నాలుక - మాట
little brother
Fr. Praveen Gopu, OFM Cap.
మనం చేసే పాపాలలో అబద్దాలు చెప్పడం ఒకటి. సత్యమును చెప్పడానికి బదులుగా, అబద్ధం చెప్పడానికే ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటాము. మన అవసరాలనుబట్టి, పరిస్థితినిబట్టి, సత్యాన్ని కూనిచేస్తూఉంటాము. అనేకచోట్ల, అనేకసార్లు, అసత్యమే, సత్యముగా నిరూపించబడుతుంది, వాదించబడుతుంది, నిర్ణయించబడుతుంది. ఈ రోజు, నిజం చెప్పవలసి వస్తుందని బయపడేవారు ఎందరో!
వ్యాపారములో, ఆఫీసులో, కుటుంబములో, విద్యాలయాలలో,ఫ్యాక్టరీలలో, ఎన్నిఅబద్ధాలో! ఎన్నిద్రోహాలో! ఎన్నిసాకులో! ...లెక్కకు మించినన్ని! మరోవైపు, అబద్ధం చెప్పడం పాపంకాదని వాదించే వారు ఉన్నారు. అబద్ధాలు చెప్పడంలో తప్పేముంది అని ప్రశ్నించేవారు మరికొందరు. ఒక అపాయమునుండి రక్షించుకోవడానికి అబద్ధాలు చెప్పడములో తప్పులేదని చెప్పేవారు ఇంకొందరు. అవసరమైన అబద్ధమని, ఉపయోగకరమైన అబద్ధమని, చిన్న అబద్ధమేకదా అని చెప్పుతూ ఉంటాము.
పునీత పాద్రే పియో గారు ఇలా అంటున్నారు: 'అబద్దాలాడటం, సాతాను నామమును స్మరించడమే' అప్పుడు ఒక వ్యక్తి, 'ఫాదర్, చిన్న చిన్నఅబద్ధాలు కూడా చెప్పవద్దా?' అని ప్రశ్నించగా 'వద్దు' అని పియోగారు సమాధానమిచ్చారు. మరల ఆవ్యక్తి 'కాని, ఫాదర్, వాటి వల్ల ఎవరికి హానిజరగడంలేదుకదా' అని చెప్పినప్పుడు, పాద్రే పియో గారు, 'ఇతరులకు ఏ హాని కలగక పోవచ్చు కాని, నీ ఆత్మకు తప్పక హాని కలుగుతుంది. ఎందుకన, దేవుడు సత్యవాది' అని చెప్పారు. అది నిజమేకదా? 'సైతాను అసత్యవాది. అసత్యమునకు తండ్రియై ఉన్నాడు (యో 8: 44). మన అబద్ధాలకు, ద్రోహాలకు, సాకులకు, సాతాను తండ్రి. వాటన్నింటికి కారకుడు ఆయనే. ఈ వాస్తవాన్ని మనం గ్రహించినట్లయితే, పునీతులు, సాతాను శక్తిని ఏ విధముగా త్రోసిపుచ్చారో, పోరాడారో అర్ధమగు చున్నది.
ఒకసారి, ఒకపిల్లవాడు, యింటిలో ఆడుకొంటూ ఉండగా, వాళ్ళ అమ్మ పనికత్తెను పిలచి, 'నాకోసం ఎవరైనా వచ్చినట్లయితే నేనిక్కడ లేనని చెప్పు' అని చెప్పింది. అదివిన్న పిల్లవాడు ' అమ్మా, నీవెందుకు రెండు అబద్ధాలు చెప్పావు? నీది మరియు పనికత్తెది? అబద్ధాలు చెప్పడం కన్నా భరించరాని పంటి నొప్పినయం' అని చెప్పాడు. ఇందులో ఎంతో సత్యముంది కదూ!
మోసపూరితమైన భాష
సత్యం పలుకవలసివచ్చినప్పుడు, నిజాన్ని చెప్పవలసివచ్చినప్పుడు, అవమానములకు గురికావలసి ఉంటుంది. అయితే, సత్యముకొరకు క్రీస్తుప్రభువు పొందిన శ్రమలతోపోలిస్తే, మన శ్రమలు చాలాచిన్నవి.'మన నాలుక ఒక చిన్న అవయవమే అయిన, తననను తాను పొగడుకొనుటయందు అది దిట్ట. నాలుక నిప్పు వంటింది. అది యొక దోష ప్రపంచము. దానికి నిలయము మన శరీరము. అది మన శరీరము అంతయును మలినము చేయగలదు. మన జీవితసర్వస్వమునకు అది నిప్పు పెట్టగలదు. నాలుకను లోబరచుకొనిన వారు ఎవ్వరును లేరు. అది విశ్రమింపని చెడుగు. ఘోర విషపూరితము...'(యాకోబు 3: 5-1 0). నిజమే కదూ!
నాలుక చిన్న అవయమైనప్పటికిని, ఎంతో భయానికి గురి చేయగలదు. గుర్రమును లొంగదీయుటకు దాని నోటికి కళ్లెము వేస్తాము. ఓడ కొట్టుకోనిపోకుండా ఉండటానికి చుక్కానితో అదుపు చేస్తాము. అలాగే, మన నాలుకను అదుపులో ఉంచాలి. నాలుకతో పాపము చేయకుండా ఉండాలంటే, మాట్లాడకుండాఉండాలని ఉద్దేశం కాదు, కాని నాలుకను అదుపులో ఉంచుకోవలయును. ఇది ఎంతో అవసరము. ఒకసారి పలికిన మాటను వెనుకకు తీసుకోలేము.
మన నాలుకద్వారా, చాలా త్వరగా ఎన్నో పాపలు చేస్తుంటాము. ఈ పాపలు చాలా దారుణమైన పరిణామాలకు దారి తీస్తుంటాయి. అందుకే క్రీస్తుప్రభువు ఇలా అంటున్నారు: 'తీర్పు దినమున ప్రతి యొక్కడు తాను పలికిన ప్రతి వ్యర్ధమైన మాటకు సమాధానము ఇయ్యవలసి ఉన్నదని నేను మీతో చెప్పుతున్నాను. నీ మాటలను బట్టి నీవు దోషివో , నిర్దొషివో కాగలవు' (మత్తయి 12: 36-37).
'మృదువుగా మాటలాడినచో కోపము చల్లారును. కటువుగా పలికినచో ఆగ్రహము హెచ్చును. విజ్ఞుడు జ్ఞానముపట్ల ఆకర్షణ కలుగునట్లు మాట్లాడును. కాని మూర్కుడు మూర్కతను ఒలుకుచూ మాటలాడును. కరుణాపూరితముగా మాటలాడు జిహ్వ జీవవృక్షము వంటిది. కటువుగా మాట్లాడు నాలుక హృదయమును వ్రయ్యలుచేయును' (సామెతలు 15: 1-2, 4).
పునీత అంద్రేయ అవేల్లినో గారు న్యాయవాది. ఒకరోజు, ఒక కేసును వాదిస్తున్నప్పుడు ఒక చిన్న అబద్ధం చెప్పవలసి వచ్చింది. అయితే, తర్వాత 'అబద్ధములాడువాడు నాశనమై పోవును' (స.జ్ఞా. 1: 11) అను వాక్యమును ధ్యానము చేస్తున్నప్పుడు తాను చేసిన తప్పును తెలిసికొన్నాడు. ఆ తర్వాత తన వృత్తికి స్వస్తి చెప్పి, సన్యాస మఠములో చేరి గురువై గొప్ప పునీతునిగా జీవించాడు.
అవునంటే అవును, కాదంటే కాదు (మత్తయి 5 :37)
అసత్యమునుండి లాబపడుటంకన్న సత్యము కొరకు శ్రమలపాలు కావడమే మేలు. సైతానుతో సుఖంకన్న దేవునితో శ్రమలే మిన్న. దేవుడు సత్యవాది. సత్యమునకు వెలుగు. సైతాను అసత్యవాది, అంధకారము. పవిత్రమైన హృదయము ఎల్లప్పుడు వెలుగును విరజిమ్ముతుంది. అబద్దాలతో నిండిన హృదయం చీకటితోఉంటుంది. క్రైస్తవులు వెలుగునకు పుత్రులుగా జీవించవలయును (యోహాను 12: 36). మనము పలికే పలుకులు సత్యమైనవిగా, నిజమైనవిగా ఉండవలయునని క్రీస్తుప్రభువు చెప్పియున్నారు. 'మీరు చెప్పదలచినది 'అవును', 'కాదు' అను వానితో సరిపుచ్చవలయును. అంతకు మించిన పలుకులు దుష్టునినుండి వచ్చునవే' (మత్తయి 5: 37).
సత్యమునుదాచి మోసపూరితముగా మాట్లాడటం సాతానుయొక్క దుష్టకార్యము. ఆసాతానే తన అసత్యపుమాటలతో ఆదాము అవ్వలను మోసంచేసింది (ఆ.కాం.3 :17). మోసపూరితమైన ఉద్దేశముతో సత్యమునకు విరుద్ధముగా మాట్లాడుటయే అబద్ధము. 'అబద్ద సాక్షములు పలుకకుము' (లూకా 18: 20). ఇది దేవుని ఆజ్ఞ. ఎలాంటి విపత్తు సమయములోనైనా, సత్యమునే పలుకవలయును. 'సత్యమేవ జయతే' అను నానుడి మనందరికీ తెలిసిందే కదా! సత్యమును పలుకువారే అంతిమముగా విజయాన్ని పొందగలరు.
ఒక రోజు, పునీత యోహాను కాన్జియో (పోలండ్ గురువు) గారు దొంగలబారిన పడ్డారు. తనదగ్గర ఉన్నదంతయు దోచుకొని 'నీ దగ్గర ఇంకా ఏమైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. 'ఏమి లేదు' అని ముందుగా చెప్పినా, తన చొక్కాక్రింద మడతలలో కొంతడబ్బు ఉన్నట్లు గుర్తించి దొంగలవెంట పరుగెత్తివెళ్లి, ఆ డబ్బును కూడా వారికి ఇచ్చివేసాడు. అతని మంచి తనమును తెలిసికొని, ఆ దొంగలు దోచుకున్న సొత్తును కాన్జియో గారికి ఇచ్చి, వారు మారుమనస్సును పొంది యున్నారు.
'నేను మీతో మరనింపవలసి వచ్చినను మిమ్ముయెరుగనని పలకను' (మ. 26: 35) అని చెప్పిన పేతురు గారు, అదే నోటితో ఆయన ఎవరో యెరుగననిబొంకాడు (మ 26: 69 -75). మనముకూడా అలాగే చేస్తూఉంటాము. ఇతరులకు చెప్పవలసి వచ్చినప్పుడు మంచి పదజాలాన్ని వాడుతూ చెప్తాము. కాని, మనమే, వాటిని పాటించము. మనంకూడా ఆరాధనలో దేవుని స్తుతించి, తోటివారితో దుర్భాషలాడుతూ ఉంటాము...
మరియ ఆదర్శం
మన అమ్మ మరియను ఆదర్శముగా తీసుకొందాం. ఆమెజీవితం సర్వంకూడా మౌనముతో నిండియున్నది. తన కుమారుని మాటలన్నింటికి ఆమె మనస్సున పదిలపరచుకొని మననం చేసింది (లూకా 2: 19). ప్రతిదినం మన నాలుకద్వారా (మాట) ఎన్నో పాపాలను మూటకట్టుకొనుచున్నాము. ప్రతిరోజు శిలువలోనున్న క్రీస్తును ముద్దిడుతూ మనం చేసిన తప్పులను, పాపాలను క్షమించమని, మన నాలుకను పవిత్రము చేయుమని ప్రార్ధన చేద్దాం. అలాగే, 'ఎవరును మిమ్ము వ్యర్ధపుమాటలతో మోసపుచ్చకుండా చూచుకొనుడు' (ఎఫే 5: 6 ) అను పౌలు గారి మాటలను గుర్తుచేసికొందాం.
నాలుక నిప్పు వంటిది (యాకోబు 3 :6)
నాలుక నిప్పువంటిది. ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని నాశనం చేయగలదో, అలాగే చిన్నదైన నాలుక మన శరీరమునంతను నాశనంచేయగలదు. 'దుష్టుడు, ఇతరులకు కీడుచేయు మార్గమును వెదకును. అతని పలుకులు కూడా నిప్పువలె కాల్చును' (సామెతలు 16: 27) మరియు నాలుకతో పొగడవచ్చు. అదే నాలుకతో శపించవచ్చు. నిప్పురవ్వలైన మాటలతో ఇతురులను నాశనం చేయకుండా మన నాలుకను అదుపులో ఉంచుకోవలయును. 'నిప్పు రవ్వమీద ఊదినచో మంట లేచును. దానిమీద ఉమ్మి వేసినచో అది ఆరిపోవును. ఈ రెండు క్రియలును మనము నోటితోనే చేయుదము (సీ.జ్ఞా. 28: 12).
నాలుక నిప్పువంటిది అని చెప్పడానికి ముఖ్యముగా రెండు కారణాలున్నాయి. మొదటిది, మనమాటలతో ఎంతటివారినైనా, ఎంత దూరములోనున్నవారినైనను నాశనం చేయవచ్చు, అవమానపరచవచ్చు. జీవించడం, మరణించడం నాలుకపై ఆధారపడి ఉంది. చేతులతో మాత్రమే గాక, సూటిపోటి మాటలతోకూడా ఇతరులను మానసికముగా చంపవచ్చు. రెండవది, ఏవిధముగానైతే నిప్పంటిన అడవిని అదుపుచేయలేమో, అలాగే ఒకసారి పల్కినమాటను అదుపుచేయడం అసాధ్యం. ఒకసారి పల్కిన మాటను వెనుకకు తీసుకోలేము.
నాలుక యొక్క దోష ప్రపంచము (యాకోబు 3 :6)
నాలుక దోష ప్రపంచాన్ని సూచిస్తుంది. నాలుక సాతానుకు, దాని క్రియలకు అలంకారముగా ఉంటుంది. నాలుక సాతానును ఆకర్షించగలదు. మాటలతో చెడ్డ విషయాలను కూడా మంచివిషయాలుగా, అసత్యాన్ని సత్యముగా, అబద్ధాన్ని నిజముగా మార్చేయవచ్చు. మాటలగారడితో మూర్ఖపు పనులను ఒప్పుగా వాదించవచ్చు. మాటలతో ఇతరులనుకూడా పాపం చేయడానికి లోబరచవచ్చు.
దోష ప్రపంచముగూర్చి బైబులు ఇలా చెప్తుంది: 'లోకము సత్య స్వరూపియగు ఆత్మను ఎరుగదు (యో 14 :17). 'లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలిసికొనుడు... లోకము మిమ్ము ద్వేషించుచున్నది' (యో 15: 18-19). క్రీస్తు రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు. 'నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు' (యో 18 :36). దోష ప్రపంచమనగా దేవుడులేని ప్రపంచము. ఎప్పుడైతే, మన నాలుక దోషప్రపంచముగా మారుతుందో, అప్పుడు మనలో దేవుడులేడని ఆర్ధము. అదుపులోలేనినాలుక దేవుడులేని ప్రపంచము. అప్పుడు నాలుక మనలో భాగమే కాని దేవున్ని విధేయించదు.
నాలుకను లోబరచుకొనిన మానవుడు ఎవరును లేరు (యాకోబు 3 :8)
మనం జంతువులను మచ్చిక చేసికొంటూ ఉంటాము. సృష్టికథలోకూడా ఈ విషయాన్ని చూస్తున్నాము. 'నీళ్ళ యందలి చేపలను ఆకాశాములోని పక్షులను, నేలమీది జంతువులను పాలింపుడు' (ఆ.కాం. 1: 26). ఇదే వాగ్దానాన్ని నోవాతోకూడా చేయబడింది: 'క్రూర జంతువులకు, ఆకాశమున విహరించు పక్షులకు, భూమిమీద నడయాడు ప్రతిప్రాణికి, సముద్రమున సంచరించు చేపలకు మీరన్నచో బెదరుపుట్టును. వానిని మీ వశము చేసితిని' (ఆ.కాం.9: 2). ఇదే విషయాన్ని, సీ.జ్ఞా. లో కూడా చెప్పబడింది 'ప్రతి ప్రాణియు నరుని చూచి భయపడునట్లు చేసెను. మృగ పక్షి గణములకు అతనిని యజమానుని చేసెను (17: 4). కీర్తన కారుడు కూడా ఈ విషయాన్ని చెప్పాడు 'నీవు చేసిన సృష్టికంతటికిని అతనిని అధిపతిని గావించితిని. సమస్తమును అతని పాదములక్రింద ఉంచితిని' (8: 6-8 ).
మన సమాజములోకూడా అనేక జీవకోటిని మచ్చికచేయడం చూస్తున్నాము. విషసర్పాలను సైతం నాట్యమాడిస్తున్నాము...ఇలా ఎన్నో...ఎన్నెన్నో... అయితే, నాలుకను మచ్చిక చేసిన వ్యక్తి, నాలుకను లోబరచిన వ్యక్తి ఎవరును లేరు.
స్తుతించడం - శపించడం (యాకోబు 3:9 -12)
ప్రతి మనిషిలోకూడా రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒక్కోసారి కోతిలా మరోసారి దూతలా, ఒక్కోసారి హీరోవలె మరోసారి గూండావలే, ఒక్కోసారి పునీతునివలె మరోసారి పాపివలె ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విభేద ప్రవర్తన మన నాలుక విషయములో చాలా స్పష్టముగా కన్పించునని యాకోబు గారి అభిప్రాయము. 'మన ప్రభువును, పితయునగు దేవుని స్తుతింపుము. కాని, ఆ దేవుని ప్రతిరూపములుగా సృజింపబడిన మన తోటిమానవులను అదే నోటితో శపింతుము (3 :9). మన విషయములో అలా జరగకుండా ప్రయత్నం చేద్దాం.
సీ.జ్ఞా. గ్రంధములో నాలుకను గూర్చి చెప్పబడింది:
'నీ మాటల వలననే నీకు ఖ్యాతియు అపఖ్యాతి కూడా కలుగును.
నీ నాలుక వలననే నీవు నాశనము తెచ్చుకొంధువు.
నీవు చాడీలు చెప్పుటలో దిట్టవనిపించు కోవలదు.
నీ నాలుకతో ఉచ్చులు పన్నవద్దు. చోరులు అవమానమునకు గురి అయినట్లే
అసత్యవాదులు తీవ్ర నిందకు పాత్రులగుదురు.
పెద్దతప్పులను చిన్నతప్పులనుకూడా మానుకొనుము (5 :13 -15).
'ఏ నాడును తప్పుగా మాటలాడని నరుడు ధన్యుడు' (14 :1).
నా నోటికి ఎవరైనా కావలియుండి విజ్ఞతతో నా పెదవులను
మూయించిన ఎంత భాగుండును!
అప్పుడు నేను తప్పులు చేయకుందును
నా జిహ్వ నన్ను నాశనముచేయకుండును' (22:27 )
మరియు నాలుకనుగూర్చి సీ.జ్ఞా. 28:13 -26 లో చక్కగా వివరించబడింది:
కల్లలాడువారు, అపనిందలు పుట్టించువారు శాపగ్రస్తులు
అట్టివారు శాంతియుతముగా జీవించువారిని నాశముచేయుదురు.
అపదూరులు మోపువారు చాలామందిని నాశముచేసిరి
తావునుండి తావునకు తరిమికొట్టిరి.
ఆదుష్టులు బలమైనపట్టణములను కూల్చివేసిరి.
ప్రముఖుల గృహములను కూలద్రోసిరి.
ఇంకను వారు యోగ్యురాండ్రైన యిల్లాండ్రకు విడాకులిప్పించిరి.
వారి కష్టార్జితములను అపహరించిరి.
అపదూరులు మోపువాని మాటలు నమ్మువాడు
శాంతిని, విశ్రాంతిని కోల్పోవును.
కొరడాదెబ్బ ఒడలిమీద బొబ్బలు పొక్కించును
కాని దుష్టజిహ్వ ఎముకలనుగూడ విరగకొట్టును.
కత్తివాతపడి చాలామంది చచ్చిరి
కాని నాలుకవాతబడి చచ్చినవారింకను ఎక్కువ.
నాలుక ఉపద్రవమునకు లొంగని వాడు
దాని ఆగ్రహమునకు గురికానివాడు
దాని కాడిని మెడ మీద పెట్టుకొని మోయనివాడు
దాని గొలుసులచే బంధింపనివాడు - ధన్యుడు.
నాలుక కాడి యినుప కాడి
దాని గొలుసులు ఇత్తడి గొలుసులు
అది తెచ్చిపెట్టు చావు ఘోరమైన చావు
నాలుకకంటే పాతాళలోకము మెరుగు
కాని నాలుక భక్తులను జయింపలేదు
దాని మంటలు వారిని తాకజాలవు
ప్రభువును విడనాడినవారినే జిహ్వ బాధించును
ఆరని మంటలతో వారిని దహించివేయును
అది సింహమువలె వారిమీదికి దూకును
చిరుతపులివలె వారిని చీల్చివేయును
నీ పొలమునకు ముళ్ళకంచె వేయుదువు కదా!
నీ ధనమును పెట్టెలో పెట్టి తాళమువేయుదువుకదా!
అట్లే నీ ప్రతిపలుకును తక్కెడలో పెట్టి తూచుము
నీ నోటికి తలుపు పెట్టి గడె బిగింపుము
నీ నాలుక వలననే నీవు నాశమైపోకుండునట్లును
నీ పతనమును ఆశించువాని ఎదుట
నీవు వెల్లకిలబడకుండునట్లును, జాగ్రత్తపడుము.
Father your reflections are very thought provoking father....tnq very much Father
ReplyDelete