జూబిలీ ప్రసంగం
“మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొన్నాను” (యోహాను 15:16)
“సర్వశక్తిమంతుడు నా యెడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది”
(లూకా 1:49)
ప్రియమైన Phirangipuram Annite జుబిలేరియన్స్ - Sr.
లూర్దుమేరి, Sr. ఫిలో వర్గీస్, Sr. అన్న మేరి, Sr. మరియ సెలీన్, Sr. మేరి పౌల్, పీటాధిపతులు,
గురువులు, Sr. అంతోనమ్మ సుపీరియర్ జనరల్, Sr. Provincials, ఫిరంగిపురం Annites, మరియు
సహోదరీ, సహోదరులారా! 50 సంవత్సరాల దైవానుగ్రహం! నిజముగా, కేవలము జుబిలేరియన్స్’కి
మాత్రమే కాకుండా, ఇక్కడ ఉన్న మనందరికీ ఎంతో సంతోషకరమైన రోజు, ఆనందకరమైన రోజు.
మనదరం ఎంతో దూరము నుండి ఇక్కడకు వచ్చి, ఈ ఐదుగురు మఠకన్యల జీవితాలలో మైలురాయి అయిన
వారి దైవాంకిత స్వర్ణోత్సవ జూబిలీ వేడుకలను ఘనముగా కొనియాడుచున్నాము. వారి
జీవితాన్ని ఓ పండుగలా, ఒక వేడుకలాగా, ఒక మహోత్సవములాగా జరుపుకొనుచున్నాము. నిజముగా
మన హృదయాలు, మనస్సులు దేవునిపట్ల కృతజ్ఞతతో నిండియున్నాయి. కృతజ్ఞత ఈ వేడుకలను
నింపియున్నట్లుగా మనకు కన్పిస్తున్నది.
జూబిలీ (హీబ్రూ ‘యోవెల్’ = పొట్టేలు కొమ్ము; ఒక సంఘటనను
ప్రకటించడానికి ఉపయోగించేవారు) అంటే ‘ఆనందముతో ఎలుగెత్తి చాటుట’ (లతీను
‘జుబిలేయో’) అని అర్ధం. నేటి మూడు పఠనాలు కూడా దైవాంకిత జీవితానికి ఒప్పగింపబడిన
ప్రవక్త బాధ్యతలను, విశ్వాసము, నిరీక్షణ యొక్క శాశ్వతఫలితాన్ని, త్రిత్వైక
దేవునిలో సహవాసము కలిగి యుండాలని, ఒకరిపట్ల ఒకరము ప్రేమ కలిగి జీవించాలని, అప్పుడు
పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతామని తెలియజేయుచున్నాయి.
50 సంవత్సరాల క్రితం, ఈ ఐదుగురు మఠకన్యలు, వారి పాలక పునీతురాలు పునీత
అన్నమ్మగారివలె ప్రేమ, విశ్వాసం, ప్రార్ధన, వినయము కలిగి జీవిస్తామని, వారి సభ
స్థాపకురాలు దైవసేవకులు తాటిపత్రి జ్ఞానమ్మ నిరుపేదలకు విద్యను అందించి, వారి
అభ్యున్నతికి పాటుపడిన స్పూర్తితో జీస్తామని, దేవునిపై ఆమెకున్న విశ్వాసం, సువార్త
ప్రచారములో ఆమె చూపిన నిబద్దతను కలిగి జీవిస్తామని, సభ స్థిర పడటానికి ముఖ్యపాత్ర
పోషించిన, సహస్థాపకులు ఫాదర్ Theodore Dieckmann MHM వారి ఆధ్యాత్మిక సలహాలను
జీవిస్తామని, పేదరికము, బ్రహ్మచర్యము, విధేయత వ్రతాలను వాగ్దానం చేసి, సభ
నియమావళికి కట్టుబడి జీవిస్తూ, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసువారి ఆధ్యాత్మిక పథములో
నడుస్తామని, దేవుని ప్రేమరాజ్యాన్ని విస్తరింపజేస్తామని, “దైవప్రేమ స్పూర్తిలో అందరికీ సేవ చేస్తామనే
వారి సభ visionను మరియు missionను కొనసాగిస్తామని, సభ ప్రధాన సుగుణమైన
సువార్తావ్యాప్తి మరియు కృపతో, వినయముతో సమాజసేవకు పాటుబడతామని, Charism అయిన
నిరాడంబర జీవితాన్ని జీవిస్తూ, దేవునిపై సంపూర్ణ నమ్మకం కలిగి, మాటలద్వారా, చేతలద్వారా
క్రీస్తును ప్రకటిస్తామని, ప్రేమ, సహవాసముగల కమ్యూనిటీ జీవితాలకు తోడ్పడతామని,
శ్రీసభ సేవకు అంకితమవుతామని, సభ మార్గదర్శక సూత్రాలను పాటిస్తామని, “ఆయననే మేము
ప్రకటిస్తాము” అన్నధ్యేయాన్ని జీవిస్తామని... వారి జీవితాలను దేవునికి సంపూర్ణముగా
అర్పించుకున్నారు. ఇచ్చిన మాటపట్టుకు కట్టుబడి జీవించి, ఈరోజు మనందరి సమక్షములో ఈ
స్వర్ణోత్సవ జూబిలీ వేడుకలను ఘనముగా కొనియాడుచున్నారు. నిజముగా అభినందనీయం!
హర్షించదగ్గ విషయం! (అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని మనస్పూర్తిగా
అభినందిద్దాం).
ప్రియ సహోదరీ, సహోదరులారా! దైవపిలుపును అందుకొని, వారి దైవాంకిత
జీవితముద్వారా తిరుసభలో మనకు సాక్ష్యమిస్తూ, వారి సేవా జీవితముతో మనలను సుసంపన్నం
చేసినందులకు మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే, రాబోయే సంవత్సరాలలో కూడా
దేవుని ఆశీర్వాదాలు కొనసాగాలని వారి కొరకు ప్రార్ధన చేద్దాం.
శ్రీసభలో జూబిలీ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే,
జూబిలీలు యేసుక్రీస్తు ప్రేషితత్వములో మనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడములో
సాధించిన విజయాలను, పొందిన దేవుని కృపానుగ్రహాలను కొనియాడు సమయం. అలాగే అడ్డంకులను
అధిగమించుకొను సమయం.
జూబిలీ సంవత్సరం వెనుదిరిగి చూసుకొని, నమ్మకముతో ముందుకు
సాగిపోవడం. మన జీవితములో ఎందుకు మనం వెనుదిరిగి చూసుకోవాలి?
- గతములోని సంఘటనలను జ్ఞాపకార్ధము చేసికొనుటకు
- గతములో చేసిన తప్పులకు పశ్చాత్తాప పడటం కొరకు
- కోల్పోయిన వానిని పునరుద్దరించుట కొరకు
- పొందిన దేవుని దయ, కనికరము పట్ల సంతోషించటం
కొరకు
- మన ద్వారా దేవుడు తన ప్రజల పట్ల చూపిన కరుణను
గుర్తించుట కొరకు
- మరల దేవునకు మన జీవితాలను తిరిగి సమర్పించుకొని,
దైవరాజ్యవ్యాప్తికై ముందుకు సాగిపోవడానికి...
దైవాంకిత జీవితము
స్వాభావికముగా మిషనరీ జీవితము; అనగా మఠవాసులందరూ ప్రవక్తలుగా ప్రస్తుత సమాజములో
జీవించాలి. పోప్ ఫ్రాన్సిస్ అంటారు: ప్రపంచాన్ని
మేల్కొల్పడానికి, నేను మఠవాసులపై ఎంతో నమ్మకాన్ని కలిగియున్నాను. యేసుకు
సాక్ష్యమిస్తూ ప్రవక్తలవలె జీవించాలి. మనం ఎలా ప్రవక్తలుగా ఈ ప్రపంచములో ఉండగలం?
మన జీవితాదర్శముద్వారా; సువార్తాను సారముగా జీవిస్తూ, క్రీస్తును అనుసరించడంద్వారా
వచ్చే వెలుగును, ఆనందాన్ని, ఈ లోకానికి పంచడంద్వారా; ప్రేమించడం యేసు నుండి
నేర్చుకొనుటద్వారా... కనుక, ప్రతీ మఠకన్య, మఠవాసి... ఒక ప్రవక్తవలె క్రీస్తుకు
సాక్ష్యమిస్తూ ఈ లోకములో జీవించాలి.
ప్రియ సహోదరీ,
సహోదరులారా!
జూబిలీ అనగా
కృతజ్ఞత. ఎందుకన,
ఇది దృఢమైన విశ్వాసమునకు, ఉదారమైన దేవుని ప్రేమకు, అపరిమితమైన నిరీక్షణకు
నిదర్శనం. వారి జీవితాల వెనుక దేవుని శక్తి, నడిపింపు ఉన్నదనుతకు నిదర్శనం.
అందుకే, దేవునకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ
2:8-10 వచనాలు చదువుకుంటే, దేవునకు మనం ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలో స్పష్టముగా
అర్ధమవుతుంది: “విశ్వాసముద్వారా, దేవుని వరము వలననే, మీరు రక్షింపబడితిరి. అది మీ
స్వయకృతం కాదు. దేవుని వరమే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు
గొప్పలు చెప్పుకొనుటకు ఇక ఏమియును లేవు. మనము దేవుని పనితనము మూలముగా చేయబడిన
వారము. క్రీస్తుయేసుద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన
అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరచియే ఉంచెను.” కనుక జూబిలీ కృతజ్ఞత సమయం. కృతజ్ఞత ఒక గొప్ప వైఖరి, కనుక మనం తప్పని సరిగా
కలిగియుండాలి. ప్రతి రోజూ కృతజ్ఞతా భావముతో జీవించాలి. నిజమైన కృతజ్ఞత కేవలం
నోటితో ‘ధన్యవాదాలు’ అని చెబితే సరిపోదు; ప్రతీక్షణం కృతజ్ఞతాభావముతో జీవించాలి.
ఎలా జీవించాలి?
-
దేవుని దాతృత్వానికి మనం లబ్దిదారులమని
(beneficiaries) గుర్తించాలి; అనగా దేవుని దయను, కృపను పొందువారమని గ్రహించాలి;
-
దేవుని నుండి పొందిన వరాలను బాధ్యతగా కాపాడుకుంటూ
ఉండాలి
-
దేవుని కృపను పొందిన మనం, ఆ కృపను ఇతరులతో
పంచుకోవాలి. కృతజ్ఞత కలిగిన వ్యక్తికి ఇతరులకు ఎలా ఇవ్వాలో, ఇతరుతో ఎలా పంచుకోవాలో
తెలుసు
పౌలుగారు చెప్పిన మరో మాటను ఆలకిద్దాం: 1 తెస్స 5:16-18 “సర్వదా సంతోషముగ
ఉండుడు. సదా ప్రార్ధింపుడు. అన్ని వేళల యందును కృతజ్ఞులై ఉండుడు.”
Dear Jubilarians, మీరంటే, మా అందరికీ ఎంతో ప్రేమ, గౌరవం, ఆప్యాయత, అభిమానం. మీ నుండి మేము ఎంతో నేర్చుకోవాలి. ఇలాగే, మీ సుమాతృక జీవితాన్ని కొనసాగించండి. ఇతరులకు ఆదర్శవంతముగా, ప్రేరణగా ఉండటం కొనసాగించండి. మంచి దేవుడు మీ జీవితాలను ఇంకా ఫలభరితం చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ప్రార్ధిస్తూ ఉన్నాము. పౌలుగారు చెప్పినట్లుగా, ‘మీ గురించి ఆలోచించిన ప్రతీసారి, దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాము’. మీలో మంచి పనిని ప్రారంభించిన దేవుడు, దానిని పరిపూర్తి చేయాలని ప్రార్ధిస్తూ... దేవుడు మిమ్ములను కలకాలము దీవించునుగాక. ఆమెన్.
Fr. Praveen Kumar Gopu OFM Cap
12 January 2023
No comments:
Post a Comment