పునీత పేతురు, పౌలుల మహోత్సవం
పొప్ లియో XIV
త్రికాల జపము
పు. పేతురు బసిలికా, రోము నగరము
సోమవారము, 29 జూన్ 2025
ప్రియమైన
సహోదరీ సహోదరులారా, అందరికీ శుభ మధ్యాహ్నం!
ఈ రోజు
మనం రోము నగర పాలక పునీతులైన పునీత పేతురు మరియు పునీత పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతున్నాము.
ఈ పండుగ రోము నగర శ్రీసభకు, విశ్వశ్రీసభకు మధ్య
విశ్వాసంలోనూ, సేవాభావంలోనూ ఉన్న పవిత్రమైన బంధాన్ని మనకు
గుర్తుచేస్తుంది.
ఈ ఇరువురు
అపొస్తలుల సాక్ష్యం నూతన నిబంధన గ్రంథానికి ఒక ముద్ర లాంటిది. వారు ఈ నగరంలో
చిందించిన రక్తం, ప్రభువైన యేసు మనకు
అందించిన దేవుని అపారమైన ప్రేమను చాటిచెబుతుంది. వారి బోధనలు, వారి వేదసాక్షి మరణం ద్వారానే క్రీస్తు సువార్త రోము నగరంలో బలంగా
నాటుకుంది. అప్పటి సామ్రాజ్య రాజధాని అయిన ఈ నగరంలోనే, దేవుని
గురించిన సరికొత్త జ్ఞానాన్ని, ప్రతి మానవుని విశిష్టమైన
గౌరవాన్ని చాటిచెప్పింది. అలాగే అధికారం అంటే ఇతరులను లొంగదీసుకోవడం కాదు, మానవ జీవితానికి సేవ చేయడం అనే కొత్త అర్ధాన్ని వివరించింది.
ఈ
రోజుల్లో కూడా, ప్రేమతో మరణించి తిరిగి లేచిన ఆ
ప్రభువు, తన సాక్షుల ద్వారా మన మధ్యకు వస్తూనే ఉన్నారు. “నన్ను
అనుసరించు!” అనే ఆయన పిలుపును అందుకుని, ధైర్యంగా అడుగులు
వేస్తున్న వారి స్వరాలు, ముఖాలు మరియు నిర్ణయాల ద్వారా ఆయన
సందేశం నగరాల నుండి మారుమూల గ్రామాలకు, రాజధానుల నుండి
చిట్టచివరి ప్రాంతాల వరకు చేరుతోంది. కాబట్టి, ఈ పండుగ రోజున
మనల్ని పేతురు మరియు పౌలుల సువార్త బాధ్యతలోనికి, అంటే
సాక్షాత్తు యేసు ప్రభువు సువార్త సేవలోనికి ఆహ్వానిస్తోంది. పాపులమైనప్పటికీ
క్షమించబడిన మనపై దేవుడు నమ్మకం ఉంచాడు; తద్వారా ఆయన కృప మన
జీవితాల ద్వారా ప్రకాశిస్తుంది, చెడును మంచిగా మార్చే ఆయన
శక్తి లోకానికి వెల్లడవుతుంది.
ప్రియమైన
మిత్రులారా, పేతురు మరియు పౌలు ఒకరికొకరు
ఎంతో భిన్నమైన వ్యక్తులు. వారి నేపథ్యం, పెరిగిన వాతావరణం,
స్వభావం అన్నీ వేరువేరు. వారు దేవుని పిలుపును అందుకునే ముందు
మాత్రమే కాదు, అందుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నారు; ఎందుకంటే ఆ ప్రభువు వారిద్దరినీ ఒకేలా మార్చలేదు. పేతురు మరియు పౌలు
ఇద్దరూ సువార్తను తమదైన శైలిలో అర్థం చేసుకుని, ప్రచారం
చేశారు. బైబులు గ్రంథాన్ని రాయించిన పవిత్రాత్మ కూడా వారి మధ్య ఉన్న ఈ
వ్యత్యాసాలను దాచాలని అనుకోలేదు. నిజానికి, ఈ తేడాలు మనకు ఒక
శుభవార్త లాంటివి. అపొస్తలుల సంఘంలో పేతురు, పౌలులు
శత్రువులు కాదు. దానికి భిన్నంగా, పవిత్రాత్మ వేర్వేరు
భిన్నత్వాలను ఎలా ఒక్కటిగా చేస్తుందో చెప్పడానికి వారు ఒక చిహ్నంగా నిలిచారు. ఈ
విధంగా, రోము నగర శ్రీసభ పాలక పునీతులు ఐక్యతలోని సవాళ్లను
ఎదుర్కొన్నారు; దానిని అర్థం చేసుకుని, సేవ చేస్తూ, దైవిక జీవితానికి అది ఒక నిదర్శనమని
చాటారు. చరిత్రలో క్రైస్తవ ఉనికి అనేది కేవలం అధికారం కోసం కాకుండా, సేవ, ఐక్యత మరియు సమాధానం కోసం పని చేయాలని
నిరూపించడంలో వారి సాక్ష్యం ఎంతో దోహదపడింది.
పునీత
పేతురు మరియు పౌలుల ప్రార్థనల ద్వారా, శ్రీసభ యొక్క
సార్వత్రికతను (క్యాథలిక్ / కతోలిక స్వభావం) మనం మరింత లోతుగా అభినందించేలా
ప్రభువు మనకు అనుగ్రహాన్ని ప్రసాదించును గాక! వ్యక్తులు మరియు ప్రజల మధ్య
సోదరభావాన్ని పెంపొందించడంలో దాని విలువను గుర్తించేలా, ఐక్యతను
దెబ్బతీసే దేనికైనా దూరంగా ఉండేలా, మరియు అందరితో నిజాయితీతో
కూడిన సంభాషణలను కొనసాగించేలా ఆయన మనల్ని నడిపించును గాక!
అపొస్తలుల రాజ్ఞి అయిన మరియ మాత, రోము నగరంలోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ ప్రజలను ఎల్లప్పుడూ కాపాడును గాక! ఆమెన్.
No comments:
Post a Comment