33 వ సామాన్య
ఆదివారము, Year B
దాని. 12:1-3, భక్తి కీర్తన 16:5,8,9-11, హెబ్రీ. 10:11-14,18, మార్కు
13:24-32
ప్రవేశ వచనము
నా ఆలోచనలు శాంతి సమాధాన పూర్వక ఆలోచనలు. దు:ఖ బాధల ఆలోచనలు ఎంత మాత్రము
కావు. మీరు ప్రార్ధించిన, నేను మీ ప్రార్ధన నాలకించి, అన్ని స్థలములందు చెదరియున్న
మిమ్ము మీ దాస్యము నుండి విడుదల చేయుదును" అను సర్వేశ్వరుడు నుడువుచున్నాడు.
సంఘ ప్రార్ధన
మా కర్తయగు ఓ సర్వేశ్వరా! సర్వ
సంపదలు గల స్థిర సేవయందే మాకు సంపూర్ణ శాశ్వతానందము కలదు. కనుక మీ భక్తి పూజలయందు మేమానందించునట్లు
మీ కృపను దయచేయుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము.
"మనుష్య కుమారుడు మహా శక్తితో, మహా మహిమతో మేఘారూడుడై వచ్చును"
(మార్కు. 13:26)
శ్రమలు-హింసలు, మహోపద్రవములు, లోకాంత్యము మరియు మనుష్య కుమారుని పునరాగమనము
గూర్చిన వివరములు మార్కు. 13:5-37 లో వివరించబడ్డాయి. ఇలాంటి సమయాలలో "మిమ్ము ఎవ్వరు
మోసగింపకుండ మెలకువ కలిగి ఉండుడు" అని ప్రభువు వారిస్తూ, ముగింపులో "ఆ సమయము
ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు అని హెచ్చరిస్తున్నాడు. అలాగే
ప్రభువును స్వీకరించుటకు సిద్దముగా ఉండవలయును.
ఇలాంటి పరిస్థితులలో మనం ఎలా ప్రభువు కొరకు సిద్దముగా ఉండవలయును? ప్రభువు
ఈ రోజు, ఈ క్షణమున, దివ్య సంస్కారముల ద్వారా, మన మధ్యన ఉన్నారు. ఆయనను విశ్వసించుదాం. ఆయన చూపిన ప్రేమ మార్గములో నడుద్దాం. అవిశ్వాసమునకు,
అవిశ్వాసములో నడిపించు వారికి తావు ఇవ్వక, ప్రభునిలో ముందుకు సాగుదాం. ప్రభువు మన కొరకు
చేసిన అర్పణ బలిని విశ్వసించుదాం: "క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్ధమైన
ఒకే ఒక బలిని సమర్పించెను" (హెబ్రీ. 10:12).
క్షణికమైన మన జీవితాలు ఈ లోకమున ఏదో క్షణమున ముగియునను వాస్తవమును గ్రహించుదాం.
ఈ లోక సంపద వాడిపోవునని, కాని ప్రభువు వాక్కు ఎన్నటికి గతించదని గుర్తుకు చేసుకొందాం.
క్రీస్తు ప్రభువు మాత్రమే నిత్య జీవపు మాటలను కలిగియున్నాడు. ఆయన వాక్కును విశ్వసించి,
ఆయన ఒసగు నిత్య జీవములో భాగస్తులమవుదాం.
ఒక రోజు ప్రభువు తిరిగి వస్తారు. మరణించిన వారికి, జీవించిన వారికి తీర్పు
చేయును. ఆ రోజు కొరకు, ప్రభువు న్యాయ తీర్పు కొరకు జాగరూకులమై సంసిద్ధులమవుదాం.
మనం దేవుని రూపములో సృజింపబడినవారమని, ప్రభువు ఒసగు నిత్య జీవములో ప్రవేశించుటకు
మనం అర్హులమని, నిత్యం గుర్తుచేయు మన తల్లి శ్రీసభ కొరకు ప్రార్ధన చేద్దాం. మన భౌతిక
భాగోగులు చూసుకొనెడి మన సమాజ నాయకులు, ప్రభువు ఆత్మ శక్తితో కృషి చేయాలని ప్రార్ధన
చేద్దాం. అనేక సమస్యలతో బాధపడుచున్న వారు, వారి శ్రమల వేదనల ద్వారా, దేవుని మహిమను
కొనియాడుచున్నారు. వారి కొరకు ప్రార్ధన చేద్దాం.
దేవుని స్థిర సేవయందును, సర్వేశ్వరుని నమ్మకమందును నాకు సుఖ క్షేమములు
గలవు (కీర్తన. 73:18).
No comments:
Post a Comment