తపస్కాల మూడవ ఆదివారము, YEAR B
మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకొనే వరకు శుభ్రముగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి, ప్రతి వస్తువును చక్కబెట్టుకొంటాం. ప్రతీ రోజు స్నానాలు చేస్తూ ఉంటాం. మురికి అయిన దుస్తువులను ఉతుకుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రముగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కొంతమంది తమనుతాము శుభ్రముగా ఉంచుకోవడానికి గంటల తరబడి సమయాన్ని హెచ్చిస్తూ ఉంటారు. కారణం, ఎవరుకూడా మురికి, వాసన వచ్చే విధముగా ఉండటానికి ఇష్టపడరు. మనం మురికిలో జీవిస్తే, తరువాత అది అనేక వ్యాధులకు దారి తీస్తూ ఉంటుంది. ఒక్కసారి జబ్బుపడితే, అది మన ప్రాణాలకే ప్రమాదముగా తయారవుతుంది. కనుక, శారీరక పరిశుభ్రత, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రముగా ఉంచటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
ఈనాటి పఠనాలు, మనం క్రీస్తు విశ్వాసులుగా మన ఆధ్యాత్మిక జీవితములో ఏవిధముగా పరిశుభ్రముగా ఉండాలో నేర్పుతూ ఉన్నాయి. మొదటి పఠనములో, యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏర్పరచుకున్న ఒడంబడికను గూర్చి వింటున్నాము. ఈ ఒడంబడిక ద్వారా యావే దేవుడు మనలను పరిశుద్ధ జీవితమునకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఒడంబడిక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే కాక, ఈనాడు ప్రతీ వ్యక్తికి కూడా వర్తిస్తూ ఉన్నది. మనం దేవుని దృష్టిలో పరిశుభ్రముగా, పవిత్రముగా ఉండటానికి దేవుడు పది ఆజ్ఞలను మోషే ప్రవక్త ద్వారా ఒసగుచున్నాడు. తన ఒడంబడిక ద్వారా యావే ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా చేసుకొని యున్నాడు. వారిని ఇతర జాతులతో కలవకుండా కాపాడగలిగాడు. ఇతర దేవుళ్ళనుండి వారిని కాపాడాడు. ఈ ఒప్పందం ద్వారా, వారిని తన బిడ్డలుగా చేసుకొని, పరిశుద్ధమైన, సక్రమైన మార్గములో వారికి తోడుగా ఉంటూ, వారిని ముందుకు నడిపించాడు.
కనుక మనం కూడా ఈనాడు ఈ పది ఆజ్ఞలను లేక ఈ ఒడంబడికను ఒక ఆహ్వానముగా స్వీకరించి, దానికి అనుగుణముగా నడచుకోవడానికి ప్రయత్నం చేయాలి. "నిత్యజీవాన్ని పొందగోరినచో దైవాజ్ఞలను అనుసరింపుము" అని మత్తయి 19:17లో క్రీస్తుప్రభువు ధనికుడగు యువకునితో చెప్పియున్నాడు. ఆ పది ఆజ్ఞలే ఈ దైవ ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను పాటించి, నిత్యజీవితములోనికి ప్రవేశించడానికి ప్రయత్నం అచేద్దాం.
"అంత:కలహాలతో విభక్తమయిన ఏ రాజ్యమైనను నాశనమగును" (మత్తయి 12:25) అను యేసు వాక్యము యెరూషలేము దేవాలయంద్వారా నిజమవుతున్నది. ఈనాటి సువిషేశ పఠనములో మనం చదువుకున్న యెరూషలేము దేవాలయ పరిస్థితిని, మనం అనేక సందర్భాలలో చూస్తూ ఉన్నాం. కొన్నికొన్ని దేవాలయ పండుగలలో ఈ దృశ్యం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. దేవుని పండుగలు, దేవాలయ ఆవరణాలు, వ్యాపార స్థలాలుగా చేయబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆ పండుగ నిజమైన అర్ధాన్ని కూడా మరిచి పోతూ ఉంటాం. ప్రార్ధన, దైవభక్తి, సోదరప్రేమ, సేవ, నిజాయితీగా ఉండవలసిన ఆలయాలు, గుడులు, వ్యాపార స్థలాలుగా మారుతూ ఉన్నాయి. పండుగ పేరు చెప్పి అనేక చెడు కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులనే యేసు తిరస్కరిస్తూ ఉన్నాడు. దేవాలయము అనునది ప్రార్ధన చేసుకోవడానికి, దేవున్కని కనుగొనడానికి, ఆయన సన్నిధిలో జీవించడానికి అని మనం మరువకూడదు. ఏ దేవాలయము అయినా, దాని ముఖ్య ఉద్దేశ్యాన్ని మరచినట్లయితే, చివరకు అది వినాశనమునకు దారి తీస్తూ ఉంటుంది. పుణ్యకేంద్రమునకు బదులుగా పాపకేంద్రముగా తయారవుతూ ఉంటుంది. అందుకే యేసు ప్రభువు వ్యాపారము చేసేవారందరినీ అక్కడనుండి పంపి వేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. "వీనిని ఇక్కడనుండి తీసికొని పొండు" (మత్తయి 2:16) అను ఈ వాక్యం మన ఆలయాలలో భక్తిని, గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. మన దేవాలయాలను దేవునికి ప్రతి బింబాలుగా గుర్తించి గౌరవ మర్యాదలతో నడచుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
యేసు యెరూషలేము దేవాలయమునుండి వ్యాపారస్తులను వెళ్ళగొట్టడం చూసి, యూదప్రజలు యేసుపై అరాచకానికి పాల్పడ్డారు. అంతేకాకుండా, వారు యేసును తన అధికారాన్ని నిరూపించుకోవడానికి ఒక గుర్తును కూడా అడుగుతూ ఉన్నారు. కాని యేసు సమాధానం "ఈ ఆలయాన్ని మీరు పడగొట్టుడు, నేను దీనిని మూడు దినాలలో తిరిగి నిర్మించెదను" అని వారికి సమాధానమిచ్చాడు. ఇక్కడ యేసు తన దేహాన్ని గురించి చెప్పుచున్నాడు. యెరూషలేము దేవాలయములో క్రీస్తు పారద్రోలిన వ్యాపారస్తులందరూ కూడా పాతనిబంధన ఒడంబడికను తుడిచి వేయడాన్ని సూచిస్తూ ఉన్నది. పాతనిబంధన ఒడంబడిక ఈ నూతన ఒడంబడికతో తుడిచి వేయబడుచున్నది. ఈ నూతన ఒడంబడిక క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా సాధ్యమగుచున్నది. ఈ కారణం చేతనే క్రీస్తు శరీరమునే నిజమైన దేవాలయముగా చూస్తూ ఉన్నాం. మానవ రక్షణ కార్యములో క్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు ఫనముగా పెట్టి, తన రక్తంద్వారా మనలను రక్షించుకున్నాడు. తన సిలువ మరణము ద్వారా, ఒక నూతన ఒడంబడికను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. పాత ఒడంబడికలో జంతు రక్తాన్ని చిందిస్తే, ఈ నూతన ఒడంబడికలో క్రీస్తు తన రక్తాన్ని చిందించి మనలను తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నాడు. అందుకే క్రీస్తు శరీరమును ఒక దేవాలయముగా చూస్తూ ఉన్నాము.
క్రీస్తు శరీరము, అనగా "తిరుసభ" లేక "శ్రీసభ". క్రీస్తు నామములో జ్ఞానస్నానము పొందిన ప్రతీ వ్యక్తి కూడా ఆయన శరీరములో ఒక భాగముగా చేయబడుతూ ఉన్నారు. "మనము చాలా మందిమైనను క్రీస్తుతో ఏకమగుట వలన మనము అందరమూ ఒకే శరీరము" (రోమీ 12:5). క్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయాన్ని ఏవిధముగా ప్రార్ధనాలయముగా గుర్తించి దానిని పరిశుభ్ర పరిచారో అదేవిధముగా తిరుసభను కూడా మనం రక్షించుకోవాలి. అనేకమైన సైతాను శక్తులు, ప్రాపంచిక విషయాలు క్రీస్తుసంఘం అయిన తిరుసభను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కనుక ప్రతీ క్రైస్తవుడు కూడా శ్రీసభ రక్షణలో పాలుపంచు కోవడానికి ప్రయాస పడాలి. "క్రీస్తు తన శరీరము అయిన శ్రీసభకు శిరస్సు" (కొలస్సీ 1:18). కనుక ఆయన శరీరములోని వేరువేరు అవయవాలుగా, ఆయన నుండి వచ్చే శక్తిని, బలాన్ని స్వీకరిస్తూ మనల్ని మనం పవిత్రముగా ఉంచుకొంటూ శ్రీసభను పరిశుద్ధముగా చేయడానికి ప్రయత్నించాలి.
మన దేహము పరిశుద్దాత్మకు ఆలయము. ఎంత అద్భుతం! అందుకే పునీత పౌలుగారు "మీరు ఆత్మయందు జీవింపుడు" (గలతీ 5:16) అని చెప్పుచున్నాడు. రెండవ పఠనములో చెప్పబడినట్లుగా మనం "సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించు చున్నాము" (1 కొరి 1:23) కనుక క్రీస్తు సిలువ మనలను పరిశుద్ధులనుగా చేస్తుంది. కనుక మన దేహములతో వ్యాపారాలు చేయకూడదు. మన హృదయాలను, ఆలోచనలను వ్యాపార స్థలములుగా మార్చకూడదు. మన శరీరం దేవుని ఆలయం. కనుక ఆయనకు ప్రధమ స్థానాన్ని ఇవ్వాలి. సైతాను శోధనలనుండి దానిని కాపాడాలి. దీనిని పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయము ద్వారా మాత్రమే సాధించగలం.
నేడు మన జీవితమనే దేవాలయాలలోనికి క్రీస్తు ప్రవేశిస్తున్నాడు. మనలోని 'వ్యాపార స్థల' బుద్ధిని మార్చడానికి, ప్రక్షాళన చేయుటకు వేంచేయు చున్నారు. 'వ్యాపార బుద్ధి' వస్తువులను కొనుగోలు చేయడం, మన కోరికలను సంతృప్తి పరచుకోవడం, లాభాలను గడించడం. వీటికోసం, స్వార్ధం, జగడాలు, అనారోగ్యకరమైన పోటీతత్వం, అబద్ధాలు, అసత్యం, నిజాయితీ లేకపోవడం, మోసం, విరోధం, శతృత్వం...మొదలగునవి మన జీవితములోనికి ప్రవేశిస్తాయి. మనం దేవాలయానికి వచ్చినపుడు, ఇలాంటి 'వ్యాపార బుద్ధి'తో వస్తున్నామా? ఈ బుద్ధి, మనస్తత్వంనుండి దూరముగా ఉంటున్నామా? దేవుని ఆలయాలమైన మనం మనం పవిత్రముగా జీవిస్తున్నామా? కనుక నేడు మన జీవితాలను శుభ్రపరచుటకు యేసు వచ్చుచున్నాడు. "మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయన, దేవుని ఆలయము పవిత్రమైనది. మీరే ఆయన ఆలయము" (1 కొరి 3:16-17). సత్కార్యములతోను, ప్రార్ధనలతోను మన జీవితాలు పవిత్ర పరచ బడాలి. పాపము, అవిదేయతనుండి దూరముగా ఉండాలి.
తపస్కాల మూడవ ఆదివారం క్రీస్తు ఏర్పాటు చేసిన నూతన ఒడంబడికను మనకు గుర్తుచేస్తూ ఉంది. క్రీస్తును అనుసరించి మనం కూడా పాపాన్ని త్యజించి, పరిశుద్ధ జీవితం జీవించుటకు ప్రయాస పడుదాం. మన స్వార్ధాన్ని వీడి, ఇతరులను ప్రేమిస్తూ, సేవిస్తూ జీవించుదాం. కారణం, "కేవలము విశ్వాసము వలన మాత్రమే కాక, చేతల వలన మానవుడు నీతిమంతుడుగా ఎంచబడును" (యాకోబు 2:24). మన విశ్వాసాన్ని క్రియల రూపములోనికి మార్చమని, మనలను పరిశుద్డులుగా, పవిత్రులుగా చేయమని ప్రార్ధన చేద్దాం.
No comments:
Post a Comment