23వ సామాన్య సోమవారము

 23వ సామాన్య సోమవారము

23వ సామాన్య వారములోని సోమవార ధ్యానాంశమునకు స్వాగతం. నేటి సువిశేష పఠనము లూకా శుభవార్త 6:6-11 వచనముల గురించి ధ్యానిద్దాం. సువిశేషములో వింటున్నట్లుగా, యేసు 'సబ్బాతు దినము' లేదా 'విశ్రాంతి దినము', యూదుల ప్రార్ధనా మందిరములో ఉపదేశించుచుండెను. అచట కుడిచేయి ఊచపోయిన వానికి, ప్రభువు స్వస్థతను చేకూర్చుటనుగూర్చి వింటున్నాము. విశ్రాంతి దినమున స్వస్థపరచినచో యేసుపై నేరము మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అప్పటికే పొంచియున్నారు. వారి ఆలోచనలను గ్రహించిన యేసు, "విశ్రాంతి దినమున, మంచి చేయుట ధర్మమా? కీడు చేయుట ధర్మమా? జీవితమును రక్షించుట న్యాయమా? జీవితమును నాశనము చేయుట న్యాయమా?" అని ప్రశ్నించి, వారి సమాధానం కొరకుకూడా వేచియుండక, ఆ వ్యక్తిని బాగుచేసెను. అది చూచి, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వెఱ్ఱికోపముతో యేసును ఏమి చేయుదమా అని మంతనాలు చేయసాగిరి.

ఇంతకు, సబ్బాతు అనగా ఏమి? సబ్బాతు నియమం ఏమిటి? యూదులకు ఇది ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? సబ్బాతు దినమున ప్రభువు స్వస్థత చేసినప్పుడు, యూదులు ఎందుకు వెఱ్ఱికోపమునకు గురైనారు? ‘సబ్బాతుఅనే పదం షబాత్అనే హీబ్రూ పదమునుండి వచ్చినది. ‘షబాత్’ అనగా ‘నిలిపివేయుట, మానుకొనుట, విశ్రాంతిపొందుట, పనిమానుట, కొనియాడుట’ అని అర్ధము. ఇది యూదుల వారదినముల పండుగ. వారికి ఎంతో పవిత్రమైన దినము. సబ్బాతు అనేది’ యేడవ దినము’. ఆ రోజు, ఏ పని చేయక, విశ్రాంతి తీసుకొను రోజు.

సబ్బాతు దినముయొక్క ఆచరణ ఏమిటంటే, ఇంటి యజమానురాలు సబ్బాతు ప్రారంభానికిముందు, రెండు కొవ్వొత్తులను వెలిగిస్తుంది. ఒకటి నిర్గమ కాండము 20:8లో చెప్పబడిన విశ్రాంతి దినమును గుర్తుంచుకొనుడు. దానిని పవిత్రము చేయుడుఅన్న ఆజ్ఞను గుర్తుచేయుటకు ఒక కొవ్వొత్తిని, అలాగే, ద్వితీయోపదేశ కాండము 5:12లో చెప్పబడిన మీ ప్రభువునైన నేను ఆజ్ఞాపించినట్లే మీరు విశ్రాంతి దినమును పాటింపుడు. దానిని పవిత్రముగా ఉంచుకొనుడుఅన్న దానికి ప్రతిస్పందనగా రెండవ కొవ్వొతిని వెలిగించును.

సబ్బాతు దినమును గూర్చిన మొదటి ప్రస్తావనను నిర్గమ కాండము 16:22-30లో చూడవచ్చు. ‘మన్నా’ను గురించి చెప్పబడిన సందర్భమున విశ్రాంతి దినముగూర్చి ప్రస్తావించబడినది: మోషే వారితో, “ఇది యావే ఆజ్ఞ. రేపు పూర్తిగా విశ్రాంతి దినము. అది యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనగోరిన దానిని కాల్చుకొనుడు. వండుకొనగోరిన దానిని వండుకొనుడు. మిగిలిన దానిని రేపటికి అట్టిపెట్టుకొనుడు” అని చెప్పెను.

ఆతరువాత, సబ్బాతు గురించి పది ఆజ్ఞలలో పున:ప్రస్తావించ బడినది (నిర్గ 20:8-11). సబ్బాతు నియమాన్ని ఒక ఆజ్ఞగా నిర్గమ కాండము 20వ అధ్యాయములో చూస్తున్నాము. సబ్బాతు దినమున, మొదటిగా, ఎవరు ఏ పనికూడా చేయకూడదు (నిర్గ 20:10). రెండవదిగా, దానిని పవిత్రముగా ఎంచని వారికి మరణశిక్ష విధింపవలయును (నిర్గ 31:14). మూడవదిగా, దుక్కులు దున్నకూడదు, కోతలు కోయకూడదు (నిర్గ 34:21). మరియు నాలుగువదిగా, యిండ్లలో నిప్పు రగిలించరాదు (నిర్గ 35:3).

సబ్బాతు ఆజ్ఞకు మూలం ఆ.కాం. 2:2-3: “ఏడవనాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తిచేసి యేడవనాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని ‘పవిత్ర రోజు’గా చేసెను.” [పవిత్రము చేయడం అనగా ‘వేరుపరచడం’ అనే అర్ధం ఉన్నది]. దేవుడు ఏడవదినమున విశ్రాంతి పొందెను. అయితే, ‘సబ్బాతు’ అను పదం ఆది కాండములో ఎక్కడా ప్రస్తావించబడలేదు. అలాగే, ఆదాము, అవ్వలు ‘విశ్రాంతి’ పొందిన విషయం, లేదా విశ్రాంతి దినమును పాటించిన విషయముగూర్చి చెప్పబడలేదు. వాస్తవానికి, దేవుడు సమస్తమును వారికి సమకూర్చారు. వారు ‘శాశ్వతమైన విశ్రాంతి’లో యున్నారు. ‘శాశ్వతమైన విశ్రాంతి’లో యున్నవారికి, విశ్రాంతి దినము గూర్చి ప్రస్తావించడం అప్రస్తుతం!

సబ్బాతు నియమం దేనిని సూచిస్తుందంటే, భవిష్యత్తులో మెస్సయ్య [యేసు క్రీస్తు] ద్వారా దేవుడు ఒసగబోవు ‘శాశ్వత విశ్రాంతి దినము’ను సూచిస్తుంది. దీనికి సూచనగానే, వారు వారములో యేడవరోజున విశ్రాంతి దినమును కొనియాడాలి.

యేసు సబ్బాతు నియమమును పాటించారా? అంటే తప్పక పాటించారు అని చెప్పవచ్చు. అయితే, అనేకసార్లు యేసు విశ్రాంతి దినమును పాటించలేదని ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆయనను నిందించారు (యో 9:16; 7:23; మార్కు 3:4). విశ్రాంతి దినమున ‘పని’ చేసినందులకు, యూదులు యేసును హింసింప మొదలు పెట్టారు. ఆయనను చంపుటకు ప్రయత్నించారు (యో 5:16-18). “కాని సబ్బాతు పవిత్రతను గౌరవాన్ని యేసు ఎన్నడూ కాదనలేదు” (మా 1:21; సత్యోపదేశం 2173). యేసు తన బోధనలలో, సబ్బాతు అను ఆజ్ఞను తప్ప, మిగతా ఆజ్ఞలన్నిటిని ప్రస్తావించారు (మ 19:18-19; 4:10; 5:34). విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని తన శిష్యులు చేసినప్పుడు, పరిసయ్యులు వారిని ప్రశ్నింపగా, యేసు వారిని సమర్ధించారు (మత్త 12:1-8; మా 2:27).

యేసు సబ్బాతు చట్టాన్ని పాటించారు; బోధనలు చేసారు; ప్రార్ధనలలో పాల్గొన్నారు (మా 6:12; లూ 4:16, 31). అయితే పరిసయ్యుల సంకుచిత మనస్తత్వాన్ని, హృదయ కాఠిన్యతను ప్రభువు తీవ్రముగా ఖండించారు. ప్రత్యేకముగా, విశ్రాంతి దినమున స్వస్థత పరిచర్యను వారు అడ్డుకున్నప్పుడు, తోటిమానవులకు సహాయం, మేలు చేయడానికి ఏ సమయమైన సరియైనదేనని నొక్కిచెప్పారు. విశ్రాంతి దినమున స్వస్థత పరచుట చట్టబద్ధమేనా అని ప్రశ్నించినప్పుడు, యేసు, “ఏమీ! మీలో ఎవడైన విశ్రాంతి దినమున తన గొర్రె గోతిలో పడినచో దానిని పట్టి వెలుపలకు తీయడా? గొర్రెకంటే మనుష్యుడు ఎంతో విలువగలవాడు కదా! కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట తగునుఅని మ 12:10-12లో సమాధానమిచ్చారు. యేసు తన అభిప్రాయాన్ని నొక్కిచెప్పడానికి, విశ్రాంతి దినమున తన స్వస్థత పరిచర్యను అనేకసార్లు కొనసాగించారు (మా 1:21-28; 1:29-31; లూ 13:10-17; 14:16; యో 5: 1-18; 9:1-41). సబ్బాతుచట్టం ప్రాధమికముగా మానవ శ్రేయస్సు, సంక్షేమం కొరకని యేసు బోధించారు. సబ్బాతు చట్టానికి బానిసలుగాక, సబ్బాతు విశ్రాంతినుండి ప్రయోజనం పొందాలని యేసు కోరుచున్నారు.

పరిసయ్యులు సబ్బాతుచట్టాన్ని తప్పుగా వివరించారు. విశ్రాంతిదిన నియమము గూర్చిన తప్పుడు వివరణలను యేసు తీవ్రముగా ఖండించారు (లూ 13:10-16; 14:1-5; యో 5:9-18; 7:22). విశ్రాంతిదిన నియమమును పాటించు విధానం యేసుకు సంతోషం కలిగించలేదు. కనుక, యేసు ప్రవక్తలవలె సబ్బాతునియమ దుర్వినియోగాన్ని తీవ్రముగా, బాహాటంగా ఖండించారు (మ 15:6-9). “మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినదిగాని, విశ్రాంతి దినముకొరకు మానవుడు నియమింపబడలేదు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకుకూడ ప్రభువే” అని మా 2:27-28లో యేసు పలికారు. ప్రామాణికమైన, అధికారికమైన అర్ధవివరణను యేసు ఇచ్చారు (సత్యోపదేశం 2173). కాబట్టి, ప్రతిరోజూ సర్వశక్తిమంతుడైన ప్రభువును ఆరాధించే రోజుగా ఉండాలి. “మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడ ప్రభువే” అన్న పలుకులు, యేసు మన జీవితాలకు, కుటుంబాలకు, బంధాలకు కేంద్రం అని అర్ధమగుచున్నది.

ప్రభువు ‘శాశ్వత సబ్బాతు దినము’ గురించి ఇలా పలికారు: ‘నేను సృజింపబోవు నూత్నదివి, నూత్నభువి, నా శక్తివలన సదా నిల్చియుండునట్లే, మీ సంతతియు, మీ పేరును శాశ్వతముగా నిల్చును. ప్రతి అమావాస్యనాడు, ప్రతి విశ్రాంతిదినమున సకలజాతి ప్రజలు నా సమక్షమునకు వచ్చి నన్నారాధింతురు” (యెష 66:22-23). ఇది యేసు క్రీస్తునందు నెరవేరుచున్నది!

కడరాత్రి భోజన సమయములో, నూతన నిబంధనను ప్రకటించిన తరువాత, యేసు ప్రాధాన్యత ఆదివారముపై యున్నట్లుగా అనిపిస్తున్నది. యేసు ఆదివారము రోజున ఉత్థానమయ్యారు. యేసు ఉత్థానమయ్యాక తరువాతి రెండు ఆదివార రోజులలో తన శిష్యులకు దర్శనమిచ్చారు (యో 20:19; 20:26). మరల ఐదువారాల తరువాత, ఆదివారమున, పెంతకోస్తు దినమున, పరిశుద్ధాత్మ శిష్యులపైకి దిగివచ్చినది. క్రైస్తవులు ‘సబ్బాతు దినము’ను [శనివారము] కొనియాడే కట్టుబాటు అవసరం లేదని, ఆదివారము అయిన ‘ప్రభువు దినము’న వారు ఆరాధన చేయాలని నూతన నిబంధనలోనే స్పష్టముగా తెలియజేయడమైనది (అ.కా. 20:7; 1 కొరి 16:2; కొలొస్సీ 2:16-17; దర్శన 1:10).

ముగింపు: క్రీస్తు మృతులలోనుండి ఆదివారము లేపబడెను. కనుక, ఆదివారము ‘ప్రభువు దినము’. ‘ప్రభువు దినము’ అని నూతన నిబంధనములో కేవలము దర్శన గ్రంథము 1:10లో మాత్రమే ప్రస్తావించబడినది. ఇది నూతన జీవితాన్ని లేదా సృష్టిని సూచిస్తుంది. కనుక, ఆదివారము పూర్వనిబంధన సబ్బాతు దినమును పరిపూర్ణము చేయుచున్నది. ఆదివారం దివ్యపూజాబలిలో పాల్గొనడం వలన ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకొని, తద్వారా, చెడును నివారించి, ఇతరులకు మంచిచేయగలము. బలిపీఠముమీద మన జీవితాలను దేవునికి అర్పించాలి. మన పాపాలకు దేవుని క్షమాపణ కోరుకోవాలి. మన మనవులను దేవునికి విన్నవించుకోవాలి. దివ్యసత్ప్రసాదాన్ని లోకొనడంద్వారా దైవీక జీవితములో పాలుపంచుకుంటాము. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి. విచారణ కార్యకలాపాలలో పాలుపంచుకోవాలి.

దేవుడు మిమ్ము దీవించునుగాక! ఆమెన్!

No comments:

Post a Comment