Showing posts with label Daily Reflections II. Show all posts
Showing posts with label Daily Reflections II. Show all posts

యేసు పర్యటన - స్త్రీల అనుసరణ (లూకా 8:1-3)

యేసు పర్యటన - స్త్రీల అనుసరణ (లూకా 8:1-3) 

లూకా సువార్త 8:1-3లో, సువార్తీకుడు లూకా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. కొంతమంది స్త్రీలు తమ వ్యక్తిగత వనరులను ఉపయోగించి యేసు మరియు ఆయన 12 మంది అపోస్తలుల అవసరాలను తీర్చారు. యేసు పట్టణాలలోనూ, గ్రామాలలోనూ పర్యటిస్తూ దైవరాజ్య సువార్తను బోధిస్తున్నప్పుడు, ఈ స్త్రీలు ఆయనతో కలిసి ప్రయాణించారు. వారి పేర్లను కూడా లూకా ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. ఇది యేసు పరిచర్యలో స్త్రీలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషించారో స్పష్టంగా చూపిస్తుంది. వారు కేవలం అనుచరులు మాత్రమే కాకుండా, ఆర్థికంగా, ఆచరణాత్మకంగా తోడ్పడిన సహచరులు. ఇది ఆనాటి సాంఘిక కట్టుబాట్లను బద్దలుకొట్టిన ఒక విప్లవాత్మకమైన చర్య!

యేసు తన పరిచర్యలో స్త్రీలకు ఒక గౌరవప్రదమైన, కీలకమైన స్థానాన్ని ఇచ్చారు. మగ్దలేన మరియమ్మ, యోహానమ్మ, మరియు సుజానమ్మ వంటివారు తమ ధనాన్ని, వస్తువులను యేసు మరియు అపొస్తలుల కోసం పంచిపెట్టారు. ఈ చర్య కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, క్రీస్తుపై వారి లోతైన విశ్వాసానికి, నిబద్ధతకు నిదర్శనం. ఈ స్త్రీలు కేవలం అనుచరులు కాదని, దైవరాజ్య స్థాపనలో చురుకైన భాగస్వాములని ఇది రుజువు చేస్తుంది.

వారు తమ సొంత వనరుల నుండి యేసు పరిచర్యకు సహాయం చేశారని స్పష్టంగా చెప్పబడింది. ఇది క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుచేస్తుంది: దేవుడు మనకు ప్రసాదించిన ప్రతిదాన్ని—అది ధనమైనా, సమయమైనా, లేదా మన ప్రతిభైనా—ఆయన సేవ కోసం, మన తోటివారి కోసం ఉపయోగించాలి. యేసు, అపోస్తలుల అవసరాలను తీర్చడం ద్వారా, వారు నిజమైన ప్రేమను, స్వీయత్యాగాన్ని ప్రదర్శించారు.

దైవరాజ్యంలో పురుషులు, స్త్రీలు ఇద్దరికీ సమానమైన ప్రాముఖ్యత ఉంది. ఈ స్త్రీలు అపొస్తలుల వలె యేసుతో కలిసి ప్రయాణించారు, ఆయన బోధనలు విన్నారు, ఆయన పరిచర్యలో సహాయం చేశారు. ఇది శిష్యరికంలో లింగభేదం లేదని, విశ్వాసంలో అందరూ దేవుని కృపను సమానంగా పొందుతారని మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. యేసు పునరుత్థానానికి మొదటి సాక్షిగా మగ్దలేన మరియమ్మ మారడం ఈ సమానత్వానికి మరో గొప్ప ఉదాహరణ.

ఈ వచనం మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తుంది: నా జీవితంలో నేను దేవుని సేవకు ఎలా తోడ్పడుతున్నాను? మనలో ప్రతి ఒక్కరికీ దేవుని సేవలో పాలుపంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది. అది చిన్నదైనా, పెద్దదైనా, మన సమర్పణను దేవుడు ఆనందంగా స్వీకరిస్తాడు. లూకా 8:1-3 ప్రతి విశ్వాసికి, ముఖ్యంగా స్త్రీలకు, దేవుని రాజ్యంలో వారి గౌరవప్రదమైన, కీలకమైన పాత్ర గురించి ఒక శక్తివంతమైన జ్ఞానోదయం.

పసిబిడ్డలు - పరలోక రాజ్యము (మత్తయి 18:1-4)

పసిబిడ్డలు - పరలోక రాజ్యము (మత్తయి 18:1-4)

శిష్యులు యేసు వద్దకు వచ్చి, “పరలోక రాజ్యమున అందరి కంటె గొప్పవాడు ఎవడు?” అని ప్రశ్నించారు. యేసు కాలములో, రబ్బయిలు, వారి అనుచరుల మధ్యన హోదా, గొప్పతనం గురించిన చర్చలు సాధారణం. యూద సంస్కృతిలో, గొప్పతనం లేదా హోదా తరుచుగా, సామాజిక స్థితి, మతపరమైన జ్ఞానం, చట్టానికి కట్టుబడి యుండటం వంటిపై ఆధారపడి ఉంటుంది. ఒకానొక సమయములో, శిష్యులు ఎప్పుడుకూడా భూలోకములో, మరియు పరలోకములో వారి హోదా, అధికారము, ఉన్నత స్థానము గురించి ఆలోచించారు, ఆందోళన చెందారు. జెబదాయి కుమారుల తల్లి, తన కుమారులతో (యోహాను, యాకోబు) యేసు వద్దకు వచ్చి, “నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ యెడమ వైపున కూర్చుండ సెలవిమ్ము” అని మనవి చేయడం. “తక్కిన పదగురు శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి” (మత్త 20:20-28; మార్కు 10:35-45). “తమలో గొప్పవాడెవ్వడు అని వాదించు కొనిరి” (మార్కు 9:33-37). కదరాత్రి భోజన సమయములో కూడా “తమలో ఎవరు గొప్పవాడు అను వివాదము శిష్యులలో తల ఎత్తెను” (లూకా 22:24).

దేవుని దృష్టిలో నిజమైన ‘గొప్పతనం’ ఏమిటో వారు గ్రహించలేక పోయారు! ‘గొప్పతనం’ గురించి ఈ లోకం తీరులో ఆలోచించారు. యేసు జీవించిన కాలం, సమాజములో, చిన్న బిడ్డలకు సామాజిక హోదాగాని, ప్రాముఖ్యతగాని ఉండేది కాదు. ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలపడం, యేసు చిన్న బిడ్డల గొప్పతనాన్ని సవాలు చేస్తున్నాడు! ‘వినయం’ లేదా ‘వినమ్రత’ అనే సుగుణము యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పుచున్నాడు. పరలోకములో ప్రవేశించాలంటే, ‘పరివర్తన’ చెంది చిన్న బిడ్డలవలె రూపొందాలని తెలియ జేశారు. చిన్న బిడ్డలవలె రూపొందడం అనగా హృదయ పరివర్తన చెందడం. బిడ్డలవలె అమాయకత్వం, వినయం, దేవునిపై ఆధారపడే సుగుణాలను కలిగి యుండటం.

సందేశం: ఆధ్యాత్మిక జీవితములో, దేవునితో సహవాస సంబంధ ప్రయాణములో వినయము, నమ్మకము, సరళమైన జీవితము ముఖ్యమని యేసు బోధిస్తున్నాడు. మొదటిగా, వినయం చాలా కీలకం. దేవుని రాజ్యములో ‘గొప్పతనం’ అనగా హోదా, జ్ఞానం, శక్తి కావు. ‘రక్షణ’ను హోదా, జ్ఞానం, శక్తిద్వారా పొందలేము. వినయము కలిగి జీవించడం. ‘చిన్న బిడ్డలవలె’ మన స్వశక్తిపైగాక, దేవునిపై ఆధారపడి జీవించడం. ‘గొప్పతనం అనగా నిస్వార్ధము, సేవ, నిగర్వము అని యేసు పునర్నిర్వచించాడు. “అందరిలో చివరివాడై, అందరకు సేవకుడిగా ఉండవలయును” (మార్కు 9:35). పరలోకములో ప్రవేశించాలంటే, ‘పరివర్తన’ తప్పనిసరి. ‘చిన్న బిడ్డలవలె రూపొందిననే తప్ప’ అనగా పరలోక రాజ్యమున ప్రవేశించాలంటే ఈ ‘పరివర్తన’ ఐచ్చికం (ఆప్షనల్) కాదు, కాని తప్పనిసరి అని అర్ధమగుచున్నది. ఇది మన జీవితాలను, దేవునిముందు సరళత, చిత్తశుద్ధి కలిగి యుండునట్లు చేస్తుంది. గర్వాన్ని, అహంకారాన్ని వీడి దేవునిపై ఆధారపడటం, వినయం కలిగి జీవించడం. దేవుని రాజ్యములో ‘గొప్పతనం’ అధికారము చెలాయించడం కాదు. గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు సేవకుని వలెను ఉండవలయును” (లూకా 22:25-26). మనం కూడా ‘గొప్పతనం’ అనేది హోదా, అధికారం, స్థానం కాదు. వినయం, నిస్వార్ధం, సేవ అని గుర్తించుదాం!

“వినయం” ఇతర సద్గుణాలకు పునాది. కనుక, ఈ సద్గుణం లేని హృదయములో, కపటం తప్ప ఏ యితర సద్గుణం ఉండదు” (పునీత అగుస్తీను). ‘పరివర్తన’ అనగా అధికారం, హోదాలపై గల ఆశలను వదులుకొని, దేవునిపై సంపూర్ణ నమ్మకము కలిగి, ఆయనపై ఆధారపడి జీవించడం. వినయం నిజమైన గొప్పతనానికి ఉన్నతమైన మార్గం.

‘పరివర్తన’ (18:3) ముఖ్యమైన మార్పును లేదా టర్నింగ్ పాయింటును సూచిస్తుంది. ‘పరివర్తన’ అనగా పాపమును, సాతానును వీడి, దేవుని వైపునకు మరలడం. పశ్చాత్తాపం, విశ్వాసం, మార్పు కలిగి యుండాలి. పూర్వ నిబంధనములో, ‘పరివర్తన’ హీబ్రూ భాషలో “శువ్”, పశ్చాత్తాపాన్ని, వెనకకు తిరిగి రావడాన్ని సూచిస్తుంది. దారి తప్పిన వారు తిరిగి దేవుని చెంతకు రావడం. ఇదే విషయం ప్రవక్తల బోధనలలో కూడా కనిపిస్తుంది (యోవేలు 2:12-13; హోషేయ 6:1). ‘పరివర్తన’ అనగా హృదయ పరివర్తన అని యెహెజ్కెలు 36:26లో చూడవచ్చు. ఇది అంత:ర్గత పునరుద్ధరణ. నూతన నిబంధనములో, ‘పరివర్తన’ అనగా ఆధ్యాత్మిక పునర్జన్మ అని నొక్కి చెప్పాడు. యోహాను 3:3 – “నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలరు”. దీని అర్ధం యోహాను 3:5లో – “నీటివలన, ఆత్మ వలన జన్మించడం”. క్రీస్తును అంగీకరించడం ప్రాధమిక పరివర్తన. అ.కా. 2:38 – “మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలయును.” పశ్చాత్తాపం, పాపమును వీడటం, యేసుక్రీస్తునందు విశ్వాసం పరివర్తనలో ప్రధానం. పరివర్తనకు, హృదయమార్పునకు, బిడ్డలవలె రూపొందడానికి చక్కటి ఉదాహరణ సౌలు పౌలుగా మారడం (పౌలు పరివర్తన). అలాగే, తప్పిపోయిన కుమారుడు (లూకా 15:11-32), త్రోవ తప్పిన గొర్రె (లూకా 15:1-7).

‘పరివర్తన’ అనగా క్రీస్తులో కొత్త జీవితము, నూతన సృష్టి (2 కొరి 5:17). పరివర్తన అనగా క్రీస్తులో నూతన గుర్తింపు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం. ‘పరివర్తన’ అంటే కేవలం అంత:ర్గతమే కాదు. అంత:ర్గత మార్పు, మన జీవితములో, మన మాటలలో, చేతలలో, మన ఆలోచనలలో, వైఖరిలో ప్రతిబింబించాలి. ఎఫెసీ 4:22-32లో “మోసకరమగు దుష్టవాంచలచే భ్రష్టమైన పూర్వజీవితపు పాతస్వభావమును మార్చుకొనుడు. మీ మనస్తత్వమును నూత్నీకరించుకొనుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. అసత్యములు పలుకరాదు. కోపము పాపములోనికి లాగుకొనిపోకుండా చూచుకొనుడు. దొంగతనము మానివేయాలి. అక్కరలోనున్న వారికి సహాయం చేయ మంచి పనులు చేయుచు కష్టపడవలెను. దుర్భాషలు రానీయ కూడదు. వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరపులుగాని, అవమానములుగాని ఉండరాదు. ఏవిధమైన ద్వేష భావము ఉండరాదు. పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. ఒకరిని ఒకరు క్షమింపుడు.”

‘పరివర్తన’ ఒకసారి జరిగేది కాదు. ఇది నిత్యమూ కొనసాగే ప్రక్రియ. ప్రారంభమైన పరివర్తన, ఆధ్యాత్మిక పరిపక్వతలో ఎదుగుదల కొనసాగుతుంది.

‘పరలోక రాజ్యము’ ప్రాపంచిక విలువలకు వ్యతిరేకమైనది. మన వైఖరిని ఆత్మపరిశీలన చేసుకుందాం! వినమ్రత, ప్రేమ, సేవా భావముతో జీవిస్తున్నామా?

13వ సామాన్య గురువారము – రోమునగర శ్రీసభలో మొదటి వేదసాక్షులు (II)

13వ సామాన్య గురువారము – రోమునగర శ్రీసభలో మొదటి వేదసాక్షులు
ఆమో. 7:10-17; మత్త. 9:1-8

ధ్యానాంశము: “తండ్రీ! వారిని క్షమించుము”
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: యేసు వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో, “కుమారా! ధైర్యము వహింపుము. నీ పాపములు పరిహరింపబడినవి” (మత్త. 9:2) అని పలికెను.
ధ్యానము: నేడు ప్రభువు ఒక పక్షవాతరోగిని స్వస్థపరచుచున్నారు. పక్షవాతరోగిని కొంతమంది యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసాన్ని గమనించారు. అందుకు పక్షవాతరోగితో, “కుమారా! ధైర్యము వహింపుము. నీ పాపములు పరిహరింపబడినవి” అని పలికారు. శారీరక స్వస్థత కలగాలంటే, ముందుగా ఆధ్యాత్మిక స్వస్థత కలగాలి అని అర్ధమగుచున్నది. పాపము చేసినప్పుడు, మనం అంత:రంగిక పక్షవాత రోగాన్ని కలిగియున్నవారమే! అయితే, యేసు పాపములను క్షమించుట కొందరు ధర్మశాస్త్రబోధకులు విని, “ఇతడు దైవదూషణము చేయుచున్నాడు” అని తమలోతాము అనుకున్నారు. దేవున్ని అవమానిస్తున్నాడని వారు భావించారు. ఎందుకనగ, దేవుడు మాత్రమే పాపములను క్షమించు అధికారమును కలిగియున్నాడు. మానవ మాత్రులమైన మనము ఇతరుల పాపములను క్షమించే అధికారము లేదు అని వారి నమ్మకం. అయితే, మనం దేవునిచేత మన్నింప బడినాము కనుక ఒకరినొకరము క్షమించుకోవాలి. మనం ఎందుకు క్షమించాలి? ఇతరులను క్షమించినప్పుడు, మనకే ఎక్కువగా మేలు జరుగుతుంది. క్షమించనప్పుడు, బాధ, కోపం, భయం, నిరాశ మనలో బలపడుతుంది. అవి మనకే కీడును తలపెడతాయి. క్షమించుటలో క్రీస్తే మనకు గొప్ప ఆదర్శం. ఆయన ఏ తప్పు చేయకపోయినను మనందరి పాపాల నిమిత్తమై సిలువపై కొట్టబడ్డారు. “తండ్రీ! వారిని క్షమించుము” అని సిలువలో నుండి దేవుని ప్రార్ధించారు.

నేడు రోమునగర శ్రీసభలో మొదటి వేదసాక్షులను స్మరించుకుంటున్నాము. క్రీస్తుకోసం, రక్తతర్పణ చేసిన వేదసాక్షులు. క్రీ.శ. 64లో నీరో చక్రవర్తి కాలములో అమాయకులైన ఎంతోమందిని క్రూరముగా హింసించబడ్డారు. క్రీ.శ. 95లో డొమిషియన్ చక్రవర్తి కాలములో క్రీస్తును విశ్వసిస్తే నేరం అన్నట్లు శాసనం చేసి క్రైస్తవులను పీడించి చంపబడ్డారు. క్రీ.శ. 107లో ట్రాజన్ చక్రవర్తి క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి చంపాడు. క్రీ.శ. 135లో హెడ్రియన్ చక్రవర్తి క్రీ.శ. 180లో ఔరేలియన్ చక్రవర్తి అదే బాటలో నడిచారు. మరల క్రీ.శ. 222లో సెప్తిమన్ సెవెరన్ చక్రవర్తి, క్రీ.శ. 257లో వలేరియన్ చక్రవర్తి, క్రీ.శ. 303లో డియోక్లేషియన్ చక్రవర్తి, క్రైస్తవులను హింసించారు. వీరు చిందించిన ప్రతీ రక్తపు బొట్టు క్రైస్తవ విశ్వాస బీజాలుగా నాటుకున్నాయి.

13వ సామాన్య బుధవారము – పునీత పేతురు, పౌలుల మహోత్సవము (II)

13వ సామాన్య బుధవారము – పునీత పేతురు, పౌలుల మహోత్సవము
అ.కా. 12:1-11; 2 తిమో. 4:6-8, 17-18; మత్త. 16:13-19

ధ్యానాంశము: ఘన అపోస్తలులు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్త. 16:16).
ధ్యానము: పేతురు చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము ఆయన కొరకు పట్టుదలతో దేవుని ప్రార్ధించింది. అప్పుడు దూత అతనిని చెరసాలనుండి (మరణము నుండి) విడిపించెను (అ.కా. 12:1-12). కొన్ని సం.ల తరువాత, రోము నగరములో పేతురు మరల చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము తప్పక అతని కొరకు ప్రార్ధన చేసి యుండవచ్చు. కాని, ఈ సారి అతను తన మరణమును తప్పించు కొనలేక పోయెను. చెరసాల నుండి విముక్తుడైనందుకు పేతురు ‘వీరుడు’ (హీరో) కాలేదు. కాని, తన ప్రాణమును త్యాగము చేసినందులకు, వేదసాక్షి మరణము పొందినందులకు వీరులయ్యారు. పేతురు చెప్పిన విశ్వాస సత్యము అతని జీవితమునే మార్చి వేసింది: “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్త. 16:16). అందుకు ప్రభువు, “యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియ జేసినది పరలోక మందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు (16:17) అని అన్నారు. ‘ధన్యత’ అనగా సంతోషము. ఈ ధన్యతకు/సంతోషమునకు కారణం, యేసు “సజీవుడగు దేవుడు” అని గుర్తించడం. పేతురు తన జీవితములో, తన హృదయములో యేసును సజీవ దేవుడిగా నిలుపుకున్నారు. అందుకే యేసు, “నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింప జాలవు” (16:18) అని అన్నారు.

యేసును దేవునిగా, ప్రభువుగా అంగీకరించిన పౌలు (అ.కా. 9:10-20), క్రీస్తు సువార్త కొరకు తనను తాను సంపూర్ణముగా అర్పించుకొని, క్రీస్తు కొరకు సర్వమును పూర్తి నష్టముగా పరిగణించారు, సమస్తమును విడనాడారు, అన్నింటిని చెత్తగా భావించారు (ఫిలిప్పీ. 3:8). క్రీస్తు సువార్తకు ప్రచారకునిగా మారారు. తన లేఖలద్వారా క్రీస్తు బోధనలను ముఖ్యంగా దేవరహస్యములను, దైరాజ్యమును గూర్చిన పరమ రహస్యములను విశదపరచారు. పౌలు గొప్ప పండితుడు, వేదాంతి, బోధకుడు, కాపరి, నాయకుడు, ‘అపోస్తలుడు’, ఉత్సాహపూరితుడైన మిషనరీ, మార్మికుడు, పునీతుడు, క్రీస్తు సేవకుడు, క్రైస్తవ రచయిత. పౌలు తాను పొందిన ఈ దైవపిలుకు, దైవ ప్రేషిత కార్యానికి కట్టుబడి యున్నారు. ఏ విషయములోను రాజీ పడలేదు. అబద్ధపు బోధకులను ధైర్యముగా ఎదుర్కొన్నారు (గలతీ. 2:4). క్రీ.శ. 49లో జరిగిన యెరూషలేము సమావేశములో తన వాదనలను వినిపించి క్రైస్తవత్వమును యూద మూలాల నుండి స్వతంత్రము గావించుటకు తనవంతు కృషి చేసారు (అ.కా. 15; గలతీ. 2:1-10). నీరో చక్రవర్తి పాలనలోని హింసలలో, క్రీ.శ. 64-68సం.ల మధ్యకాలమున పౌలును విచారణ జరిపించి, మరణ శిక్ష విధించారు. సంప్రదాయం ప్రకారం, పౌలు క్రీ.శ. 67లో వేదసాక్షి మరణం పొందారు.

13వ సామాన్య మంగళవారము – పునీత ఇరేనియ లియోన్సు (II)

13వ సామాన్య మంగళవారము – పునీత ఇరేనియ లియోన్సు
ఆమో. 3:1-8, 4:11-12; మత్త. 8:23-27

ధ్యానాంశము: భయం – విశ్వాసం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు!” అని జనులు ఆశ్చర్యపడిరి (మత్త. 8:27).
ధ్యానము: “ప్రభూ! మేము నశించు చున్నాము, రక్షింపుము” అని శిష్యులు ప్రార్ధింపగా, నిదురించుచున్న యేసు లేచి గాలిని, సముద్రమును గద్ధించగా, వెంటనే ప్రశాంతత చేకూరింది. ముందుగా, “ఓ అల్ప విశ్వాసులారా! మీరు భయపడెదరేల?” అని వారిలోని అవిశ్వాసాన్ని గద్ధించారు. ప్రభువు వారితోనే పడవలో ఉన్నారు, కాని శిష్యులు ప్రభువుతో లేరు. దేవుడు సర్వాంతర్యామి. ఆయన అంతటా ఉంటాడు. అది దైవసాన్నిధ్యం. అయితే, మనం ఆ దేవుని సాన్నిధ్యములో ఉన్నామా అన్నది కూడా చాలా ముఖ్యం. ప్రభువునందు విశ్వాసము లేనప్పుడు, ఉండేది భయమే!

నేడు ‘నిదురించుచున్న’ మన విశ్వాసమును పరిశీలించు కోవాలి. శ్రీసభ అను పడవలో ప్రభువు ఎల్లపుడు మనతోనే ఉన్నారు. కష్టాలలో, అవమానాలలో, సమస్యలు, సంక్షోభాలలో ప్రభువును విశ్వసించాలి. శ్రీసభను ఎప్పటికి నాశనం కానివ్వరు. “నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింప జాలవు” (మత్త. 16:18) అని ప్రభువు చెప్పియున్నారు. ప్రభువు సాన్నిధ్యములో ఉన్నవారికి కూడా కష్టాలు వస్తాయని అర్ధమగుచున్నది. బహుశా, మన విశ్వాసాన్ని బలపరచుటకే! మన ప్రతీ కష్టములో దేవుడు ప్రేమ, ఆప్యాయతతో మనలను గమనిస్తూనే ఉన్నారు. కనుక, మన జీవితములోని అలజడులలో, ప్రభువు తప్పక మనలను తీరం దాటేస్తారని దృఢవిశ్వాసం మనలో ఉండాలి. ఆయన మనకు నిజమైన శాంతిని, ప్రశాంతతను ఒసగును. “శాంతిని మీకు అనుగ్రహించు చున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు. మీ హృదయములను కలవర పడనీయకుడు. భయపడనీయకుడు” (యోహాను. 14:27). ఈ అంత:ర్గత శాంతి నిత్యమైనది. “క్రీస్తు ప్రసాదించెడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయన, ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగ ఉండ పిలువ బడితిరి” (కొలొస్సీ. 3:15)

బిషప్పు, శ్రీసభ పితామహుడు, వేదసాక్షి పునీత ఇరేనియ లియోన్సు (క్రీ.శ. 130-202) గారిని నేడు స్మరించు కుంటున్నాము. వేదహింసలలో ‘రహస్య గురువు’గా పనిచేయడానికి ఫ్రాన్సు దేశమునకు పంపబడినారు. అక్కడే బిషప్పుగా 24సం.లు నిస్వార్ధముగా సేవలు అందించారు. మొట్టమొదటి క్రైస్తవ సత్యోపదేశ సంక్షేపాన్ని సంభాషణల రూపంలో అర్ధమయ్యేలా రాసారు. ‘శాంతి స్థాపకుడు’గా పేరు తెచ్చుకున్నారు.

13వ సామాన్య సోమవారము – పునీత అలెగ్సాండ్రియా సిరిల్ (II)

13వ సామాన్య సోమవారము – పునీత అలెగ్సాండ్రియా సిరిల్
ఆమో. 2:6-10; మత్త. 8:18-22

ధ్యానాంశము: దైవ పిలుపు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: యేసు “నీవు నన్ను వెంబడింపుము. మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకొననిమ్ము” (మత్త. 8:22) అని పలికెను.
ధ్యానము: ధర్మశాస్త్ర బోధకుడు యేసును సమీపించి, “బోధకుడా! నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను” అని అన్నాడు. మొదటి శతాబ్దపు యూదులలో ధర్మశాస్త్ర బోధకుడు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినవాడు, దానిని వివరించేవాడు. ఈ ధర్మశాస్త్ర బోధకుడు యేసు బోధనలను, కార్యాలను కళ్ళారా చూసాడు. తన సర్వాన్ని యేసుకు అంకితం చేసి అనుసరించడానికి సిద్ధపడ్డాడు. నిజమైన శిష్యరికం యేసుకు సంపూర్ణముగా నిబద్ధత కలిగి అనుసరించడం. యేసు ప్రేషిత కార్యములో భాగస్థులు కావడం. యేసు పేదరికములో, శ్రమలలో, పాలుపంచుకోవడం. యేసును మన మాటలద్వారా కాక, చేతలద్వారా అనుసరించాలి. ఇంకొకడు తన తండ్రిని సమాధిని చేసి వస్తాను, అనుమతి ఇవ్వండి అని అన్నాడు. యేసును అనుసరించాలని మనకి ఉంటుంది కాని సంపూర్ణముగా అనుసరించడానికి సిద్ధపడము. మనకు అనుకూలమైన విధముగా ప్రవర్తిస్తూ ఉంటాము. చాలా సందర్భాలలో, యువకుడైన ధనికునివలె ప్రవర్తిస్తూ ఉంటాము. సర్వం దానం చేసి తనను అనుసరింపుమని యేసు కోరినప్పుడు, ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యములో చేరాలని, రక్షణ పొందాలని అనుకుంటాము, కాని పవిత్రులుగా జీవించడానికి సిద్ధపడము. దేవుని రాజ్యములో షరతులకు తావు లేదు. దేవుని పట్ల, సోదరుల పట్ల అనంతమైన ప్రేమ కలిగి జీవించాలి. ఎలాంటి షరతులు లేకుండా ప్రభువును అనుసరించాలి. అన్ని సమయాలలో, పరిస్థితులలో దేవునిపై విశ్వాసము కలిగి జీవించాలి. సంపూర్ణమైన అంకిత భావమును ప్రభువు కోరుచున్నారు.

బిషప్, శ్రీసభ పండితుడు, మతసాక్షి పునీత అలెగ్జాండ్రియ సిరిల్ (క్రీ.శ. 376-444) గారిని నేడు స్మరించుకుంటున్నాము. అతను తప్పుడు బోధనలను, క్రైస్తవ సత్యాలను వక్రీకరించి చెబుతున్న దేవాలయాలన్నింటికి తాళం వేయించారు. మరియ తల్లి ‘దేవుని మాత’ అని బోధించి లోకానికి తెలిసేట్లు చేసారు. అలాగే, త్రిత్వైక సర్వేశ్వరుని పరమరహస్యాన్ని తేటతెల్లం చేసారు. 

12వ సామాన్య శనివారము – నిష్కళంక మాత మహోత్సవము (II)

12వ సామాన్య శనివారము – నిష్కళంక మాత మహోత్సవము
యెషయ 61:9-11; లూకా. 2:41-51

ధ్యానాంశము: నిష్కళంక హృదయం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “తల్లి మరియమ్మ ఆ విషయములన్ని మనస్సున పదిల పరచుకొని ఉండెను” (లూకా 2:51).
ధ్యానము: “సుందరమైన గులాబీ పువ్వు ముండ్ల మొక్క మీద వికసిస్తుంది. తల్లి చెట్టు కంటే మిక్కిలి సుందరమైనది. తల్లి చెట్టులాగా ముళ్ళులేనిది కూడా. అలాగే,  ‘మరియ’ అనే సుందరమైన పుష్పం ఏవ అనబడు ముండ్ల మొక్కమీద వికసించింది. దోషరహితయై ఆ తొలి కన్య పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది (సెడూలియస్ అనే 5వ శతాబ్దపు లాటిన్ కవి). లోకసృష్టికి పూర్వమే దేవుడు మరియను సుతుడైన సర్వేశ్వరునికి తల్లిగాను, పితయైన సర్వేశ్వరునికి ప్రియ కుమార్తెగాను, పవిత్రాత్మ సర్వేశ్వరునికి మిత్రురాలుగాను, పాపములేకుండా అనగా నిష్కళంకగా ఉద్భవింప చేసారు. మరియతల్లి అందరిలాగే ఆదాము సంతానములో జన్మించారు. కాని ఆమెకు జన్మపాపము సోకలేదు. భవిష్యత్తులో జన్మించబోయే క్రీస్తు వరప్రసాదాలద్వారా దేవుడు ముందుగానే మరియతల్లిని జన్మపాపం సోకకుండా పదిలపరిచారు. తనద్వారా ఈ లోకంలో అడుగిడబోయే రక్షకుడైన యేసుక్రీస్తు, లోకానికి ప్రసాదించబోయే రక్షణ ఫలమును దైవానుగ్రహంతో మరియతల్లి ముందుగానే అందుకని జన్మపాప, కర్మపాప దోషమునుండి విడుదల పొందారు. పాపపు కళంకము అంటని పావనమూర్తిగా మరియతల్లి ఈ లోకంలో జన్మించారు. మానవ రక్షణ మహత్కార్యాన్ని దేవుడు మరియతల్లిని జన్మపాపమునుండి విముక్తురాలను చేయడం ద్వారానే ఆరంభించారు. నిష్కళంక మరియతల్లి ద్వారానే పాపపు కళంకితమైన మానవజాతిని శుద్ధికరించి, రక్షణ భారాన్ని ప్రసాదించాలన్నది దేవుని ప్రణాళిక. “హృదయ శుద్ధిగలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు (మత్త. 5:8). సంపూర్ణ హృదయశుద్ధితోనే భగవత్ దర్శనం సాధ్యం. దేవుని వరప్రసాదలను మన జీవితాలలో నింపుకోవాలి అంటే మన హృదయం కూడా మరియతల్లి హృదయంవలె నిష్కళంకముగా ఉండాలి. మరియమాత ప్రేమమూర్తి, దేవునిపట్ల ప్రగాఢమైన ప్రేమగల పుణ్యమూర్తి. ఆ తల్లి అంతరంగంలో జ్వలించే ప్రేమాగ్ని జ్వాలలు పాపపు ఆశలను కూడా దరిచేరనివ్వవు. కనుకనే పాపపు కళంకమెరుగని పావనాత్మురాలుగా జీవించి ధన్యులయ్యారు. ఆమె బిడ్డలమైన మనం కూడా అదే బాటలో నడవాలి అన్నది ఆ తల్లి ప్రగాఢమైన కోరిక.

12వ సామాన్య శుక్రవారము – యేసు తిరు హృదయ పండుగ (II)

12వ సామాన్య శుక్రవారము – యేసు తిరు హృదయ పండుగ
యెహెజ్కె. 34:11-16; రోమీ. 5:5-11; లూకా. 15:3-7

ధ్యానాంశము: తిరుహృదయం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “పశ్చాత్తాపము అవసరము లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల కంటె, హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును” (లూకా. 15:7).
ధ్యానము: ఈ రోజు యేసు తిరు హృదయాన్ని పూజించి, గౌరవిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. యేసు తిరుహృదయాన్ని ధ్యానించడం అంటే, దేవుని ప్రేమను, దయ, కనికరమును ధ్యానించడమే! దేవుడు ప్రేమ. ఈ లోకములో జన్మించిన దేవుని ప్రేమ యేసు క్రీస్తు. దేవుని హృదయాన్ని అనగా దేవుని ప్రేమను, ఆయన దయను యేసు ఈలోకంలో చూపించారు. “ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి వక్ష స్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియ పరచెను” (యోహాను. 1:18). యేసు తిరుహృదయం గురించి యోహాను. 19:34లో స్పష్టంగా చూడవచ్చు: “సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను.” ఇది దేవుని ప్రేమకు గొప్ప నిదర్శనం. క్రీస్తు మన రక్షణ కోసం తననుతాను అర్పించుకున్నారు. ఆయన ప్రేమ, దయ, కనికరము, ఏవిధముగా మనపై కుమ్మరింపబడినదో తెలియుచున్నది. యేసు హృదయం కనికరముగల హృదయం. ‘కనికరము’ అనగా లోతైన, హృదయంతరాలలోని భావము. ఒక తల్లి తన బిడ్డల బాధను అనుభవించగలదు. అలాగే లేక అంతకన్న మిన్నగా దేవుడు మనలను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ ఫలితం జీవము. మనము జీవించునట్లు చేయుచున్నది. ప్రభువు ఎల్లప్పుడూ మనలను ప్రేమతో, కనికరముతో చూస్తూ ఉంటారు. ఆయన హృదయం కనికరమైనది. మనలోని పాపాలను, గాయాలను క్షమిస్తారు. మన పాపాల వలన ఆయన హృదయం గాయపరచబడింది. కాని, మానవ హృదయంతో మనల్ని ప్రేమించారు. మనల్ని రక్షించారు. అందుకే ఆయన హృదయం ప్రేమకు గుర్తుగా, సంకేతంగా నిలిచింది. మనపై దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన మనలను తన పవిత్ర ప్రజలుగా, సొంత ప్రజగా ఎన్నుకొన్నారు. దేవుని కనికరమును పొందాలంటే, ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞ ప్రేమించడం. కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని ఎరిగిన వాడగును. దేవుని ఎవరును, ఎన్నడును చూడలేదు. మనము ఒకరి యెడల ఒకరము ప్రేమ కలవారమైనచో, దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. యేసు తిరుహృదయం మనలను ఈవిధంగా ఆహ్వానిస్తుంది: “భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్ధకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీ రెత్తుకొనుడు. సాధుశీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు” (మత్త. 11:28-29). కనుక, మన హృదయాలను దేవునికి తెరుద్ధాం. తిరుహృదయానికి అంకితం చేద్దాం. దేవునితో, తోటివారితో సఖ్యపడుదాం. వినయ, విధేయతతో తిరుహృదయానికి అంకితం చేసుకున్న యెడల, శాంతి, ఆనందము పొందెదము. అలాగే, మన కుటుంబాలను తిరుహృదయానికి అంకితం చేద్దాం. మన సంపూర్ణ నమ్మకాన్ని ఆయనలో ఉంచుదాం. మనపై ప్రేమాగ్నితో రగిలిపోతున్న తిరు హృదయం మనలను రక్షించును, శాంతి సమాధానము ఒసగును. యేసు తిరుహృదయము మనలను ప్రేమించి, ఆశీర్వదించునుగాక!

12వ సామాన్య గురువారము – బప్తిస్మ యోహాను జన్మదినం (II)

12వ సామాన్య గురువారము – బప్తిస్మ యోహాను జన్మదినం
యెషయ 49:1-6; అ.కా. 13:22-26; లూకా. 1:57-66, 80

ధ్యానాంశము: బప్తిస్మ యోహాను
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ఆ బాలుడు వృద్ధిచెందుచు ఆత్మయందు బల సంపన్నుడాయెను” (లూకా. 1:80).
ధ్యానము: అద్భుతరీతిన యోహాను జన్మించినపుడు, ‘ఈ పసిబాలుడు ఎట్టివాడగునో!’ (లూకా. 1:66) అని ప్రజలు మనసులో అనుకొనిరి. అలాగే, యోహాను జననం లోకరక్షకుని రాకకు సంకేతమైనది. ఆయన బోధనలు, హెచ్చరికలు ప్రజలలో స్పూర్తిని రగిలించి ప్రేరణ కలిగించాయి. ఎంతోమందిని దైవబాటలోనికి నడిపించాయి. యోహాను మాతృగర్భంలోనే పవిత్రాత్మతో పరిపూర్ణంగా నింపబడ్డాడు. జన్మ, కర్మ పాపములు శుద్ధిచేయబడి జన్మించాడు. “నేను తల్లి కడుపున పడినప్పటినుండియు ప్రభువు నన్నెన్నుకొని తన సేవకునిగా నియమించెను” (యెషయ 49:1). మనం జన్మించకమునుపే, దేవుడు మనలను మన పిలుపును ఎన్నుకొని యున్నాడు. ఇది యిర్మియా (యిర్మి. 1:5), బప్తిస్మ యోహాను (లూకా. 1:15), యేసు (లూకా. 1:31), పౌలు (గలతీ. 1:15) జీవితములలో నిరూపితమైయున్నది. యోహాను ప్రవక్తలలో గొప్పవాడు. పవిత్రాత్మ దేవుడు తనద్వారా ప్రవక్తల ప్రవచనాలను పరిపూర్ణం చేసారు. యోహాను వెలుగునకు సాక్ష్యమీయ వచ్చారు. యెషయా ప్రవక్త తెలియపరిచిన విధంగా రక్షకుని రాక గురించి ప్రజలకు తెలియజేసి వారిని ఆత్మీయంగా సిద్ధంచేయడానికి దేవుడు యోహానును ఎన్నుకున్నారు (యెషయ 40:3). “అతడు నాకు పదునైన కత్తివంటి వాక్కు నొసగెను” (యెషయ 49:1). ప్రవక్తలు దేవుని వాక్కును ప్రవచించారు. దైవప్రజలు ఆలకించారు. వారు ప్రవక్తలద్వారా, దైవసందేశమును వినియున్నారు. “ఇదిగో! లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల” (యోహాను. 1:29) అని యోహాను యేసును ప్రజలకు పరిచయం చేసారు. రెండవ పఠనములో, దావీదు, యోహాను, యేసును గూర్చి పౌలు బోధిస్తున్నారు. దేవుడు దావీదును అభిషేకించి, ఆయన వంశమునుండి మెస్సయ్యను పంపియున్నారు. మెస్సయ్యా అనగా అభిషేకించబడినవాడు. ఇలా దేవుడు ఇస్రాయేలు ప్రజలకు చేసిన వాగ్ధానమును నెరవేర్చాడు. ఈ వాగ్ధానమునకు సాక్ష్యముగా, ఈ ప్రవచనాల పరిపూర్ణత కొరకు బప్తిస్మ యోహాను పంపబడినాడు. యోహాను యేసు రాకను ఆగమనం చేసారు. యేసు రాకతో, యోహాను ప్రవక్త కార్యము ముగిసినది.  యోహానువలె ఆ వెలుగునకు సాక్ష్యమీయుటకు మనముకూడా పిలువబడి యున్నాము. యేసు మనకు చేసిన కార్యముల గూర్చి, ఒసగిన దీవెనల గూర్చి సాక్ష్యమిద్దాం! ఈ లోకానికి ప్రభువు ఒసగిన రక్షణకు సాక్ష్యమిద్దాం!

12వ సామాన్య బుధవారము – పునీత పౌలినుస్ నొల, పునీత జాన్ ఫిషర్, పునీత తోమాస్ మోర్ (II)

12వ సామాన్య బుధవారము – పునీత పౌలినుస్ నొల, పునీత జాన్ ఫిషర్, పునీత తోమాస్ మోర్
2 రాజు. 22:8-13, 23:1-3; మత్త. 7: 15-20

ధ్యానాంశము: కపట ప్రవక్తలు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “కపట ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడు. వారి ఫలముల వలన వారిని మీరు తెలిసి కొనగలరు” (మత్త. 7:15, 20).
ధ్యానము: కపట ప్రవక్తల గురించి జాగ్రత్త పడమని ప్రభువు హెచ్చరిస్తున్నారు. వారు తోడేళ్ళ వంటివారు. గొర్రెల చర్మము కప్పుకొని మనలను మోసం చేసెదరు. కపట ప్రవక్తలను తెలుసుకోవాలంటే, వారి కార్యాలను గమనించాలి. లోకం దృష్టిలో మంచిదైన ఫలం, దేవుని దృష్టిలో మంచి ఫలం కాకపోవచ్చు. మంచివారు మంచి పనులనే చేయుదురు. దేవునకు, సువార్తకు వారు వ్యతిరేకం. ప్రవక్తలు దేవుని మాటను, దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజేసేవారు. చెడును ఖండించేవారు. కాని, కపట ప్రవక్తలు ప్రజలను తప్పు త్రోవలో నడిపిస్తారు. వీరు తమనుతాము మోసము చేసుకొనేవారు (యిర్మీ. 23); అసత్యవాదులు. యేసును ‘క్రీస్తు’గా అంగీకరించనివారు (1 యోహా. 2:22); విశ్వాసానికి భిన్నముగా బోధించువారు (1 యోహా. 2:19); అపహాసకులు, వ్యామోహములను అనుసరించువారు (2 పేతు. 3:3); దైవదూషణ చేయువారు. క్రీస్తును తిరస్కరించి అవినీతికర ప్రవర్తనను సమర్ధించుటకు అపార్ధములు కల్పించువారు, స్వార్ధపరులు, నిలకడలేనివారు (యూదా. 1:4,10,12,13); మోసగించువారు (మార్కు. 13:22); దేవుని గూర్చిన సత్యమగు జ్ఞానమును తిరస్కరించువారు, సర్వవిధములగు దుష్టత్వముతోను, దుర్గుణములతోను నిండియుందురు, దైవద్వేషులు, అవివేకులు, ఆడి తప్పువారు, పాషాణ హృదయులు, నిర్ధయులు (రోమీ. 1:28-31). ఇలాంటివారి గురించి మనం జాగ్రత్త పడాలి. అదేసమయములో, ఇలాంటి స్వభావాన్ని మనం ఎన్నటికీ అలవర్చుకొన కూడదు. ఎందుకన, జ్ఞానస్నానము ద్వారా మనము కూడా క్రీస్తు గురుత్వము, ప్రవక్త, రాజరికములో అభిషేకించ బడినాము. క్రీస్తుకు ప్రవక్తగా నేను జీవిస్తున్నానా? మన జీవితము, కార్యాలద్వారా క్రీస్తుకు సాక్ష్యమిస్తున్నామా? “దేవుని కరుణకు, గొప్ప శక్తికి కృతజ్ఞతలు. నా మనస్సాక్షికి వ్యతిరేకముగా ఎట్టిదియును నేను సమ్మతించలేదు” (పునీత తోమాస్ మోర్). 

12వ సామాన్య మంగళవారము – పునీత అలోషియసు గొంజాగ (II)

12వ సామాన్య మంగళవారము – పునీత అలోషియసు గొంజాగ
2 రాజు. 19:9-11, 14-21, 31-36; మత్త. 7:6, 12-14

ధ్యానాంశము: జీవ ద్వారము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము; ప్రవక్తల ప్రబోధము” (మత్త. 7:12).
ధ్యానము: ఇరుకైన మార్గము జీవమార్గము. మన జీవిత అంతిమ గమ్యం, అర్ధం - రక్షణ. “మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి?” (మత్త. 16:26). మన ప్రాణమును, జీవితాన్ని, ఆత్మను, రక్షించుకోవాలంటే, మన జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే, ప్రభువు చెప్పిన, తన జీవితము ద్వారా చూపిన ఇరుకైన మార్గములో పయనించాల్సిందే! మన జీవితములో, సరియైన నిర్ణయాలను తీసుకొని, ఇరుకైన మార్గమున పయనించాలి. అనగా, ఇహలోక ఆలోచనలనుగాక, సంపదలనుగాక, అధికారమునుగాక, ఎల్లప్పుడూ దేవుని మార్గమును ఎంచుకోవాలి. మనలను మనం త్యజించుకొని, దేవుని అనుగ్రహమునకు సహకరించాలి. పాపపు వాంఛలను విడనాడాలి. దేవునితోను, తోటివారితోను సఖ్యతను కలిగియుండి, మంచి కారణానికై, మంచి పనులను చేయడము, మన పేరు, ప్రతిష్టలనుగాక, దైవరాజ్యమును, నీతిని వెదకాలి, పాప జీవితానికి పశ్చాత్తాపపడాలి, విధేయత, వినయము, నీతి న్యాయము, సత్యములతో జీవించాలీ. ఈ విధముగా, ప్రార్ధన ద్వారా, ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు, ప్రయాసపడవలయును. ఇదియే, పరలోకరాజ్య ప్రవేశమార్గము. ఇంకోమాటలో చెప్పాలంటే, మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధమునైన మూలధర్మమును జీవించడం: “ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు” (మత్త. 7:12).

నేడు రాజవంశములో జన్మించి పునీతుడైన గురువు, మతసాక్షి, యువజన పాలకుడు అలోషియసు గొంజాగ (క్రీ.శ. 1568-1591) వారిని స్మరించు కుంటున్నాము. పునీతుల గాధలను చదివి మారుమనస్సు పొందారు. తన 17వ ఏట ‘యేసు సభ’లో చేరి, 19వ ఏటనే తన గురుత్వ ప్రథమ వ్రతాలను స్వీకరించారు. క్రీ.శ. 1591లో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు, రోగులకు అహర్నిశలు సేవలు చేసారు. ఆ వ్యాధితోనే, కేవలం 22 ఏళ్ల ప్రాయములో మరణించారు. పరలోక సంపదలపై ఎల్లప్పుడు ఆసక్తి చూపిన అలోషియసు గొంజాగ మనకు ఆదర్శం.

12వ సామాన్య సోమవారము (II)

12వ సామాన్య సోమవారము
2 రాజు. 17:5-8, 13-15, 18; మత్త. 7:1-5

ధ్యానాంశము: తీర్పు – ఇతరులను సరిచేయుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు. అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలువబడును” (మత్త. 7:1,2).
ధ్యానము: పరులను గూర్చి మనం తీర్పు చేసినప్పుడు, దేవుడు మనకు తీర్పు చేస్తారు. పరులను గూర్చి తీర్పు చేయడం మానివేయాలి, అప్పుడు అంతిమ దినమున దేవుని తీర్పు మనపై ఉండదు. మరి, ఇతరులు పాపము చేయునప్పుడు, మనం ఎలా స్పందించాలి? వ్యక్తిపై తీర్పుగాక, ఆ వ్యక్తిచేసే కార్యాలను సరిచేయాలి. ఎందుకంటే, సోదరులను సరిచేయుట సామాజిక బాధ్యత. అయితే, తప్పులను నివారించడానికి, సరిచేయుటలో నెమ్మది వహించాలి. ఇతరులను అన్యాయముగా విమర్శింప కూడదు. దేవుడు సఖ్యతపడే వరమునే మనకు ఒసగాడు కాని ఖండించమని కాదు. “దేవుడు క్రీస్తుద్వారా మనుష్యులనందరిని తనతో సఖ్యపరచు కొనుచున్నారు. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నారు” (2 కొరి. 5:19). ఇతరులను దేవునితో సఖ్యపరచు ప్రేషిత కార్యము మనకు ఒసగబడినది. కనుక, “ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసి కొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును” (మత్త. 7:5). చూపు స్పష్టముగా నుండవలయునంటే, కంటిలోని దూలమును, నలుసును తీసివేయవలయును. ప్రతీ ఒక్కరు అంత:రంగికముగా శుద్ధిపొందాలని, మారుమనస్సు పొందాలని ప్రభువు బోధిస్తున్నారు. మన కంటిలోని దూలమును గమనింపనిచో, మన సోదరుల కంటిలోని నలుసును వ్రేలేత్తి చూపలేము. సోదరులను సరిచేయడం మంచిదే, కాని సరి చేయాలంటే, ముందు మనము సరిగా ఉండవలయును. తననుతాను సరిచేసుకోలేనివాడు, ఇతరులను సరిచేయలేడు. అలా చేయువారిని ప్రభువు, వంచకులని, కపట భక్తులని, అంధులని, అవివేకులని చెప్పుచున్నారు. ఏది ఏమైనప్పటికిని, ఇతరులను పక్షపాతముతో తీర్పు చేయరాదు. సహోదర భావముతో ఇతరులను వారిని వారిగా అంగీకరించి, సహోదర సమూహమును ఏర్పాటు చేయవలయును. అంత:రంగిక శుద్ధి ఇతరులను మన్నించి, ప్రేమించేలాగున చేయును.

11వ సామాన్య శుక్రవారము (II)

11వ సామాన్య శుక్రవారము
2 రాజు. 11:1-4, 9-18, 20; మత్త. 6:19-23

ధ్యానాంశము: నిజమైన సంపదలు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును” (మత్త. 6:21).
ధ్యానము: దైవరాజ్యము కొరకు మనం స్పష్టమైన నిర్ణయాలు చేయాలి. లోక సంపదలా లేక పరలోక సంపదలా? దైవమా లేక ధనమా? అని నిర్ణయం చేయాలి. దేవుని రాజ్యములో జీవించాలంటే, ఈ లోక సంరక్షణలనుండి, ఆందోళనలనుండి విముక్తులం కావాలి. ఆకాశ పక్షులవలె, లిల్లీపుష్పములవలె మనం దేవునిపై ఆధారపడి జీవించాలి. ‘పరలోక ప్రార్ధన’లో దేవుని రాజ్యము కొరకు ప్రార్ధన చేయాలని యేసు నేర్పించారు. నిజమైన శిష్యులు ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనరు. ప్రార్ధన, ఉపవాసము, దానధర్మాలద్వారా సంపదలను పరలోకములో కూడబెట్టు కుంటారు. విశ్వాసులు, మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకాలి. అప్పుడు అన్నియు అనుగ్రహింపబడును (మత్త. 6:33). లోక సంపదలు అశాశ్వతము. ఎన్నియున్నను, మన హృదయం ఖాళీగానే ఉంటుంది. కాని స్వర్గ సంపదలు శాశ్వతము. పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో ఇలా అన్నారు: “నేను లాభముగా లెక్కించుకొన దగిన వానిని అన్నింటిని క్రీస్తు కొరకై నష్టముగా లెక్కించు కొనుచున్నాను. క్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగనే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటిని చెత్తగ భావించుచున్నాను” (3:7-8). స్వర్గ సంపదలనగా మన హృదయాన్ని దేవునిపై కేంద్రీకృతమై ఉంచడం; దేవుడు మన జీవితాలలో బహిర్గతమొనర్చే విషయాలను మన హృదయాలలో నిధిగా ఉంచుకోవడం (మరియతల్లివలె, లూకా. 2:19, 51). “నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును” (మత్త. 6:21). పరలోక సంపదలు ఇవే: ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము (గలతీ. 5:22-23).

11వ సామాన్య శనివారము (II)

11వ సామాన్య శనివారము
2 రా.ది.చ. 24:17-25; మత్త. 6:24-34

ధ్యానాంశము: దేవునిపై ఆధారపడుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకుడు. అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింపబడును (మత్త. 6:33).
ధ్యానము: ఆందోళన (వెత, కలత) చెందకుడు (మత్త. 6: 25, 31, 34) అని ప్రభువు చెప్పుచున్నారు. నేడు మనం ఎన్నో విషయాలపట్ల ఆందోళన కలిగి జీవిస్తున్నాము. అట్లయిన, మనం దేవునిపై ఆధారపడి జీవించడము (విశ్వాసము, నమ్మకము) లేదని అర్ధం. ఆందోళన వలన మనకు ఎంతో కీడు కలుగుతుంది: ఆందోళన మన ఆలోచనలను వక్రీకరించును, మన పనికి అంతరాయం కలిగించును, మన ఆత్మను అసంతృప్తిపరచును, మన శరీరాన్ని భంగపరచును, మన ముఖాన్ని అందవిహీనముగా మార్చును. ఆందోళన మన స్నేహితులను నాశనం చేయును, మన జీవితాన్ని నిరుత్సాహ పరచును. మన విశ్వాసాన్ని విచ్చిన్నం చేయును, మన శక్తిని బలహీన పరచును. ఎందుకు కలత చెందకూడదో ప్రభువు స్పష్టం చేసారు: మనలో ప్రాణాన్ని సృష్టించిన దేవుడు మన సర్వాన్ని ఆయనే చూసుకుంటారు (6:25); రేపటి గురించి కలత చెందితే, నేటి ప్రయత్నాలు విఫలమవుతాయి (6:26); ఆందోళన మనకు ఎక్కువ హానిని కలుగచేస్తుంది (6:27); తనపై ఆధారపడే వారిని దేవుడు ఎప్పటికీ విస్మరింపడు (6:26-30); ఆందోళన దేవునిపట్ల విశ్వాసం, అవగాహన లేకపోవడమే (6:31-32); మనం ఎదుర్కోవాల్సిన గొప్ప సవాళ్లు మనముందున్నాయి. ఆందోళన ఆ సవాళ్ళను ఎదుర్కోకుండా చేస్తుంది (6:33). ఏ రోజుకు ఆ రోజు జీవించడం, ఆందోళన చెందకుండా ఉంచుతుంది (6:34). కనుక, మన ఆందోళనలను, బాధలను అన్నింటిని దేవునికి అప్పజెబుదాం. దేవునియందు సంపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతములోని వైఫల్యాలనుండి నేర్చుకొంటూ, భవిష్యత్తుపై ఆందోళన చెందకుండా, ఈరోజు మనం చేయవలసిన పనులను, బాధ్యతలు పరిపూర్ణముగా చేయాలి. “నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము” (6:11) అని విశ్వాసముతో పార్దిద్దాం. నేటికి కావలసిన దేవుని కృప మనకు తప్పక తోడై ఉంటుంది.

11వ సామాన్య గురువారము (II)

11వ సామాన్య గురువారము
సీరా. 48:1-14; మత్త. 6:7-15

ధ్యానాంశము: క్షమాగుణం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మా యోద్ధ అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన యెడల, పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు” (మత్త. 6:12, 14-15).
ధ్యానము: ప్రార్ధన చేసేప్పుడు, అన్యులవలె వ్యర్ధమైన పదాలతో ప్రార్ధింప వలదని, యూదులవలె కపటముతో ప్రార్ధింప వలదని చెప్పిన నేపధ్యములో, యేసు తన శిష్యులకు ‘పరలోక ప్రార్ధన’ నేర్పించారు. యూదులు రోజుకు మూడుసార్లు ప్రార్ధన చేసేవారు. బోధకులు (రబ్బీలు) ప్రతీ సందర్భానికి ఒక ప్రార్ధన చేసేవారు. అయితే, యేసు తన శిష్యులు ఇలాంటి యాంత్రికమైన, అర్ధంలేని ప్రార్ధన చేయకూడదని హెచ్చరించారు (మత్త. 6:7-8). ప్రార్ధనలో పదాలతోపాటు చిత్తశుద్ధి, దేవునిపై నమ్మకం, విశ్వాసం ఉండాలి. దేవునితో లోతైన సహవాసములోనికి ప్రవేశించాలనేదే క్రైస్తవ ప్రార్ధన ఉద్దేశ్యం. ‘పరలోక ప్రార్ధన’ ద్వారా మనం దేవున్ని ఎలా ప్రార్దించాలో యేసు నేర్పిస్తున్నారు. దేవుడు మన తండ్రి. “దేవుని నుండి మీరు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను స్వీకరించితిరి. ఆ ఆత్మద్వారా మనము దేవుని ‘అబ్బా! తండ్రీ! అని పిలుతుము. ఆ ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును” (రోమీ. 8:15-16). ‘పరలోక ప్రార్ధన’ వ్యక్తిగత ప్రార్ధనకన్న, ఒక సంఘ ప్రార్ధన. తల్లి శ్రీసభతో ఏకీభవిస్తూ చేసే ప్రార్ధన. ఈ ప్రార్ధనలో, దేవుని క్షమను పొందాలంటే, ఇతరులను క్షమించడం ఎంత అవసరమో యేసు నొక్కి చెప్పారు (6:14-15). ఇది పరస్పరము షరతులు లేని క్షమ. క్షమించడం అంత సులువుకాదు. క్షమించడంకన్న ద్వేషించడం చాలా సులువు. అందుకే క్షమించడం దైవత్వంతో సమానం. పరస్పరం క్షమించుకోవడం వలన సంఘాలు ఐఖ్యతగా, ప్రేమగా నిలుస్తాయి. అప్పుడు దేవుని నామము పవిత్రపరప బడును, ఆయన రాజ్యము, చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుతుంది. ‘పరలోక ప్రార్ధన చేసినపుడెల్ల, క్షమా వరము కొరకు ప్రార్ధన చేద్దాం. 

11వ సామాన్య బుధవారము (II)

 11వ సామాన్య బుధవారము
2 రాజు. 2:1, 6-14; మత్త. 6:1-6, 16-18

ధ్యానాంశము: దానము, ప్రార్ధన, ఉపవాసము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “రహస్యకార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును” (మత్త. 6:4,6,18).
ధ్యానము: దైవరాజ్యము కొరకు నీతిమంతమైన జీవితము జీవించడం మనలనుండి ఏమి ఆశిస్తున్నదో మత్త. 6:1-18లో చూడవచ్చు: దానము, ప్రార్ధన, ఉపవాసము. ఈ మూడు కూడా యూదులకు పవిత్రమైన భక్తి కార్యములు. ఈ భక్తి కార్యములను కపట భక్తి లేకుండా, రహస్యముగా చేయాలని ప్రభువు తన శిష్యులను కోరుచున్నారు. విశ్వాసులు పవిత్రతలో ఎదుగుటకు ఇవి ఎంతో అవసరము. ‘పవిత్రత’ అనగా కేవలము నోటితో యేసు ‘ప్రభువు’, ‘రక్షకుడు’ అని పలకడం కాదు, దానిని మన చేతలలో తప్పక నిరూపించు కోవాలి. దేవునితోను ఇతరులతోను మనకున్న సంబంధం ప్రత్యేకమైనదని మన జీవితాలు, మన ప్రవర్తన చూపించగలగాలి. అన్యులువలెగాక (మత్త. 5:46-47, 6:7-8, 31-32, 18:15-17), యూదులవలెగాక (మత్త. 5:20, 6:1-18, 15:1-20), క్రైస్తవులు ప్రత్యేకముగా జీవించాలని ప్రభువు కోరుచున్నారు. మనం అనేకసార్లు ఇతరులు చూడాలని, ఈ భక్తి కార్యములను ప్రదర్శిస్తూ ఉంటాము. వీటిని మనం ప్రదర్శన కొరకుగాక, దేవుడు చూస్తున్నాడు అనే భావనతో చేయాలి. “రహస్యకార్యములనెల్ల గుర్తించు తండ్రి మనకు తగిన బహుమానమును ఒసగును” (మత్త. 6:4,6,18). దేవునికోసం చేసే కార్యాలు మనలను పరిపూర్ణతకు నడిపిస్తాయి. మన పాప జీవితాన్ని మార్చుకోకుండా ఇతరులపై తీర్పు చేస్తూ ఉంటాము, వారిని నిందించి, ఖండిస్తూ ఉంటాము. కనుక, మన అంత:ర్గత స్వభావమును పరిశీలించుకోవాలి. మన అంత:ర్గత స్వభావమునకు, మనం చేయు కార్యములకు పొంతన లేనిచో లేదా చెప్పేది ఒకటి చేసేది మరొకటైనప్పుడు అది కపటభక్తి, కపట వేషధారణ అగును. మతపరమైన కార్యములన్ని కపటం కాదు. అయితే, మనం చేసేవన్నీ దేవుని మహిమ కొరకు చేస్తున్నామా లేదా మన మహిమ కొరకు చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. కపటం, రక్షణకు, పవిత్రతకు ఆటంకం. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు బయటకు నీతిగా జీవించినను, అంత:ర్గతముగ కపటవేషముతో జీవించేవారు. క్రైస్తవులు కపటములేని నీతిమంతమైన జీవితము జీవించాలి (మత్త. 5:20).

11వ సామాన్య మంగళవారము (II)

 11వ సామాన్య మంగళవారము
1 రాజు. 21: 17-29; మత్త. 5:43-48

ధ్యానాంశము: పరిపూర్ణ ప్రేమ
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు” (మత్త. 5:44).
ధ్యానము: ప్రతీ విశ్వాసి పరిపూర్ణతకు, పవిత్రతకు పిలువబడియున్నారని మత్త. 5:48 గుర్తుకు చేయుచున్నది. దేవుని ప్రేమలో సహవాసము కలిగియుండటం పవిత్రత. దేవునితోను, ఇతరులతోను సన్నిహిత సంబంధములో ఎదగడమే పవిత్రత. రక్షణ పొంది దైవరాజ్యములో నిత్యజీవము కలిగియుండటం పరిపూర్ణత. తండ్రివలె మనం పరిపూర్ణులము కావలెను. నీతి నిమిత్తము ఆకలిదప్పులు కలవారు పరిపూర్ణత కొరకు ఆకలిదప్పులు కలిగి ఉంటారు. అనగా, దేవునితోను, ఇతరులతోను యుక్తమైన, న్యాయమైన సంబంధమును కలిగియుంటారు. యేసు ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధముల పరిపూర్ణము. తండ్రి చిత్తానుసారముగా చట్టములోని ప్రతీ అంశమును పాటించారు. ధర్మశాస్త్రమును సంపూర్ణమొనర్చారు. పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడైనట్లే యేసు పరిపూర్ణుడై యున్నారు. కనుక, దేవుని రాజ్యములో ప్రవేశింప గోరువారు పవిత్రులై ఉండవలయును. విశ్వాసులు మొదటిగా ఆయన రాజ్యమును, నీతిని వెదకాలి (మత్త. 6:33). అనగా పరలోకరాజ్యము, నీతియే పవిత్రత. దేవునిపట్ల, ఇతరులపట్ల అనంతమైన ప్రేమను కలిగియున్నవారు పరలోక రాజ్యములో పవిత్రులు. పరలోక పౌరులు పరిపూర్ణ ప్రేమ కలిగి జీవించువారు. పరిపూర్ణ ప్రేమ విషయములో యేసు కొత్త ప్రమాణాలను ఇచ్చియున్నారు. షరతులుగల ప్రేమనుండి అనంతమైన, షరతులులేని ప్రేమలో జీవించాలని కోరుచున్నారు. అనగా, “ధర్మశాస్త్ర బోధకులకంటె, పరిసయ్యులకంటే నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు” (మత్త. 5:20). పవిత్రత / పరిపూర్ణత పరలోక రాజ్యములో గొప్పదైనది. దేవుని ఆజ్ఞలను పాటించి, వాటిని ఇతరులకు నేర్పించువారు పరలోకరాజ్యములో అత్యధికులుగా పరిగణింపబడును (మత్త. 5:19).

11వ సామాన్య సోమవారము – పునీత పాదువ అంతోని (II)

 11వ సామాన్య సోమవారము – పునీత పాదువ అంతోని
1 రాజు 21:1-16; మత్తయి 5:38-42

ధ్యానాంశము: ప్రతీకారము తీర్చుకొనకుడు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "అడిగిన వానికి లేదనక యిమ్ము" (మత్తయి 5:42)
ధ్యానము: ప్రతీకారము అనగా మన్నింపలేక పోవడం; అది మన స్వతంత్రాన్ని, సంతోషాన్ని మింగివేయును. బంధాలను విచ్చిన్నం చేయును. ప్రతీకారము తీర్చుకోవడం మానవ నైజం. లోకం అదే బోధిస్తుంది, పాటిస్తుంది. కాని, ప్రతీకారము చేయకుము అని ప్రభువు తెలియజేయుచున్నారు. ప్రేమ, సహనము కలిగి జీవించాలని కోరుచున్నారు. మనకు అపకారము చేయువారికి ఉపకారమును మాత్రమే చేయాలి. చెడును చెడుతోగాక, మంచితో జయించాలి. అన్యాయము-హింసను, ప్రేమ-క్షమాపణ శక్తితో జయించాలి. మనము దేవుని బిడ్డలము కనుక దైవస్వభావంతో జీవించాలి. “దేవుడు ప్రేమాస్వరూపుడు” (1:8,16). ప్రేమయనగా చెడుకు మంచిని చేయడం, శాపానికి ఆశీర్వదించడం, బాధించే వారికొరకు ప్రార్ధించడం. మంచిని చేయడానికి ఎలాంటి పరిమితులు, షరతులు ఉండరాదు. అందరికి, అన్నిచోట్లా మంచి చేయడమే నిజమైన ప్రేమ. ప్రతీకారంతో ఉన్నచో, దైవారాజ్యాన్ని వ్యాప్తిచేయలేము; మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండలేము, ఇతరులను ప్రభువు చెంతకు నడిపించలేము, సువార్తను ఉజ్జీవముతో ప్రకటించలేము. “మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు” (యోహాను 13:35). శాంతి సాధనముగా మలచుమని, ద్వేషమున్నచోట ప్రేమను పంచునట్లు చేయుమని పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారితో కలిసి ప్రార్ధించుదాం.

నేడు పునీత పాదువపురి అంతోని వారిని స్మరించుకుంటున్నాము. అద్భుతాల అంతోనిగా బాగా ప్రసిద్ధి. కాని, వేదప్రచారము పట్ల, వేదసాక్షిగా మరణించాలన్న అతనిలోని కోరిక గురించి చాలామందికి తెలియదు. ఆరంభములో అంతోనివారు, ‘ఫెర్నాండో’గా పునీత అగుస్తీను మఠసభలో గురువు. అస్సీసిపుర ఫ్రాన్సిస్ సభకు చెందిన ఐదుగురు సోదరులు మొరాకో దేశమునకు వేదసాక్షులుగా వెళ్తూ అస్సీసినుండి పోర్చుగల్ చేరుకొని రాత్రికి ఫెర్నాండో ఉన్న మఠములో ఆశ్రయాన్ని పొందారు. మరుసటి రోజు ఆ ఐదుగురు సంతోషముతో మొరాకో వెళ్ళారు. మూడు నెలల తరువాత, ఆ ఐదుగురు సన్యాసులు వేదసాక్షి మరణాన్ని పొందారు. వారి పరిశుద్ధ అవశేషాలు ఫెర్నాండో ఉన్న మఠమునకు తీసుకొని రాబడ్డాయి. అది చూసిన ఫెర్నాండో, ఆ క్షణములోనే అస్సీసిపుర ఫ్రాన్సిస్ అనుచరుడు కావాలని, ఒక బిచ్చగానివలె జీవిస్తూ ప్రపంచమే ఆశ్రమముగా జీవించాలని, వేదసాక్షి మరణం పొందాలని ఆశించి, ఫ్రాన్సిస్ సభ సన్యాసిగా చేరి తన పేరును ‘అంతోని’గా మార్చుకున్నారు. ఆ ఐదుగురు వేదసాక్షులవలె, తానుకూడా మొరాకోకు బయలుదేరాడు, కాని మార్గమధ్యలో అనారోగ్యం పాలవడం వలన వెళ్ళలేక పోయాడు. తన సువార్తా బోధనకు క్రీస్తు అతనిని ఎన్నుకున్నారు. ఆ కాలములో అందరూ కోరుకొనే అత్యంత ప్రసిద్ధులైన ప్రసంగీకులుగా అంతోనివారు పేరుగాంచారు.

10వ సామాన్య శనివారము – పునీత బర్నబాసు (II)

 10వ సామాన్య శనివారము – పునీత బర్నబాసు
అ.కా. 11: 21-26, 13:1-3; మత్త. 10:7-13

ధ్యానాంశము: వేదప్రచారం మన కర్తవ్యం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు” (మత్త. 10:8).
ధ్యానము: నేడు అపోస్తలుడు, పునీత పౌలు సహచరుడు, వేదసాక్షి పునీత బర్నబాసు (క్రీ.శ. 1-60) మహోత్సవమును కొనియాడుచున్నాము. యూదలేవీ వంశానికి చెందిన గొప్ప ధనవంతుడైన ‘యోసేపు’, పెంతకోస్తు తరువాత క్రీ.శ. 29 లేక 30లో క్రీస్తు విశ్వాసిగా మారి ‘బర్నబాసు’ అను పేరు మార్చుకున్నారు. ‘బర్నబా’ అనగా ‘ఉత్సాహపరచువాడు’ అని అర్ధము (అ.కా. 4:36). “ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోను, విశ్వాసముతోను నిండియుండెను” (అ.కా. 11:24), అలాగే, “అతడు తన సొంత భూమిని అమ్మి, వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలుల పాదముల చెంత పెట్టెను” (11:37) అని చదువుచున్నాము. పరివర్తన పొందిన పౌలును యెరూషలేము అపోస్తలులకు పరిచయం చేసినది ఈ బర్నబానే (9:27). యెరూషలేములోని క్రీస్తు సంఘము బర్నబాసును అంతియోకియా సందర్శనకు పంపిరి. బర్నబాసు పౌలును అచటకు తీసుకొని రాగా, వారిరువురు, ఒక ఏడాది అచట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి (11:26). పౌలుతో కలిసి, అపూర్వ సేవలు అందించినందులకు, 12మందిలో ఒకరు కాకున్నను, శ్రీసభ అతనిని ‘అపోస్తలుడు’గా గౌరవించినది. సైప్రసులో వేదప్రచారం చేయుచుండగా, రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు. పునీత బర్నబా మనకు గొప్ప ఆదర్శం. ఆయన గొప్ప విశ్వాసి.

అపోస్తలుడు అనగా ‘పంపబడినవాడు’ అని అర్ధము. యేసు తన శిష్యులను వేదప్రచారమునకు పంపాడు (మత్త. 10:1-15). వారికి సూచనలను ఇచ్చి, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు అని చెప్పాడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకు, మరణించిన వారిని జీవముతో లేపుటకు, కుష్ఠరోగులను శుద్ధులను గావించుటకు, దయ్యములను వెడలగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చారు. అదే ప్రేషిత కార్యమునకు నేడు మనం పిలువబడుచున్నాము. “శ్రీసభ స్వభావ సిద్ధంగానే వేదబోధక సంఘం” (Ad Gentes Divinitus, No. 2). వేదబోధక సంఘముగా, ఏమీ ఆశించక సంపూర్ణముగా క్రీస్తు కొరకు మన జీవితాలను అర్పించుకుందాం.

10వ సామాన్య శుక్రవారము (II)

 10వ సామాన్య శుక్రవారము
1 రాజు. 19:9, 11-16; మత్త. 5:27-32

ధ్యానాంశము: విడాకులు వద్దు – కలిసి ఉండుట ముద్దు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు” (మత్త. 5:30).
ధ్యానము: యేసు కాలములో, యూదులు వ్యభిచారమును తీవ్రమైన నేరముగా భావించి, కఠినముగా శిక్షలు అమలుచేసేవారు. అయితే, ఈ శిక్షలన్నీ స్త్రీలకు మాత్రమే ఉండేవి. అందుకే, ఒక పత్రముచే విడాకులు ఇవ్వడాన్ని యేసు రద్దుచేస్తున్నారు. అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడ వచ్చునని మోషే ఏల ఆజ్ఞాపించెను?” అని పరిసయ్యులు ప్రశ్నింపగా, “మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమంతించెనే కాని, ఆరంభము నుండి ఇట్లు లేదు” (మత్త. 19:7-8) అని యేసు సమాధానమిచ్చాడు. “ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే!” (మత్త. 5:28). కామపు చూపులు, తలంపులద్వారా కూడా ఆరవ ఆజ్ఞను మీరిన వారమవుతాము. “వివాహము అందరిచేతను గౌరవింప బడవలెను. వివాహ బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వ్యభిచారులు దేవుని తీర్పుకు గురియగుదురు” (హెబ్రీ. 13:4). “దేవుడు జతపరచిన జంటను మానవుడు వేరుపరపరాదు” (మత్త. 19:6; మార్కు. 10:9). “అంతర్యుద్ధం దేశానికి ఎలాంటిదో, విడాకులు కుటుంబ జీవితానికి అంతే” అని క్రీస్తుకు చాలాకాలం ముందే అరిస్టాటిల్ చెప్పాడు. భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే, శోధనలు, ప్రమాదకర పరిస్థితులను నివారించాలి (మత్త. 5:29-30). జీవిత భాగస్వామిలోని అనుకూల అంశములను గుర్తించి ప్రశంసించాలి. ఒకరినొకరు గౌరవించు కోవాలి. ఒకరితోనొకరు ఉల్లాసముగా ఉండాలి. “కృతజ్ఞతలు”, “నన్ను క్షమించు”, “నిన్ను ప్రేమిస్తున్నాను” అన్న మాటలను క్రమం తప్పకుండా ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. హృదయం స్వచ్చముగా ఉంటే, ప్రేమించే మన సామర్ధ్యాన్ని పెంచుతుంది; స్వార్ధపూరిత ఆలోచనలు మన అంత:ర్గత జీవితాన్ని నాశనం చేస్తాయి.