వ్యాకులమాత పండుగ (Fr. Praveen Gopu OFM Cap.)

వ్యాకులమాత పండుగ - సెప్టెంబర్ 15

ప్రియ సహోదరీ సహోదరులారా, సెప్టెంబర్ 15న, కతోలిక శ్రీసభ “వ్యాకులమాత” పండుగను జరుపుకుంటోంది. ఈ పండుగ మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రమలలో, తల్లియైన కన్యమరియ అనుభవించిన అపారమైన దుఃఖాన్ని గుర్తు చేస్తుంది. క్రీస్తు రక్షణ కార్యంలో ఆమె ఎంత గొప్పగా పాలుపంచుకున్నారో, మరియు మన జీవిత కష్టాల్లో ఆమె మనకు ఎలా తోడుగా ఉంటారో ఈ పండుగ మనకు బోధిస్తుంది. మరియమ్మ దు:ఖము వెనుక ఉన్న నిస్వార్థమైన ప్రేమ, త్యాగం మరియు విశ్వాసం గురించి మనకు ఈ పండుగ తెలియజేస్తుంది.

మత్తయి సువార్త 5:4లో ప్రభువు చెప్పినట్లుగా, “శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు.” నిజమే! ఈ లోకంలో ఎవరూ కష్టాలను, శ్రమలను కోరుకోరు. అందరూ సుఖంగా ఉండాలనే ఆశిస్తారు. కానీ, జీవితం అంటేనే సుఖదుఃఖాల కలయిక. కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు, వాటిని ఎలా స్వీకరించాలో తెలియక చాలామంది కుంగిపోతారు. అయితే, మన తల్లి మరియ, దుఃఖాన్ని కూడా దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానంగా స్వీకరించి, విశ్వాసానికి ఒక ఆదర్శంగా నిలిచారు. పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు ఇలా అన్నారు, “శారీరక బాధల కన్నా, మరియతల్లి అనుభవించిన మానసిక బాధలు అత్యంత తీవ్రమైనవి. మరియమ్మ కన్నీళ్లు యేసు హృదయం నుండి వచ్చిన ప్రతి రక్తపు బొట్టుతో పోల్చదగినవి.”

దుఃఖపూరిత హృదయం, విచారకరమైన హృదయం ఒకటి కాదు. మరియమాత యొక్క దుఃఖపూరిత హృదయాన్ని గౌరవించేటప్పుడు ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వేదాంతపరంగా చెప్పాలంటే, ‘విచారం’ అనేది ఒక రకమైన ఆత్మసంతాపం. మనం కోల్పోయిన వాటి మీద లేదా మనకు దక్కని వాటి మీద కలిగే బాధ వల్ల విచారం కలుగుతుంది. ‘దుఃఖం’ అనేది అష్టభాగ్యాలలో ఒకటి. ఇది అత్యంత పవిత్రమైన లక్షణం. ఇక్కడ ‘దుఃఖపడటం’ అంటే దుఃఖపూరితమైన హృదయాన్ని కలిగి ఉండటం. పవిత్రమైన దుఃఖం అనేది పాపాన్ని చూసి బాధపడే హృదయం నుండి పుడుతుంది. అందుకే అష్టభాగ్యాలలో దుఃఖించే హృదయం అంటే ప్రేమించే హృదయం అని అర్థం.

తన కుమారుడు పడుతున్న బాధను, తిరస్కరణను, చివరికి మరణాన్ని చూసి కూడా మరియమాత నిరాశ చెందలేదు, కోపగించుకోలేదు. ఆమె తన బాధను చూసి ఆత్మసంతాపంలో మునిగిపోలేదు. బదులుగా, ఆమె తన పవిత్రమైన హృదయం నుండి వచ్చిన అపారమైన ప్రేమ, సానుభూతితో ప్రతిస్పందించింది. ఆమె అనుభవించిన బాధ కేవలం ఒక తల్లిగా తన కుమారుడిపై కలిగిన జాలి మాత్రమే కాదు. ఆ బాధకు కారణమైన పాపాలను చూసి ఆమె హృదయం పవిత్రమైన దుఃఖంతో నిండిపోయింది. ఆ పాపాలన్నీ క్షమించబడాలని ఆమె ప్రగాఢంగా ఆశించారు. అందువల్ల, మరియమాత యొక్క దుఃఖం ఆమె ప్రేమకు, పవిత్రతకు నిదర్శనంగా నిలిచింది.

ప్రియ సహోదరీ సహోదరులారా, వ్యాకులమాత పండుగ సందర్భముగా మరియ తల్లి అనుభవించిన ఏడు దు:ఖపూరిత సంఘటనలను ధ్యానిద్దాం. ఈ దుఃఖాలు మన జీవితంలో ఎదురయ్యే శ్రమలకు, బాధలకు ప్రతీకగా నిలుస్తాయి.

1. ఖడ్గం వంటి దుఃఖం – సిమియోను ప్రవచనం: ఈ సంఘటన లూకా 2:34-35లో ఉంది. బాలయేసు జన్మించిన 40రోజులకి దేవాలయంలో సమర్పించినప్పుడు, నీతిమంతుడు, దైవభక్తుడు అయిన సిమియోను మరియతో, “ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది” (లూకా 2:35) అని ప్రవచించాడు. ఈ మాటలు భవిష్యత్తులో యేసు అనుభవించబోయే శ్రమలను, మరియు ఆ శ్రమలను చూసి మరియ అనుభవించబోయే దుఃఖాన్ని ముందుగానే సూచించాయి. తన కళ్ళ ముందే తన కుమారుడు సిలువ వేయబడుతున్నప్పుడు ఆమె పడిన మానసిక వేదనకు ఈ ప్రవచనం ప్రతీక. ఆమె హృదయం నిజంగా ఒక కత్తితో చీల్చబడినట్లు అనిపించి ఉంటుంది. పునీత బెర్నార్డ్ క్లేర్వాక్స్ ఇలా అన్నారు, “ఓ ధన్యురాలైన తల్లి, ఆ ఖడ్గం నీ శరీరాన్ని కాదు, నీ హృదయాన్ని చీల్చింది. నీ దేహంలో ఎటువంటి గాయం లేకపోయినా, నీ హృదయంలో కలిగిన గాయం అత్యంత తీవ్రమైనది. ఆ గాయం మానవజాతి పాపాల వల్ల కలిగింది.”

2. ఈజిప్టుకు పయనం-శ్రమలకు, అభద్రతకు ప్రతీక: ఈ సంఘటన మత్తయి సువార్త 2:13-23లో ఉంది. జ్ఞానులు యేసును దర్శించి వెళ్ళిపోయిన తర్వాత, హేరోదు రాజు శిశువును చంపడానికి వెదుకుతున్నాడని దేవదూత యోసేపుకు కలలో చెప్పడం జరిగింది. వెంటనే, యోసేపు, మరియ, బాలయేసు రాత్రికి రాత్రే ఈజిప్టుకు పయనమై పోయారు. ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమైనది, కష్టాలతో కూడుకున్నది. ఎటువంటి ప్రణాళిక లేకుండా, తమ ఇల్లు, దేశం వదిలి, అపరిచితులైన దేశంలో శరణార్థులుగా జీవించవలసి రావడం వారికి భయాన్ని, అభద్రతను, మానసిక శ్రమను కలిగించింది. ఈ సంఘటన, ప్రపంచంలో నిరాశ్రయులైన, హింసకు గురైన ప్రతి ఒక్కరి బాధను సూచిస్తుంది.

3. బాలయేసు యెరూషలేములో తప్పిపోవడం: ఈ సంఘటన లూకా సువార్త 2:41-50లో ఉంది. యేసుకు పన్నెండేళ్ళ వయసులో, వారు పస్కా పండుగకు యెరూషలేము వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. పండుగ ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా, యేసు తమతో లేడని గమనించారు. వారు మూడు రోజుల పాటు భయంతో, దుఃఖంతో యేసును వెతికి, చివరికి ఆయనను దేవాలయంలో బోధకుల మధ్య కనుగొన్నారు. ఈ మూడు రోజుల వేదన ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినప్పుడు కలిగే దుఃఖం, భయం, ఆవేదనను తెలియజేస్తుంది. ఈ సంఘటన మానవ సంబంధాలలో ఉన్న బాధలను మనకు గుర్తు చేస్తుంది.

4. కల్వరి మార్గంలో యేసును కలవడం: ఈ సంఘటన బైబులులో స్పష్టంగా చెప్పబడకపోయినా, క్రైస్తవ సంప్రదాయంలో దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. యేసు సిలువను మోసుకుంటూ కల్వరి కొండకు వెళ్తున్నప్పుడు, రక్తస్రావంతో, బలహీనంగా ఉన్న తన కుమారుడిని చూసి మరియ హృదయం వర్ణించలేని బాధతో నిండిపోయింది. ఇది ఆమె శారీరకంగా కాకుండా, మానసికంగా యేసు యొక్క శ్రమలలో పాలుపంచుకున్నదని చూపిస్తుంది. ఈ దుఃఖం తల్లి ప్రేమకు, త్యాగానికి ప్రతీక.

5. సిలువ చెంత తల్లిగా దుఃఖం, మానవజాతికి మాతృత్వం: ఈ సంఘటన యోహాను సువార్త 19:25-27లో ఉంది. క్రీస్తు సిలువపై మరణిస్తున్నప్పుడు, మరియ తల్లి అక్కడే సిలువ చెంత నిలబడింది. తన కళ్ళ ముందే తన కుమారుడు అపారమైన బాధతో చనిపోవడాన్ని చూసిన దుఃఖం అత్యంత తీవ్రమైనది. అతని బాధ ఆమె బాధగా మారింది. అతని మరణం తన మరణంగా మారింది. ఈ సమయంలో యేసు, “అమ్మా, ఇదిగో నీ కుమారుడు” అని మరియమ్మతోను, “ఇదిగో నీ తల్లి” అని యోహానుతోను చెప్పారు. ఈ మాటల ద్వారా, యేసు మరియను కేవలం యోహానుకు మాత్రమే కాదు, తనను అనుసరించే మానవజాతి అందరికీ ఆధ్యాత్మిక తల్లిగా ఇచ్చి యున్నారు.

6. యేసు మృతదేహాన్ని ఒడిలోకి తీసుకోవడం: ఈ సంఘటన కూడా బైబులులో నేరుగా ప్రస్తావించబడనప్పటికీ, ‘పియతా’ అనే పేరుతో ఇది క్రైస్తవ సంప్రదాయంలో ప్రసిద్ధి చెందింది. యేసు మరణించిన తర్వాత, ఆయన మృతదేహాన్ని సిలువ నుండి దింపి, మరియ తన ఒడిలోకి తీసుకుంది. ఈ దృశ్యం తల్లిగా మరియ అనుభవించిన దుఃఖానికి పరాకాష్ట. శిశువుగా ఉన్నప్పుడు యేసును ఒడిలోకి తీసుకున్న మరియ, ఇప్పుడు ఆయన మృతదేహాన్ని ఒడిలోకి తీసుకోవడం ఆమె దుఃఖం యొక్క లోతును చూపిస్తుంది. ఈ దృశ్యం మన పాపాల వల్ల దేవుని కుమారుడు, ఆయన తల్లి పడిన బాధను గుర్తు చేస్తుంది.

7. భూస్థాపనము (మత్తయి 27:57-61): క్రీస్తు మృతదేహాన్ని సమాధిలో ఉంచినప్పుడు మరియ అక్కడే ఉంది. ఈ సంఘటన ఆమె అనుభవించిన అన్ని బాధలకు ముగింపు. ఒక తల్లి తన బిడ్డను శాశ్వతంగా కోల్పోయి, అతనిని సమాధిలో భూస్థాపితం చేసేప్పుడు అనుభవించే బాధ అత్యంత తీవ్రమైనది. ఈ దుఃఖం ఈ లోకంలో బిడ్డలను కోల్పోయిన ప్రతి తల్లి బాధకు ప్రతీక. అయితే, ఈ దుఃఖం తర్వాత వచ్చే పునరుత్థానం మనకు నిరీక్షణను ఇస్తుంది.

ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ వ్యాకుల మాత సంస్మరణ పండుగను విశ్వశ్రీసభ జరుపుకుంటుంది. ఈ పండుగ చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 13వ శతాబ్దంలో “సర్వైట్స్” అనే సన్యాసుల ద్వారా ఈ భక్తి పద్ధతి విస్తృతంగా ప్రచారం పొందింది. ఆ తర్వాత పోప్ ఏడవ పయస్ 1814లో సెప్టెంబర్ 15న ఈ పండుగను అధికారికంగా ప్రకటించారు.

ఈ పండుగ ద్వారా, తల్లి ప్రేమకు ఉన్న విలువ, గొప్పతనాన్ని, మాధుర్యాన్ని, స్వచ్ఛతను, వ్యాకులమాత స్మరణ నుండి మనమందరమూ తెలుసుకుంటున్నాం. తల్లి చూపించే ప్రేమ, ఆదరణ, జాలి, దయ, కరుణ, క్షమాపణ, ఈ సృష్టిలో మనకు ఎవరి వద్ద లభించవు. కేవలం తల్లి వద్ద నుండి, ఆ తరువాత పరలోకమున, దేవుని వద్ద నుండి లభిస్తాయి. ఈ సృష్టిలో తల్లికి మించిన దైవము మరొకటి లేరు. కనుక ప్రతి ఒక్కరమూ తల్లి ప్రేమను గ్రహించాలి. తల్లి యెడల ప్రత్యేక ప్రేమను, ఆదరణను, చూపుదాం. క్రీస్తు ప్రభువు తాను అనుభవిస్తున్న శ్రమలయందు కూడా, తన తల్లి యెడల, ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తాను మరణించి, పునరుత్థానుడై పరలోకమున తండ్రి కుడి పార్శ్వమున చేరుకున్న తర్వాత, తన తల్లి పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకొని, తన ప్రియ శిష్యుడగు యోహానునకు తన తల్లి బాధ్యతను అప్పగించారు.

క్రీస్తు ప్రభువు తన శ్రమలను స్వీకరించి, దేవుని ప్రణాళికను నిర్వహించడానికి, సిద్ధపడి, తన తల్లి యెడల తనకున్న వ్యక్తిగత బాధ్యతను, నెరవేర్చుకున్నారు. మరియమాత కూడా వ్యాకుల భరితమాతయై తన కుమారుడు అనుభవించుచున్న, అనుభవించబోవుచున్న సిలువ శ్రమలను చూస్తూ ఎంతో కలత చెందుతూ హృదయ వేదనతో హృదయమునే కలత చెందుతూ తన హృదయంలో తన బాధనంతా పదిలపరచుకొని, అందరితోపాటు తానూ, క్రీస్తు ప్రభువునకు సంభవించిన శ్రమలను, తన బాధను, దాచుకొని, వ్యాకుల భరితమాతగా మనముందు నిలిచారు‌. కష్టాలలో ఒకరిని వీడి ఒకరు ఉండుట మంచిది కాదు. కష్టాలలో బాధ్యతలు మరువకూడదు. ప్రేమలన్నింటిలో జన్మనిచ్చిన తల్లి ప్రేమను మనం బ్రతికున్నంత వరకూ వదలకూడదు, మరిచిపోకూడదు. తల్లిదండ్రులను గౌరవించి, వారిని, వారి వృద్ధాప్యంలో, తల్లిదండ్రుల చివర స్థితిలో వారికి ‘నేను ఉన్నాను అనే,’ బాసటగా నిలిచి, వారు ప్రాణముతో ఉన్నంతవరకూ వారి యెడల, ప్రేమ, ఆదరణ, ఆప్యాయతను చూపగలుగుదాం. బాధలలో బాధపడడం కాదు గానీ బాధ్యత తీసుకోవడం ప్రధానమని గ్రహించాలి. మనం కూడా, మన బాధ్యతను, కుటుంబ బాధ్యతలు, ఇంకా అనేకమైన దేవుడు అప్పగించిన బాధ్యతలను, ఎన్ని శ్రమలైనా నెరవేర్చుదాం. అటువంటి హృదయాలు దయచేయమని క్రీస్తు ప్రభువునకు ప్రార్థించుకుందాం.

ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి పరిస్థితులకు సందేశం ఏమిటంటే, ఈ రోజు మన సమాజంలో అనేకమంది శోకంతో, బాధతో, అభద్రతతో జీవిస్తున్నారు. ఒక తల్లిగా మరియ పడిన దుఃఖాలు, నేటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధలకు ప్రతీక. ఈజిప్టుకు పారిపోయిన మరియ, యోసేపు, యేసు, నేటి శరణార్థుల, వలసదారుల బాధలను గుర్తు చేస్తారు. తన బిడ్డ తప్పిపోయినప్పుడు మరియ పడిన వేదన, నేడు తమ బిడ్డలను కోల్పోయిన ప్రతి తల్లిదండ్రి పడుతున్న బాధను తెలియజేస్తుంది. తన కుమారుడు మరణించడం చూసిన మరియ బాధ, నేటి సమాజంలో ఉన్న అపనమ్మకం, ద్రోహం, మరియు మన పాపాల వల్ల కలిగిన దుఃఖాన్ని తెలియజేస్తుంది.

ఈ రోజు మరియమాత యొక్క దుఃఖపూరిత హృదయాన్ని స్మరించుకుంటున్నప్పుడు, మన దుఃఖం గురించి కూడా ఆలోచించుకోవాలి. మన దుఃఖం పవిత్రమైనదైనప్పుడు, మనం కరుణ, ఆధ్యాత్మిక సానుభూతితో నిండిపోతాం. ‘కరుణ’ అంటే ఇతరుల బాధలో భాగం పంచుకోవడం. మరియమాత తన కుమారుడు యేసు హృదయంతో ఏకమై, ఆయనను సిలువ వేసిన పాపాత్ముల కోసం ఆయనతో కలిసి బాధపడ్డారు. ఆమె ఆ పాపాలను చూసి ద్వేషంతో నిండిపోలేదు. బదులుగా, యేసుకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిపై కూడా ఆయన దయ కురిపించాలని ఆమె తీవ్రంగా ఆశించారు. మరియమాత చూపించిన ఈ స్వచ్ఛమైన ప్రేమ, ఆమె హృదయపు పవిత్రతకు నిదర్శనం.

వ్యాకులమాత పండుగ కేవలం గతానికి సంబంధించినది కాదు, ఇది మన జీవితంలో ఒక భాగం. మన కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్లలో, మరియ తల్లి మనకు తోడుగా ఉంటారు. మనం మన పాపాలను ఒప్పుకొని, ఆమె మధ్యస్థ ప్రార్ధన ద్వారా దేవుని దయను పొంది, మన శ్రమలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ఈ పండుగ ద్వారా మనం ఒక సందేశాన్ని తీసుకుందాం, ఏమిటంటే, “కష్టాలు, శ్రమలు మన జీవితంలో భాగమే! కానీ మనం ఒంటరిగా లేము. వ్యాకులమాత మనకు తోడుగా, మనకు ఆశ్రయంగా ఉంటారు.” పునీత గాబ్రియేల్ ఆఫ్ సొరోఫుల్ మదర్ గారు తన పేరులోనే ‘వ్యాకులమాత’ను చేర్చుకున్నారు. ఆయన ఏమన్నారంటే, “మన బాధల్లో మనం ఒంటరిగా లేము. మరియమ్మ మనకు తల్లిగా, మన కన్నీళ్లను తన కన్నీళ్లతో కలిపి, దేవుని దయను మనకు పొందిపెడతారు.”

‘వ్యాకులమాత’ కేవలం దుఃఖానికి చిహ్నం మాత్రమే కాదు, నిరీక్షణ, విశ్వాసం, మరియు పాపక్షమాపణకు కూడా చిహ్నం. ఈరోజు, మరియమాత యొక్క పవిత్రమైన, దుఃఖపూరిత హృదయాన్ని మనం ధ్యానించుకుందాం. అలా చేస్తూ, ఆమె హృదయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆమె హృదయంలోని ప్రేమ లోతును అర్థం చేసుకోవాలంటే ప్రార్థన ఒక్కటే మార్గం. ప్రార్థనలో, దేవుడు ఆమె నిష్కళంకమైన ప్రేమను మనకు తెలియజేస్తారు. అప్పుడు ఆమెను మరింత సంపూర్ణంగా అనుకరించడానికి ప్రేరేపించ బడతాము. స్వార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టి, నిస్వార్థాన్ని ఆలింగనం చేసుకుంటాము. తద్వారా ఈ నిష్కళంకమైన తల్లికి, ఆమె దివ్య కుమారుడికి మధ్య ఉన్న పరిపూర్ణమైన ప్రేమలో మనం పాలుపంచుకుంటాము. పునీత లూయిస్ మేరీ మోన్‌ఫోర్ట్ గారు ఏమన్నారంటే, “వ్యాకులమాత దుఃఖం విశ్వాసానికి, ప్రేమకు నిదర్శనం. ఆమె దుఃఖంలో మనం భాగం పంచుకున్నప్పుడే, యేసుతో ఆమెకున్న ప్రేమబంధాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం.”
దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్! 🙏

No comments:

Post a Comment