అమలోద్భవిమాత మహోత్సవము
డిశంబర్ 8
ఆ.కాం. 3:9-15, 20; ఎఫెసీ. 1:3-6,
11-12; లూకా 1:26-38
లూకా 1:27-33 - “దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికివచ్చి, ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను.”
సెడూలియస్ అనే 5వ
శతాబ్దపు కవి, మరియతల్లిని గూర్చి ఈ విధముగా ప్రశంసించారు, “సుందరమైన గులాబీ
పువ్వు ముండ్ల మొక్కమీద వికసిస్తుంది. అది తల్లి చెట్టు కంటే మిక్కిలి సుందరమైనది.
తల్లి చెట్టులాగా ముళ్ళులేనిది కూడా. అలాగే, ‘మరియ’
అనే సుందరమైన పుష్పం, ఏవ అనబడు ముండ్ల మొక్కమీద వికసించింది. దోషరహితయై, ఆ తొలి
కన్య, పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది.”
దీని అర్ధం ఏమిటంటే, ముండ్లు, ఏవ మరియు సర్వమానవాళిని సూచిస్తుంది. ఏవ చేసిన అవిధేయత (పాపం) కారణంగా,
దేవుడు భూమిని శపించినప్పుడు, అది ‘ముండ్ల తుప్పలను, గచ్చపొదలను’ మొలిపించింది (ఆది 3:18). ఈ
ముళ్లు పాపము మరియు జన్మ పాపము యొక్క నొప్పికి మరియు పరిణామాలకు చిహ్నాలు.
ఏవ అవిధేయత ద్వారా మానవాళి అంతా ఈ ‘ముండ్ల మొక్క’ (పాపపు
స్వభావం) మీద మొలిచింది.
గులాబీ పువ్వు మరియ తల్లిని సూచిస్తుంది. గులాబీ పువ్వు యొక్క ప్రత్యేకత
ఏమిటంటే, “తల్లి చెట్టు కంటే మిక్కిలి సుందరమైనది”. తల్లి
చెట్టు (మానవాళి/ఏవ) పాపమనే ముళ్లను కలిగి ఉంది, కానీ
మరియమ్మ దేవుని అనుగ్రహం ద్వారా జన్మపాపం లేకుండా సృష్టించ బడ్డారు. అందుకే ఆమె ‘మిక్కిలి
సుందరమైనది’. పాపం లేని పవిత్రతను కలిగి ఉన్నది. ఈ గులాబీ
పువ్వుకు ముళ్లు లేవు. అంటే, మరియమ్మకు జన్మపాపం
అనే ‘ముల్లు’ లేదు. ఆమె గర్భంలో పడిన మొదటి క్షణంలోనే దేవుని
కృప ద్వారా కాపాడబడ్డారు. అందుకే ఆమె అమలోద్భవి
మాత!
క్రీస్తునందు
ప్రియ సహోదరీ సహోదరులారా! నేడు డిసంబరు 8న మనం అమలోద్భవిమాత మహోత్సవమును కొనియాడు
చున్నాము. ‘అమలము’ అనగా! మలినము లేనటువంటి అని అర్థము. ‘నిష్కళంకము’ అనగా
‘పాపరహితము’. అమలోద్భవి మాత! మలినము లేనటువంటి అమ్మ! తల్లి! అని అర్థము. ఏ కళంకము
లేని, క్రీస్తుని మాత, మరియమ్మ!
అమలోద్భవి మాతను, అనగా క్రీస్తుని తల్లి మరియమ్మను శ్రీసభ ఎంతగానో గౌరవిస్తుంది. మన
మలినములను కూడా తొలగించమని, ప్రార్థించమని వేడుకుంటుంది. ఈ
మహోత్సవము ద్వారా మరియతల్లి పాపరిహితముగా జన్మించినదని లేక జన్మపాపములేక
జన్మించినదను విశ్వాసమును కొనియాడుచున్నాము.
మరియతల్లి యొక్క
పరిపూర్ణత / నిష్కలంకత్వం / అమలత్వం దేవునికి ఎందుకు అవసరమైంది? ఒకటి, దేవుడు
స్వయంగా పవిత్రతకు నిదర్శనం. ఆయన
లోక రక్షకుడిగా జన్మించడానికి ఎంచుకున్న తల్లిగర్భం, పవిత్రమైన
గుడారంగా ఉండాలి. భూమిపైకి వస్తున్న దేవుని రెండవ వ్యక్తి (క్రీస్తు) కొరకు
తల్లిగర్భాన్ని పరిశుద్ధ పరచడం అనేది, దేవుని యొక్క పరిశుద్ధతకు మరియు గౌరవానికి నిదర్శనం. రెండు, ఆదికాండము 3:15లో
దేవుడు సాతానుతో, “స్త్రీకిని, నీకును
వైరము కలుగునట్లు చేసెదను” అని చెప్పారు. ఈ స్త్రీయే మరియమ్మ. పాపంపై దేవుడు
సాధించిన తొలి విజయం మరియతల్లి యొక్క నిష్కళంకోద్భవం.
లోకరక్షకుడు రాకముందే, తన తల్లిని పాపమనే వైరస్ నుండి రక్షించడం ద్వారా
దేవుడు తన శక్తిని, ప్రేమను ప్రకటించారు.
కతోలిక శ్రీసభ, మరియ తల్లి “అనుగ్రహ పరిపూర్ణురాలు” అని, ఆమె జన్మపాపము లేకుండా ఉద్భవించిన మాత అను విశ్వాసమును బోధిస్తున్నది. ఈ
విశ్వాసాన్ని, అధికారపూర్వకముగా 9వ భక్తినాధ పోపుగారు 8
డిశంబర్ 1854వ సం.లో ప్రకటించి యున్నారు. “మిక్కిలిగా ఆశీర్వదింపబడిన పరిశుద్ధ
కన్యమరియమ్మ, గర్భములో పడిన క్షణమునుండి, సర్వశక్తి
మంతుడైన దేవుని ఏకైక అనుగ్రహము, ఆశీర్వాదము, అనుమతి వలన, లోకరక్షకుడైన యేసు క్రీస్తునాధుని
సుకృత పుణ్యముల ద్వారా, ఆదిపాపము అను మచ్చనుండి ఆమె
పరిశుద్ధముగా ఉంచబడి యున్నది.” మరియమ్మ, నిష్కళంకోద్భవిమాత
అని 9వ భక్తినాధ పోపుగారు 1854వ సం.లో మాత్రమే అధికారపూర్వకముగా
ప్రకటించినప్పటికిని, ఈ విశ్వాసం తిరుసభ ఆరంభమునుండియే
(7వ శతాబ్దము నుండి) ఉన్నది. అధికారపూర్వకముగా ప్రకటింపబడిన,
4 సం.ల తరువాత అనగా 1858వ సం.లో, లూర్దునగరములో పునీత
బెర్నదెత్తకు దర్శనములో మరియతల్లి తననుతాను “నేను నిష్కళంకోద్భవి మాతను” అని
సంభోదించి మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని
దృఢపరచి యున్నది. కాబట్టి, తిరుసభ బోధన దేవుని నుండి వచ్చింది అని నిరూపించడానికి
మరియతల్లి స్వయంగా భూమిపైకి దిగివచ్చారు! దేవుడు
తన సేవకుడైన పోపు ద్వారా ప్రకటించిన విశ్వాస సత్యాన్ని, మరియ
తల్లి స్వయంగా ధృవీకరించారు. ఇది మన
విశ్వాసంపై మనకు మరింత నమ్మకాన్ని పెంచుతుంది.
గబ్రియేలు
దూత పలికిన “దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మా, వందనము” అను శుభవచనములను మనము ప్రతీరోజు జపిస్తున్నాము. గబ్రియేలు దూత
వచనముల ద్వారా, దేవుని యొక్క పరమ రహస్యము పరిపూర్ణముగా, నిండుగా మరియమ్మపై ఉన్నదని అర్ధమగుచున్నది. దూత
ఆమెను ‘మరియా’ అని పేరు పెట్టి పిలవలేదు. బదులుగా, “దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మా” అనగా, “అనుగ్రహముచే
పరిపూర్ణంగా నిండిన వ్యక్తి” లేదా “వరప్రసాదమంతా ఇవ్వబడిన వ్యక్తి” అని పిలిచింది. మనిషి సాధారణంగా అనుగ్రహాన్ని పొందుతాడు. కానీ
మరియ అనుగ్రహంతో నిండినది. అంటే,
ఆ అనుగ్రహం ఆమె జీవితంలో ఒక తాత్కాలిక అనుభవం కాదు; అది
ఆమె స్వభావంలో భాగమైపోయింది. దేవుని అనుగ్రహం ఆమెలో
అంతగా నిండి ఉంది కాబట్టే, ఆమె పాపమనే మచ్చ లేకుండా సృష్టించబడింది.
దేవుడు
సమస్త విశ్వమును తన కుమారుని ద్వారా, కుమారుని కొరకు
సృష్టించెను. సర్వపరిపూర్ణత కుమారునిలో ఉండెను. ఈ పరిపూర్ణత,
శ్రీసభకు శిరస్సు, సమస్తమును అయిన క్రీస్తునుండి పొంగిపొరలి, తన శరీరమునయిన శ్రీసభలో ప్రవహిస్తూ ఉన్నది (కొలస్సీ 1:12-20). తన
శరీరమునయిన శ్రీసభలోనికి ఈ పరిపూర్ణత్వము దిగివచ్చుటకు ముందుగా, ప్రత్యేక విధముగా, దేవుని తల్లిగా నెంచుకొనబడిన
మరియతల్లిపై రావడం జరిగియున్నది. అందుకే, ఆమె పరిశుద్దురాలు, పరిపూర్ణురాలు, జన్మపాపరహితముగా ఉద్భవించిన మాత, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు.
ఏవమ్మను
మానవ లోకమునకు తల్లిగా ఆదికాండములో చూస్తున్నాము. ఆమె అవిధేయత వలన లోకమునకు పాపము
సంక్రమించియున్నది. నూతన ఏవమ్మ అయిన మరియ తల్లి విధేయతద్వారా, లోకరక్షణమునకు ద్వారములు తెరువబడి యున్నాయి.
దీనినిమిత్తమై, ఆమె నిర్మలత్వముగా,
పరిపూర్ణముగా సృష్టింపబడి యున్నది. ఎందుకన, ఆమెద్వారా, వాక్కు, లోకరక్షకుడు, రెండవ
ఆదాము, పాపపరిహారముగా ఉద్భవించనున్నారు.
మరియ
నిష్కళంకోద్భవము ద్వారా, త్రిత్వైక దేవుని
లోకరక్షణ ప్రణాళికను సుస్పష్టముగా చూడవచ్చు. పాపములో పడియున్న లోకాన్ని
రక్షించుటకు దేవుడు ముందుగానే ప్రణాళికను ఏర్పాటు చేసియున్నారు. దానినిమిత్తమై
మరియను జన్మపాపరహితగా సృష్టించారు. తద్వారా, ఈ లోకానికి
పరిశుద్ధమైన, పరిపూర్ణమైన మానవత్వమును తీసుకొని వచ్చి, ఆయన ద్వారా మరల లోకాన్ని దేవునిలో ఏకమగునట్లు చేసియున్నారు.
అవిధేయత
వలన, స్వతంత్రమును దుర్వినియోగము
చేసికోవడముద్వారా, ఆమె కుమారుడు యేసు క్రీస్తుద్వారా
మరల మనము స్వతంత్రమును, పరిశుద్ధమును పొందగలుగు చున్నాము.
మరియ నిష్కళంకమాత, జన్మపాపరహిత. ఎందుకన, ఆమె దేవునికి తల్లిగా ఎన్నుకొనబడి యున్నది. పరిశుద్ధత్వమును, పరిపూర్ణతను పొందియున్నది. దేవునియొక్క చిత్తము, అనుగ్రహముతో
సహకరించినచో మనమూ ఆ దేవుని అనుగ్రహములను పొందగలము.
మనలో కొంతమందికి
అమలోద్భవి, మరియమాతను, ఆమె జీవితమును గూర్చి, కొన్ని అపోహలు ఉన్నాయి.
మరియమ్మను క్రీస్తు ప్రభుని తల్లి అని అందరూ విశ్వసిస్తారు కానీ! క్రీస్తు ప్రభుని
జననము తరువాత, మరియమ్మకు వేరే బిడ్డలు కలిగినారని
అనుకుంటారు. మార్కు సువార్త 3:31-32లో,
“అప్పుడాయన తల్లియు, సోదరులును వచ్చి, వెలుపల
నిలిచి, ఆయనను పిలువ నంపిరి. జనసమూహము ఆయన చుట్టును
కూర్చుండి యుండెను. ‘నీ తల్లియు, నీ సోదరులును (మరియు నీ
సహోదరీలును) వచ్చి వెలుపల నీ కొరకు వేచి యున్నారు’ అని కొందరు చెప్పిరి” అని
చదువుచున్నాం. ఈ వాక్యమును ఆధారంగా తీసుకొని, క్రీస్తు
ప్రభువుని తల్లి, కన్యమరియను గూర్చి, ఆమెను
తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాము. ఐతే! మలినము లేనటువంటి, అమలోద్భవి
మాత! మరియమాతకు, ఇంకా బిడ్డలు ఉన్నారన్నది అవాస్తవము! అది
ఎంత మాత్రము నిజం కాదు!
యోహాను
సువార్త 19:26-27 చూసినట్లయితే, మరియమాత మలినము లేనటువంటి, అమలోద్భవి మాత అని ‘రూఢి’
అవుతుంది. క్రీస్తు ప్రభుని తల్లి అమలోద్భవి మాత అనగా, మరియమ్మను, పవిత్రమైన నిత్య కన్యతల్లిగా, చివరి వరకూ, ఆమె అమలోద్భవమును, మలినము లేనటువంటి నిత్యకన్యగానే
జీవించి, మోక్షారోహణమై పరలోకము రాజ్యమునకు చేరుకున్నారు.
క్రీస్తు ప్రభువు తాను సిలువపై, సిలువకు
వ్రేలాడుతున్నప్పుడు... తన తల్లియు, తాను ప్రేమించిన
శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో,
“స్త్రీ! ఇదిగో నీ కుమారుడు!” అనెను. ఆ తరువాత శిష్యునితో “ఇదిగో నీ
తల్లి” అనెను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకొని
పోయెను.” క్రీస్తునందు విశ్వాసులారా! క్రీస్తు ప్రభువు తప్ప వేరే కుమారులు
లేకపోబట్టే, క్రీస్తు ప్రభువు తన తల్లిని, అనగా మరియమ్మను తన ప్రియ శిష్యునికి అప్పగించారు. క్రీస్తు తల్లి మరియమ్మ
మలినము లేనటువంటి అమలోద్భవిమాత! అనగా మరియమాత ఏ కళంకము లేకుండా చివరి వరకు
పవిత్రతతో జీవించారు. ఆమె గర్భమునందు, క్రీస్తు ప్రభువు తప్ప,
వేరే ఎవరినీ మోయలేదు. మరియమ్మ ఏ పాప మలినముమునూ ఎరుగరు. ఆమె
నిత్యకన్యక!
కనుక, ప్రియ సహోదరీ సహోదరులారా, క్రీస్తు
జననానికి ముందు, జనన సమయంలో, మరియు
జననం తర్వాత కూడా మరియమ్మ కన్యగానే ఉన్నారనేది తిరుసభ విశ్వాసం. ఇది ఆమె భౌతిక పవిత్రతను సూచిస్తుంది. మరియమ్మ తల్లి
గర్భంలో పడిన మొదటి క్షణంలోనే, జన్మపాపం నుండి
కాపాడబడ్డారు. ఇది ఆమె ఆధ్యాత్మిక
పవిత్రతను సూచిస్తుంది. ఈ రెండు అంశాలు ఒకదానికొకటి బలం చేకూరుస్తాయి. దేవునికి
కేటాయించబడిన శరీరంలో, ఆత్మలో ఎటువంటి మచ్చ ఉండకూడదు. మరియ తల్లి,
దేవుని రక్షణ ప్రణాళికలో అత్యున్నత పాత్ర పోషించడానికి, ఆత్మలోను,
శరీరంలోను పాపమనే
మచ్చ లేని కన్యకగా ఎన్నుకోబడ్డారు.
మరియ అమలోద్భవము ద్వారా, మనకు
ఒక సందేశం ఉంది, ఏమిటంటే, దేవుని
అనుగ్రహం మరియు మన విధేయత. మరియతల్లి జన్మపాపరహిత. ఎందుకనగా, ఆమె
దేవునికి తల్లిగా ఎన్నుకోబడ్డారు. ఆమె పరిశుద్ధత్వమును, పరిపూర్ణతను
పొందారు. కానీ మనం జన్మపాపంతో జన్మించినప్పటికీ, మనమంతా
“అనుగ్రహ పరిపూర్ణులం కావచ్చు. మరియ దేవుని అనుగ్రహంతో సహకరించారు, “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట
చొప్పున నాకు జరుగుగాక” (లూకా 1:38). మనం జ్ఞానస్నానం ద్వారా పాపక్షమాపణ
పొంది, దేవుని అనుగ్రహాన్ని స్వీకరించాం. మరియతల్లి తన శరీరంలో క్రీస్తును
మోసారు. మనం మన ఆత్మలో నిత్యము
క్రీస్తును మోయాలి. మరియతల్లి పాపం నుండి దూరంగా ఉన్నట్లుగా, మనం
కూడా మన పాపాల నుండి దూరంగా
ఉండాలి. దేవుని చిత్తానికి విధేయులమై, అనుదినము మనల్ని మనం శుద్ధి చేసుకుంటే,
మనం కూడా దేవుని అనుగ్రహ పరిపూర్ణులమై, ఆయనకు
యోగ్యమైన నివాసంగా మారగలం. ఈ మహోత్సవం రోజున, “ఓ అమలోద్భవిమాతా,
నిత్య కన్యకమాత! మేము పాపరహితమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయము చేయుము” అని
మరియ తల్లిని కోరుదాం!
నిర్మల
ఆత్మలను ప్రేమించు ఓ సర్వేశ్వరా! కన్యమరియమ్మ పాపరహిత ఉద్భవముద్వారా మీ కుమారునికి
ఒక యోగ్యవాసమును తయారు చేసితిరి. ముందు లభించనున్న మీ కుమారుని మరణ ఫలితమున ఆమెను
సమస్త మలినమునుండి కాపాడితిరి. మేముకూడా ఆమె ప్రార్ధనా సహాయమున నిర్మల మనసులతో
మిమ్ము చేరుకొను భాగ్యమును ప్రసాదింపుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము.

No comments:
Post a Comment