క్రీస్తు బప్తిస్మ పండుగ, Year B

క్రీస్తు బప్తిస్మ పండుగ, Year B
పఠనాలు: యెషయ 55:1-11; 1 యోహాను 5:1-9; మార్కు 1:7-11

రక్షకుడు బప్తిస్మము పొందిన సమయమున, ఆకాశము తెరచుకొనెను. పవిత్రాత్మ పావురరూపమున వచ్చి ఆయన మీద నిలచెను. ''నా కానందము కలిగించు నా ప్రియతమ పుత్రుడితడే'' నను పితస్వరము వినిపించెను.

క్రీస్తు బప్తిస్మ పండుగతో క్రీస్తుజయంతి కాలము ముగిసి, సామాన్యకాలము ప్రారంభమవుతుంది. క్రీస్తు బప్తిస్మము, త్రిత్వైక దేవుని మహిమను, క్రీస్తు బహిరంగ సువార్తాబోధనను సూచిస్తుంది. బప్తిస్మయోహాను మరోసారి క్రీస్తుకు సాక్షమిచ్చిన రోజు: ''నాకంటే శక్తివంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగీ ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని. కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును'' (మా 1:7-8). బప్తిస్మ యోహాను పాపక్షమాపణ, హృదయపరివర్తనగూర్చి ప్రకటించుచుండెను. తన సందేశాన్ని ఆలకించి, వారి పాపములను ఒప్పుకొనినవారిని, యోర్దానునదిలో స్నానము చేయించుచుండెను. మరియు, పవిత్రాత్మతో స్నానము చేయించు వానియొద్దకు వారిని నడిపించియున్నాడు. ఈ సాక్షముకన్న మిన్నదైన సాక్ష్యమును తండ్రి దేవుడు, పవిత్రాత్మలు ఇచ్చిన రోజు: ''నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను'' (మా 1:11). యేసు బప్తిస్మము పొంది వెలుపలకు వచ్చిన వెంటనే పరమండలము తెరువబడి, పవిత్రాత్మ పావురరూపమున ఆయనపైకి దిగివచ్చెను.


పాపపరిహార్ధమై, ముఖ్యముగా జన్మపాప పరిహారానికి, జ్ఞానస్నాన దివ్యసంస్కారం అత్యవసరమని శ్రీసభ బోధిస్తున్నది. యేసు జన్మ పాపములేక జన్మించియున్నాడు. మరియు జీవితాంతము కూడా పాపరహితునిగా జీవించాడు. అట్లయినచో, క్రీస్తు ఎందుకు బప్తిస్మమును పొందియున్నాడు? క్రీస్తు బప్తిస్మయోహాను నుండి జ్ఞానస్నానము పొందుటవలన, మనకు సుమాత్రుకగా యున్నాడు. ఆయనలో జన్మపాపము మరియు ఏ ఇతర పాపము లేకున్నను, జ్ఞాన స్నానమును స్వీకరించియున్నప్పుడు, పాపచీకటినుండి విడుదల చేయు జ్ఞానస్నానం మనకి ఇంకెంత అవసరమో! బప్తిస్మము క్రీస్తుకు అవసరమని కాదు, కాని మనకి ఎంత అవసరమోయని తెలియజేస్తున్నది. క్రీస్తు బప్తిస్మము, జ్ఞానస్నాన దివ్యసంస్కార స్థాపనకు మూలం. ఆయన శరీరం, నీటిని ఆశీర్వదించియున్నది. పవిత్రాత్మ పావురరూపమున దిగిరావడం, తండ్రి ఆయనగూర్చి ఆనందించడం యేసుక్రీస్తుని సువార్తాబోధన ఆరంభానికి సంకేతాలు. ''పవిత్రాత్మతోను, శక్తితోను, దేవుడు నజరేయుడగు యేసును అభిషేకించెను. ఆయన అంతటను పర్యటించుచు, మేలు చేయుచు, పిశాచశక్తికి లోబడిన వారందరును బాగుచేసెను. ఏలయన, దేవుడు ఆయనతో ఉండెను'' (అ.కా. 10:38).

జ్ఞానస్నాన దివ్యసంస్కారం

ఏడు దివ్యసంస్కారాలలో మొదటిది, మరియు ఇతర సంస్కారములన్ని దీనిపై ఆధారపడి యున్నాయి. క్రీస్తు ప్రభువే స్వయముగా తన శిష్యులతో ఇలా చెప్పియున్నారు: ''సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు'' (మ 28:19). యేసు నికోదేముతో సంభాషిస్తూ ఇలా చెప్పియున్నాడు: ''ఒకడు నీటివలన, ఆత్మవలన జన్మించిననే తప్ప దేవునిరాజ్యములో ప్రవేశింపలేడు'' (యో 3:5). ఈ విధముగా, రక్షణ పొందుటకు, జ్ఞానస్నానము తప్పనిసరి అని ప్రభువు తెలియజేసియున్నాడు. కతోలికులకు, జ్ఞానస్నానము ఓ ఆనవాయితీ మాత్రమే కాక, క్రైస్త్వవత్వమునకు గురుతుగా నున్నది. ఎందుకన, బప్తిస్మము, క్రీస్తులో మనకి ఓ నూతన జీవితమును ఒసగుచున్నది. అయితే, జ్ఞానస్నానము పొందినవారు మాత్రమే రక్షింపబడుదురా? జ్ఞానస్నానము పొందాలని కోరిక కలిగియుండి మరణించినవారు కూడా రక్షింపబడుదురు. మరియు, వారి తప్పిదమువలనగాక, క్రీస్తు సువార్తను ఎరిగియుండకపోయినను, సహృదయముతో, ఆత్మ ప్రేరణతో, దైవాన్వేషణ చేస్తూ, వారి మంచి కార్యముల ద్వారా, ఆత్మసాక్షి అనుసారముగా, దైవ చిత్తమును నేరవేర్చువారుకూడా రక్షింపబడుదురు. (Constitution on the Church, Second Vatican Council).

జ్ఞానస్నానమువలన ముఖ్యముగా ఆరు అనుగ్రహాలను పొందెదము:

1. జన్మపాపము మరియు వ్యక్తిగత పాపదోషము తొలగించబడును.
2. ఈలోకమున మరియు ఉత్తరించు స్థలమున, పాపము వలన ప్రాప్తించు తాత్కాలిక మరియు శాశ్వత శిక్షనుండి ఉపశమనమును పొందెదము.
3. దైవానుగ్రహముతో మనము నింపబడెదము. అనగా దేవునియొక్క జీవితము మనలో కలిగియుండెదము. పవిత్రాత్మ వరాలైన దైవజ్ఞానము, తెలివి, దైవనిర్ణయం, దైవబలం, వివేకము, దైవభక్తి, దైవభీతిలను పొందెదము. దివ్య సుగుణాలైన విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమలను పొందెదము.
4. క్రీస్తులో భాగస్తులమయ్యెదము.
5. భూలోకమున క్రీస్తు శరీరమైన శ్రీసభలో భాగస్తులమయ్యెదము.
6. మిగతా సంస్కారములలో పాల్గొనునట్లు చేయును. దైవానుగ్రహములో మన ఎదుగుదలకు తోడ్పడును.

మన జ్ఞానస్నానం

దివ్య సంస్కారం (''an outward and visible sign of an inward spiritual grace'') అయిన జ్ఞానస్నానం క్రైస్తవ సమాజములోనికి ప్రవేశసాంగ్యము; దీని ద్వారా, దేవుడు మనలను తన దత్తపుత్రులనుగా చేసికొనుచున్నాడు. మరియు ఈ బంధం ఎన్నటికిని విడదీయరానిది. యేసు బప్తిస్మమునందువలె, మన బప్తిస్మముయందు త్రిత్వైక దైవం మనతో వాసం చేయుచున్నది. దేవునకు దత్తపుత్రులుగా మారుచున్నాము మరియు మనకోసం పరలోకం తెరువబడుచున్నది. ఈరోజు మనం కొనియాడే యేసు బప్తిస్మ పండుగకు అర్ధాన్ని చేకూర్చాలంటే, మన జ్ఞానస్నానము ద్వారా, క్రీస్తుకు, శ్రీ సభకు మనతోనున్న సంబంధాన్ని గుర్తించాలి. మన జ్ఞాన స్నానముద్వారా బోధించుకార్యాన్ని, భాద్యతను స్వీకరించియున్నాము. . ఇదే మన జ్ఞానస్నాన పిలుపు.

మొదటి పఠనములో (యెషయ 55:1-11), బాబిలోనియాలో బానిసత్వములోనున్న ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమునకు తిరిగిరావాలని, పూర్వము దేవునిలో జీవించిన విధముగా వారు జీవించాలని యెషయా పిలుపునిస్తున్నాడు. ''దప్పిక గొనిన వారెల్లరును నీటిచెంతకు రండు'' (55:1) అని ప్రవక్త ప్రతీకాత్మకముగా పిలుపినిస్తున్నాడు. ఇదే ఆధ్యాత్మిక నవీకరణ మనకీ ఎంతో అవసరం. ఈ లోకమున ప్రభువునువిడచి ఎన్నింటికో బానిసలై జీవిస్తున్న మనం, ఆ బానిసత్వాన్ని విడచి తిరిగి దేవుని చెంతకు రావాలి.

రెండవ పఠనము ఇలా బోధిస్తున్నది: యేసు, మెస్సియా అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతీ వ్యక్తియు ఆయన పుత్రునికూడా ప్రేమించును. దైవ కుమారుడైన క్రీస్తును విశ్వసించుట వలన మనము దేవుని కుటుంబానికి చెందినవారమని నిరూపిస్తున్నాము. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుటద్వారా, మనము దేవుని బిడ్డలైన ఇతరులను కూడా ప్రేమించుచుంటిమి. దేవుని ప్రేమలో వెలుగుటకు, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలు కఠినమైనవి ఏమీకావు. ఎందుకన, మనము జ్ఞానస్నాన దివ్యసంస్కారము ద్వారా, దేవునిలో జన్మించియున్నాము. ఈ లోకాశలను, కోరికలను జయించుటకు పరలోకతండ్రి అనుగ్రహమును, పవిత్రాత్మ దేవునిశక్తిని, పవిత్రమైన యేసునామమున పొందియున్నాము. యేసు, దేవుని పుత్రుడని నమ్మినచో, ఈ లోకమును జయించగలము. విశ్వాసము దేవుని వరము. విశ్వాసము చేతనే మనం లోకముపై గెలుపొందుదము. యేసు క్రీస్తు జలముతోను, రక్తముతోను వచ్చెను, అనగా, బప్తిస్మము మరియు సిలువపై ఆయన మరణము. ఇలా ఆయన ఈ లోకాన్ని జయించి, మనము దేవుని బిడ్డలుగా జీవించులాగున చేసియున్నాడు.

క్రీస్తు బప్తిస్మపండుగను కొనియాడుచున్న మనం మన జ్ఞానస్నాన ప్రమాణాలను నూత్నీకరించుదాం. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా జీవించుదాం. తండ్రి దేవుడు, పవిత్రాత్మ దేవుడు, సుతుడైన క్రీస్తు ద్వారా మనయందు, మన జ్ఞానస్నానమందు ఆనందించును గాక!

No comments:

Post a Comment