రభువు విజయం, సకల మానవాళిలో, సరిక్రొత్త నమ్మకాన్ని, సరిక్రొత్త ఆశను నింపుతుంది అని చెబుతున్నారు.
యేసు ప్రభువు, శోధనలపై మరియు సాతానుపై తాను సాధించిన విజయము ద్వారా గొప్ప సందేశమును ఇస్తున్నారు:
మొదటి శోధన:
"నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము". మానవుడు కేవలము రొట్టేవలన జీవింపడు. కాని దేవుడు వచించు ప్రతీ వాక్కు వలన జీవించును" అని యేసు సమాధానమిచ్చాడు. నిజమైన ఆనందం దైవ వాక్కును ఆలకించి దేవుని చిత్తం నెరవేర్చడములో ఉన్నది అని అర్ధము. యేసు దైవ కార్యాన్ని గురించి చేసిన భోదనల అంతరార్ధం ఈ వాక్యములో ఇమిడి ఉన్నది: "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను విస్వసింపుడు" (మార్కు. 1:15).
దేవుని వాక్యం మనకు మార్గ దర్శం కావాలంటే రెండు ముఖ్య విషయాలున్నాయి. మొదటగా, దానిని సరిగా అర్ధము చేసుకోవాలి. రెండధిగా, దైవ చిత్తానికి పూర్తిగా లోబడటము. మనం వాక్యాన్ని చదివినప్పుడు, మన స్వంత ఇష్టము కంటే, దైవ చిత్తానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకుంటే, పరిశుద్ధ గ్రంధం మనలకు నిరాశాపరిచేదిగానే ఉంటుంది. కొంత మంది విశ్వాసులు కొన్ని సార్లు వాక్యములోని ఆజ్ఞలకు అడ్డదారి కనిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లుగా జరిగిస్తూనే తమకు తాము సమర్హ్దించుకొనే మార్గం వెదకుతూ ఉంటారు. ఉదా: పరిసయ్యులు.
రెండవ శోధన:
"నీవు దేవుని కుమారుడవైనచో, ఈ శిఖరమునుండి క్రిందికి దుముకుము." అని సాతాను శోధించెను. యేసు మరొకసారి తిరస్కరించారు. "ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు. మన సామర్ధ్యాలను, గర్వముగా ప్రదర్శించుకొనే శోధన, ఆడంబరముగా గొప్పలు చెప్పుకొనే శోధనలో మనము అప్పుడప్పుడూ పడుతూ ఉంటాము. ఇవి దేవుని చిత్తాన్ని నేరవేర్చలేవు. యేసు లేఖన భాగాలను ఉదాహరించడము ద్వారా, వీటన్నింటిని జయించాడు. దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటే, సాతాను శోధనలు ఎప్పటికీ మనపై విజయం సాధించలేవు. యేసు ప్రభువు ఎన్ని అద్భుతాలు చేసిన తన గొప్ప తనాన్ని, తన సామర్ధ్యాన్ని, తన బలాన్ని నిరూపించుకొనే ప్రయత్నం ఏనాడు చేయలేదు. ఎప్పుడుకూడా, ప్రతీ అద్భుతాన్ని దేవుణ్ణి మహిమపరచడానికి చేసాడు. ఉదా: "నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి, ప్రభువు నిన్ను కనికరించి, నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియ చెప్పుము" (మార్కు. 5:19).
మూడవ శోధన:
"నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన యెడల నీకు సమస్తమును ఇచ్చెదను". అప్పుడు యేసు, "సైతానూ! పొమ్ము! ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము. ఆయనను మాత్రమే సేవింపుము" అని చెప్పెను. అధికారం, ప్రభావం అంతా తనదేనని, యేసుకు దానినంతటినీ ఇవ్వగలననే సాతాను అబద్ధం చెప్పాడు. చెడుతనముతో, లోకముతో రాజీ పడితే దేవుని కోసం ఏదైనా చేయడం మరింత సులువుగా సాధ్యపడుతుందని అప్పుడప్పుడూ మనం భావిస్తాం.
ఇటువంటి బేరసారాలకి మన జీవితములో అనేక సార్లు లొంగి పోతాం. దేవునికి దగ్గరగా ఉండాలని ఆరాటపడతాం. కాని, లోకాశాలకులోనై సాతాను శోధనలకు లొంగి పోతాం. ఇక్కడ ఒక వాక్యాన్ని గుర్తుకు చేసికోవాలి. "మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలదు? (మత్త. 16:26).
యేసు ప్రభువు సాతాను శోధనలను జయించిన తీరు ఎంతో గొప్పది. మానవుని జీవితములో ప్రతీ రోజు సాతాను శోధనలకు గురి అవుతున్నాడు. శోధనలను జటించే శక్తి కోసం దేవుణ్ణి ప్రార్ధించాలి. తపస్సు కాలములో ఉపవాసం, త్యాగ క్రియలు చేయడము ద్వారా సాతానుకి చిక్కకుండా దేవునికి ప్రియమైన బిడ్డలముగా, దేవుని నామానికి మహిమను చేకూర్చి పెట్టే బిడ్డలుగా జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని దేవుణ్ణి ప్రార్ధిద్దాం.
No comments:
Post a Comment