Friday, January 27, 2012

4 వ సామాన్య ఆదివారము, 29 జనవరి 2012

4 వ సామాన్య ఆదివారము, 29 జనవరి 2012
పఠనాలు: ద్వితీయో 18: 15-20; భక్తి కీర్తన 95: 1-2, 6-9; 1 కొరింతి 7: 32-35; మార్కు 1: 21-28
little brother gopu

"మా కర్తయగు ఓ సర్వేశ్వరా! మమ్ము అన్ని దేశములనుండి రప్పించి తిరుగ ఏకము చేయుడు. అపుడు మేము మీ నామ సంకీర్తనము చేయుచు మీకు ప్రస్తుతి చేయుటలో ఆనందము కలిగియుందుము."

గతవారం, యేసు దైవరాజ్యమును ప్రకటించియున్నాడు. "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు" ( మార్కు 1: 14). ఈ వారం తన సువార్తా వాక్య బోధన ద్వారా, తన అధికారము, శక్తితో, సాతానును గద్దించి పారద్రోలాడు. దేవుని వాక్యం మన మధ్యలోనికి అనేక విధాలుగా వస్తున్నది. "దేవుని వాక్యం సజీవమును, చైతన్యవంతమునైనది. అది కత్తివాదరకంటే పదునైనది. జీవాత్మల సంయోగస్థానము వరకును, కీళ్ళు మజ్జ కలియువరకును, అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను, అది విచక్షింపగలదు" (హెబ్రే 4:12). దేవుని వాక్యం, మన హృదయములోనికి దూసుకొని పోగలదు. మన ఆలోచనలను, మన జీవితాలను మార్చగలదు. మనలను శుద్ధులను గావించి, మనలోని పాపమును తొలగించగలదు. ఈ లోక విలువలకు వ్యతిరేకముగా, దైవ విలువల వైపునకు మనలను నడుపుతుంది. దేవుని వాక్యమునకు పాపోశ్చరణ శక్తి గలదు. మనలోని విభేధములను తొలగించి, ఒకటిగా చేయును.


ఈనాటి మొదటి పఠనములో, మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు తన చివరి వీడ్కోలు సందేశమును ఇస్తున్నాడు. వాగ్ధత్తభూమిలోనికి ప్రవేశించు వారికి, వారిని నడిపించుటకు, జీవిత మార్గమును చూపుటకు దేవునివాక్యం వారితో ఎల్లప్పుడు ఉంటుందని చెప్పాడు. తన మరణం తర్వాత, దేవుడు వారిని విడచివేయక వారితో తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడని అభయాన్ని ఇచ్చాడు. మోషే ప్రవక్తను ఆలకించిన విధముగా, రాబోవు ప్రవక్తలను, వారి ప్రవచానాలను ఆలకించాలి. ప్రవక్తలను నిర్లక్ష్యము చేసిన యెడల, వారి జీవితాలు ప్రమాదములో పడిపోతాయి. యోర్దాను నది దాటి, వాగ్ధత్త భూమిలోనికి ప్రవేశించిన తర్వాత కూడా, దేవునికి విధేయులై జీవించడం చాలా ముఖ్యమని వారికి మోషే గుర్తుకు చేస్తున్నాడు. దేవుని ఒప్పందాలకు విశ్వాసపాత్రులుగా జీవించిన యెడల, వారు అనేక దైవ వరములను పొందెదరు. నిబంధనలను ఉల్లంఘించిన యెడల వారికి కష్టాలు తప్పవు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నపుడు, వారికి దేవుడు ఎలా అవసరపడియున్నాడో, అలాగే, వాగ్ధత్త భూమిలో కూడా, దేవుని అవసరం, సహాయం, శక్తి వారికి అవసరమని వారు గుర్తుంచుకోవాలి. అనేక ప్రవక్తల ద్వారా వచ్చు దేవుని సందేశమును, వాక్యమును శ్రద్ధగా ఆలకించి, పాటించాలి.

ఈనాటి రెండవ పఠనములో, దేవునిచేత ప్రత్యేకముగా ఒసగబడిన పిలుపును విశ్వాసముతో జీవించాలని, పునీత పౌలుగారు విశ్వాసులకు బోధిస్తున్నారు. ప్రత్యేక పిలుపు అనేది కేవలం అవివాహితులకు మాత్రమే గాక, వివాహితులకు కూడా అని గుర్తించాలి. సకల విచారములనుండియు దూరము కావలయుననియు, అత్మచేత ప్రేరేపింపబడి, ప్రభువును నమ్మిన పౌలుగారు చెబుతున్నారు. అవివాహితులు, విధవరాండ్రు దేవుని విషయములందు నిమగ్నులై ఉండాలి. దేవుణ్ణి సంతోష పెట్టుటకు ప్రయత్నించాలి. అలా శారీరకముగా, ఆత్మయందును పరిశుద్ధులై ఉండెదరు. వివాహితులు ఈ లోక విషయాలలో చిక్కుకొని ఉండెదరు. భర్త భార్యను, భార్య భర్తను ఎలా సంతోషపెట్టవలయునని లౌకికవ్యవహారములలో చిక్కుకొని ఉండెదరు. వారి జీవితం దేవునికి-లోకానికి మద్య విభజింపబడుతూ ఉంటుంది. వారు విచారములనుండి దూరము కావలయునంటే, ప్రభువునకు సంపూర్ణముగా వారి జీవితాలను అర్పించుకోవాలి మరియు క్రమశిక్షణ అలవరచుకొన వలయును. కుటుంబ భాధ్యతలను నేరవేరుస్తూనే, దేవుని విషయాలయందుకూడా నిమగ్నులై ఉండాలి. పొరుగువారిని ప్రేమిస్తూ, దైవాజ్ఞలను విధేయిస్తూ, సజీవ విశ్వాసము కలిగి క్రీస్తునందు వారు జీవించగలగాలి.

ఈనాటి సువిషేశములో, యేసు విశ్రాంతి దినమున (సబ్బాతు) కఫర్నాములోని ప్రార్ధన మందిరములోకి ప్రవేశించి, ధర్మశాస్త్ర బోధకులవలె గాక, అధికార పూర్వకముగా బోధించాడు. ఆయన బోధకు అచ్చటనున్నవారు ఆశ్చర్య పడ్డారు. మార్కు సువార్తీకుడు, ప్రభువును, ఒక బోధకునిగా, గురువుగా, ఆశ్చర్యకరునిగా, ప్రార్ధనాపరునిగా చూపుచున్నాడు. ఇవన్నియు, ప్రభుని అనుదిన చర్యలో భాగాలే! ఆయన, ఓ గొప్ప గురువు, బోధకుడు. ప్రజలకు దర్మశాస్త్రమును గూర్చి బోధించాడు. ఆయన వద్దకు విశ్వాసముతో వచ్చిన ప్రతీవారిని స్వస్థపరచాడు. గురువు తన వ్యక్తిగత జీవితము ద్వారా, అనుభవము ద్వారా, జ్ఞానాన్ని ఇతరులకు ఒసగుతాడు. ప్రభువు, తన జీవితాంతము కూడా, దేవుడు తనకు అప్పగించిన ప్రజలకు సువార్తను బోధించాడు. మరియు దానిని అర్ధము చేసికొనుటకు, చిన్నచిన్న ఉపమానాలద్వారా సహాయం చేసాడు. క్రీస్తు బోధన కేవలం మదిలోనికే గాక, మన హృదయములోనికి కూడా, ప్రవేశిస్తుంది.

యేసు తండ్రిప్రేమను బోధించాడు. ఆయన నిశ్చయముగా మరియు అధికార పూర్వకముగా బోధించాడు, ఎందుకనగా, ఆయన బోధన తండ్రిచిత్తమని, తండ్రివాక్కు అని ఎరిగి యున్నాడు. పునీత అస్సీసి పుర ఫ్రాన్సిసు వారు ఒకసారి, ఒక సహోదరుని పిలచి, మనం పట్టణానికి వెళ్లి దేవుని సువార్తను బోధిద్దాం అని చెప్పాడు. అలాగే, ఆ ఇరువురు పట్టణ వీధులలో తిరిగి, ఒక్క వాక్యమైన బోధించకుండా, దారిలో కలిసిన వారందరిని పలుకరించి తిరిగి వచ్చారు. ఆ సహోదరుడు, ఎందుకు మనం ఏమీ బోధించలేదని అడుగగా, మనం పట్టణములో నడచినంత సేపూ మన జీవిత ఆదర్శము ద్వారా బోధించామని ఫ్రాన్సిసు వారు చెప్పారు. మన బోధ కేవలం మాటద్వారా మాత్రమేగాక, మన బోధ జీవిత౦ అయిఉండాలి. యేసు ప్రభువు దేవుని వాక్యమును బోధించాడు. దేవుని గూర్చి, రక్షణ ప్రణాళికను గూర్చి బోధించాడు. ప్రజలు ఆయన బోధనను ఆలకించడానికి ఆసక్తిని చూపారు. ఈ సందర్భాలలోనే ఆయన ఎన్నో అద్భుతాలను చేసాడు. ఈనాడు, అపవిత్రాత్మతో ఆవేశించిన వానిని, ప్రభువు స్వస్థపరచాడు. ఆ అపవిత్రాత్మ ప్రభువు శక్తిని అణగత్రొక్కుటకు ప్రయత్నం చేసింది. కాని, ప్రభువు దానిని తన శక్తితో, అధికారముతో గద్దింపగా, అది వదలి పోయింది.

క్రీస్తు ఓ గొప్ప బోధకుడు. మనమందరం ఆయన శిష్యులం, అనుచరులం. దేవుడు, జ్ఞాన స్నానము ద్వారా, మనకొక్కరికి ఓ విధమైన పిలుపునిచ్చి ఆయన బిడ్డలుగా జీవించునట్లు చేసాడు. ఆ పిలుపునకు మనం ఎల్లప్పుడు స్పందించాలి. ఎలాంటి విచారములకు లోనుకాకుండా, లోక వ్యవహారములలో చిక్కుకొనక, ప్రభునిలో నమ్మకముంచి, ముందుకు సాగిపోవాలి. మనలోనున్న అపవిత్రాత్మ శక్తులను, లోక వ్యామోహములను గద్దింపమని ప్రభువుని ప్రార్దన చేద్దాం.

క్రీస్తు అధికారపూర్వకముగా బోధించాడు. అందుకే, ఆయన బోధ మనసున నాటుకొని పోతుంది. అయితే, ఈ రోజుల్లో, 'అధికారం' ఓ చెడు పదముగా మారింది. ఇతరులచేత చెప్పించుకోవడం, ఆజ్ఞలు వేయించుకోవడం, ఎవరికీ ఇష్టముండదు. ఈనాడు మనం ఇతరుల అధికారాన్ని చూసి వారికి గౌరవాన్ని ఇస్తాం. అలా అధికారముతో గాక, మన మంచి జీవితముద్వారా, ఇతరుల గౌరవాన్ని పొందాలి. అప్పుడే, మనం చేసే బోధనని ఇతరులు ఆలకిస్తారు. ఆరవ పౌలు పాపుగారు, ఓ సందర్భములో : 'ఈ లోకం బోధకులకన్న ఎక్కువగా సాక్షులు అవసరం ఎంతో ఉన్నది' అని అన్నారు. ఈ రోజు, గురువులను, బోధకులను గౌరవిస్తున్నారంటే, వారికున్న అధికారమునుబట్టి కాదు. కాని, వారి జీవితమును బట్టి. వారు ఎలాంటి వ్యక్తులు, ఎలా జీవిస్తున్నారో వారి బోధనలను బట్టి చెప్పగలరు.

యేసు ప్రభువు అధికారపూర్వకముగా బోధించాడు. ఆయన గొంతెత్తి బోధించాడనో , శిక్షనుగూర్చి బోధించాడనో కాదు. ఆయన బోధన ఆయన జీవిత ఆదర్శానుసారముగా సాగింది. ఆయన జీవించినదే, బోధించాడు. అందుకే, అధికారముతో బోధించగలిగాడు.

తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, గురువులుగా, మఠవాసులు, మఠకన్యలుగా, పాలకులుగా, ప్రజాధికారులుగా మనం కలిగియున్న అధికారము, మనము జీవించే జీవిత విధానమునుండి రావాలి. అప్పుడే, మనం చెప్పేదానిని ఇతరులు ఆలకిస్తారు. మనమూ గౌరవాన్ని పొందగలము.


No comments:

Post a Comment