18వ సామాన్య బుధవారము
సంఖ్యా. 13:1-2,
25-14:1, 26-29, 34-35; మత్త. 15:21-28
ధ్యానాంశము: సిరోపెనిష్యా స్త్రీ విశ్వాసము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “అమ్మా! నీ విశ్వాసము మెచ్చదగినది.
నీ కోరిక నేరవేరునుగాక!” (మత్త. 15:28).
ధ్యానము: “యేసు అచట నుండి తూరు, సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను” (15:21). అన్యులు ఉండే ప్రాంతములు. ఈ ప్రాంతం ఏలియా ప్రవక్తకు
శత్రువైన ఎసెబెలు వచ్చిన ప్రాంతం. ఈ ప్రాంతం ప్రవక్తల కోపానికి గురియైనది (యెహెజ్కె
26:15-17; జెకర్యా 9:3). యేసు ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించడం విశేషం! ఆయన ప్రజలను
విభజించే అడ్డుగోడలను బ్రద్దలు చేయడానికి వచ్చారు. ఆయన అందరి రక్షణార్ధమై ఈ
లోకానికి వచ్చారు. ప్రభువు ఎందులకు ఈ ప్రాంతానికి వచ్చారో స్పష్టత లేదు. బహుశా, గలిలీయ పరిచర్య తరువాత,
జనసమూహములనుండి
ఏకాంతము కొరకు వచ్చియుండవచ్చు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తెగల ఒక స్త్రీ
యేసుగూర్చి విని వచ్చి, ఆయన పాదములపై పడి, దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరచుమని ప్రార్ధించెను.
ఆమె గ్రీసు దేశీయురాలు. సిరోపెనిష్యాలో పుట్టినది. ఆమె అన్యురాలు, అనగా యూదేతరురాలు. పెనిష్యా పశ్చిమాన మధ్యధరా సముద్రం మరియు
తూర్పున పర్వతాలతో సరిహద్దులుగా ఉన్న పొడవైన ఇరుకైన తీరప్రాంతం. ఆధునిక లెబనాన్
తీరమైదానం. దీని దక్షిణ సరిహద్దు కార్మెల్ కొండ (గలిలీ సముద్రానికి తూర్పున); అది అక్కడి నుండి ఉత్తరంగా దాదాపు 185 మైళ్ళు (300 కిమీ) విస్తరించి ఉంది.
ప్రధాన నగరాలలో టోలెమైస్, తూరు, సీదోను ఉన్నాయి. సిరోపెనిష్యా అనగా ఈ స్త్రీని సిరియా మరియు
పెనిష్యాతో కలుపుతుంది. యేసును గూర్చి విని వచ్చినది. యేసుకు తన అవసరతను
మొరపెట్టుకున్నది.
యేసు సమాధానం మనందరిని ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురి చేస్తుంది – “బిడ్డల రొట్టెలను కుక్కపిల్లలకు వెయ తగదు” (15:26). ఇచట ‘బిడ్డలు’ అనగా ‘ఇశ్రాయేలు ప్రజలు’ (నిర్గమ 4:22; ద్వితీ 14:1; హోషె 11:1). అన్యులకు పరిచర్య తగిన సమయములో వచ్చునని ప్రభువుకు తెలుసు! యేసు ఆమె విశ్వాసాన్ని మెచ్చారు. వినయముతో కూడిన గొప్ప విశ్వాసముతో ఆమె సమాధాన మిచ్చినది. యేసు ఆ స్త్రీ గృహమునకు వెళ్ళలేదు. ఆ బాలికను తాకలేదు. కాని, ఆ బాలిక స్వస్థత పొందినదని తెలిపారు. ప్రభువు మాటలను ఆమె విశ్వసించి, వెంటనే ఇంటికి వెళ్లి పోయినది. ఈ ఉదాంతము నుండి ‘నిరంతర ప్రార్ధన’ యొక్క విలువను గ్రహించాలి. ఆ స్త్రీ పట్టుదలతో ప్రార్ధించి, తన విశ్వాసాన్ని వెల్లడి చేసింది. ఆ స్త్రీ ప్రేమగల తల్లి అని నిరూపించుకున్నది. తన బిడ్డకోసం, ఎన్ని మాటలైనా పడటానికి సిద్ధపడింది. ఆ స్త్రీ వినయాన్నికూడా గ్రహించాలి. క్రీస్తును గూర్చిన సువార్తను చూచువారందరికి, వినువారందరికి, దేవుని రాజ్యము అందుబాటులో నున్నదని, ఈ ఉదాంతం తెలియజేయుచున్నది.
No comments:
Post a Comment