తపస్కాల నాలుగవ వారము - గురువారం (II)

  దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల నాలుగవ వారము - గురువారం
నిర్గమ 32:7-14; యోహాను 5:31-47 

ధ్యానాంశము: యేసు పట్ల సాక్షులు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు. ఆయన సాక్ష్యము సత్యము" (యోహాను 5:31).
ధ్యానము: [సందర్భము] యేసు తన బోధనలద్వారా, అద్భుత కార్యాల ద్వారా, తానే మెస్సయ్య (క్రీస్తు) అని, దేవుని కుమారుడని, దేవునిచేత పంపబడినాడని స్పష్టం చేసియున్నారు. అయితే, యూదులు అనేకమంది యేసును విశ్వసింపలేదు. ఆయన ప్రవక్తలచేత వాగ్దానం చేయబడిన మెస్సయ్య అని వారు అంగీకరించలేదు. ఆయన చేసిన అద్భుత కార్యములను, సూచక క్రియలను విశ్వసింప లేదు. సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడని, బెల్జబూలు వలన దయ్యములను వెడలగొట్టు చున్నాడని, మోషే చట్ట నియమములను ( ఉదా: విశ్రాంతి నియమాలు) ఉల్లంఘించు చున్నాడని నిందించారు. తననుతాను దేవునితో సమానముగా చేసికొనుచున్నాడని (దైవదూషణ) భావించారు. వారు ఎప్పుడుకూడా యేసును ఒక దోషిగా పరిగణించారు. యూదనాయకులు ఆయనను చంప తీవ్రముగా ప్రయత్నాలు చేసారు. 

[సందేశము] అయితే, నేటి సువిశేష భాగములో, యేసు తీవ్రముగా వారి అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని బట్టబయలు చేయుచున్నారు. తన ప్రేషిత కార్యములను, బోధనలను ఎలాంటి పక్షపాతము లేకుండా చూసినట్లయితే, తాను దేవునిచేత పంపబడినాడని మరియు తన బోధనలను విశ్వసించే వారని యేసు తెలియజేయుచున్నారు. వారు ఆయనను విశ్వసించడానికి, ఆయనను గూర్చి నాలుగు సాక్ష్యాలు ఉన్నాయని యేసు స్పష్టం చేయుచున్నారు. ఎందుకన, దోషిని శిక్షించుటకుగాని, లేదా దేనినైన నమ్మి అంగీకరించడానికి, యూదులకు ఒక సాక్ష్యం చెల్లదు - "దోషిని చంపవలయునన్న, ఒక్కని సాక్ష్యము చెల్లదు" (ద్వితీ 17:6); "మానవుని దోషిగా నిర్ణయించుటకు ఒక్కని సాక్ష్యము చాలదు. ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యము పల్కిననేగాని ఎవనినైన దోషిగా నిర్ణయింపరాదు" (ద్వితీ 19:15). అందుకే యేసు, "నాకు నేను సాక్ష్యము పలికినచో, నా సాక్ష్యము [మోషే చట్టం ప్రకారం] సత్యము కాదు" (5:31) అని పలికియున్నారు.

కనుక, తనను గూర్చి నాలుగు సాక్ష్యాలు / సాక్ష్యులు గురించి యేసు ప్రభువు స్పష్టం చేయుచున్నారు.
1. బప్తిస్త యోహాను సాక్ష్యము  - "మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి. అతడు సత్యము గురించి సాక్ష్యము ఇచ్చెను" (యోహాను 5:33; 1:19, 26, 29). యేసు రక్షకుడని, దేవుని గొర్రెపిల్లయని యోహాను సాక్ష్యమిచ్చి యున్నాడు.
2. యేసు చేయు క్రియలు, తండ్రి తనకు చేయనిచ్చిన పనులు - ఈ కార్యములు యేసు గురించి సాక్ష్యమిచ్చుచు, తండ్రియే తనను పంపెనని నిరూపించు చున్నవి. ఇది బప్తిస్త యోహాను ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది అని యేసు అన్నారు (యోహాను 5:36).
3. తండ్రి దేవుడు - "నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మీరు ఎన్నడును ఆయన స్వరమును వినలేదు. ఆయన రూపమును చూడలేదు" (యోహాను 5: 32,37). తండ్రి దేవుడు యేసు జ్ఞానస్నానమున (మార్కు 1:11; యోహాను 1:31-34), దివ్యరూప ధారణ సమయమున (మార్కు 9:7; మత్త 17:1-8) కూడా సాక్ష్యమిచ్చారు. మరియు ప్రజల సమక్షములో దేవుడు సాక్ష్యమిచ్చెను (యోహాను 12:28-30).
4. లేఖనములు - "నిత్యజీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను [మోషే చట్టము, ప్రవక్తల ప్రవచనములు] పరిశీలింపుడు. అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి (యోహాను 5:39).

యూదులు ఈ నాలుగు సాక్ష్యములను విశ్వసించలేదు. సత్యమును గూర్చిన ఆసక్తి వారికి ఎంతమాత్రమును లేదు. తనను మెస్సయ్యగా వారు అంగీకరించక పోవడానికి కారణాలు: వారిలో దైవప్రేమ లేకపోవడం; వారు "ఒండొరుల పొగడ్తలను ఆశించారు" (యోహాను 5:44). వారి గర్వం, అహంకారం దేవుని స్వరానికి / వాక్కుకు చెవిటివారినిగా చేసింది; లేఖనములను పక్షపాతముగా, వారికి అనుగుణముగా వివరించడం; మోషే [క్రీస్తును గూర్చి] వ్రాసిన వాటిని కూడా వారు విశ్వసించలేదు, సరిగా గ్రహించలేదు. 

మనం దేవుని వాక్యాన్ని విని విశ్వసించు చున్నామా? క్రైస్తవులముగా, క్రీస్తునందు విశ్వాసమునకు సాక్ష్యులుగా పిలువబడినాము. యేసుకు సాక్ష్యులుగా, మొదటిగా మన స్థిరమైన జీవితము ద్వారా సాక్ష్యమివ్వాలి. మనం దేవుని బిడ్డలముగా జీవిస్తూ, ఆయన ప్రేమ-సేవాజ్ఞలను పాటిస్తూ జీవించాలి. రెండవదిగా, పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్కును విశ్వసించుట ద్వారా క్రీస్తుకు సాక్ష్యమివ్వాలి. లేఖనములద్వారా తండ్రి దేవుడు, యేసుకు సాక్ష్యమిచ్చారు. దేవుడు చెప్పే ప్రతీ మాట సత్యమే, కనుక మనం విశ్వసించాలి. పాత నిబంధన అంతయు, తన కుమారుని రాకకు, తన ప్రజలను దేవుడు సంసిద్ధం చేసారు. క్రీస్తును గూర్చిన అనేక విషయాలు స్పష్టముగా తెలియజేయ బడ్డాయి. కనుక, పరిశుద్ధ గ్రంథము పట్ల మరియు పరిశుద్ధ గ్రంథమును చదువుచున్నప్పుడు, మన వైఖరి ఏమిటి? కేవలము తెలుసుకొనుటకు చదువుచున్నామా లేక నిత్యజీవపు మాటల కొరకు చదువుచున్నామా? చివరిగా, ప్రేమగా జీవించడం ద్వారా, క్రీస్తుకు గొప్ప సాక్ష్యులుగా మనం జీవించవచ్చును.

No comments:

Post a Comment