3వ సామాన్య ఆదివారం, Year B
యోనా 3:1-5, 10, భక్తి కీర్తన 25 : 4-9, 1 కొరి 7: 29-31, మార్కు 1:14 -20
"సర్వేశ్వరునికి ఒక కొత్త స్తుతి గీతమును పాడుడు. సర్వ ప్రజలారా, సర్వేశ్వరుని ప్రస్తుతి చేయుడు, ఆయన పవిత్ర సమక్షమున విశ్వాసము, సౌందర్యము, పవిత్రత, వైభవములు కలవు."
పిలుపు అనునది దేవుని వరం. పిలిచేది భగవంతుడు. భగవంతుడు ప్రతి వ్యక్తిని ఒక ముఖ్య ఉద్దేశముతో పిలుస్తాడు. దేవుని పిలుపును భక్తితో ఆలకించాలి. దేవుని పిలుపును కనుగొనాలి. మనం అలా ఆరుబయట నడచుకొంటూ ముఖ్యముగా కొండప్రక్కన పెద్ద పెద్ద రాళ్ళను చూస్తాము. ఆ రాళ్ళవైపు మనం ఎంతసేపు చూసిన అది మనకి రాయిలాగే కనపడుతుంది. అది రాయేకదా అని అనుకొని వెళ్లిపోతాము. కాని ప్రపంచ ప్రసిద్దిగాంచిన శిల్పి మైఖిల్ అంజేలో అలా కాదు. ఆయన రాయిలో ఒక శిల్పాన్ని కనుగొన్నాడు. ఒకరోజు ఆయన ఒక పెద్ద రాయిని చెక్కుతుండగా, ఒక బాటసారి వచ్చి, నీవు ఏమి చేయుచున్నావు? అని అడిగాడు. అందుకు, అతను 'నేను ఈ రాయిలో ఉన్న దేవదూతను బయటకు తీయుచున్నాను' అని సమాధానమిచ్చాడు. మనం కూడా దేవుడు మనకు దయచేసిన పిలుపును కనుగొనాలంటే, దేవుని సహాయం అవసరం.
నేటి సువిషేశములో, యేసుప్రభువు బెస్తలను చూచి ఇలా ఆహ్వానించాడు. "మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుషులను పట్టువారిగా చేసెదను". వెంటనే, వారు తమ వలలను విడచిపెట్టి యేసును వెంబడించారు, 'మేము రాము', 'మాకు కుదరదు', 'ఆలోచించుకొని నిర్ణయం తీసుకొంటాము' అని చెప్పలేదు. యేసు ప్రభువు పిలుపునకు బెస్తలు స్పందించిన తీరు అమోగం, అద్భుతం. వలలను, పడవలను (జీవనోపాధి), తండ్రిని (కుటుంబాన్ని) విడచి పెట్టి ప్రభువును అనుసరించడానికి వారు చూపిన భక్తి, విశ్వాసం, నమ్మకం, త్యాగం ప్రశంసనీయం. వారికి ఉన్నటువంటి శక్తిని, సామర్ధ్యమును, ఇకనుండి చేపలను పట్టుటకు కాకుండా, మనుష్యులను పట్టడానికి వారు తీసుకొన్న నిర్ణయం మహాద్భుతం.
ప్రభువు పిలుపును స్వీకరించినప్పుడు మన జీవితములో మనకు ప్రీతికరమైన ఎన్నో వస్తువులకు మనం దూరం కావలసి వస్తుంది. బెస్తల పిలుపులో గమనించదగిన విషయం. వారు సాధారణ వ్యక్తులు. మరో ఆలోచన లేకుండా ప్రభువు పిలుపును అందుకొని దానికి తగిన విధముగా స్పందించారు.
యేసు ప్రభువు పేతురుతో ఒక బెస్తవానిని కాక, శ్రీసభకు పునాదిరాయి అయిన శక్తిని అతనిలో చూశారు. అతడు ఏమి కాగలడో కేవలం ప్రభువునకు మాత్రమే తెలుసు. "మీ జీవితాన్ని నాకర్పించిన యెడల దాని సామర్ధ్యమును బట్టి నేను తీర్చి దిద్దుదును" అని యేసు ప్రభువు ప్రతి ఒక్కరిని ఈ విధముగా ఆహ్వానిస్తున్నారు.
మనలో ప్రతి ఒక్కరము ప్రభువు చేత పిలువబడినాము. ప్రవక్తలుగా జీవించడానికి, ప్రవచనాలు పలకడానికి, ప్రభోదం చేయడానికి, పరిరక్షకులుగా ఉండి, ఇతరులను సాతానునుండి రక్షించడానికి మనం పిలువబడి యున్నాము. ప్రవక్తలుగా, భోదకులుగా, దేవునిచేత ఎన్నుకొనబడిన బిడ్డలుగా మనందరి భాద్యత ఏమంటే - యేసప్రభువు గలిలయ సరస్సు తీరములో మొదలు పెట్టిన ప్రేషితకార్యాన్ని మనం కొనసాగించడం.
మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఆయన అభిషేకాన్ని పొందిన బిడ్డలుగా, దేవుని పిలుపును అందుకొని జీవించే బిడ్డలుగా, ఆయన రాజ్యానికి చెందిన బిడ్డలుగా జీవించడానికి ఆశిస్తున్నప్పుడు అన్ని రకాలైన దుష్టశక్తులు మనకు ఆటంకములుగా నిలబడతాయి. అదే సమయములో ప్రభునివాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, "ఈ జీవిత పోరాటం నీది కాదు. నాది. నేను నీకు తోడైయుండి నిన్ను నడిపిస్తాను". దైవపిలుపును అందుకొని, దైవపిలుపుకు తగిన విధముగా స్పందించి, దైవపిలుపులో ముందుకు సాగే ప్రతీ బిడ్డలో ప్రభువు పలికే పలుకులు. - "నేను నీకు తోడైయుండి నిన్ను ముందుకు నడిపిస్తాను."
కష్టం, దు:ఖం, వేదన సమయములో దేవుడు మనకు దయచేసిన ఉన్నతమైన జీవమును, జీవితమును తప్పకుండ కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన పిలుపును కాపాడు కోవాలి. యేసు ప్రభువుకు సాక్షులుగా నిలబడాలి. మనం ఈ లోకములో దుష్టుడైన సాతానుతో పోరాడుతున్నప్పుడు, మనం ధరించియున్న ఆయుధాలు ఈ లోకానికి చెందినవి కావు. దేవునికి చెందినవి అని పునీత పౌలుడు రెండవ కొరింతీయులకు వ్రాసిన లేఖలో 10వ అధ్యాయం 3-5 వచనాలలో చెబుతున్నారు. అంతేకాదు, పునీత పౌలు కొలస్సీయులకు వ్రాసిన లేక 3:12 లో "మనం దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలం. మనం పరదేశులం కాదు. మనం అనాధలం కాదు. చీకటినుండి ఉన్నతమైన దేవుని వెలుగులోనికి నడిపింపబడుతున్నాం." ఇటువంటి ఉన్నత జీవితం కోసం మనం దేవుని ప్రార్ధించాలి. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు. వెళుతున్నప్పుడు ఏమి తీసుకొని పోలేము. జీవించినంత కాలం దేవునికి ఉన్నతమైన బిడ్డలుగా, సాక్షులుగా, దేవుని పిలుపును, దేవుని పిలుపు యొక్క గొప్పతనాన్ని, దేవుని పిలుపులో ఉన్న ఔన్నత్యాన్ని లోకానికి చూపించే బిడ్డలుగా మారాలి. అటువంటి ఉన్నతమైన బిడ్డల్ని, సాక్షులను యేసయ్య ఈనాడు వెదకుచున్నాడు. మరి నీవు సిద్ధముగా ఉన్నావా?
No comments:
Post a Comment