యోబు. 38:1, 8-11, 2 కొరి. 5:14-17, మార్కు. 4:35-41
మార్కు
సువార్తికుడు, మొదటి నాలుగు అధ్యాయాలలో, యేసు ‘మెస్సయా’గా, ఈ లోకమునకు
వచ్చియున్నాడని బోధించుటకు, తన అధికారపూర్వకమగు ‘మాటలతో’, శక్తిగల ‘కార్యములతో’, యేసు
చేసిన స్వస్థతల గూర్చి ప్రస్తావించాడు: దయ్యములను, అపవిత్రాత్మలను పారద్రోలట
(1:27,39, 3:15), స్వస్థతలు (1:29-31, 40-45, 3:10), తుఫానును గద్దించుట
(4:35-41). ఇవన్ని కూడా, తాను బోధించే దైవరాజ్యమునకు సంబంధాన్ని కలిగియున్నాయి.
మానవాళిని జీవము, రక్షణలోనికి పునరుద్ధరించుటకు యేసు ఈ లోకమునకు ఏతెంచాడు.
దేవుని శక్తి: యేసు తుఫానును గద్దించుట
యేసు
శిష్యులు గలిలీయ సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుటకు నిశ్చయించు కొనిరి. సరస్సు
దాటుచుండగా, పెద్ద తుఫాను చెలరేగెను. యేసుకూడా వారితో ఉండెను, కాని పడవ వెనుక
భాగమున తలగడపై తలవాల్చి నిద్రించు చుండెను. చనిపోవుచున్నాము అని శిష్యులు చాలా
భయపడ్డారు. అందుకే, యేసును సహాయము కోరుటకై నిద్ర లేపిరి. యేసు లేచి గాలిని
గద్దింపగా, గొప్ప ప్రశాంతత కలిగెను.
ఇదొక
ప్రకృతికి సంబంధించిన అద్భుతం. మార్కు సువార్తలో ఆరు సరస్సు ప్రయాణాలు ఉన్నాయి:
4:35-41, 5:21, 6:32, 6:45, 8:10, 8:13). ఇవి విశ్వాస ప్రయాణాలు. ప్రతీ ప్రయాణం
విశ్వాసానికి ప్రరీక్ష. ప్రతీ ప్రయాణం, పరలోక రాజ్యం వైపునకు నడిపిస్తుంది. యేసు
ఎన్ని అద్భుతాలు చేసినను, శిష్యులు ఇంకను ఆయన ఎవరో గ్రహించలేక పోయారు. అందుకే,
ప్రభువు, “మీకు విశ్వాసము లేదా?” (4:40) అని వారిని ప్రశ్నించాడు.
భయము
మన జీవితములో భాగము. భయపడినప్పుడు, మనం చేయవలసిన కార్యాన్ని మరచిపోతూ ఉంటాము.
పేతురు పడవవలె, నేడు శ్రీసభ అను పడవకూడా ఎన్నో ఒత్తిళ్లకు, ఉద్రిక్తలకు గురియగు
చున్నది. మనముకూడా, యేసు మనలను వదిలేసాడని, నిద్రపోవుచున్నాడని భావిస్తూ ఉంటాము.
ఎందుకు భయం? మనకు యేసునందు విశ్వాసము లేదా? మనం ప్రయాణించే పడవలో యేసుకూడా ప్రయాణం
చేస్తున్నాడని తెలియదా? మన జీవితములో, ప్రాధమిక విశ్వాసము ఎంతో ముఖ్యము. విశ్వాసము
మూడు ప్రమాణాలలో ఉంటుంది. మొదటిగా, విశ్వాసము అనగా “నమ్మకము”. యేసు
“నాప్రభువు! నా దేవుడు?” (యోహాను. 20:28) అని వ్యక్తిగత జ్ఞానమును కలిగి యుండటము
క్రైస్తవ విశ్వాసము. రెండవదిగా, విశ్వాసము అనగా “చేయడం”. నమ్మకముతో పాటు
చేయడం. “నా సోదరులారా! ఏ వ్యక్తియైనను, ‘నాకు విశ్వాసము ఉన్నది’ అని
చెప్పుకొనినచో. తన చేతలు దానిని నిరూపింపకున్న యెడల దాని వలన ప్రయోజనమేమి?”
(యాకో. 2:14) అని యాకోబు ప్రశ్నిస్తున్నాడు. “ప్రభూ! ప్రభూ! అని నన్ను
సంబోధించువాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తాను
సారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును” (మత్త. 7:21) అని
స్వయముగా యేసు ప్రభువే పలికి యున్నారు. విశ్వాసమును చేతలద్వారా నిరూపించుకోవడం
అనగా, అవసరములోనున్న వారికి, ప్రేమతో సేవచేయడద్వారా సాక్ష్యమివ్వడం. మూడవదిగా,
విశ్వాసం అనగా “దేవునిపై ఆధారపడటము”. దేవుని ఆజ్ఞ ప్రకారం, విశ్వాసమునకు
తండ్రి అయిన అబ్రహాము, తన సమస్తమును విడచి, దేవునిపై ఆధారపడి జీవించాడు. పై
మూడింటిని వేరుచేయలేము. అన్ని ఏక కాలములో జరగాలి. అలాంటి విశ్వాసము మనకున్నదా!
ఆత్మపరిశీలన చేసుకుందాం.
బైబులులో
‘పెనుగాలి’, ‘సముద్రము’ అవ్యక్త స్థితికి (గందరగోళం) సూచనలు (ఆది. 1:1, కీర్తన.
34:5-6, 65:8, 107:23-30, సామె. 30:4, యోబు. 28:25). ప్రకృతిలోని గందరగోళ
స్థితిపై, సాతాను దుష్టశక్తులపై యేసుకు శక్తి, అధికారము ఉన్నది. పాత నిబంధనలో,
‘తుఫాను’ దేవుని శక్తికి, ఘనతకు సాక్షాత్కారం. అలాగే, మానవ నిస్సహాయతకు,
ఏమిలేమితనానికి నిదర్శనం. సముద్రములోని తుఫానులు, నిజ జీవితములోని సవాళ్ళతో
పోల్చవచ్చు. జీవితములో పాపము సముద్రములోని తుఫానువలె మనలను నాశనం చేయును.
నేటి
మొదటి పఠనములో, నీతిమంతుడైన యోబు, తన శ్రమలకు కారణం తెలుసుకోవడానికి ప్రభువును
ప్రశ్నించినపుడు, “ప్రభువు తుఫానులో నుండి యోబుతో పలికెను” (38:1). యోబు, తన
శ్రమలకు పరమార్ధాన్ని తెలుసుకోవాలని అనుకున్నాడు. కాని, అతనికి లభించిన సమాధానం:
సర్వశక్తిమంతుడైన దేవుని ప్రశ్నిచడానికి యోబు ఎవరు? సువార్తలో సమాధానం
దొరుకుతుందేమో చూద్దాం!.
మార్కు
సువార్త, క్రైస్తవ విశ్వాసుల (గ్రీకులు-రోమనుల) హింసల నేపధ్యములో వ్రాయబడినది.
శ్రమలను, హింసలను దేవుని శక్తియుందు సంపూర్ణ విశ్వాసముతో ఎదుర్కోవాలి. ఈ అద్భుతం,
శ్రమలను, హింసలను నిర్భయముగా ఎదుర్కొనుటకు కావలసిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని
కలుగజేయును. పడవలోని శిష్యుల సమూహం, శ్రమలను, హింసలను ఎదుర్కొంటున్న క్రైస్తవ
సంఘాన్ని సూచిస్తుంది. పడవలో “యేసు నిద్ర” దేవునిపై పరిపూర్ణ నమ్మకాన్ని
సూచిస్తుంది (సామె. 3:23-24, కీర్తన. 3:5, 4:8, యోబు. 11:18-19). మన శ్రమలకు,
హింసలకు, అవమానములకు సరియైన సమాధానం దొరికిన, దొరకకపోయిన, మనం యేసునందు సంపూర్ణ
విశ్వాసం, నమ్మకం కలిగి యుండాలి. ఆయనను అంటిపెట్టుకొని యుండాలి. ఆయనయందే మన
సంపూర్ణ సంరక్షణ, రక్షణ!
నేటి
రెండవ పఠనములో, పౌలు, తనకు, మనందరి జీవితాన్ని మార్చిన ‘ఆధ్యాత్మిక పరివర్తన’ గురించి
చెప్పుచున్నాడు: “మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింప బడుచున్నాము. అందరి కొరకు ఆయన
ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించితిమిగదా! అనగా, మానవులు అందరును ఆయన
మృత్యువున పాల్గొందురనియే గదా భావము. జీవించుచున్నవారు, ఇక మీదట కేవలము తమ కొరకు
కాక, ఆయన కొరకే జీవించుటకుగాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి,
పునరుత్థానము చెందినది వారి కొరకే గదా!” (5:14-15).
సముద్రాన్ని
గద్దించిన ప్రభువు, మన జీవితములోని తుఫానులైన శోధనలను, శ్రమలను, హింసలనుకూడా
గద్దించగలరు. విశ్వాసులు మరణం గురించి భయపడకూడదు. యేసు వారిమధ్యలోనే యున్నాడు.
విశ్వాసము, భయాన్ని అధిగమించాలి. క్రమముగా విశ్వాసములో ఎదగాలి. యేసు మనలను
ప్రశ్నిస్తున్నారు: మీరింత భయపడుచున్నారేల? మీకు విశ్వాసము లేదా? మరి, నా సమాధానం
ఏమిటి!
No comments:
Post a Comment