2వ సామాన్య ఆదివారము, Year B, (15 January 2012)
పఠనాలు: 1 సమూయేలు 3:3-10,19; భక్తి కీర్తన: 40: 1,3,6-9;
1 కొరింథీ 6:13-15, 17-20; యోహాను 1: 35-42
కనబడుటలేదు - వినబడుటలేదు: ఎందుకు?
ఓ పరమోన్నత సర్వేశ్వరా! లోకమంతయు మిమ్మారాధించి, మీ ప్రస్తుతి చేయునుగాక. మీ నామ సంకీర్తనమందు నిమగ్నమై యుండును గాక.
దీపము వెలుగుచున్నది; కళ్ళున్నాయి. కాని, కనబడుటలేదు.
ఎవరో మాట్లాడుతున్నారు; చెవులున్నాయి. కాని, వినబడుటలేదు. ఎవరికి? ఎందుకు?
సాధారణముగా, ఈ ఆదివార పఠనాలను చదివినప్పుడు, మనం సామూయేలు పిలుపునుగూర్చి, దేవునిసేవకు ఆయన సంసిద్ధతనుగూర్చి వింటూఉంటాం, చెబుతూఉంటాం లేక ధ్యానిస్తూఉంటాం. ఈనాడు ఈ పఠనాలయందు దాగియున్న మరోసత్యాన్ని, మరొక కోణాన్ని పరిశీలించి, ధ్యానిద్దాము!
లేవి గోత్రమునకు చెందిన ఏలీ, షిలోవద్ద ప్రభుమందిరముచెంత యాజకుడు (1 సామూయేలు 1:9). ప్రజల తరుపున, ప్రభువుసన్నిధిలో బలులను అర్పిస్తూ, ప్రజలకొరకై ప్రార్ధిస్తూ, ప్రభువుచిత్తాన్ని, ఆయనమాటను ప్రజలకు వివరిస్తూఉండేవాడు. ఆవిధముగా, ప్రభువుమందిరమున సేవలుచేస్తూ ఉండేవాడు. యావేసేవకుడిగా, ఆయనకు అత్యంత సన్నిహితముగా ఉండి సేవలుచేస్తున్న ఏలీకి, ప్రభువుప్రత్యక్షత కనబడలేదు. ఆయనమాట, ఆయనస్వరం వినబడలేదు. ఎందుకు? వయసుభారము వలన, చూపుమందగించినదా? లేక మరేమైన కారణమున్నదా?
మనం బైబిలుగ్రంధమును పరిశీలించినచో, దైవసన్నిధిలో సేవలుచేయుచున్నవారికి, ఆయనకు ప్రీతీపాత్రులుగా, నీతిమంతులుగా జీవించువారికి వయస్సు మళ్ళినను చూపు మందగించలేదు. ఉదాహరణకు, మోషేను తీసుకొందాం! ''చనిపోవునాటికి మోషేవయస్సు 120 యేండ్లు. ఐనను, అతని దృష్టి మందగించనులేదు. అతనిశక్తి సన్నగిల్లలేదు (ద్వి.కాం. 34:7). అదేవిధముగా, సిమియోను (లూకా 2: 25-27), హన్నా (లూకా 2: 36-38). వీరికి వయస్సు మళ్ళినను చూపుమందగించలేదు. శక్తి సన్నగిల్లలేదు. వారికి దేవునిమాట వినబడుతూనే ఉంది. ఆయన ప్రత్యక్షత, ఆయన రక్షణకార్యమును చూస్తూనే ఉన్నారు. కానే, ఏలీకి దేవుని మందిరములోఉన్నను, ఆయన సన్నిధిలో దీపమువెలుగుచున్నను, ఆయనకు కనబడదాయెను. యావే, సమూయేలుతో మాట్లాడుతున్నను ఆయనకు వినబడదాయెను. ఎందుకు?
ఏలీ మంచివాడే. కాని, తను చేయవలసిన పని చేయలేదు. తన కుమారులు హోఫ్నీ, ఫీనెహాసులు (వారుకూడా దేవుని సన్నిధిలో యాజకులు) దేవునిసన్నిధిలో, ఆయన మందిరములో అగౌరవముగా, అసభ్యకరముగా ప్రవర్తించినను, జీవించినను (1 సామూయేలు 2:12), అతడు మిన్నకుండెను. వారి చెడుకార్యములనుగూర్చి తెలిసినను వారిని గద్ధించలేదు, హెచ్చరించలేదు. ఈ విషయములను గూర్చి ప్రజలు మాట్లాడుకొంటున్నారని విని, చెప్పిచెప్పనట్లుగా మందలించాడు (1 సామూ యేలు 2:22-24). తన కుమారులను గౌరవించి, యావేను అలక్ష్యము చేసాడు (1 సామూ యేలు 2:29). పాపము చేయుచున్న తన కుమారులను, యావేకు సమర్పించబడిన బలికి అగౌరవము తీసుకొని వచ్చిన కుమారులను గౌరవించాడేతప్ప, యావేనుగాని, ఆయన నియమములనుగాని చెవియొగ్గలేదు. ఆయన మాటను పెడచెవినపెట్టాడు. తండ్రిగా, యాజకుడిగా, దేవుని సేవకుడిగా తన భాద్యతను మరచినాడు. తన కళ్ళముందే, తన ఆధీనములో జరుగుచున్న పాపకార్యమును, అపవిత్రకార్యమును ఆపలేక పోయాడు. అందుకే, దేవునిస్వరము అతనికి వినబడలేదు. దేవునిప్రత్యక్షత ఆయనకు కనబడలేదు. దేవునిపవిత్రతకు, ఆయన మందిరమునకు కలుగుతున్న అప్రతిష్టతను, అగౌరవమును కట్టడి చేయలేకపోయాడు. అందుకే, అతని చూపు మందగించింది, మసక బారినది.
ఈనాటి రెండవ పఠనములోకూడా పౌలుగారు కొరింథీలోని దేవుని మందిరమునుకు (దేహమునకు) కలుగుతున్న అప్రతిష్టతనుగూర్చి హెచ్చరిస్తున్నాడు. సజీవయాగముగా సమర్పించబడే మన శరీరాలను (రోమా 12:1) దేవునిఆత్మకు, మహిమకు, కృపకు, గౌరవమునకు నిలయముగా మార్చాలని పిలుపునిస్తున్నాడు. తండ్రిదేవునిచే సృజింపబడి, కుమారుడైన యేసుక్రీస్తు వెలనిచ్చి కొనబడిన (1 కొరింథీ 6:20), పరిశుద్ధాత్మ వసిస్తున్న (1 కొరింథీ 3:16) దేహములను తండ్రి మహిమార్ధం ఉపయోగించాలని భోదిస్తున్నాడు. ఆ మాటలను తనకు అనువయించుకొని, తనకు బాధకలిగినను, శ్రమలువచ్చినను, కారాగారములో బంధీగాఉన్నను, జీవించినను, మరణించినను, నా సర్వస్వమును ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును (ఫిలిప్పి 1:20) కలిగించెదను అని దృఢముగా చెప్పుచున్నాడు. అదే మనకు స్ఫూర్తి, మన జీవితానికి నియమావళి.
ఈ గొప్ప భాగ్యమును పొందుటకే, ప్రభువు సువార్త పఠనము ద్వారా మనలనందరినీ ఆహ్వానిస్తున్నాడు: ''వచ్చి చూడుడు (యోహాను 1:39). వచ్చి అనుభవించండి. తండ్రి నాకిచ్చిన భద్రత, సంరక్షణ ఆయన ప్రసన్నతే! ఆయన ప్రత్యక్షతే! నాకున్న సర్వస్వం ఆయనే. దానిని మీరు కూడా అనుభవించండి. జీవించండి అని ప్రభువు పిలుపుని స్తున్నాడు. ప్రధమ శిష్యులవలె, వచ్చిచూసి, యేసుక్రీస్తును అనుసరించడమనగా, ఆయనతో సంపూర్ణముగా ఉండుట, మన మనస్సును, హృదయాన్ని, ఉనికిని, జీవాన్ని, జీవితాన్ని, సంపూర్ణముగా అర్పించడం మరియు పవిత్రమైన జీవితాన్ని జీవించడం.
సహోదరీ, సహోదరులారా!
ప్రభువుచిత్తమును నెరవేర్చుటకు, ఆయనస్వరమును ఆలకించుటకు, ఆయనను గాంచుటకు, మనలను ముఖ్యముగా ఆటంకపరచేవి, పవిత్రాత్మకు వ్యతిరేకముగా పాపం, స్వార్ధపరత్వము, స్వప్రయోజనము, స్వీయపోషణ, లోకాషలు, నిరంకుశత్వం, నటనజీవితం, తల్లిదండ్రుల, గురువుల, పెద్దల మాటలు పెడచెవినపెట్టడం...మొ,,వి. 2005 వ సం,,లో 16 వ బెనెడిక్టు పోపుగారు తను వ్రాసిన ''వాక్కు యొక్క వెలుగు'' లో మనం ఎదుర్కొనే సవాళ్లలో ఇవి కొన్ని అని గుర్తించారు. ఏలీ కుమారులవలె, స్వార్ధముతో, స్వీయ కోరికలను సంతృప్తిపరచక, పవిత్రముగా జీవిద్దాం. ప్రభువు పిలుపును ఎల్లప్పుడూ శ్రద్ధగా ఆలకించుదాం! ఆ పిలుపు మన పొరుగువాని ద్వారా కావచ్చు, లేక ఇతరుల ద్వారా కావచ్చు!
కొద్దిసేపు మౌనముగా ఉండి, ఆత్మ శోధన చేసుకొందాం! మనలను మనమే ప్రశ్నించుకొందాం!
ఏలీలాగా భాద్యతలను మరచినానా? ఇతరుల గౌరవముకొరకు, మంచి పేరు కొరకు ప్రభువు కార్యమును ఆయన మాటను అలక్ష్య పెట్టితినా? ప్రత్యక్షముగాకాని, పరోక్షముగాకాని ఆయన నామమునకుగాని, ఆయన మందిరమునకుగాని అగౌరవమును కలిగించితినా? ఏలీ కుమారులవలె తండ్రిమాటను పెడచెవిన పెట్టితినా? ఇష్టము వచ్చినట్లు చేసితినా? కొరింథీలోని కొందరివలె, ప్రేమతో నన్ను సృష్టించిన - తండ్రిని, త్యాగముతో నన్నుకొనిన - క్రీస్తును, కరుణతో నాలోవసిస్తున్న - పరిశుద్ధాత్మను అగౌరవపరుస్తున్నానా? ఆయన దిద్దుబాటును, ఆయనతో ఉండుటకు యిచ్చిన పిలుపునకు స్పందిస్తున్నానా? ఆయనను నాలో, ఇతరులలో, చుట్టుప్రక్కల వారిలో కనుగొంటున్నానా? ఆయన స్వరము, ఆయన హెచ్చరిక, ఆయన పిలుపు నాకు వినబడు తున్నదా? ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత నాకు కనబడుతున్నదా? ఆమెన్.
Fr. John Antony Polisetty OFM Cap, Germany
No comments:
Post a Comment