Showing posts with label Saints and Blesseds. Show all posts
Showing posts with label Saints and Blesseds. Show all posts

మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు - అతిదూతలు

 మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు - అతిదూతలు


కతోలిక శ్రీసభ అతిదూతలు లేదా మహాదూతలు అయిన మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు గార్ల పండుగను సెప్టెంబరు 29న కొనియాడుతుంది. ఈ రోజును సాధారణంగా మైఖేల్‌మాస్ (Michaelmas) అని పిలుస్తారు, ఎందుకంటే, 5వ శతాబ్దం నుండే మిఖాయేలు పండుగను మాత్రమే జరుపుకునేవారు. కాలక్రమేణా మిగతా ఇద్దరు అతిదూతలనుకూడా చేర్చబడింది. ‘దూత’ అనగా ‘సేవకుడు’ లేదా ‘సందేశకుడు’ అని అర్ధం. బైబులులో పేర్కొనబడిన తొమ్మిది సమూహాలలో అతిదూతలు ఒకరు. ముందుగా, ‘దూతలు’ సజీవుడైన దేవున్ని ఆరాధించే అపారమైన సమూహాన్ని సూచిస్తారు. వారిలోనున్న రెండు లక్షణాలు ఏమిటంటే, ఒకటి ఆరాధన: దూతలు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటారు, నిరంతరం దేవున్ని మహిమపరుస్తారు, కీర్తిస్తారు. మనం కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగిస్తూ, ప్రార్థనలో ఆయనను ధ్యానించాలి. రెండు, సేవ: ఆరాధన నుండి శక్తిని పొంది, దేవుని సంకల్పాన్ని ప్రపంచంలో, (ఇతరుల రక్షణ కోసం) నెరవేర్చడానికి సేవ చేస్తారు. మనం కూడా ప్రార్థన తర్వాత ఇతరులకు సేవచేస్తూ, దేవుని ప్రేమను ప్రకటించాలి.

మనకు ఎవరైనా అనుకోకుండా సహాయం చేసినవారిని, మంచి సలహా ఇచ్చిన వారిని దేవదూతలా వచ్చి నన్ను ఆదుకున్నావు అని అంటాం. నిర్గమ కాండములో దేవుడు ఇలా పలికాడు, “మీరు బయలుదేరి పోవుచున్నప్పుడు, త్రోవలో మిమ్ము కాపాడుచు, నేను సిద్ధపరచిన చోటికి మిమ్ము చేర్చుటకు, నా దూతను మీకు ముందుగా పంపెదను” (నిర్గమ 23:20). మనం ఊహించని సమయములో దేవుడు మనకు కల్పించిన రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేద్దాం!

ఈరోజు ముగ్గురు అతిదేవదూతలను స్మరించుకుంటున్నాము. తోబితు గ్రంధం 12:15 ప్రకారం, ఏడుగురు అతిదూతలు ఉన్నప్పటికీ, బైబులులో పేర్లతో ప్రస్తావించబడిన మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు మాత్రమే కతోలిక శ్రీసభ అధికారికంగా గుర్తించే అతిదూతలు. వారి పేర్లు వారి పాత్రలను, స్వభావాన్ని సూచిస్తాయి. ఆ పేర్లన్నీ ఎల్ (El) అనే అక్షరంతో ముగుస్తాయి. ఈ ఎల్ అనేది హీబ్రూ భాషలో దేవుడు’ అని అర్ధం, కనుక వారు దేవుని దూతలు లేదా సందేశకులు అనే అర్థాన్ని సూచిస్తుంది.

(1). మిఖాయేలు: సాతాను, అతని దుష్టశక్తులకు వ్యతిరేకముగా పోరాడు దేవదూతల సమూహమునకు అధిపతి. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప అధిపతిగా, “పారశీక రాజ్యమునకు కావలికాయు దేవదూత” అని, “జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు” అని దాని 10:13 మరియు 12:1లో చదువుచున్నాం. మరియు యూదా వ్రాసిన లేఖ 1:9లో మోషే శరీరము కొరకు సాతానుతో వాదించాడు అని చదువుచున్నాం. మరియు పిశాచము, సైతాను అయిన సర్పముతో యుద్ధము చేసి దానిని ఓడించినట్లుగా దర్శన గ్రంధం 12:7-12లో చదువుచున్నాం. కనుక, అతిదూత మిఖాయేలు, సాతానుకు మరియు అతని అనుచరులకు (దూతలకు) వ్యతిరేకంగా పోరాడే వీరుడు. శ్రీసభకు ప్రధాన రక్షకుడు, దేవున్ని ప్రేమించే వారిని కాపాడువాడు, మరియు దైవజనానికి సంరక్షకుడు. ‘మిఖాయేలు’ అనగా ‘దేవునితో సమానం ఎవరు?’ అని అర్ధం.

(2). గాబ్రియేలు: బప్తిస్త యోహాను జననమును అతని తండ్రి జెకర్యాకు (లూకా 1:11-20), మరియు యేసుక్రీస్తు జననాన్ని మరియమ్మకు ప్రకటించిన (లూకా 1:26-38) వారు గాబ్రియేలు. అలాగే, దానియేలుకు దర్శనాలను వివరించిన (దాని 8:16; 9:21) దేవదూత గాబ్రియేలు. గాబ్రియేలు దూత యోసేపుకు కలలో కనిపించాడని, బెత్లేహేములో గొర్రెల కాపురులకు కనిపించాడని, గేత్సేమని తోటలో యేసు మహావేదనలో ఓదార్చాడని (లూకా 22:39-46) శ్రీసభ సాంప్రదాయం చెబుతుంది. ‘గాబ్రియేలు’ అనగా ‘దేవుని బలం’ అని అర్ధం.

(3). రఫాయేలు గురించి తోబీతు గ్రంధము 12వ అధ్యాయంలో చూస్తాం. ప్రధానంగా స్వస్థపరచేవాడు. తోబీతు కుమారుడైన తోబియాకు, మాదియాకు వెళ్ళు ప్రయాణములో మనిషిగా మారువేషములో మార్గదర్శకుడిగా ఉన్నాడు. అతనికి చూపును కలుగజేశాడు. అలాగే, తోబియా భార్యయైన సారాను దురాత్మనుండి విముక్తి చేయడానికి, స్వస్థత పరచడానికి సహాయ పడ్డాడు. ‘రఫాయేలు’ అనగా ‘దేవుని స్వస్థపరచెను’ అని అర్ధం.

కతోలిక శ్రీసభ బోధనల ప్రకారం, దేవదూతలు, అతిదేవదూతలతో సహా నిజమైన ఉనికిని కలిగి యున్నారని, వారు కేవలం ఊహాత్మక వ్యక్తులు కాదని శ్రీసభ బోధిస్తుంది. వారు నిర్ధేహ ఆత్మలు (non-corporeal spiritual beings). వారు దేవుని సేవకులు, సందేశకులు (messengers). అతిదూతలు (Archangels) అనేవారు దూతల సమూహంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటారు. వీరు దేవుని నుండి అత్యంత ముఖ్యమైన కార్యముల కొరకు, మహోన్నత రహస్యాల ప్రకటన కొరకు పంపబడతారు. దేవదూతలు మానవులకు కూడా సేవలు, సహాయం చేస్తారు. మానవుల రక్షణ, మార్గదర్శకత్వం కొరకు దేవునిచే పంపబడతారు. ప్రతీ వ్యక్తికి ఒక కావలి సన్మనస్కుడు లేదా దూత (Guardian Angel) ఉన్నట్లే, అతిదూతలు కూడా మానవ చరిత్రలో ముఖ్యమైన ప్రాత్రను పోషించారు.

అతిదూతలకు కతోలిక శ్రీసభ ఎందుకంత ప్రాధాన్యతనిచ్చి గౌరవిస్తుందని ఆలోచిస్తే, మన జీవితంలో వారి పాత్ర, పునీతుల పాత్రకు భిన్నంగా ఉంటుంది. పునీతుల విషయంలో, వారి విజ్ఞాపన కోసం మనం ప్రార్థించడమే కాక, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని, వారిని అనుకరించడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవదూతలు అందుకు భిన్నం. దేవదూతలు ఒక నిర్దిష్ట ప్రయోజనం కొరకు దేవునిచే సృష్టించబడిన నిర్దేహ ఆత్మ ప్రాణులు.

 “పరిశుద్ధ గ్రంథం సాధారణంగా దూతలు అని పిలిచే, ఈ ఆత్మ సంబంధమైన, దేహము లేని ప్రాణులు (spiritual, non-corporeal beings) యొక్క ఉనికి ఒక విశ్వాస సత్యం (a truth of faith). ఈ సత్యానికి పరిశుద్ధ గ్రంథ సాక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో, సంప్రదాయం (Tradition) యొక్క ఏకాభిప్రాయం కూడా అంతే స్పష్టంగా ఉంది” అని కతోలిక శ్రీసభ సత్యోపదేశం నం. 328లో చదువుచున్నాం.

దేవదూతలు శుద్ధ ఆధ్యాత్మిక జీవులు కనుక దూతలకు మేధస్సు, సంకల్పం ఉన్నాయి. వాళ్ళు వ్యక్తులు, చిరంజీవులు. కంటికి కనిపించే సృష్టి జలాన్ని మించిన పరిపూర్ణత వాళ్లకుంది. వాళ్ళని ఆవరించి ఉండే తేజస్సే ఇందుకు సాక్ష్యం” అని కతోలిక శ్రీసభ సత్యోపదేశం నం. 329లో చదువుచున్నాం.

శ్రీసభ పండితులు, పునీతులు, జగద్గురువుల బోధనల ప్రకారం,

పునీత మిఖాయేలు దేవుని సైన్యానికి అధిపతి, శ్రీసభ సంరక్షకుడు. 13వ లియో జగద్గురువులు 19వ శతాబ్దంలో భయంకరమైన దుష్టశక్తులు శ్రీసభను నాశనం చేయడాన్ని దృష్టితో చూసిన తరువాత, ‘పునీత మిఖాయేలు ప్రార్ధన’ను రచించి, ప్రతీ దివ్యబలి పూజ తరువాత, ప్రార్ధించేలా ఆదేశించారు. పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, సాతానుకు వ్యతిరేకంగా మిఖాయేలు పోరాటం నేటికీ కొనసాగుతుందనీ నొక్కి చెప్పారు. వాటికన్ గార్డెనులో, పునీత మిఖాయేలు స్వరూపాన్ని ప్రతిష్టించిన సందర్భంగా (2013), పోప్ ఫ్రాన్సిస్ ఇలా అన్నారు, “అతిదూత మిఖాయేలు దైవిక న్యాయాన్ని తిరిగి నెలకొల్పడానికి పోరాడుతాడు; ఆయన దేవుని ప్రజలను వారి శత్రువుల నుండి, ముఖ్యంగా శత్రువులకల్లా ముఖ్య శత్రువు అయిన సాతాను నుండి రక్షిస్తాడు. పునీత మిఖాయేలు విజయం సాధిస్తాడు, ఎందుకంటే అతని ద్వారా పనిచేసేది స్వయంగా దేవుడే.

పునీత గాబ్రియేలు దేవుని శక్తిని, బలాన్ని సూచిస్తాడు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన సందేశాలను తీసుకువచ్చాడు. ఈవిధంగా, దేవుని రక్షణ ప్రణాళికలో అత్యంత ప్రధాన పాత్రను పోషించాడు.

పునీత రఫాయేలు స్వస్థపరచేవాడు, మార్గదర్శకుడు. రఫాయేలు దేవుని స్వస్థతను సూచిస్తాడు. యోహాను సువార్తలో ప్రస్తావించబడిన బెతెస్దా కోనేటిని (యోహాను 5:2-4) స్వస్థత కొరకు కదిలించిన దూత రఫాయేలే అని పునీత అగుస్తీనుగారు నమ్మేవారు. రఫాయేలు కేవలం శారీరక స్వస్థతనే గాక, ఆధ్యాత్మిక స్వస్థతను, ప్రయాణాలలో, జీవితంలోని కష్ట సమయాలలో మార్గదర్శకత్వంను కూడా ఇస్తాడని పునీతులు బోధించారు. తోబీతు గ్రంథంలోని అతని పాత్ర ద్వారా, కుటుంబాలకు, వివాహాలకు రక్షకుడిగా కూడా అతని ప్రార్ధన సహాయాన్ని వేడుకుంటారు.

ఈవిధంగా, కతోలిక శ్రీసభ ఈ ముగ్గురు అతిదూతలను పరలోక యోధులుగా, దైవసందేశకులుగా, స్వస్థపరిచేవారిగా గౌరవిస్తుంది. వారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా, దేవుడు మనకు రక్షణ, మార్గదర్శకత్వం, స్వస్థతను పొందుకుంటామని విశ్వసిస్తుంది.

దూతలు దేవుని నిరంతరంగా మహిమపరచే మరియు ఇతర ప్రాణుల రక్షణ ప్రణాళిక కొరకు సేవచేసే ఆత్మ సంబంధమైన ప్రాణులు. “దూతలు మనందరి మేలు కొరకు కలిసి పనిచేస్తారు” అని పునీత థామస్ అక్వినాస్ గారు బోధించారు. పునీత అగుస్తీను ప్రకారం, దూతలు సృష్టి యొక్క మొదటి రోజున సృష్టించబడ్డారు. దీనిని ఆదికాండము 1:3-4లో చూడవచ్చు. దేవుడు, “వెలుగు కలుగుగాక అని ఆజ్ఞాపించగా, వెంటనే వెలుగు కలిగెను. ఆ వెలుగు కంటికి బాగుగా ఉండెను. దేవుడు చీకటి నుండి వెలుగును వేరు చేసెను. ఆ విధంగా వెలుగును చీకటి నుండి వేరుచేయడం అనేది మంచి మరియు చెడ్డ దూతలకు పెట్టిన పరీక్షగా, వారి విభజనగా పరిగణించబడింది. ఆ సమయంలోనే పునీత మిఖాయేలు, ‘దేవునితో సమానం ఎవరు?’ అనే యుద్ధ నినాదంతో సాతానును, ఇతర దురాత్మలను పరలోకం నుండి వెళ్ళగొట్టాడు.”

అతిదూతల పండుగ మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, “దేవుని దయ, సహాయం మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. మనం ఒంటరిగా పోరాడనవసరం లేదు.” జీవితంలోని ప్రతి క్షణంలోనూ, దూతలు కనిపించకపోయినా, చురుకుగా ఉండి, మార్గనిర్దేశం చేస్తూ, రక్షిస్తూ, దేవుని సంకల్పాన్ని తెలియజేస్తూ ఉంటారు.

“దుష్టశక్తులకు వ్యతిరేకంగా దేవుడు మన పక్షాన పోరాడుతున్నాడు.” ఈ లోకంలో మనకు శోధనలు, చెడు అలవాట్లు, ఆందోళనలు, ఆధ్యాత్మిక పోరాటాలు అనేవి ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే, ఈ పోరాటంలో మనకు దేవుని వైపు నుండి ఒక శక్తివంతమైన సంరక్షకుడు ఉన్నాడని పునీత మిఖాయేలు గుర్తుచేస్తాడు. కనుక, ధైర్యంగా ఉంటూ, చెడు లేదా అన్యాయం మన చుట్టూ ఉన్నప్పుడు, భయపడకుండా దేవుని శక్తిని, మిఖాయేలు రక్షణను వేడుకోవాలి.

“దేవుని సంకల్పం మరియు శుభవార్త మన జీవితాల్లో ప్రకటించబడతాయి.” దేవుడు మన జీవితాలలో కూడా కొన్ని ముఖ్యమైన శుభవార్తలను లేదా ప్రణాళికలను ప్రకటిస్తాడు. అవి మన ఆత్మలో కలిగే ప్రేరణలు కావచ్చు. మన కర్తవ్యం గురించి కలిగే స్పష్టత కావచ్చు. దేవుని పిలుపును వినడానికి, అది కష్టంగా ఉన్నా దానిని నమ్మకంతో అంగీకరించడానికి మనకు ధైర్యం ఇవ్వడానికి గాబ్రియేలు అతిదేవదూత సిద్ధంగా ఉన్నాడు. కనుక, ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నించాలి. మన జీవితంలో దేవుని సంకల్పం గురించి స్పష్టత కోసం గాబ్రియేలును వేడుకోవాలి.

“దేవుడు మన గాయాలను మాన్పి, మన ప్రయాణంలో నడిపిస్తాడు.” మన జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు శారీరక వ్యాధులు, మానసిక గాయాలు, ఆధ్యాత్మిక నష్టాలు సంభవించవచ్చు. దేవుని స్వస్థపరిచే కరుణ మనకు అందుబాటులో ఉందని, ఆయన ఒక నమ్మకమైన స్నేహితుడిలా మనకు సహాయం చేయడానికి, సరైన మార్గంలో నడిపించడానికి పునీత రఫాయేలు సిద్ధంగా ఉన్నాడని గుర్తుచేస్తుంది. కనుక, మన గాయాలు లేదా ఇతరుల బాధల కోసం స్వస్థతను కోరుకోవాలి. జీవితంలో తికమక పడినప్పుడు, సరైన నిర్ణయాల కోసం మార్గదర్శకత్వం కోసం పునీత రఫాయేలును వేడుకోవాలి.

ఈవిధంగా, అతిదూతల పండుగ మనకు బోధించే ముఖ్య సత్యం ఏమిటంటే, పరలోకంలోని దూతల మాదిరిగానే, మనమూ దేవుని పట్ల నమ్మకంతో, విధేయతతో, వినయంతో జీవించాలి. ఎందుకంటే, అతిదూతలు దేవుని సేవకులు మాత్రమే, దేవుడే అంతటికీ మూలం కనుక.

కనుక, నేడు మనం దేవుని దయలో భాగమైన అతిదూతలను మన జీవితంలోకి ఆహ్వానించుదాం. తద్వారా, వారి ప్రత్యేక సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని, రక్షణను పొందవచ్చు. భయం, శోధన లేదా ఆధ్యాత్మిక పోరాటాలను ఎదుర్కొంటున్నప్పుడు, రక్షణ యోధుడైన మిఖాయేలును ఆహ్వానించుదాం! జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు, దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, సందేశకుడైన గాబ్రియేలును ఆహ్వానించుదాం! శారీరక లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, సరైన జీవిత భాగస్వామి లేదా స్నేహితుని కోసం వెతుకుచున్నప్పుడు, స్వస్థపరిచేవాడు, మార్గదర్శకుడైన రఫాయేలును ఆహ్వానించుదాం!

ఈ ముగ్గురు అతిదూతల యొక్క ప్రత్యేక సహాయాన్ని కోరుతూ, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకుందాం. మన ప్రార్థనలో వారిని ఎంత తరచుగా గుర్తు చేసుకుంటే, దేవుని ద్వారా వారు మనకు అంత దగ్గరగా ఉంటారు.

ఈ అతిదూతలు మీ ఆత్మకు, శరీరానికి, మీ దైనందిన జీవితానికి రక్షణ, మార్గదర్శకత్వం, స్వస్థతను తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను!

అస్సీసిపుర ఫ్రాన్సిస్ పంచగాయాలు (17 సెప్టెంబరు)

 అస్సీసిపుర ఫ్రాన్సిస్ పంచగాయాలు - 800 సం.ల వార్షికోత్సవము

అక్టోబరు 4న, విశ్వశ్రీసభ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉంటుంది. సెప్టెంబరు 17న ఫ్రాన్సిస్ వారి పంచగాయాల పండుగను కొనియాడుతుంది. ఈ పండుగను 5వ పౌలు జగద్గురువులు ఆమోదించారు. అయితే, 2024 ప్రత్యేకత ఏమిటంటే, ఫ్రాన్సిస్ పంచగాయాలు పొంది 800 సం.లు (17.09.1224-17.09.2024) పూర్తియైన సందర్భముగా, శ్రీసభ, ముఖ్యముగా, ఫ్రాన్సిస్కన్ సహోదరీ, సహోదరులు వార్షికోత్సవాన్ని కొనియాడుచున్నారు. 3 అక్టోబర్‌ 1226లో ఫ్రాన్సిస్ స్వర్గస్తులైనారు. ఈ సందర్భముగా, జనరల్ మినిస్టర్ బ్రదర్ ఎలియాస్, “నేను మీకొక సంతోషకర, నూతన అద్భుతాన్ని ప్రకటిస్తున్నాను. దైవకుమారుడైన క్రీస్తులో తప్ప ఆరంభమునుండి వినబడని సూచన. అతని మరణానికి కొంతకాలం ముందుగా, మన సోదరుడు, తండ్రియునైన ఫ్రాన్సిస్ తన శరీరములో పంచగాయాలను పొంది, సిలువ వేయబడిన క్రీస్తును పోలినట్లుగా కనిపించారు” అని ఫ్రాన్సిస్ మరణ వార్తను ప్రకటిస్తూ లేఖను విడుదల చేసాడు. అయితే, ఫ్రాన్సిస్ పంచగాయాలను మరణావస్థలో పొందినవి కావు. తన మరణానికి రెండు సంవత్సరాలకు ముందుగా, 17 సెప్టెంబరు 1224న క్రీస్తు పవిత్ర పంచగాయాలను పొందియున్నాడు. క్రైస్తవ చరిత్రలోనే ఇదొక మరుపురాని మైలురాయి. ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. క్రీస్తు శ్రమలతో పునీతుని లోతైన ఐఖ్యతకు అద్భుత చిహ్నం. అతని పవిత్రతకు, అంకితభావానికి గొప్ప సూచన. దైవచిత్తానికి సంపూర్ణముగా తలొగ్గడం. క్రీస్తు ప్రేమపట్ల అమితాసక్తి కలిగియుండటం. సిలువలో కొట్టబడిన క్రీస్తుపట్ల, ఆయన శ్రమలపట్లనున్న ఫ్రాన్సిస్ భక్తికి ఇది పరాకాష్ట! పేదరికము, వినయము, దాతృత్వము పట్ల ఫ్రాన్సిస్ నిబద్ధతకు ఇదొక అద్భుత సాక్ష్యము.

 ఇటలీ దేశములోని ‘లవర్నా’ పర్వతమునకు ఫ్రాన్సిస్‌, మరో ఇరువురు సహోదరులతో వెళ్ళాడు. వారిలో బ్రదర్ లియో ఒకరు. ఆగష్టు 15 మరియ మోక్షారోపణ పండుగ తరువాత, ఫ్రాన్సిస్ ‘లవర్నా’ పర్వతమునకు వెళ్లి అక్కడ 29 ఆగష్టు అతిదూతయగు పునీత మిఖయేలు పండుగ వరకు ఉపవాస ప్రార్ధనలో గడపడం ఆనవాయితీ!

1224వ సం.లో, ‘లవర్నా’ ‘పర్వత శిఖరముపై, ఫ్రాన్సిస్ ఏకాంతముగా, తీవ్రమైన ఆధ్యాత్మిక చింతనతో ఉపవాస ప్రార్ధనలు చేయు సమయములో, ఆరు మండుతున్న రెక్కలతోగల సెరాఫీము దేవదూత స్వర్గమునుండి దిగిరాగా, రెక్కల మధ్యన, సిలువపై సిలువవేయబడిన క్రీస్తును ఫ్రాన్సిస్ గాంచాడు. ఆ దృశ్యములో, క్రీస్తు దయగల చూపు ఫ్రాన్సిసును సంతోషముతో నింపగా, యేసు సిలువ వేయబడటం అతనిని దు:ఖముతో నింపినది. ఇది క్రైస్తవ ప్రేమ పారడాక్స్ను వ్యక్తపరుస్తుంది. అలా సిలువ వేయబడిన క్రీస్తు దర్శనములో మమేకమై యుండగా, అకస్మాత్తుగా తన శరీరముపై క్రీస్తు పంచగాయాలు పొందియున్నాడు’. ‘క్రీస్తు దర్శనాన్ని చూసి ఫ్రాన్సిస్ సంతసించాడు. అతని ఆత్మ వేదనతో కూడిన ఆనందాన్ని అనుభవించింది. గతములో ఎన్నడూ వినని, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన క్రీస్తు పవిత్ర పంచగాయలతో అలంకరించబడిన నూతన వ్యక్తిగా ఫ్రాన్సిస్ ‘లవర్నా’ పర్వతము దిగివచ్చాడు’ అని థామస్ సెలానొ (1229) మరియు పునీత బొనవెంతుర (ఫ్రాన్సిస్ జీవిత చరిత్ర, 13వ శతాబ్దం మధ్యకాలం) వివరించారు. సెరాఫీము దేవదూతల గురించి యెషయ 6:2-3లో చదువుతాం. “మండుతున్న రెక్కలు” క్రీస్తు ఫ్రాన్సిసుకు తెలియబరచిన ప్రజ్వరిల్లే దైవప్రేమను సూచిస్తుంది. అందుకే, “ఫ్రాన్సిస్ హృదయం ఉత్సాహముతో ప్రజ్వరిల్లినది. అతని శరీరం సిలువ వేయబడిన క్రీస్తు రూపాన్ని కలిగి యున్నది మరియు దైవీక ముద్రతో సీలు చేయబడినది” (అల్బాన్ బట్లర్, “పునేత అస్సీసిపుర ఫ్రాన్సిస్ జీవితము”).

ఫ్రాన్సిస్‌ తన చేతులు, కాళ్ళు, ప్రక్కటెముకలో గాయాలను పొందినట్లుగా స్పష్టముగా వర్ణించారు. ఈ పంచగాయాలు రెండు సంవత్సరాల పాటు, అనగా తన మరణము వరకు ముద్రించబడి యున్నాయి. తాను పొందిన పంచగాయాలను వీలైనంత వరకు ఎవరి కంటబడకుండా గుప్తముగా యుంచేవాడు. ఇది అతని వినయాన్ని, ఆయన జీవించిన పేదరికాన్ని తెలియజేయు చున్నది. ఒక హతసాక్షి మరణాన్ని పొందకున్నాను, ఈవిధముగానైనా క్రీస్తు శ్రమలలో పాల్గొన్నందుకు ఫ్రాన్సిస్ సంతోషపడ్డాడు. పంచగాయాలు భౌతికమైన సంకేతాలు మాత్రమేగాక, లోతైన ఆధ్యాత్మిక సంకేతాలు. ఫ్రాన్సిస్ క్రీస్తు శ్రమలతో పోల్చుకొనుటను, క్రీస్తు వినయమును, త్యాగమును అవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ దైవదర్శనం కేవలం ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే గాక, ఫ్రాన్సిసుకు క్రీస్తు ప్రేమాభిమానాలతో, సంకల్పముతోనున్న ఐఖ్యతకు, మమేకతకు గొప్ప నిదర్శనం!

గ్రీకు భాషలో, “స్తిగ్మాట” (Stigmata) అన్న పదానికి ‘సిలువ వేయబడిన క్రీస్తు గాయాలను పోలియుండే శరీరముపై పొందు గుర్తులు’ అని అర్ధం. ‘పంచగాయాల’ గురించి బైబులులో వివరించబడనప్పటికినీ, క్రీస్తు బాధలలో భాగస్థులమవడం అనే భావన నూతన నిబంధనలోని ఫిలిప్పీ 3:10; గలతీ 2:20లో చూడవచ్చు. “నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించియున్నాను” (గలతీ 6:17) అని పునీత పౌలుగారు తన లేఖలో వ్రాసారు. క్రైస్తవ చరిత్రలో రికార్డ్ చేయబడిన, పంచగాయాలను పొందిన ప్రధమ వ్యక్తి, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారే! పౌలుగారు చెప్పినట్లుగా, ఫ్రాన్సిస్ పంచగాయాలు క్రీస్తు శ్రమలతో నొకటిగా గావింప బడ్డాయి. గలతీ 2:20, “ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు”. ఫ్రాన్సిస్ పంచగాయాలు, తాను క్రీస్తుకు సంపూర్ణముగా చెందినవాడని తెలియజేయు చున్నాయి. అందుకే ఫ్రాన్సిస్ “అపర క్రీస్తుగా’, “మరో క్రీస్తుగా” పిలువ బడుచున్నాడు.

‘క్రీస్తు శ్రమల, మరణ గాయాలు, మానవాళిపై దైవప్రేమకు చిహ్నాలు. క్రీస్తు పంచగాయాలను కొంతమంది క్రైస్తవ విశ్వాసులు [పునీతులు] పొందడం, మనపై, మన రక్షణకోసమై, క్రీస్తు ప్రేమతో తన శరీరములో అనుభవించిన బాధను గుర్తుచేస్తుంది’.

పంచగాయాలపట్ల కొంత సందేహం, ప్రశ్నలు ఉండటం సాధారణమే! చరిత్రలో పంచగాయాల గురించి వివిధరకాలైన వివరణలను ఇచ్చారు. ఎన్నో సందేహాల నివృత్తి తర్వాతనే, విశ్వవ్యాప్తముగా ఆమోదించ బడినవి. ఏదేమైనప్పటికినీ, ఫ్రాన్సిస్ విషయములో, సందేహాలతో సంబంధము లేకుండా, అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి, క్రీస్తుతో ఐఖ్యతకు గొప్ప నిదర్శనము, సాక్షిగా నిలిచింది.

‘ఫ్రాన్సిస్ పంచగాయాల అష్టశతాబ్ది వేడుకల’ను కొనియాడు వేళ, ఫ్రాన్సిస్ జీవితం, ఆధ్యాత్మికత మరియు బోధనల గురించి తెలుసుకుందాం, ధ్యానిద్దాం! క్రీస్తు ప్రక్కనుండి ప్రవహించు ప్రేమ బలముతో, క్షమాపణ, స్వస్థత, సంతోషం, సౌభాతృత్వంతో జీవించుదాం. కేవలం సిలువచెంత మాత్రమే సువార్తను పూర్తిగా అర్ధంచేసుకోగలము. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫ్రాన్సిస్ పంచగాయాలు ప్రేమలోనున్న శక్తికి నిదర్శనం. కనుక ద్వేషముతోనున్న లోకం ప్రేమతో నింపబడాలి.

ఫ్రాన్సిస్ సువార్త వెలుగులో జీవించిన గొప్ప పునీతుడు. ఆయన జీవించిన ‘పేదరికం ఎవరూ జీవించి యుండరు. పేదవారిపట్ల ప్రేమ, సేవాభావముతో జీవించాడు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనో, అప్పుడే దేవున్ని పరిపూర్ణంగా ప్రేమించగలనని నమ్మాడు. ప్రేమ, కరుణగల దేవుని మంచితనమును అలవర్చుకున్నాడు. పవిత్రాత్మచేత ప్రేరేపింప బడినాడు. ధాతృత్వమును జీవితాంతం ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి. తప్పుచేసిన తన సహోదరులను సరిచేయుటకు ఎన్నడు వెనకాడలేదు. “ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదు, దేవున్ని సేవించడం ఇకనైనా ఆరంభిద్దాం” అని తన మరణావస్థలో తోటి సహోదరులతో పలికిన గొప్ప పునీతుడు. దేవుని సృష్టిపట్లముఖ్యంగా మూగజీవులపట్ల సోదరభావాన్ని వ్యక్తపరచిన చిరస్మరణీయుడు.

ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ.1182లో జన్మించారు. తండ్రి పీటర్‌ బెర్నార్డ్‌, తల్లి పీకా. తండ్రి బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్‌ చలాకీగా, కలుపుగోలు తనముతో వ్యాపారంలో తండ్రికి సహాయం చేసేవాడు. కాని, విందు, వినోదాలకు ఖర్చుచేసేవాడు. యుక్తవయస్సులో గొప్ప యోధుడవ్వాలని కళలు కన్నాడు. యుద్ధాలలో పాల్గొన్నాడు. పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డాడు. చెరనుండి విడుదల అయిన కొద్దిరోజులకే తీవ్రజబ్బున పడ్డాడు. కోలుకున్నాక, ఆపూలియా వెళ్ళు త్రోవలో ప్రభువు స్వరాన్ని విన్నాడు: “ఫ్రాన్సిస్‌, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగలవు? యజమానుడినా, సేవకుడినా? ‘యజమానుడిని’ అని ఫ్రాన్సిస్‌ సమాధానం. “నీవు యాజమానుడినిగాక, సేవకుడిని సేవిస్తున్నావు” అని ఆస్వరం పలికింది. అప్పుడు ఫ్రాన్సిస్‌, ‘అయితే, నన్నేమి చేయమంటారు? అని ప్రశ్నించాడు. “నీవు తిరిగి అస్సీసికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని ఆ స్వరం పలికింది. ఫ్రాన్సిస్‌ తిరిగి అస్సీసికి వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్‌ సువార్త ధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు దానం చేసాడు. రోము నగరములోని పునీత పేతురు సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకురోగులకుముఖ్యంగా కుష్ఠరోగులకు సేవలు చేసాడు.

 ఫ్రాన్సిస్‌ దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్తవయస్సులో, చిలిపిగా, విచ్చలవిడిగా జీవించినప్పటికిని, మార్పు, మారుమనస్సు అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాల్లో దేవుని వాక్యం, ప్రేమపై ధ్యానించాడు, ప్రార్ధించాడు. ‘దమియాను’ దేవాలయంలో సిలువపై వ్రేలాడు క్రీస్తు ఫ్రాన్సిస్‌ హృదిని, మదిని తొలిచింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే! అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టాడు. ఇలా దైవచిత్తాన్ని అన్వేషించాడు.

తన జీవితాన్ని చూసి కొందమంది ఆయన సహోదరులుగా, అనుచరులుగా చేరారు. 1209లో 3వ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మల రక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకు, భిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతినిచ్చారు. 1219 నాటికే ఫ్రాన్సిస్‌ సోదర బృందం ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిస్‌ స్థాపించిన సభ ఎంతగానో అభివృద్ధి చెంది, నేడు ప్రపంచమంతట సేవలను అందిస్తున్నది.

“యేసు సిలువ లోకానికి, మానవ చరిత్రకు కేంద్రం. ఒకవైపు సిలువ మానవ క్రూరత్వానికి సంకేతం. గందరగోళ పరిస్థితిలో జీవనదాతనే మనిషి సిలువ వేసాడు. మరోవైపు సిలువ, ఏ హింస, తిరస్కరణ ఆపలేని దేవుని స్వేచ్చకు, అనంత ప్రేమకు సంకేతం. ఫ్రాన్సిస్ తన జీవితములో దైవప్రేమను అనుభవించాడు. దాని సాక్ష్యమే అతను పొందిన పంచగాయాలు. ఈవిధముగా, దైవప్రేమకు, స్వేచ్చకు ఫ్రాన్సిస్ మరో సంకేతముగా, రుజువుగా, జ్ఞాపికగా మారాడు.

క్రీస్తు పంచగాయాలు – నూతన జీవితం

స్వస్థత: యేసు గాయాలు మనకు స్వస్థతను చేకూర్చును. మన గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును నయం చేస్తాయి. క్రీస్తు పంచగాయాలు మన బలానికి, విశ్వాసానికి మూలం. శాంతిని పొందుటలో మనక తోడ్పడగలవు. యెషయ 53:5 (చదువుము).

దేవుని బహిర్గత: యేసు గాయాలు దేవుని శక్తిని, ప్రేమను, దయను వెల్లడి చేస్తాయి. మనము, శ్రమల నొందునపుడు, యేసు తన గాయాలను తాకమని, దేవుని శక్తిని అనుభవించమని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు.

విశ్వాసం: మన గాయాలు, యేసు గాయాలను తాకినప్పుడు లేదా కలిసినప్పుడు, మనలో నూతన విశ్వాసం జనిస్తుంది.

దివ్యసంస్కారాలు: శ్రీసభ దివ్యసంస్కారాలు, గాయపడిన క్రీస్తు ప్రక్కనుండి ప్రవహిస్తాయి. క్రీస్తు ప్రక్కనుండి నీరు, రక్తము ప్రవహించాయి.

జీవదాయక కృప: క్రీస్తు గాయాలు, జీవదాయకమైన కృపను ఒసగును.

పునీత జోజప్పగారి పండుగ (మార్చి 19)

పునీత జోజప్పగారి పండుగ (మార్చి 19)

2సమూ7:4-5, 12-14, 16; రోమీ 4:13, 16-18, 22; మత్త 1:16, 18-21, 24



కన్య మరియ సంరక్షక భర్త
బాల యేసుకు సాకుడు తండ్రి
విశ్వ శ్రీసభ పాలకపోషకుడు
కార్మిక వర్గ పాలక పునీతుడు
పునీత జోజప్పగారు!

ఉపోద్ఘాతము: ‘యోసేపు’ లేదా ‘జోజప్ప’ అనగా ‘కలుపుకొను’ లేదా ‘దేవుడు సమృద్ది చేయును’ అని అర్ధం. యోసేపు కన్యమరియమ్మకు జ్ఞానభర్త, యేసుకు సాకుడు తండ్రి. ఇంత గొప్ప వ్యక్తి పండుగను మార్చి 19న కొనియాడు చున్నాము. యోసేపు గురించి బైబులులో చాలా తక్కువగా వ్రాయబడటం వలన, మనం ఆయన గురించి చాలా తక్కువ శ్రద్ధను చూపుతూ ఉంటాము. ఆయనపట్ల భక్తిని పెంపొందించుట చాలా అరుదు! పవిత్ర కుటుంబములో మరచిపోబడినవారు! యోసేపు, మరియలను మనం ఎప్పుడు కూడా ఒక జంటగా గుర్తించాలి.

1962వ సం.లోనే 23వ జాన్ జగద్గురువులు, రోమీయ క్రమములో (ప్రస్తుత ప్రధమ కృతజ్ఞతార్చన ప్రార్ధన) యోసేపు నామమును చేర్చడం గమనార్హం! నేడు ఇతర కృతజ్ఞతార్చన ప్రార్ధనలలో కూడా పునీత జోజప్పగారిని స్మరించుకుంటున్నాము. యోసేపు మరియభర్త కనుక, యేసునకు తండ్రి!

బాలయేసు దేవాలయములో తప్పిపోయినప్పుడు, మరియ యేసుతో, “నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి” (లూకా 2:48) అని చెప్పినది. “యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుటకు” (లూకా 2:52) యోసేపు కృషి ఎనలేనిది!

యూదసంప్రదాయములో ఐదు సం.లు నిండిన పిల్లలు, తండ్రుల ప్రత్యేకమైన సంరక్షణలో ఉండేవారు. యోసేపు యూదమత విశ్వాసాన్ని, బోధనలను యేసుకు బోధించాడనడములో ఎంతమాత్రము అతిశయోక్తి లేదు! యోసేపు తన కుటుంబాన్ని దేవుని మార్గములో నడిపించాడు. యేసుకు ప్రాయము వచ్చినప్పుడు, యోసేపే యేసును యూద ప్రార్ధనా మందిరమునకు (సినగోగు) పరిచయం చేసియుంటాడు. యోసేపు వండ్రంగి, కనుక వండ్రంగి పని నైపుణ్యాలను కూడా యేసునకు నేర్పియుంటాడు. “మీలో ఏ తండ్రియైన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా” (లూకా 11:11-12) అని చెప్పినప్పుడు యోసేపు ప్రేమ, ఆప్యాయతలు యేసు మదిలో మెదిలి ఉంటాయి! “తప్పిపోయిన కుమారుడు” (లూకా 15) ఉపమానం చెప్పినప్పుడు, యోసేపు తండ్రి ప్రేమను యేసు గుర్తుకు చేసుకొని యుంటారు!

పండగ ఆవిర్భావం-యోసేపుపట్ల గౌరవం: యోసేపునకు సంబంధించిన పండుగ ఐదవ శతాబ్దములో ‘కోప్టిక్ దైవార్చన కాలెండరు’లో మొదటిసారిగా ప్రస్తావించ బడినది. 8 వందల సంవత్సరములలో మొదటిసారిగా ఫ్రెంచ్ కాలెండరులో కనిపిస్తుంది. అనేక శతాబ్దాలుగా యోసేపునకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. 16వ శతాబ్ధములోనే అతని ఆరాధనకు అధికారిక ప్రోత్సాహం ఇవ్వబడినది. ఆధునిక కాలములో అత్యంత ప్రజాదరణ పొందిన పునీతులలో యోసేపు ఒకరు.

మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవమును 9వ భక్తినాధ జగద్గురువులు 1847లో ప్రారంభించారు. క్రీ.శ. 1869-70లో జరిగిన ప్రధమ వాటికన్ మహాసభలో, 9వ భక్తినాధ జగద్గురువులు పునీత యోసేపుగారిని “విశ్వశ్రీసభ పాలక పోషకుడు”గా ప్రకటించారు. అలాగే, శ్రీసభ “ఆస్తిపాస్తులకు సంరక్షకులు”గా ప్రకటించారు. క్రీ.శ. 1955లో 12వ భక్తినాధ జగద్గురువులు యోసేపుగారిని “కార్మికుల పాలకుడు”గా గౌరవించారు. మంచి మరణాన్ని కోరుకునే వారందరూ పునీత యోసేపుగారిని ప్రత్యేకంగా ప్రార్ధిస్తారు. 1989వ సంవత్సరములో రెండవ జాన్ పౌలు జగద్గురువు యోసేపు “రక్షకుని సంరక్షుకుడు” అని గౌరవించారు.

“యోసేపుద్వారా మరియ వద్దకు, మరియద్వారా, పవిత్రతకు ఊటయైన యేసు వద్దకు మనం నడిపించ బడుచున్నాము” అని 15వ బెనెడిక్ట్ జగద్గురువులు యోసేపు పట్ల భక్తిని వెల్లడించారు.

“కొంతమంది పునీతులు వాళ్ళ ప్రత్యేక కార్యసాధకతతో కొన్ని అవసరాల్లో మాత్రమే వారి సహకారాన్ని మనకందిస్తారు. కాని, మన పవిత్ర పాలకులైన యోసేపు ప్రతీ అవసరంలోను, ప్రతీ పనిలోను, ప్రతీ సందర్భములోను మనకు సహాయం చేసే శక్తి కలిగియున్నారు” అని పునీత థామస్‌ అక్వినాస్‌ కొనియాడారు.

“పునీత యోసేపుగారిని అడిగినదంతా నేను ఎన్నడూ పొందకుండా లేను. దీనిని నమ్మనివారు పరీక్షించుకోవచ్చును. ఆ పరమపితా పితృని గౌరవించుట ఎంతో మేలని తెలుసుకొందురు” అని పునీత తెరేసమ్మ వెల్లడి చేసారు.

యోసేపు జ్ఞానభర్త, సాకుడు తండ్రి: యోసేపు బెత్లేహేములో జన్మించారు. యోసేపుకు చాలా పెద్దవయస్సు ఉన్నప్పుడు కన్యమరియతో ప్రధానం జరిగిందని తెలుస్తుంది. అప్పటికి మరియ వయస్సు 14 సంవత్సరములు ఉండవచ్చు. గాబ్రియేలు దేవదూత శుభవర్తమానాన్ని మరియమ్మగారికి అందించక మునుపే ఈ నిశ్చితార్ధం జరిగింది.

“దేవుడు యోసేపును కన్య మరియకు జీవిత భాగస్వామిగా ఒసగాడు. మరియకు తోడుగా, ఆమె కన్యత్వమునకు సాక్షిగా, ఆమె గౌరవానికి సంరక్షకునిగా నిలిచాడు” అని 13వ సింహరాయ జగద్గురువులు పేర్కొన్నారు.

యేసుక్రీస్తు సువార్త ప్రచారం ఆరంభించక మునుపే, నజరేతు గ్రామంలో క్రీ.శ. 20లో యేసు, మరియ హస్తాలలో తమ వయోభారంతో పరిశుద్దమైన సహజ మరణం పొందారు.

యోసేపు బాధ్యతగల జ్ఞానభర్తగా, మంచి సాకుడు తండ్రిగా అత్యుత్తమ బాధ్యతాయుతముగా, లోకరక్షకునికే సంరక్షకుడుగా యున్నారని సువార్తలద్వారా గ్రహించ గలుగుతున్నాము. మత్త 1:17 ప్రకారం, యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహామునుండి దావీదు వంశము వరకు యోసేపు ముందు తరాల పేర్లు ఇవ్వబడినవి. అయితే యోసేపు మరియతో వివాహానికి నిశ్చితార్ధం జరిగాక, వారు సంసార పక్షంగా కాపురం చేయకముందే మరియమ్మ గర్భవతి కావడం యోసేపును ఎంతగానో కలచి వేసింది. మరియమ్మను నొప్పింపక, అవమానింపక, రహస్యంగా పరిత్యజించి మెల్లగా తప్పుకోవాలనే ప్రయత్నం చేసినట్లు మత్త 1:19లో చెప్పబడినది. ఇక్కడ యోసేపు గంభీర వ్యక్తిత్వం, ఘర్షణ ధోరణిలేని సాధుత్వం, పుట్టుకతో వచ్చిన సహజమైన పాపభీతి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పిమ్మట ప్రభువు దూత మాటప్రకారం, మారుమాటలాడక మరియను చేర్చుకున్నారు. ఇక్కడే వారు తమ బాధ్యత, విధేయత, పరిశుద్దతకు పూర్తిగా లోబడి దైవాజ్ఞలను తు.చ. తప్పక పాటించారు. ఇదే వారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత.

మనుష్యావతారమెత్తిన యేసుక్రీస్తుకు, మరియమాతకు సంరక్షకుడుగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా యోసేపు గురించి సువార్తలు వెల్లడిస్తున్నాయి. కాని, యోసేపు మాత్రం సువార్తల్లో ఎక్కడా ఒకమాటైనా మాట్లాడినట్లు లేదు. వారి ప్రవర్తన, చేసే పనిని నిర్వర్తించడంబట్టి దైవాదేశానుసారముగా జీవించాడని ఖచ్చితముగా చెప్పవచ్చు. గొప్ప విశ్వాసం, విరక్తత్వం, విధేయత, శ్రమైక జీవితం, బాధ్యతా పాలన, వివేకం, వివేచనం, మితవ్యయం, మితభాషిత్వం, తననుతాను తగ్గించుకొనడం, దయ, దానధర్మగుణం, ఆపదలోనున్న వారిని ఆదుకోవడం, నిగర్వం, నిశ్చలత, నిరాడంబరత్వం ఇలా మంచి గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న మహా మనిషి పునీత జోజప్పగారు!

యోసేపు సుగుణాలు

నీతిమంతుడు: సువార్తలలో జోజప్పగారు న్యాయవర్తనుడు, నీతిమంతుడు అని అర్ధమగుచున్నది.
పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, శ్రీసభకు రాసిన లేఖలో (రెడెంప్తోరిస్ కుస్తోస్ 1989), పునీత యోసేపుగూర్చి, “లోక సర్వేశ్వరునికి సంరక్షకుడు అంటే అతడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, సాధుశీలుడు, వినమ్ర హృదయుడు. నిర్మలత్వం, నిష్కపటత్వము మొదలైన సుగుణాలతో కూడిన వ్యక్తిత్వం కలవారు” అని ప్రశంసించారు.

వాస్తవానికి జోజప్పగారు నీతిమంతుడు, ప్రార్ధనాపరుడు, విశ్వాసములో జీవించేవాడు. మత్త 1:19లో, యోసేపు “నీతిమంతుడు”

అని చదువు చున్నాము. యోసేపు “నీతిమంతుడు” అని పిలవటం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి.

యూదుల సంప్రదాయాలలో వివాహానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. వివాహానికి కొద్ది నెలల ముందు యూదులు దేవుని, కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థాన్ని కొనియాడేవారు. ఈ నిశ్చితార్థం పూర్తయిన కొన్ని నెలల తర్వాత వివాహాన్ని ఆచరించేవారు. లూకా 1:7 ప్రకారం, యోసేపునకు మరియతల్లి ప్రధానము చేయబడింది. ఇక వీరిరువురుకూడా కొన్ని రోజులలో పరిశుద్ధ వివాహాన్ని చేసుకొని కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో, పవిత్రాత్మ ప్రభావం వలన మరియతల్లి గర్భం దాల్చారు. ఇది దైవ ప్రణాళిక! మోషే ధర్మశాస్త్రం ప్రకారం, వివాహం కాకముందు స్త్రీ గర్భం ధరిస్తే అది పాపం. శిక్షలుకూడా చాలా కఠినంగా ఉంటాయి. ద్వితీ. 22:20-21 ప్రకారం, అలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని చెబుతుంది.

యోసేపు స్థానంలో మరొక మానవమాత్రుడు ఉన్నట్లయితే, ఖచ్చితంగా మరియతల్లిని తీసుకొని వెళ్లి న్యాయంకోసం పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల చేతికి అప్పగించేవాడు. కాని యోసేపు ఆ పని చేయలేదు. సమాజంలో నిలబెట్టి బహిరంగంగా అవమానింప ఇష్టంలేక మరియతల్లిని మౌనంగా, రహస్యంగా విడిచి పెట్టాలనుకున్నారు (మత్త 1:19). ఎందుకన, ఆయన నీతిమంతుడు. దేవదూత స్వప్నంలో కనిపించి ఇది దైవకార్యం, మరియను విడిచి పెట్టవద్దు, ఆమెను స్వీకరించు అని చెప్పినప్పుడు, దేవుని ప్రణాళికను అర్థంచేసుకొని యోసేపు మరియతల్లికి అన్ని వేళలా తోడుగా ఉన్నారు.

నేడు కొన్ని కుటుంబాలను చూసినట్లయితే భార్య/భర్తమీద లేనిపోని అనుమాన పడేవారు, చిన్నచిన్న మనస్పర్ధలకు విడాకులు తీసుకొని కుటుంబాలను చేజేతులారా నాశనం చేసుకునేవారు కోకొల్లలు! అట్టివారు ఓసారి యోసేపుగారిని స్మరించుకుంటే మంచిది. యోసేపు, మరియతల్లి వీరిరువురుకూడా కాపురం చేయకముందే మరియతల్లి గర్భం దాల్చారు. ఆ క్షణంలో మరియమ్మను యోసేపుగారు బహిరంగంగా జనంమధ్య అవమానించ లేదు, దానికి బదులుగా, మౌనంగా రహస్యముగా విడిచి పెట్టాలను కున్నారు. కాని దూతద్వారా ఇది దైవకార్యం, పవిత్రాత్మ ప్రభావం వలన జరిగిన మహత్కార్యం అని తెలుసుకొని మరియతల్లికి అండగా ఉన్నారు. ముఖ్యంగా ప్రసవ సమయంలో యోసేపుగారి మంచి మనసును బట్టి దేవుడు ఆయనను నీతిమంతునిగా సత్కరించారు. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. నీతిమంతుడు అనగా, నీతిగా, న్యాయముగా జీవించేవాడు, సత్ప్రవర్తన కలిగి యుండేవాడు, ధర్మాత్ముడు అని అర్ధం. కనుక ఇదొక గొప్ప సుగుణం.

దైవభక్తిపరుడు: దైవభక్తిగల వారిలో ఐదు సుగుణాలు ఖచ్చితముగా ఉంటాయి:

1. దేవున్ని నమ్ముతారు: అనగా అందరికన్నా, అన్నింటికన్నా దేవునికి ప్రధాన స్థానం ఇవ్వడం. దేవునిపై ఆధారపడి జీవించడం. దేవునికన్న, ఇతర విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. దైవభక్తిగల తండ్రి తన కుమారున్ని దేవుని వైపుకు నడిపిస్తాడు. “యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుచు, దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుట” (లూకా 2:52) యోసేపుగారు చూసారు. కష్టతరమైనవి ఎన్నో యోసేపుగారు చేయగలిగారు, ఎందుకన, ఆయన దేవున్ని నమ్మాడు, విధేయించాడు. దేవునిపై నమ్మకముంచడం అనగా, మన భయాలలో, బలహీనతలలోకూడా ముందుకు వెళ్ళగలము అని విశ్వసించడం.

2. దేవుని వాక్యాన్ని ఎరిగినవారై ఉంటారు: దేవునియొక్క వాక్యమును హృదయమున నిలుపు కొంటాడు (కీర్త 119:11). దైవభక్తిగల భర్త, తండ్రికి దేవునివాక్యం తప్పక తెలిసి యుంటుంది. యోసేపు దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా ఎరిగినవారు.

3. ఎల్లప్పుడూ ప్రార్ధన చేస్తారు: మత్తయి 6:5-15లో, యేసు తన శిష్యులకు ప్రార్ధన చేయడం నేర్పించాడు. దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్ధన చేస్తాడు. యోసేపుగారు దేవుని చిత్తాన్ని అక్షరాల పాటించాడు.

4. బంధాలను నిర్మిస్తారు: ఆపదలలో, కష్టసమయాలలో, కుటుంబాలను నిలబెడతాడు. పునీత జోజప్పగారు అక్షరాల అలాగే చేసారు. తిరుకుటుంబాన్ని నిలబెట్టారు, నిర్మించారు.

5. ఇతరులకు సేవ చేస్తారు: హృదయపూర్వకముగా సేవ చేయుటం. యోసేపు గొప్పతనం ఏమిటంటే, ఆయన మరియతల్లి భర్తగా, యేసుకు తండ్రిగా, రక్షణ ప్రణాళికలో తన సేవను హృదయపూర్వకముగా, సంపూర్ణముగా అందించాడు. ఆయన సేవ త్యాగపూరితమైనది. తిరుకుటుంబానికి తన జీవిత సర్వాన్ని త్యాగం చేసాడు. తన ప్రేమను తన సేవలో పరిపూర్ణం గావించాడు. విశ్వాసముద్వారా నీతిమంతుడు జీవిస్తాడు (రోమీ 1:17).

కష్టజీవి: మత్త 1:1-16 ప్రకారం, యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనందరికీ తెలుసు. యోసేపు ఈ పేరుప్రఖ్యాతులను ఉపయోగించి ఏవైనా చేయవచ్చు. కాని ఆయన తనకు తెలిసిన వడ్రంగి వృత్తినే కుటుంబ పోషణకై ఎంచుకున్నాడు. ఈ వడ్రంగి వృత్తిలోనే మంచి ప్రావీణ్యతను, గుర్తింపును సంపాదించు కున్నాడు (మత్త 13:55). ‘పని చేయడం’ అనేది రక్షణ ప్రణాళికలో భాగస్తులగుటకు ఓ చక్కటి మార్గం. మనకున్న వరాలద్వారా సమాజములో ఇతరుల సేవనిమిత్తమై ఉపయోగించే బాగ్యం లభిస్తుంది. పనిచేయడం దేవుని ప్రణాళికలో భాగం. ఏ పనైనను మానవ గౌరవార్ధమై యుండాలి.

ప్రతి భర్త! ప్రతి తండ్రి! కూడా పునీత జోజిప్ప గారి వలె, కుటుంబ బాధ్యతలను స్వీకరించగలగాలి. కష్టపడి పని చేయగలగాలి. కుటుంబం అంటే బాధ్యత కలిగి ప్రవర్తించడం అని, వీరి నుండి గ్రహించాలి. కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండడం వీరినుండే నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞను, దేవుడు ఏర్పరిచిన బాధ్యతను, ఎటువంటి అవాంతరాలు వచ్చినా, కుటుంబమును విడిచిపెట్టకుండా, నెరవేర్చాలి. క్రీస్తు ప్రభుని సాకుడు తండ్రియైన జోజప్పగారు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవునిచే ఎన్నుకోబడిన మంచి వ్యక్తి. ప్రతి పురుషుడు వీరి వలె, కుటుంబ బాధ్యతలు స్వీకరించి దేవుని అనుసరణలో జీవించడానికి, పిల్లలను క్రమశిక్షణతో, బాధ్యతతో పెంచడానికి, దేవుని అనుసరణలో జీవింపచేయడానికి కష్టపడాలి.

సంరక్షకుడు / ప్రేమగల తండ్రి: తన స్వప్నంలో దేవదూతద్వారా దేవుని ఆదేశాలను స్వీకరించి, హేరోదు రాజుయొక్క దుష్టతలంపులనుండి బాలయేసును కాపాడారు. ఒక గాడిద సహాయముతో తాను నడుస్తూ మరియతల్లిని, బాలయేసును సురక్షిత ప్రాంతానికి చేర్చి శత్రువుల బారినుండి తల్లిని, బిడ్డని కాపాడారు (మత్త 2:13-15). అదేవిధముగా, బాలయేసు 12 ఏళ్ళ ప్రాయంలో యెరుషలేములో తప్పిపోయినప్పుడు తల్లడిల్లిపోయి, మూడు రోజులపాటు నిద్రాహారాలు మానేసి వెతికి వెతికి చివరికి దేవాలయంలో కనుగొన్నారు. అన్ని వేళలా క్రీస్తుకు తోడుగా ఉన్నారు. యోసేపు నిజమైన తండ్రి, నిజమైన సంరక్షకుడు. మరియతల్లి, యేసు కొరకు ఆయన సర్వం ప్రేమతో, ఆప్యాయముతో చేసాడు. అలాగే బాలయేసుకు సర్వం చేసారు. ప్రతీ క్షణం వెన్నంటి ఉన్నారు.

ప్రార్థనాపరుడు: యోసేపు మంచి ప్రార్థనాపరుడు. మోషే ధర్మశాస్త్రాన్ని, పది ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించాడు. దేవుని ఆదేశానుసారం ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి దేవదూత ముందుగా సూచించినట్లు ఆ బిడ్డకు ‘యేసు’ అని పేరు పెట్టారు (లూకా 2:21). మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించి, పాటించి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడియున్నట్లు బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించారు (లూకా 2:22-24). సాధారణంగా కలలను ఎవరూ పట్టించుకోరు. కాని యోసేపు మాత్రం తన స్వప్నంలో దేవునిద్వారా దూత మోసుకొచ్చిన ప్రతి సందేశాన్ని త్రికరణశుద్ధిగా ఆలకించి, పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు (మత్త 1:19-24; 2:13-15; 2:19-23). యోసేపు నోరుతెరిచి మాట్లాడిన ఒక్క సందర్భంకూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఆయన దేవునిపట్ల ప్రేమను, తన విశ్వాసాన్ని మాటల్లోగాక, తన చేతల్లో నిరూపించారు.

మంచి మరణం: పునీత యోసేపు దేవుని పిలుపును అందుకున్నాడు. మరియతల్లికి భర్తగా, దైవకుమారునికి తండ్రిగా పిలుపును అందుకున్నాడు. తన పిలుపును సంపూర్ణ విశ్వసనీయతతో పరిపూర్తి చేసాడు. ఆతరువాత దేవుడు యోసేపును తన సన్నిధిలోనికి పిలచుకున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, క్రీస్తు, మరియతల్లి సన్నిధిలో, ఒడిలో భాగ్యమైన మరణాన్ని పొందారు. తిరుసభ పాలకుడిగా, మంచి మరణాన్ని ప్రసాదించు పునీతుడిగా వినతికెక్కారు.

ముగింపు: యేసు, మరియ, యోసేపులు తిరుకుటుంబము! లోకరక్షణార్ధమై దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసారు. రక్షణ చరిత్రలో వారు ఒకటిగా నిలిచారు. ముగ్గురుకూడా విడదీయలేనటువంటి వారు. దేవుని ప్రణాళికలో, వారి వ్యక్తిగత గుర్తింపులు ఒకరితోనొకరికి సంబంధాన్ని కలిగియున్నాయి. కనుక, వారి ముగ్గురిని విడివిడిగా చూడక, ఎప్పుడు ఒకటిగానే చూడాలి, ఒకటిగానే అర్ధంచేసుకోవాలి! యోసేపును ఎప్పటికీ మరువరాదు! ఆయన మరియ యేసులకు ఏమిచేసాడో, మనకూ, విశ్వశ్రీసభకూ చేయగలడు!

యోసేపు దేవుని చిత్తానికి పరిపూర్ణముగా తలొగ్గాడు. దైవపిలుపుకు, బాధ్యతకు, త్యాగానికి ప్రతిస్పదించి, దైవప్రణాళికకు సహకరించాడు. తన జీవిత సర్వాన్ని దేవుని చేతులో అప్పజెప్పాడు. అతను ఎందుకు మౌనముగా ఉన్నాడంటే, దేవుని మాటను ఎక్కువగా ఆలకించాడు గనుక! ఎప్పడూ వాదించలేదు; వెనకడుగు వేయలేదు; అభ్యంతరం చెప్పలేదు; వివరణలు అడగలేదు; దేవుని ఆజ్ఞలను ఎప్పుడూ ప్రశ్నించలేదు, దేనిని నిలువరించలేదు. దేవుని ప్రణాళికను మౌనముగా, శాంతియుతముగా నేరవేర్చడములోనే గర్వపడ్డాడు. మౌనములోనే, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

యోసేపు మౌనజీవిత సందేశం – ఇష్టపూర్వక విధేయత, సేవ! సంకల్పం, సేవయే యోసేపు జీవిత రహస్యం. ఇదే మనకు ఆయన జీవిత సందేశం!

పునీత జోజప్ప గారి ప్రార్థనా సహాయమును, తప్పనిసరిగా మన అందరికీ దయచేయమని, ఈ పండుగ రోజున మనమందరమూ వారికి ప్రార్థించుకుందాం. వారి ఆశీస్సులను పొందుకుందాం. వారిలో ఉన్న, నీతిని మనమూ అలవరచుకొని, దేవుని ఆదేశమును అనుసరించే విధముగా మనమూ ఆ విధముగా దేవుని బోధన ఆలకించి జీవించుదాం.

అందరికీ, మరియ భర్తయగు పునీత జోజప్పగారి పండుగ శుభాకాంక్షలు!

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్

 పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)


ఉపోద్ఘాతం:
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ 12వ శతాబ్దంలో జీవించిన గొప్పపునీతుడుమహనీయుడు. ఆయన జీవించిన ‘పేదరికం’, ఎవరూ జీవించి యుండరు. పేదవారిపట్ల ప్రేమ, స్నేహ, సేవా భావముతో జీవించాడు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనో 

, అప్పుడే దేవున్ని పరిపూర్ణముగా ప్రేమించగలనని గ్రహించాడు. ప్రేమ, కరుణ స్వరూపియైన దేవుని మంచితనమును ఫ్రాన్సిస్‌ అలవర్చుకున్నాడు. పవిత్రాత్మచేత ప్రేరేపింప బడ్డాడు. తన ధాతృత్వ సుగుణాన్ని, జీవితాంతం ఆచరణలో పెట్టిన గొప్పవ్యక్తి. “ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదు, దేవున్ని సేవించడం ఇప్పటికైనా మొదలు పెడదాం” అని తన మరణావస్థలో తన సహోదరులతో పలికిన గొప్పపునీతుడు ఫ్రాన్సిస్‌. దేవుని సృష్టిపట్ల, ముఖ్యంగా మూగజీవులపట్ల ప్రత్యేకమైన ఆకర్షణని, ప్రేమని, సోదరభావాన్ని వ్యక్తపరచిన చిరస్మరణీయుడు.

కుటుంబ నేపధ్యం: ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ. 1182వ సం.లో జన్మించాడు. జ్ఞానస్నానం పేరు యోహాను. తరువాత ఫ్రాన్సిసుగా పిలువబడ్డాడు. తండ్రి పీటర్‌ బెర్నార్డ్‌తల్లి పీకా. తండ్రి పెద్ద ధనవంతుడైన బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్‌ చలాకీగా, కలుపుగోలు తనముతో వ్యాపారంలో తండ్రికి సహాయం తోడుగా ఉండేవాడు. కాని, ఫ్రాన్సిస్‌, తోటియువతతో కలిసి విందువినోదాలకు అధికంగా డబ్బు ఖర్చుచేసేవాడు, దుబారా చేసేవాడు. ఒకవైపు తండ్రి తన వ్యాపారంలో ఫ్రాన్సిసు గొప్పవారసుడు కావాలని కలలు కనేవాడు.

కాని, మరోవైపు ఫ్రాన్సిసు యుక్తవయస్సులోనే గొప్పయోధుడు కావాలని కలలు కనేవాడు. యుద్ధాలలో పాల్గొన్నాడు. 1202వ సం.లో పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. అయితే అస్సీసి ఓడిపోవడముతో ఖైదీగా పట్టుబడ్డాడు. తన కల చెదరిపోయింది. చెరసాలలోకూడా అందరితో కలవిడిగా తిరుగాడుచూ చతురోక్తులతో నవ్వించేవాడు. ఒక సంవత్సరం తరువాత, చెరసాలనుండి విడుదలయ్యాడు. కాని, కొద్దిరోజులకే తీవ్రజబ్బు బారిన పడ్డాడు. ఈ సమయంలోనే తనలో ఎంతో మార్పు కలిగింది. తన జీవితములోనికి తొంగి చూడటం ప్రారంభించాడు.

దైవపిలుపు: అయినను, మరల 1205వ సం.లో, పోపు సైన్యముతో కలిసి యుద్ధము చేయుటకు బయలుదేరాడు. ఆపూలియా వెళ్ళుత్రోవలో, “ఫ్రాన్సిస్‌, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగోరుచున్నావు? యజమానుడినా లేదా సేవకుడినా? అని ఒక స్వరాన్ని విన్నాడు. ‘యజమానుడిని’ అని ఫ్రాన్సిస్‌ సమాధానం చెప్పాడు. మళ్ళీ ఆ స్వరం, “కాని, నీవు యాజమానుడినిగాక, సేవకుడిని సేవిస్తున్నావు” అని పలికింది. అప్పుడు ఫ్రాన్సిస్‌, “అయితే, నన్నేమి చేయమంటారు?” అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ స్వరం, “నీవు తిరిగి అస్సీసి నగరానికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని చెప్పింది.

ఫ్రాన్సిస్‌ తిరిగి అస్సీసికి వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్‌ సువార్తధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు దానంచేసాడు. ఆస్తినంతా త్యజించి, స్వచ్చంధ పేదరికంలో, క్రీస్తుకు నిజమైన శిష్యునిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. దైవపిలుపును అర్ధంచేసుకోవడం మొదలుపెట్టాడు. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి, ప్రార్ధన చేయడం ప్రారంభించాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాడు.

          ఈ అన్వేషణలో ఉండగానే, ఫ్రాన్సిసువారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన మరో అద్భుతమైన, మరపురాని సంఘటన జరిగింది. ఒకరోజు ఫ్రాన్సిస్ తన గుర్రముపై వెళ్ళుచుండగా, ఒక కుష్ఠురోగి ఎదురు పడ్డాడు. యుద్ధానికి వెళ్ళకముందు ఫ్రాన్సిస్ కుష్ఠురోగులను చూసి అసహ్యించుకునేవాడు. వారినుండి దూరముగా తప్పించుకునేవాడు. కాని ఈసారి, ఫ్రాన్సిస్ కుష్ఠురోగి దగ్గరకు వెళ్లి కౌగలించుకొని ముద్దుపెట్టు కున్నాడు. కుష్ఠురోగిని ముద్దాడి, అతనికి సహాయం చేసిన తరువాత, గుర్రముపై తిరిగి వెళ్ళేటప్పుడు, వెనుదిరగగా, అక్కడ ఆ కుష్ఠురోగి కనిపించలేదు. చుట్టూచూడగా అతని జాడ ఎక్కడా కనిపించలేదు. ఆ సమయములో తనను సందర్శించినది స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే అని ఫ్రాన్సిస్ గ్రహించాడు. ఈ సంఘటన తన జీవితములో మరువలేని తీయనైన అనుభూతిగా ఫ్రాన్సిస్ వర్ణించాడు. లోకబంధకములనుండి తనను విముక్తిగావించిన అద్భుతమైన సంఘటనగా వర్ణించాడు.

అయితే, ఖచ్చితమైన దైవపిలుపును 14 మే 1208 సం.లో, పునీత మత్తయిగారి పండుగ రోజున అర్ధంచేసుకున్నాడు. ఆనాటి సువార్తా, “క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం” ఫ్రాన్సిస్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తను అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టుటకు బయలు దేరాడు.

రోమునగరములోని పునీత పేతురుగారి సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠురోగులకు సేవలు చేయాలని తీర్మానించుకున్నాడు. ఈవిధముగా, తన జీవితాన్ని, సేవకు (సంఘంనుండి వెలివేయబడినవారికి, పేదవారికి, కుష్ఠురోగులకు) అంకితం చేసుకున్నాడు. అస్సీసి పట్టణ ఆవల జీవిస్తూ ప్రార్ధించాడు, బోధించాడు, రోగులకు సేవచేసాడు. కుష్ఠురోగుల సేవద్వారా తనలో ఆధ్యాత్మిక చింతన పెరిగింది, తన మిషన్‌, తన ప్రేషితసేవను, దేవునిచిత్తాన్ని తెలుసుకోగలిగాడు. కుష్టురోగులను ఆలింగనం చేసుకోవడంద్వారా, సర్వమానవాళిని గౌరవించాలి, రక్షించాలి అని తెలుసుకున్నాడు. సకలసృష్టితో సహోదరభావమును పెంపొందించు కోవడంకూడా నెమ్మదిగా తెలుసుకోగలిగాడు.

అలాగే, సువార్తను జీవించడం మరియు దానిని ప్రకటించడం, బోధించడం ప్రారంభించాడు. దేవునియొక్క ప్రేమను, కరుణను ఇతరులతో పంచుకోవడం ప్రారంభించాడు. సాన్ దమియానో దేవాలయములో సిలువలోని యేసుప్రతిమ ముందు ప్రార్ధించు చుండగా, యేసు కళ్ళు తెరచి, ఫ్రాన్సిసుతో, “వెళ్లి నా దేవాలయాన్ని పునర్నిర్మించు” అని చెప్పడం తన ప్రేషితకార్యానికి మూలమైనది. ఆరంభములో పాడుబడిన దేవాలయాలను పునర్నిర్మించిన ఫ్రాన్సిస్ అతిత్వరలోనే శ్రీసభ పునరుద్ధరణకు దోహద పడ్డాడు. 

ఫ్రాన్సిసు సభ: త్వరలోనే అస్సీసిలో అనేకమంది మన్ననలను పొందాడు. తన పేద, ఆధ్యాత్మిక జీవితాన్నిచూసి ఎంతోమంది ఆయనను అనుసరించారు. ఈవిధంగా, చిన్నసహోదరబృందం ఏర్పడింది. ఫ్రాన్సిస్‌ తన స్వచ్చంధ పేదరికం, సహోదరభావం, సంఫీుభావంద్వారా, లోకాన్నే మార్చివేసాడు.

తన జీవితాన్నిచూసి కొందమంది ఆయన సహోదరులుగాఅనుచరులుగా చేరారు. 1209వ సం.లో, మూడవ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మల రక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకుభిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతిని ఇచ్చారు. 1219 నాటికి ఫ్రాన్సిస్‌ అనుచరుల సంఖ్య ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిసువారు స్థాపించిన మఠవాస సభ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఫ్రాన్సిస్‌వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎంతోమంది తమ జీవితాలను అంకితం చేసుకొని, ఫ్రాన్సిసువారి బాటలో నడుస్తూ, సేవామార్గంలో జీవిస్తూ, స్వచ్చంధ పేదరికాన్ని జీవిస్తూ, ప్రపంచమంతటా వారు తమ సేవలను అందిస్తున్నారు. ఫ్రాన్సిస్‌ అనుచరుడనగా ‘స్వచ్చంధ పేదరికం’లో జీవించడం అనగా, సోదరునిగా జీవించడం, మానవగౌరవాన్ని పెంపొందిచడం.

దైవచిత్తాన్వేషి: ఈనాటి మానవుడు ‘కోరికలు’ అనే వలయంలో చిక్కుకున్నాడు. కోరికలు తీరనప్పుడు నిరుత్సాహపడి పోతున్నాడు. సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక పోతున్నాడు. దేవునివాక్యం, దేవునికార్యంపై ధ్యానంచేసిఆయన చిత్తాన్ని అన్వేషించుటకు మానవునికి సమయం, ఆసక్తి లేకుండా పోయింది. దైవచిత్తాన్ని వెదకుటలో, తెలుసుకోవడంలో, ఆచరించడంలోనున్న ఆనందాన్ని, సంతోషాన్ని నేటి మానవుడు గ్రహించలేక పోతున్నాడు.

ఫ్రాన్సిస్‌ దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్తవయస్సులో, చిలిపిగా యువతకు నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికిని, మార్పు, మారుమనస్సు అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి దేవుని వాక్యంపై, దేవుని ప్రేమపై ధ్యానించడం, ప్రార్ధించడం ప్రారంభించాడు. దమియాను దేవాలయంలోని సిలువలో వ్రేలాడు క్రీస్తుప్రతిమ ఫ్రాన్సిస్‌ హృదిని, మదిని తొలచింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే! ఈవిధముగా, తన జీవితములో జరిగిన ప్రతీ సంఘటననుండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాడు.

ప్రకృతి ప్రేమికుడు: ఫ్రాన్సిస్‌ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిద్వారా దేవుని మహిమను పొగడేవాడు. ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమనుగౌరవాన్ని పెంచుకున్నాడు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసాడు. సమస్తమును తన సహోదరీసహోదరులుగా పిలిచాడు. సూర్యుడు ఆయన సోదరుడు, చంద్రుడు ఆయన సోదరి. ఆకాశములోని పక్షులకు, నీటిలోని చేపలకు ప్రవచనాలను బోధించాడు. భయంకరమైన తోడేలుకు ఉపదేశం చేసి దానిని సాధుజంతువుగా మార్చాడు. ప్రకృతిపట్ల, ఫ్రాన్సిసువారికున్న ప్రేమవలన, ఈ తరమువారుకూడా ప్రకృతిపట్ల ప్రేమను, దాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకొనేట్టు ప్రేరేపింపబడాలని ఆశిద్దాం.

శాంతిదాత: ఫ్రాన్సిసువారు తన జీవితముద్వారా ఈ లోకాన్నే మార్చేసారు. క్రూసేడుల కాలములో, శాంతిని నెలకొల్పుటకు మధ్యవర్తిగా ఫ్రాన్సిస్ ధైర్యముగా ఈజిప్టుకు వెళ్లి అక్కడి సుల్తానును కలిసాడు. యుద్ధాన్ని ఆపాలని కోరాడు. ఈ సంఘటన సకల మానవాళిపట్ల ఫ్రాన్సిసువారికున్న ప్రేమ, కరుణను తెలియజేస్తుంది. ఫ్రాన్సిస్ వారు ప్రపంచ శాంతిదూత అని చెప్పడానికి ఆయన చేసే శాంతి ప్రార్ధనయే గొప్పనిదర్శనం.

ప్రభువా! నీ శాంతి సాధనముగా నన్ను మలచుకొనుమయా!
ద్వేషమున్నచోట, ప్రేమను వెదజల్లనీయుము
గాయమున్నచోట క్షమాపణను చూపనీయుము
అవిశ్వాసమున్నచోట విశ్వాసమును నింపనీయుము
నిరాశయున్నచోట ఆశను పెంచనీయుము
అంధ:కారమున్నచోట జ్యోతిని వెలిగింప నీయుము
విచారము నిండినచోట సంతోషమును పంచనీయుము
ఓ దివ్యనాధా!
పరుల ఓదార్పును వెదకుట కంటె, పరులను ఓదార్చు వరము నీయుము
పరులు నన్ను అర్ధము చేసుకొన గోరుట కంటె, పరులను అర్ధముచేసుకొను గుణము నీయుము
పరులు నన్ను ప్రేమించాలని కోరుట కంటె, పరులను ప్రేమింప శక్తినీయుము
ఎందుకన,
యిచ్చుట ద్వారా పొందగలము
క్షమించుట ద్వారా క్షమింప బడగలము
మరణించుట ద్వారా నిత్యజీవము పొందగలము

క్రిస్మస్: పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ దివ్యబాలయేసుపట్ల ప్రత్యేకమైన భక్తిని కలిగియున్నాడు. 1223వ సం.లో క్రిస్మస్‌ జాగరణ సందర్భంగా పశువుల పాకను ఏర్పాటు చేసి క్రీస్తుజనన సన్నివేశాన్ని సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిసుగారు. అస్సీసి పట్టణమునకు దగ్గరిలోనున్న గ్రేచియా అనే గుహలో క్రీస్తుజన్మను ఒక ప్రత్యేక అనుకరణములో ఫ్రాన్సిస్‌ పున:సృష్టించాడు. ఈసందర్భంగా అచ్చట దివ్యపూజాబలిలో పాల్గొనాలని, తాను స్వయంగా ఏర్పరచిన పశువులపాకలోని క్రీస్తుజనన సన్నివేశాన్ని దర్శించాలని అచ్చటి పట్టణ ప్రజలను ఆహ్వానించియున్నాడు.

సిలువపట్ల ఆరాధన: ఫ్రాన్సిసువారు యేసు పవిత్ర సిలువను ఎంతగానో ఆరాధించేవారు, గౌరవించేవారు. ఎక్కడ దేవాలయము కనబడిన, వెంటనే మొకాళ్ళూని సిలువను ఆరాధించేవారు. ఆయన ఈవిధముగా ప్రార్ధించేవారు, “ఓ యేసుక్రీస్తువా, ఇక్కడ ఈ దేవాలయమునందును, ప్రపంచములోని ప్రతీ దేవాలయమునందును, ప్రతీ దివ్యమందసమునందునుగల మిమ్ము మేము ఆరాధించుచున్నాము. మిమ్ము స్తుతించుచున్నాము. ఎందుకన, మీ పవిత్ర సిలువద్వారా మీరు ఈ లోకమును రక్షించితిరి.” అందుకేనేమో, యేసు పవిత్ర సిలువ మహోత్సవమునాడే, 14 సెప్టెంబర్‌ 1224వ సం.లో, అల్వెర్నా అనే కొండప్రాంతములో ప్రార్ధన చేయుచుండగా క్రీస్తు పంచగాయాలను తన శరీరముపై పొందాడు.

ముగింపు: సువార్తను అక్షరాల జీవించి, క్రీస్తువలె, క్రీస్తునుపోలి జీవించడానికి ప్రయత్నం చేసిన గొప్ప పునీతుడు ఫ్రాన్సిస్. అందుకే చరిత్రకారులు ఫ్రాన్సిసువారిని ‘మరోక్రీస్తు’ అని పిలిచారు. సంపూర్ణముగా దేవునిపై ఆధారపడి జీవించాడు. అస్సీసిపుర ఫ్రాన్సిసుగారు, 3 అక్టోబర్‌ 1226వ సం.లో స్వర్గస్తులైనారు. మరణించిన రెండేళ్లకే, అనగా 1228వ సం.లో తొమ్మిదవ గ్రెగోరి పోపుగారు, ఫ్రాన్సిసువారిని పునీతునిగా ప్రకటించారు. పునీత ఫ్రాన్సుసువారు ఇటలీ దేశానికి పాలకపునీతుడు.

అలాగే, 1979 నవంబరు 29వ తేదీన రెండవ జాన్ పౌల్ జగద్గురువులు, పునీత అస్సీసి ఫ్రాన్సిసు వారిని పర్యావరణమునకు, వాతావరణ సంరక్షణ, జీవజాల సమగ్రతను కాపాడుటకు కృషిసలుపు వారందరికి పాలక పునీతునిగా ప్రకటించి యున్నారు.

జీవితము ఒసగే సుఖసంపదలను ఒడిసి పట్టుకోవాలని పరుగులు తీస్తున్నప్పుడు, ఫ్రాన్సిస్ క్రిందికి తోయబడ్డాడు. వివిధ రూపాలలో తాను క్రీస్తును కలుసుకొనుట ద్వారా, ఆత్మప్రేరేపితుడై జీవితములో ఏది విలువైనదో, ఏది శాశ్వతమైనదో తెలుసుకున్నాడు. సేవకుడినిగాక, యజమానిని సేవించడం మొదలుపెట్టాడు. సువార్తయే తన నియమాళిగా చేసుకొని జీవించాడు. క్రీస్తులేకుండా ధనవంతునిగా ఉండుట కంటె, క్రీస్తు కొరకు పేదవానిగా ఉండుటకు ఫ్రాన్సిస్ ఇష్టపడ్డాడు.

“క్రైస్తవమతం ఒసగిన వారిలో ఫ్రాన్సిస్ గౌరవ ప్రదమైన వ్యక్తులలో ఒకనిగా నిలిచిపోతాడు. సర్వాన్ని పరిత్యజించి వైరాగ్య జీవితాన్ని జీవించాడు. కుష్ఠురోగులకు సేవలు చేసాడు” అని నెహ్రూజీ ఫ్రాన్సిస్ వారి గురించి చెప్పారు. “ప్రపంచములోని ఏకైక నిజాయితీగల ప్రజాస్వామ్యవాది మరియు మానవతావాది, ప్రధమ హీరో, ధీరుడు, నాయకుడు ఫ్రాన్సిస్” అని జీ.కే. చెస్టర్టన్ రాసాడు. “ప్రపంచములోనే గొప్ప జ్ఞాని ఫ్రాన్సిసుగారు” అని గాంధీజీ ప్రశంసించారు.

మొదటిగా ఫ్రాన్సిస్ తన ఆత్మను చక్కదిద్దుకున్నారు, ఆతరువాత దేవాలయము, అటుపిమ్మట ప్రపంచము! ఫ్రాన్సిసు వారివలె దేవుని కలలను నిజం చేద్దాం. శాంతి, ప్రేమ, నీతి, న్యాయం కలిగిన ప్రపంచం కోసం మనం కలలు కందాం. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనవంతు కృషి చేద్దాం.