28వ సామాన్య ఆదివారం A

 28వ సామాన్య ఆదివారం A

యెషయ 25:6-10; ఫిలిప్పీ 4:12-14, 19-20; మత్త 22:1-14

పరలోక విందుకు ఆహ్వానం

“అతడు తన విందుశాలకు నన్ను తోడుకొని వచ్చెను” (పరమగీతం 2:4).

క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈరోజు 28వ సామాన్య ఆదివారం! నేటి వాక్యోపదేశానికి మీ అందరకు ప్రేమపూర్వక ఆహ్వానం!

నేటి పఠనాలు పరలోక విందుకు దేవుని ఆహ్వానాన్ని గుర్తుకు చేస్తున్నాయి. ఎంత గొప్ప శుభవార్త! తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధరణ, నిరీక్షణ, దయ, సమృద్ధి, విముక్తి సందేశాన్ని ఇస్తున్నప్పటికీ, దేవుని  ఆహ్వానానికి మన సరైన స్పందన ముఖ్యం అని నేటి పఠనాలు తెలియజేస్తున్నాయి.

మనలను మనం ప్రశ్నించుకుందాం! దేవుని యొక్క ఆహ్వానాన్ని లేదా పిలుపును మనం చివరిసారిగా ఎప్పుడు నిర్లక్ష్యం చేశాము? దేవుడు మనలను ప్రార్ధన చేయమని, ఇతరులను క్షమించమని, కుటుంబముతో కలిసి సమయం గడపమని, పవిత్ర దివ్యపూజాబలిలో పాల్గొనమని, దివ్యసప్రసాదమును స్వీకరించమని... ఈవిధంగా అనేక విషయాలలో దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉంటాడు!

దేవుని ఆహ్వానాన్ని త్రోసిపుచ్చడానికి, లేదా నిర్లక్ష్యం చేయడానికి మనకు అనేక కారణాలు ఉండవచ్చు! సమయం లేదనే సాకుతో, ప్రార్థన చేయమన్న పిలుపును బహుశా మనం పక్కన పెట్టామేమో! మనల్ని నొప్పించిన వారిని క్షమించమని అడిగినప్పుడు, లేదా మన పని కంటే కుటుంబముతో కొంత సమయం గడపమని కోరినప్పుడు... ఆదివారం పవిత్ర దివ్యబలిపూజలో భక్తితో పాల్గొనమని పిలచినప్పుడు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయమని అడిగినప్పుడు, మన జీవితంలోని కష్టకాలంలో దేవునిపై నమ్మకం ఉంచమని దేవుడు పిలిచినప్పుడు... మనం నిర్లక్ష్యం చేశామేమో!

మనలో చాలామందిమి దేవున్ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించము; కేవలం వాయిదా వేస్తుంటాము; ‘తర్వాత చూద్దాంలే’ అని మనకు మనం సర్దిచెప్పుకుంటాము. అయినప్పటికీ, నేటి పఠనాలు తన ప్రజలను ఎప్పటికీ ఆహ్వానిస్తూనే ఉండే దేవుడిని, ఆ పిలుపునకు స్పందించడంలో తరచూ విఫలమయ్యే మానవత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి.

మొదటి పఠనం (25:6-10): దేవుడు మనల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారో అర్థంచేసుకోవడానికి యెషయా గ్రంథం నుండి, నేటి మొదటి పఠనం మనకు సహాయపడుతుంది.

యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు. అదేమిటంటే, దేవుడు మనకోసం ఒక దివ్యవిందును సిద్ధం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు జరిగే పరలోక విందే ఇది! ఈ విందులో మనం భాగస్తులు కావాలంటే, మనమందరం ఒక ప్రత్యేకమైన ‘గుర్తు’ను కలిగి ఉండాలి. ఆ ప్రత్యేక గుర్తు ఏమిటంటే, ఎల్లప్పుడూ దేవుని ఆలోచనలను కలిగి ఉండటం; దేవునితో మంచి అనుబంధాన్ని పెంపొందించుకోవడం మరియు దైవానుసరణలో జీవించడం.

ఇహలోక జీవితంలో మనం అనుభవిస్తున్న పేదరికం, అనారోగ్యాలు, ఇబ్బందులు మరియు అనేక రకాల సమస్యల వల్ల మన కళ్ళనుండి రాలిన కన్నీరంతా శాశ్వతం కాదు. ఇదంతా కేవలం తాత్కాలికమే! “మృత్యువు సదా నాశనం చేయబడుతుంది” అని దేవుని వాక్కు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకంలో ప్రాణం ఉన్నంతవరకు మన శరీరంతో జీవించేటప్పుడు మృత్యువు మనలను తాకవచ్చు; అది మన ఇహలోక జీవితాన్ని అంతం చేయవచ్చు. కానీ, పరలోక జీవిత ఆహ్వానంలో, ఆ మృత్యువు స్వయంగా నాశనం చేయబడుతుంది. ఈ లోకంలో మనం ఎదుర్కొన్న ఇబ్బందులు, కన్నీళ్లు అన్నీ తొలగిపోయి, నశించిపోయిన మన మట్టి శరీరము మహిమతో లేవనెత్తబడుతుంది. అప్పుడు, మనం పరలోక రాజ్య నిత్యజీవితంలో క్రీస్తు ప్రభువుతో పాటు నిరంతరం నివసిస్తాము. ఇదే అసలైన పరలోక విందు.!

ఈ లోక జీవితంలో మనం ఎదుర్కొంటున్న శ్రమలను చూసి ఎప్పుడూ కృంగిపోకుండా... దేవుని విందు కొరకు ఓర్పుతో, ఓపికతో, విశ్వాసంతో వేచి ఉందాం. మొదటి పఠనం ద్వారా, దేవుడు మనకు బయలు పరిచిన ఈ పరమ రహస్యాలను గ్రహించి, వాటిని మన జీవితంలో ఆచరిద్దాం. దేవుని దివ్య ఆహ్వానానికి కట్టుబడి, ఆయన విందులో మరియు రాకడలో పాలుపంచుకోవడానికి కావలసిన గట్టి పట్టుదలను, కృపను ప్రసాదించమని ఆ సర్వశమంతుడైన దేవున్ని వేడుకుందాం!

ఈవిధంగా, సహోదరీ సహోదరులారా! యేసు ప్రభువు, ఈ “పెండ్లి పిలుపు” ఉపమానం చెప్పడానికి శతాబ్దాల ముందే, యెషయా ప్రవక్త ప్రజలందరి కోసం దేవుడు ఒక గొప్ప విందును సిద్ధం చేస్తున్న దర్శనాన్ని చూశాడు. అది ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క భాష వారికో, ఏ ఒక్క సంస్కృతికో పరిమితం కాదు; సమస్త మానవాళి కోసం! ఆ విందులో “ప్రభువు సకల జాతిజనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దు:ఖపు తెరను తొలగించును. మృత్యువును సదా నాశనం చేయును. ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును.” కాబట్టి, ఇది కేవలం ఒక విందును గురించిన ఉపమానం కాదు. ఇది మన పట్ల దేవుని కల, వాగ్దానం! గాయపడిన, సమాధానపడిన, తన చుట్టూ చేరిన ఒక నూతన ప్రపంచపు దర్శనం అది! యేసు ఉపమాన రీతిగా విందు గురించి మాట్లాడినప్పుడు, ఈ అందమైన దేవుని వాగ్దానాన్నే మనకు గుర్తుచేస్తున్నారు. దేవుని ఆహ్వానం అనేది జీవము, ఆనందం, స్వస్థత మరియు సహవాసాల వైపు నడిపించే పిలుపు, ఆహ్వానం.

ఈ మొదటి పఠనంలో, మనం రెండు విషయాలను గమనించాలి: ఒకటి, ప్రభువు విందును “పర్వతం మీద” సిద్ధం చేస్తున్నాడు. మరి మనం “ఆ పర్వతంపై” ఉన్నామా? దేవుని ఆహ్వానానికి స్పందనగా “ఆ పర్వతంపైకి” అనగా “దేవుని సన్నిధికి” వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? విశ్వాసంతో కూడిన అడుగు దేవుని వైపు వేయడానికి సిద్ధముగా ఉన్నామా? రెండు, దేవుని ఆహ్వానం “సకలజాతులకు”. ఆహ్వానంలో ఎలాంటి వివక్షత లేదు. ఎలాంటి భేదభావాలు, జాతి, కుల, వర్గ తారతమ్యాలు లేవు. మనలో ప్రతీ ఒక్కరు ఈ విందుకు ఆహ్వానితులే! అయితే దేవుని ఆశీర్వాదాలను, అనుగ్రహాలను పొందడానికి “పర్వతంపై” అనగా “దేవుని సన్నిధిలో” ఉండాలి.

నేటి 23వ కీర్తన మంచి కాపరి యొక్క ప్రార్థన! అయితే 5వ వచనంలో, “నీవు నాకు విందు చేయుదువు” అని చూస్తున్నాం! ప్రభువు కేవలం తన మందను నడిపించే కాపరి మాత్రమే కాదు; అతిథులను సాదరంగా ఆహ్వానించే వారు కూడా. మనం గాడాంధకారపు లోయలో పయనించునపుడును, అనారోగ్యం, దుఃఖం, ఒంటరితనం, నిరాశ, అనిశ్చితి లేదా నష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు, ప్రభువు మనకు విందును సిద్ధపరుస్తూనే ఉంటాడు. జీవితం కష్టతరమైనప్పుడు ప్రభువు ప్రేమ దూరమవ్వదు; ఆయన ఆహ్వానం మనకు ఎప్పుడూ ఉంటుంది.

రెండవ పఠనం: రెండవ పఠనంలో, అపొస్తలుడైన పౌలు, తన స్వంత అనుభవం నుండి రెండు గొప్ప సత్యాలకు  సాక్ష్యమిస్తున్నారు. ఒకటి, “క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటిని చేయగలను” (ఫిలిప్పీ 4:13) అని అంటున్నాడు. “కలిమి లేములలో ఉండుట అననేమియో నాకు తెలియును” అని అంటున్నాడు; అనగా, సమృద్ధిలో ఎలా బతకాలో, లేమిలో ఎలా నెగ్గుకు రావాలో తనకు తెలుసని చెబుతున్నాడు. పౌలు తన జీవితంలో ఆకలిని, సంపదను, సుఖాన్ని, కష్టాలను అనుభవించారు. అయినప్పటికీ, లోకానికి అర్థం కాని ఒక రహస్యాన్ని పౌలుగారు కనుగొన్నాడు, అదే “క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటిని చేయగలను” అని! రెండు, “క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యముల కనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నింటిని తీర్చును” అని అంటున్నాడు (ఫిలిప్పీ 4:19).

పౌలు దేవుని ఆహ్వానాన్ని సంపూర్ణంగా అంగీకరించాడు. ఆయన వద్ద ఎక్కువ ఉన్నా క్రీస్తే చాలు, తక్కువ ఉన్నా క్రీస్తే చాలు’ అని జీవించాడు. ఆయన ‘ప్రశంసించబడినా క్రీస్తే చాలు, శ్రమలు అనుభవించినా క్రీస్తే చాలు’ అని జీవించాడు. ఈవిధంగా, ‘క్రీస్తుకు చెందడం ద్వారా వచ్చే శక్తిని’ పౌలుగారు కనుగొన్నాడు.

కానీ మన విషయానికి వస్తే... మనం ఒక్కో పరిస్థితిని బట్టి ఒక్కో విధంగా మారుతూ ఉంటాం: కష్టాలు వచ్చినప్పుడు, ఇతరులను దూషిస్తాం; ఒక్కోసారి దేవుడిని కూడా ప్రశ్నిస్తాం లేదా దూషిస్తాం; మనల్ని మనమే కష్టపెట్టుకుంటాం! సుఖసంతోషాలలో ఉన్నప్పుడు, దేవుడిని పూర్తిగా మరచిపోతాం; మనకు ఇష్టమైన రీతిలో మాత్రమే జీవిస్తాం; కనీసం మన పక్కన ఉన్నవారి దీనస్థితిని కూడా చూడము, పట్టించుకోము, వారికి సహాయం చేయము!

దేవుని నిజంగా మహిమ పరచాలంటే మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుడు మనకు ఇచ్చిన అపారమైన కృపను మనం కూడా ఇతరులకు పంచుతూ జీవించాలి. ఇటువంటి నిస్వార్థ జీవితమే దేవుడు మెచ్చే జీవన విధానం!

కాబట్టి, మనము కూడా దేవుని ఆహ్వానానికి పూర్తిగా స్పందిస్తే, ఆయన రక్షణ కవచం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. మనం కూడా క్రీస్తు యేసునందు ఉన్న యెడల, మన అవసరములన్నీ తీర్చబడతాయి. క్రీస్తుతో మనకు ఉన్న సంబంధముపై మరియు ఆయన చిత్తానికి లోబడి ఉండటంపై ఆధారపడి ఉంటుంది! దేవుని చిత్తానుసారంగా, ఇతరులకు మేలు చేసే మరియు నిజమైన అవసరాలను దేవుడు తప్పక తీరుస్తాడు!

సువార్త పఠనం: దేవుడు తన విందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాడని తెలియజేయడానికి, యేసు ప్రభువు, నేటి సువార్త పఠనంలో, “పెండ్లి పిలుపు” అను ఒక అద్భుతమైన ఉపమానాన్ని మన ముందుంచుతున్నారు. ఒక రాజు తన కుమారుడి వివాహ విందును సిద్ధం చేస్తాడు. సమస్తం సిద్ధంగా ఉంది, విందు ఏర్పాటయింది, ఆహ్వానాలు కూడా పంపబడ్డాయి. అయినప్పటికీ ఆహ్వానించబడిన అతిథులు రాలేదు. కొందరు తమ పొలాల పనుల్లో నిమగ్నమయ్యారు, మరికొందరు వ్యాపారాలతో బిజీగా ఉన్నారు, ఇంకొందరు రాజు పంపిన సేవకులను చిన్నచూపు చూసి అవమానించారు. యేసు కేవలం ఒక పెండ్లి కథను లేదా పెండ్లి విందును గూర్చి మాత్రమే చెప్పడం లేదు. దేవుని వాగ్దానాలను ఎరిగినప్పటికీ, తన కుమారుని ద్వారా వచ్చిన దేవుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్న వారితో ఆయన మాట్లాడుతున్నారు. చరిత్ర అంతటా దేవుడు పంపిన ఎందరో దూతలకు, ఈ సేవకులు ప్రతీకలుగా ఉన్నారు. ఈ ‘పెండ్లి విందు’ అనేది దేవుడు తన ప్రజలతో పంచుకోవాలని పరితపించే ‘పరలోక రాజ్యానికి’ సూచనగా ఉంది. ప్రజలు దేవుని ఆహ్వానాన్ని ఇతర విషయాలన్నింటికంటే తక్కువ ప్రాధాన్యమైనదిగా చూసారు!

మనం కూడా లౌకిక విషయాల కోసం పాకులాడే క్రమంలో, మనలో చాలామంది మొదటి ఆహ్వానితుల వలె దేవుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాము లేదా నిర్లక్ష్యం చేస్తున్నాము. దేవుని ‘పర్వతానికి’, ‘దేవుని సన్నిధికి’ రావడానికి మనకు సమయం లేదు, ప్రార్థనకు అసలు సమయం దొరకదు, కానీ లౌకిక విషయాల కోసం మాత్రం మన దగ్గర సమయం ఉంటుంది. పొలం ఉండటం తప్పు కాదు, వ్యాపారం చేయడం కూడా తప్పు కాదు. అసలు విషయం ఏమిటంటే, పొలం పనులు, వ్యాపార పనులు, దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. మనలో చాలామంది దేవున్ని ద్వేషించడం వల్ల విశ్వాసాన్ని కోల్పోవడం లేదు; బహుశా దేవుని కోసం సమయం కేటాయించక... మన పనులలో బిజీగా ఉండిపోవడం వల్ల... విశ్వాసాన్నికోల్పోయే అవకాశం ఉంది!

జీవనోపాధి సంపాదనలో పడి, బ్రతకడమే మర్చిపోతున్నాం. భవిష్యత్తును ప్లాన్ చేసుకునే హడావుడిలో, మన ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఫోన్‌లతో కాలం గడుపుతూ, పక్కన ఉన్నవారినికూడా పట్టించుకోవడం లేదు. ఎన్నో పనులతో బిజీగా మారి, అన్నింటికీ అర్థాన్నిచ్చే ఆ ఏకైక దేవునికి మన జీవితంలో చోటు లేకుండా చేస్తున్నాం.

ఈ రోజుల్లో చాలామంది తాము ఒంటరిగా మోయకూడని బరువులను మోస్తూ అలసిపోతున్నారు. తమ ఆందోళనలను, భయాలను, నిరాశలను, గాయాలను ఒంటరిగా మోస్తున్నారు. తమ పిల్లల గురించిన బెంగ, భవిష్యత్తు గురించిన చింత, ఆరోగ్యం, ఆర్థిక విషయాల గురించిన భయాలను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. అయితే దేవుని ఆహ్వానం ఖచ్చితం: “నా వద్దకు రండి. నాతో నడవండి. నేను మిమ్మల్ని బలపరుస్తాను. మీకు విందును సిద్ధపరుస్తాను. మిమ్మల్ని స్వస్థపరుస్తాను” అని ఆహ్వానిస్తున్నారు. దేవుని ఆహ్వానం అనేది మనపై మోపే మరొక భారం కాదు; మనం ఇప్పటికే మోస్తున్న భారాలకు అది చక్కటి పరిష్కారం.

మనం బిజీగా ఉన్నందువల్ల బహుశా దేవునికి దూరంగా ఉంటున్నామేమో! లేదా మనం అర్హులం కాదనే భావనతో దూరంగా ఉంటున్నామేమో! చెడిపోయిన సంబంధాలు, వైఫల్యాలు, తప్పుడు నిర్ణయాలు, గత పాపాలను తలచుకుంటాము. మనలో మనమే, మనకు ఇంకా దేవుని హృదయంలో చోటుందా అని సంశయిస్తాము. నేటి సువార్త దానికి స్పష్టమైన సమాధానం ఇస్తుంది. రాజు పదే పదే ఆహ్వానాలు పంపుతూనే ఉన్నాడు. మన గురించి సమస్తం తెలిసినప్పటికీ, దేవుడు మనల్ని తన ‘విందుకు’ రమ్మని కోరుకుంటున్నాడు. ఈ ఆహ్వానం పరిపూర్ణులైన వారి కోసం కాదు; రావడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరి కోసం. మనం ఎంత దూరంగా వెళ్లిపోయినప్పటికీ, ప్రభువు మనల్ని వెనక్కి పిలుస్తూనే ఉన్నాడు.

సువిషేశములో వింటున్నట్లుగా, అప్పుడు ఆ ప్రభువు కోపగించి, తన సైన్యమును పంపి, ఆ హంతకులను హతమార్చి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. ఆ తర్వాత తన సేవకులను పిలిచి, “నా విందు సిద్ధముగా ఉన్నది, కానీ నేను మొదట ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు; కాబట్టి మీరు వీధి మార్గములకు వెళ్లి మంచి చెడు తేడా లేకుండా కంటబడిన వారందరినీ పిలుచుకొని రండు” అని పంపాడు. ఆ సేవకులు పురవీధులలోనికి వెళ్లి అందరినీ తీసుకొని వచ్చి ఆ కళ్యాణ మండపమును అతిథులతో నింపారు.

ప్రతి ఆదివారం దేవుడు తన ప్రజల కోసం ఒక విందును సిద్ధం చేస్తాడు. ప్రతి ఆదివారం ఆయన వేర్వేరు దేశాలు, భాషలు, సంస్కృతుల నుండి ప్రజలను ఒక్కచోట చేర్చుతాడు. ప్రతి ఆదివారం ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మరియు క్రీస్తు తన దివ్య శరీరరక్తాలతో మనకు పోషణనిస్తాడు. దివ్యబలిపూజ అనేది కేవలం నెరవేర్చవలసిన ఒక బాధ్యత మాత్రమే కాదు. అది స్వీకరించవలసిన ఒక ఆహ్వానం. మనం ప్రేమించబడ్డామని, స్వాగతించబడ్డామని, జ్ఞాపకం చేసుకోబడ్డామని దేవుడు మనకు ప్రతి వారం అందించే సుందరమైన జ్ఞాపిక ఇది. విందు కోసం ప్రజలను ఆహ్వానించడానికి సేవకులు పదేపదే పంపబడుతున్నారు. అదే సంఘం యొక్క శాశ్వతమైన సేవ. ఈ ఆహ్వానాన్ని అందుకున్న మనం, ఆ ఆహ్వానాన్ని ఇతరులకు అందించే దూతలుగా పిలువబడుతున్నాము.

నేటి మన ప్రపంచం ఒంటరితనంతో, గాయాలతో, నిరుత్సాహంతో, అర్థం కోసం వెతుకుతున్న ప్రజలతో నిండి ఉంది. కొన్నిసార్లు సువార్త ప్రకటన చాలా సరళమైన మాటలతో మొదలవుతుంది: “రండి, ప్రార్థన చేద్దాం.” “నాతో పాటు పూజకి రండి.” “వచ్చి చూడండి.” ప్రభువు తన విందు శాలయైన దేవాలయాన్ని నింపాలని కోరుకుంటున్నాడు, అందుకే ఇతరులను తీసుకువచ్చేలా ఆయన మనల్ని పంపుతున్నాడు.

ఉపమానములో, ఎందుకు ఒక వ్యక్తి బయటకి గెంటివేయబడ్డాడు? ఎందుకన “వివాహ వస్త్రము” లేకయే పెండ్లి విందుకు వచ్చాడు. ఆనాటి కాలములో, అందరికీ “వివాహ వస్త్రము” ఉచితముగా ఇవ్వబడుతుంది. కాని ఆ వ్యక్తి దానిని ధరించడానికి నిరాకరించాడు. ఇది రాజుకు చేసిన తీవ్రమైన అవమానం. ఉపమానములో రాజు తన అతిథుల కోసం వివాహ వస్త్రాలను అందించినట్లే, దేవుడు మానవజాతికి విశ్వాసాన్ని మరియు రక్షణను అందించాడు. క్రీస్తు యేసులో మరియు ఆయన ద్వారా వీటిని మనకు ఉచితంగా అందుబాటులో ఉంచాడు. వాటిని ధరించడానికి నిరాకరించడం అంటే విందును కోల్పోవడమే! దేవుని పర్వతం మీద “విడులో” పాల్గొనుటకు, మర్యాద, మంచి ప్రవర్తన, విశ్వాసము, భక్తి, విధేయత ఉండాలి.

ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు:

1. అందరికీ పిలుపు: ప్రియ విశ్వాసులారా! దేవుని పిలుపు అందరికీ ఉంది. గొప్పవారికి ఉంది, దీనులకు ఉంది, పాపులకు కూడా ఉంది. ఎట్టి విభేదమూ లేకుండా సమస్త ప్రజలకు దేవుని ఆహ్వానం అందుబాటులో ఉంది.

2. బాధ్యతాయుతమైన జీవితం: దేవుని పిలుపును, ఆయన అప్పగించిన బాధ్యతను ఎవరైతే గౌరవంతో, బాధ్యతతో నెరవేరుస్తారో వారే సన్మానింపబడతారు. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన ప్రణాళికను నెరవేరుస్తూ, దైవానుసరణలో ఉండే వారందరూ ఆ విందుకు యోగ్యులే. ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వారు ఆ విందులో పాలుపంచుకుని ఆనందిస్తారు.

3. పరలోక రాజ్య విందు: ఈ ఉపమానంలో ‘విందు’ అనగా పరలోక రాజ్య ఆహ్వానమే! దేవుని పిలుపును మనం నిర్లక్ష్యం చేస్తే కాలం చెల్లిపోతుంది; దేవుడు తెరిచిన పరలోక తలుపులు మూసుకుపోతాయి. కాబట్టి, మన సొంత ఆలోచనలను పక్కన పెట్టి, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను భక్తిశ్రద్ధలతో నెరవేర్చాలి.

4. ఇహలోక బాధ్యతలు: మన ఉద్యోగ బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను, దేవుని సేవా బాధ్యతలను సరైన రీతిలో నిర్వర్తించాలి. వాటిని విస్మరించి ప్రక్కదారులు పడితే అది దేవుని ప్రణాళికను నెరవేర్చినట్లు కాదు.

5. పెండ్లి వస్త్రం మరియు మన నీతివంతమైన జీవితం: పెండ్లి విందు ఉపమానంలో మొదటిగా ఎంపికచేయబడిన వారు తమ అహంభావం వల్ల ఆ విందులో పాలుపంచుకోలేకపోయారు. మనకు పరలోక భాగ్యమును దయచేయడానికి దేవుడు తన ఏకైక కుమారుని భూమికి పంపిస్తే, మనం ఆ దైవకుమారుని సిలువ వేసి చంపాము.

పెండ్లి విందులో రాజు వివాహ వస్త్రం లేని వానిని చూసి, కాళ్లు చేతులు కట్టివేసి చీకటిలోనికి త్రోసివేయమని ఆజ్ఞాపించాడు - అదే నరకము. ఇక్కడ మన వివాహ వస్త్రం అనగా మన ‘నీతివంతమైన జీవితమే!’ నీతి, న్యాయం, నియమం, విలువలు మరియు దైవాజ్ఞలను పాటించకపోతే నిత్య నరకాగ్నిని అనుభవించాల్సిందే.

ముగింపు - పిలుపు: దేవుడు మనకు ఒకే హెచ్చరికను, సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. దైవరాజ్య ఆహ్వానంలో మనం ఉండాలన్నా, అందులో ఆనందించాలన్నా దేవుని అనుసరణే ప్రధానం. దేవుడు ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకతను దయచేశారు. ఆ ప్రత్యేకతను అసమర్థతతో పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవించ కూడదు. చివరి శ్వాస వరకు దేవుని అనుసరణే ప్రధానంగా భావించి... నీతిని, న్యాయమును, ప్రేమను, సాటివారి యెడల సహాయక గుణమును, సహనమును, ఓర్పును, దేవునియందు భక్తి విశ్వాసములను కలిగి జీవిద్దాం. అప్పుడు, పిలువబడిన అనేకులలో ఎన్నుకోబడిన కొందరిలో మనము తప్పనిసరిగా ఉంటాము!

మనం ఈ దివ్యబలిని జరుపుకుంటున్నప్పుడు, మనం మొదలుపెట్టిన ప్రశ్నను మరొకసారి అడుగుదాం, ‘దేవుని యొక్క ఆహ్వానాన్ని లేదా పిలుపును మనం చివరిసారిగా ఎప్పుడు నిర్లక్ష్యం చేశాము?’ బహుశా ఆ ఆహ్వానం నేడు మళ్లీ మన వద్దకు వస్తోందేమో! ప్రార్థించడానికి, క్షమించడానికి, సమాధానపడటానికి, నమ్మకం ఉంచడానికి, సేవ చేయడానికి, తిరిగి రావడానికి, ప్రేమించడానికి ఒక పిలుపు ఇది! దేవుడు మనలను ఆహ్వానించడం ఎప్పటికీ ఆపలేదనేదే నేటి వాక్యాల ద్వారా మనకు అర్ధమగుచున్నది. విందు సిద్ధంగా ఉంది; తలుపులు తెరచి ఉన్నాయి, ప్రభువు వేచి చూస్తున్నాడు. దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడా లేదా అనేది ప్రశ్న కాదు, మనం ఆయన పిలుపునకు, ఆహ్వానానికి స్పందిస్తామా లేదా అనేదే ప్రశ్న! నేడు మన సమాధానం ఎంతో సరళంగా, వినయంగా, హృదయపూర్వకంగా ఉండాలి: “ప్రభువా, నేను వస్తున్నాను” అని!

ముగింపు: దేవుని విందులో నిత్యజీవమును సొంతం చేసుకుందాం!

ఈ సృష్టిలో జీవించిన ప్రతి ఒక్కరూ దేవుని విందుకు ఆహ్వానింపబడినవారే! కానీ ఆ దివ్య విందులోకి, కోరబడిన ఆ ప్రత్యేక వస్త్రంతో (నీతివంతమైన జీవితంతో) ప్రవేశించాలంటే మాత్రం మనం పూర్తిగా దేవుని కనుసన్నలలో, ఆయన మార్గంలో జీవించాలి. దేవుని ఆహ్వానమునకు తగిన పవిత్రమైన జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. విచ్చలవిడితనంతో కూడిన, ఇష్టానుసారమైన లేదా స్వార్థపరమైన జీవితం ఎప్పుడూ దేవుని పిలుపునకు తగినది కాదు. అయితే, ఎటువంటి జీవితం దేవుని పిలుపునకు అంకితమై ఉందో మన అంతరాత్మకు బాగా తెలుసు! నీతి మార్గమే పరలోక మార్గం! అటువంటి నీతి మార్గంలో నడుస్తూ, దేవుడు మన కొరకు ప్రత్యేకంగా ఏర్పరిచిన పరలోక రాజ్య నివాస స్థలమునకు చేరుకుందాం.

“దేవా! నీవు ఎన్నుకునే ఆ పవిత్ర గుంపులో నేనూ ఉండాలి; నా జీవితాన్ని నీ చేతులలోకి తీసుకుని, నీ ఆజ్ఞలలో, నీ వాక్కులో నన్ను తీర్చిదిద్దు నాయనా!” అని ఆ దేవాది దేవుని వేడుకుందాం. దేవుని పరలోక విందులో, ఆ తీర్పు దినాన నిలబడి విజయం సాధించి, నిత్య జీవములోనికి ప్రవేశమును పొందుకుందాం.

“నేను దైవ రాజ్యమునకు చేరుకోవాలి” అనే ఈ పవిత్రమైన తపనను, సంకల్పాన్ని దేవుడు మన జీవితంలో తప్పక నెరవేరుస్తారు. ఆ పరలోక భాగ్యమును పొందే గొప్ప ఆశతో, ఓర్పుతో, భక్తి విశ్వాసాలతో ముందుకు సాగిపోదాం.

ఆమేన్!

29వ సామాన్య ఆదివారము, A

 29వ సామాన్య ఆదివారము, A

యెషయ 45:1, 4-6; 1 తెస్స 1:1-5; మత్త 22:15-21

దేవుని రాజ్యములో మన బాధ్యతలు - వేదవ్యాపక ఆదివారము

ఉపోద్ఘాతము: క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ రోజు దైవార్చన కాలములో 29వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము. దేవుని ఎంపికను, పిలుపును స్వీకరించి ఆయనకు లోబడదాం. దేవుని చిత్తమును సత్యముతో నెరవేరుస్తూ, మనకు అప్పగించిన బాధ్యతలను క్రియల రూపంలో నెరవేరుద్దాం. సత్యమును కలిగి, దేవునికి ఘనత తెచ్చేలా ప్రవర్తిద్దాం.

దేవునికి ‘వీరు నా బిడ్డలు, వారు పరాయి బిడ్డలు’ అనే తారతమ్య భావన ఎంతమాత్రమూ ఉండదు. అన్యులైనా, క్రైస్తవులైనా దేవునికి అందరిపై సమానమైన ప్రేమ ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి తన వద్దకు పిలుచుకుంటాడు, తన రక్షణ ప్రణాళికలో భాగస్వాములను చేస్తాడు. నిజమైన దేవుడు ఏకైక దేవుడని తెలుసుకొని, ఆయన పిలుపును ఆలకించి నెరవేర్చే వారికి దేవుని పరలోక రాజ్య మహిమలో భాగం ఉంటుంది.

మొదటి పఠనము (యెషయ 45:1, 4-6): మొదటి పఠనంలో దేవుడు అన్యుడైన కోరెషు రాజును గూర్చి మాట్లాడుతున్నాడు. కోరెషు యూదుడు కాదు, దేవున్ని ఎరుగని అన్యుడు. అయినా దేవుడు కోరెషుతో ఇలా అంటున్నాడు, “నేను నిన్ను పేరు పెట్టి పిలిచానని నీవు గ్రహిస్తావు. నీవు నన్ను ఎరుగకున్నను నేను నిన్ను ఘనునిగా చేసెదను.” అని! అన్యుడైన కోరెషు రాజును కూడా దేవుడు అభిషిక్తునిగా చేసి, తన ప్రణాళికను నెరవేర్చడానికి ఎన్నుకున్నాడు.

దేవుడు తన ప్రజలను విడిపించడానికి కోరెషు రాజును ఒక ‘కాపరి’గా నియమించుకున్నాడు. దేవుడు తనకు తానుగా స్వయంగా ఇలా పలుకుతున్నారు, “మొదటివాడను, కడపటివాడను నేనే. నేను తప్ప ఏ దైవము లేదు. నాకు సాటివాడు లేడు.” దేవుని గొప్పతనమును, కృపను, ఈ పఠనం ద్వారా మనం గ్రహించాలి. దేవుడు పడిపోయిన వాటిని లేవనెత్తుతాడు; సమస్తమూ ఆయనకు సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనే వాస్తవాన్ని విశ్వాసులమైన మనమందరమూ గుర్తించాలి. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి అన్యుడైన కోరెషు రాజును వాడుకున్నాడు. దేవునికి పని చేయడానికి విశ్వాసపాత్రులైన వారే కాదు, ఎవరైనా సాధనం కావచ్చు! నేను బలహీనుడను, నాకేం సామర్థ్యం ఉంది?" అని మనం అనుకోకూడదు. అన్య రాజునే కాపరిగా మార్చుకున్న దేవుడు, బలహీనులమైన మనలను కూడా తన మహిమార్థం గొప్ప సాధనాలుగా మార్చగలడు. మన ప్రవర్తన ద్వారా అన్యులకు కూడా దేవుని ప్రేమను చాటిచెప్పే బాధ్యత మనపై ఉంది అని గ్రహిద్దాం.

ప్రియ విశ్వాసులారా! నిన్ను, నన్ను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అందుకే మనం ఈ సృష్టిలో దేవుని రూపంలో, పోలికలో రూపుదిద్దుకున్నాం. దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీయులను విడిపించడానికి ఒక అన్య రాజును వాడుకున్నాడు. మనము ఎంత అయోగ్యులమైనా, దేవుడు మనల్ని యోగ్యులుగా ఎన్నుకొని తన ప్రణాళికలో వాడుకుంటాడు; మనల్ని ఘనులుగా చేస్తాడు. కాబట్టి, దేవుని ఆనుకొని జీవించే జీవితం మనకు ఉండాలి. ఆయన పిలుపుకు తలవంచి, ‘చిత్తం ప్రభూ!’ అని దేవుని ముందు నిలబడగలిగే మనసు ఉండాలి. కోరెషు రాజు దేవుని పిలుపును ఆలకించాడు. మరి నీవు, నేను, మనమందరం దేవుని పిలుపును మరియు ఆయన ప్రణాళికను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం.

రెండవ పఠనము (1 తెస్స 1:1-5): రెండవ పఠనంలో పునీత పౌలు గారు తెలియజేస్తున్న సత్యాలను గ్రహించి, దేవుని యందు మరింత విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించుకుందాం. దేవునిచే పిలువబడి, మార్చబడి, ఎన్నుకోబడిన పౌలు గారి సువార్త జీవితం, దేవునికి సాక్ష్యంగా మన ముందు ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి తన వారిగా ఎన్నుకున్నాడని పౌలు గారు తెలుపుతున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన సువార్తను ప్రచారం చేశారు. కాబట్టి దేవుని వాక్కును, పరిశుద్ధాత్మ శక్తిని స్వీకరించి, ఆత్మపూరితులమై దేవుని సేవలో వాడబడుదాం.

మన సువార్త సేవ అనేది కూడా కేవలం మాటలకే పరిమితం కాకూడదు; అది క్రియలతో కూడిన విశ్వాసంగా, త్యాగంతో కూడిన ప్రేమగా వ్యక్తమవ్వాలి.

సువిశేష ధ్యానము (మత్త 22:15-21): ఈనాటి సువార్తలో పరిసయ్యులు, హేరోదీయులు కలిసి యేసుప్రభువును మాటలలో చిక్కించుకోవాలని పన్నుగడ పన్నారు. ‘చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా? కాదా? నీ అభిప్రాయ మేమి?’ అని అడిగారు. పరిసయ్యులు కల్మషంతో నిండిన హృదయాలతో ప్రభువును పైపై మాటలతో పొగిడారు, “బోధకుడా! నీవు సత్యవంతుడవు; దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు; ఎవరికి భయపడవు; మోమాటము లేనివాడవు” (22:16) అని అన్నారు. ఈ విధముగా, వారి కపట బుద్ధి, కపట వేషధారణ కనిపిస్తుంది. పరిసయ్యులు ప్రభువును పొగుడుతూనే, లోపల కుట్ర పన్నారు.

నేటి క్రైస్తవ జీవితంలో కూడా పైకి భక్తిపరులుగా కనిపిస్తూ, హృదయాలలో ఈర్ష్య, పగ, కపటం కలిగి ఉండటం దేవునికి అసహ్యకరం. దేవునికి మన పెదవుల స్తుతి కంటే, హృదయశుద్ధి ముఖ్యం. దేవునితో మరియు తోటివారితో మన ప్రవర్తన కపటం లేకుండా, నిజాయితీతో ఉండాలి.

వారు అడిగిన ప్రశ్నకు “అవును న్యాయ సమ్మతమే” అని సమాధానం చెబితే, ప్రజలు యేసును ద్వేషిస్తారని తలంచారు. ఎందుకంటే, విదేశీ (రోమీయ) ప్రభుత్వానికి సుంకములు (పన్నులు) కట్టడం ఎవరికీ ఇష్టం ఉండేది కాదు. యూదులు దానిని అవమానముగా, దైవదూషణగా  భావించేవారు. అలా కాకుండా, “కాదు. న్యాయ సమ్మతం కాదు” అని చెబితే, పరిసయ్యులు వెంటనే యేసు మీద రోమను అధికారులకు పిర్యాధు చేయ తలంచారు. యేసును ప్రభుత్వ వ్యతిరేకిగా, విప్లవకారుడిగా, తిరుగుబాటు దారుడిగా చిత్రీకరించాలని భావించారు. అట్లయినచో, రోమను అధికారం యేసును బంధించి, చెరలో వేసేవారు.

యేసుప్రభువు వారి దురాలోచనను గుర్తించి, ఒక దీనారమును తెప్పించి “ఈ రూపు, నామధేయం ఎవరివి?” అని అడిగారు. ‘చక్రవర్తివి’ అని వారు చెప్పగా, అప్పుడు యేసు ప్రభువు “చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునికి చెల్లించండి” అని చెప్పారు. ఒక నాణెం మీద రాజు బొమ్మ ఉన్నట్లే, ప్రతి మనుష్యుని ఆత్మపై దేవుని రూపం (దేవుని ముద్ర) చెక్కబడి ఉంది (ఆది 1:27). కాబట్టి, లౌకిక రాజ్యాలకు చెల్లించాల్సిన పన్నులు/బాధ్యతలు నెరవేరుస్తూనే, దేవునికి చెందిన మన ‘హృదయాన్ని, ఆత్మను, జీవితాన్ని’ పూర్తిగా దేవునికే అర్పించాలి. మనం దేవుని సొత్తు, లోకపు సొత్తు కాదు!

ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలం ప్రభుత్వానికి విధేయులమై, న్యాయంగా జీవించాలి. అయితే మన సర్వస్వం లౌకిక ప్రభుత్వాలు కాదు; మనం ఎల్లప్పుడూ దేవునికి విధేయులమై, దేవుని సొత్తుగా బాధ్యతతో ఆయన ప్రణాళికను నెరవేర్చాలి. మన ఈ జన్మ, మన ఈ జీవితం, మన ఆత్మ దేవుని సొంతం. దేవుని యెడల మనకు ఉన్న ప్రేమ, భక్తి, విశ్వాసాలలో సత్యం ఉండాలి. నలుగురిలో ఘనత కోసమే మన క్రియలు ఉంటే దేవుడు మనల్ని అసహ్యించుకుంటాడు.

మన పిలుపు - బాధ్యత: దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ ఒక ప్రత్యేక బాధ్యతతో పిలుచుకున్నాడు:

దేవుని సేవకులు: దేవుడు సేవ చేయడానికి సంఘ కాపరులుగా, గురువులుగా, కన్యస్త్రీలుగా, ఉపదేశకులుగా ఎన్నుకున్న వారు ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా సేవ చేయాలి. సంఘ కాపరి తనకు అప్పగించబడిన ప్రతి కుటుంబాన్ని తన మందలో కలుపుకొని ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ చూపాలి.

ఉపాధ్యాయులు: దేవుడు తమకు అప్పగించిన విద్యాబోధన బాధ్యతను కష్టపడి, నిష్టతో నెరవేర్చాలి.

రైతులు: దేవుడు ఇచ్చిన భూమిని కల్మషం లేకుండా సాగు చేసి, స్వచ్ఛమైన పంటను సమాజానికి అందించాలి.

ఇలా ఈ సృష్టిలో ఎవరెవరికి ఏ బాధ్యత అప్పగించబడిందో, దేవుని పిలుపును గమనించి ఆ బాధ్యతలను నెరవేర్చడానికి కావలసిన ఓర్పును, నీతిని, న్యాయాన్ని అలవర్చుకోవాలని ప్రార్థిద్దాం.

ముగింపు: మనం దేవునిచే ఎన్నుకోబడిన బిడ్డలం. దేవుడు మన జీవితంలో అప్పగించిన బాధ్యతలను భక్తితో, విశ్వాసంతో, శ్రద్ధతో నెరవేరుద్దాం. దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో ఎన్ని కష్టాలు, అవాంతరాలు వచ్చినా, ఆయన పిలుపును గౌరవిస్తూ అపార విశ్వాసంతో ముందుకు సాగుదాం. కోరెషు రాజువలె, పౌలు గారి వలె మనం కూడా దేవుని ప్రణాళికలో ఎన్నుకోబడిన వారమని గుర్తెరిగి, దేవునికి ప్రీతిపాత్రంగా జీవిస్తూ ఆయనను ఘనపరుద్దాం.

పోప్ లియో XIV గారి ప్రపంచ వేదవ్యాపక ఆదివార సందేశం (క్లుప్తంగా)

నేడు ప్రపంచ వేదవ్యాపక దినోత్సవం (వరల్డ్ మిషన్ డే)! ఈ వేదవ్యాపక దినోత్సవమును స్థాపించి నేటికి సరిగగ్గా 100 సంవత్సరాలు పూర్తవుతోంది! 1926వ సంవత్సరంలో, పొప్ పయస్ XI, ప్రపంచ వేదవ్యాపక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ వంద సంవత్సరాల చారిత్రాత్మక సందర్భంలో, పొప్ లియో XIV, 2026వ సంవత్సరానికి గాను “క్రీస్తునందు ఏకమై, సువార్త సేవలో సమైక్యమై” అనే అంశాన్ని మన ధ్యానం కొరకు ఎంచుకున్నారు. జూబిలీ సంవత్సరం ముగిసినప్పటికీ, పరిశుద్ధాత్మ దేవుని ఆనందోత్సాహాలతో శ్రీసభ తన సువార్త ప్రచార ప్రయాణాన్ని కొనసాగించాలి. దానికి క్రీస్తునందు ఏకమైన హృదయాలు, సమాధానపడిన సమాజాలు, ఉదారమైన సహకారం ఎంతో అవసరం అని పొప్ లియో గారు గుర్తుచేశారు.

1. క్రీస్తులో ఐక్యతే సువార్త సేవకు మూలాధారం

క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండటమే వేదవ్యాపకమునకు హృదయస్పందన వంటిది. “వారందరును ఏకమై యుండవలెను” అని యోహాను 17:21లో యేసు చేసిన ప్రార్థన, త్రిత్వైక దేవుని నుండి విశ్వాసులకు ప్రవహించే ఐక్యతను తెలియజేస్తోంది.

క్రైస్తవ జీవితం అంటే కేవలం ఆచారాలు పాటించడం కాదు; ద్రాక్షావల్లిలో తీగల వలె నిరంతరం క్రీస్తులో నిలిచి ఉండటమే (యోహాను 15:4). పునీత పొప్ జాన్ పాల్ II గారు చెప్పినట్లు: “సహవాసమే మిషన్ యొక్క మూలం, మరియు ఫలం.”

మన సమాజంలో విభేదాలు, నమ్మకలేమి ఉన్నప్పుడు, అది మనం ఇచ్చే సువార్త సాక్ష్యానికే విఘాతం కలిగిస్తుంది. కావున, నైసియన్ మహాసభ 1700వ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని, వివిధ క్రైస్తవ శాఖల మధ్య ఐక్యతా ప్రయత్నాలను బలపరచాలి. “ఇక జీవించునది నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు” అని గలతీ 2:20లో పౌలుగారు చెప్పినట్లు, మన జీవితాలకు క్రీస్తే కేంద్రం కావాలి. పొప్ పాల్ VI గారు అన్నట్లు, “యేసుక్రీస్తు నామం, బోధన, జీవితం ప్రకటించబడకపోతే అక్కడ నిజమైన సువార్త ప్రచారం లేనట్లే” అని.

2. సువిశేష ప్రచార బాధ్యతలో ఐక్యంగా – లోకం క్రీస్తును విశ్వసించేలా

శిష్యుల ఐక్యత లోకం క్రీస్తును విశ్వసించడానికే ఉపకరించాలి (యోహాను 17:21). దైవసేవకుడు పౌలో మన్నా గారు, “సమస్త లోక పరివర్తన కొరకు సమస్త శ్రీసభ” అని పిలుపునిచ్చినట్లు, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరూ సువార్త ప్రచారంలో భాగస్వాములే! మిషనరీ ఐక్యత అంటే ఏకరూపత (Uniformity) కాదు; వివిధ వరాలు, ఆత్మీయ అనుభవాలు, క్రీస్తు ప్రేమను చాటడానికి ఒకే చోట కలవడం.

3. ప్రేమించే మిషన్ – దేవుని నమ్మకమైన ప్రేమను ప్రకటించడం, జీవించడం

ఐక్యత మిషన్‌కు ప్రాథమిక షరతు అయితే, ప్రేమే దాని యొక్క సారం. పరలోక తండ్రికి యేసు చేసిన ప్రార్థన నెరవేర్పుగా (యోహాను 17:26) అపొస్తలులు, వేదసాక్షులు, దైవిక ప్రేమను చాటడానికి తమ ప్రాణాలను సైతం అర్పించారు.

ప్రతికూలతలు, పేదరికం, అనేక సవాళ్ళు ఉన్న ప్రాంతాలలో నిస్వార్ధ సేవలందిస్తున్న మిషనరీలకు లియో జగద్గురువులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు. పునీత ఫ్రాన్సిస్ అస్సిసి గారి “మనలను ఎంతో ప్రేమించిన ఈ ప్రేమ ఎంతో ప్రేమించబడాలి” అనే ఆదర్శం, అలాగే పునీత థెరెసా గారి “యేసును ప్రేమించడం, ఆయన ప్రేమించబడేలా చేయడం” అనే ఆదర్శంతో మన మిషనరీ పిలుపును బలపరచుకుందాం అని లియో జగద్గురువులు పిలుపునిచ్చారు. చివరిగా ‘మీ ప్రార్థనలు, విరాళాలు పేదలకు, అవసరంలో ఉన్నవారికి సువార్తను అందించడంలో ఎంతగానో తోడ్పడతాయి’ అని లియో గారు పిలుపునిచ్చారు.

సువార్త ప్రచారం మన అందరి బాధ్యత. సమైక్యంగా సువార్త సేవలో భాగాస్తులమవుదాం! నేటి ఆధునిక కాలంలో సువార్త ప్రచారం అంటే కేవలం దూర ప్రాంతాలకు వెళ్లడం మాత్రమే కాదు. మన ఇల్లు, మన పని ప్రదేశం, మరియు సోషల్ మీడియా (డిజిటల్ మీడియా) వేదికగా క్రీస్తు ప్రేమను, సత్యాన్ని, శాంతిని వ్యాప్తి చేయడం కూడా ఒక గొప్ప వేదవ్యాపక బాధ్యతే!

సామాన్య 27వ ఆదివార వాక్యోపదేశము (A)

 సామాన్య 27వ ఆదివార వాక్యోపదేశము (A)
పఠనాలు: యెషయ 5:1-7; ఫిలిప్పీ 4:6-9; మత్త 21:33-43

సహోదరీ సహోదరులారా! ఈరోజు మనం సామాన్య 27వ ఆదివారములో ప్రవేశిస్తున్నాము. దేవుడు మనందరిపై అపారమైన ప్రేమను ఉంచి, ఈ జీవితమనే అందమైన ద్రాక్షతోటను మనకు కానుకగా ఇచ్చారు. ఈ లోకంలో మనం ఆనందంగా, పవిత్రంగా, ఫలభరితమైన జీవితాన్ని గడపాలని దేవుడు మనలనుండి ఆశిస్తున్నారు. అయితే, నేడు మనం చదువుచున్న పరిశుద్ధగ్రంథ పఠనాలు మనల్ని ఆత్మపరిశీలన చేసుకోమని పిలుస్తున్నాయి. అదేమంటే, దేవుడు మనకు సమకూర్చిన ప్రతి దానిని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాము? ఆయన ఆశించే మంచి ఫలాలను అందిస్తున్నామా, లేక మన స్వార్థం వలన, పుల్లని ఫలాలను మిగులుస్తున్నామా? ఈరోజు దేవుని వాక్కు ద్వారా మన జీవితాలను సరిదిద్దుకుందాం, ఆయన కృపను పొందుకుందాం!

యెషయా గ్రంథము 5:1-7 - ద్రాక్షతోట పాట: “నేను నా ప్రియునికి ఒక పాట పాడెదను, నా చెలికానిని గూర్చి, అతని ద్రాక్షతోటను గూర్చి పాడెదను. సారవంతమైన కొండపై నా ప్రియునికొక ద్రాక్షతోట కలదు. అతడు ఆ తోటను వ్వి రాళ్లు ఏరివేసి మేలైన ద్రాక్షతీగలు నాటెను. తోట నడుమ బురుజు కట్టి, రసము తీయుటకు తొట్టిని తొలిపించెను. అతడు ద్రాక్షపండ్ల కొరకు ఎదురుచూచెను. కాని ఆ తోట పుల్లని కాయలు కాచెను. ఇస్రాయేలు జనులు సైన్యములకు అధిపతియైన ప్రభువు ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకు ప్రీతి గొలుపు వనము.
ఆయన న్యాయమును అపేక్షించెనుగాని, అక్కడ దౌర్జన్యముండెను. ఆయన నీతిని కాంక్షించెనుగాని అన్యాయమునకు బలియైన వారి ఆక్రందనము వినిపించెను.”

మొదటి పఠనమును ధ్యానించి, మన జీవితములను సరిచేసుకుందాం: దేవుడు నాటిన ద్రాక్షతీగలము... మనమే. దేవునికి మన యెడల ఎంతో శ్రద్ధ, ప్రేమ. దేవుడు మన జీవితములలో ఉన్న, కష్టమనెడి, దుఃఖమనెడి ఎత్తు పల్లములను, మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను, పాపములను, దేవుడు సరిచేసి మనల్ని మన్నిస్తారు. బురుజు వంటి దేవుని కాపుదల ఆయన బిడ్డలమైన మనకు ఎల్లప్పుడూ ఉండేలాగా దేవుడు మన యెడల ప్రత్యేకతను, ప్రత్యేక బాధ్యతను, ప్రత్యేక ప్రణాళికను, ప్రత్యేక భద్రతను కలిగి ఉన్నారు.

మొదటి పఠనములో దేవుని వాక్కు, నిన్ను... నన్ను గూర్చి... మనలనందరిని గూర్చి... చెప్తుంది. దేవుడు ఈ లోకమున మనల్ని ఫలించుమని, స్వేచ్ఛగా... స్వచ్ఛముగా... పవిత్రముగా... ఆనందముగా... జీవించుమని, మనకు ఈ అమూల్యమైన జీవితములను ఇస్తే, మనము ఏం చేస్తున్నాము...

ఈ ద్రాక్షతోట పాటను మన జీవితములకు అన్వయించుకుందాం. మనము ద్రాక్షతోట... మనము ద్రాక్షతీగలము. మన కొరకు దేవుడు ఈ అందాల సృష్టిని ప్రసాదించారు. మనం జీవించడానికి మనకు అన్ని సదుపాయములను దేవుడు కల్పించారు. సృష్టిలో పంచభూతములను, మన జీవన విధానమునకు అనుగుణముగా సమస్తమును సృష్టిలో దేవుడు సమకూర్చారు.

ఉదాహరణకు, యజమానుడు ద్రాక్షతోటను నాటడానికి ముందు ఆ తోటలోని “రాళ్లను ఏరివేశాడు” అని 5:2 వాక్యంలో చదువుతున్నాం. ఈ ‘రాళ్లు’ మన జీవితంలోని కఠినమైన స్వభావానికి, పట్టుదలకు, క్షమించలేని గుణానికి, చెడు అలవాట్లకు సాదృశ్యం. దేవుడు మనల్ని ఫలభరితంగా మార్చడానికి మన హృదయాలలోని రాతి గుండెను తొలగించి, మెత్తటి కరిగిపోయే మనసును ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. మరి మనం ఆ శుద్ధిని అంగీకరిస్తున్నామా?

అలాగే, అదే వచనంలో, తోట నడుమ “బురుజు కట్టి, రసము తీయుటకు తొట్టిని తొలిపించెను”. ‘బురుజు’ అనేది శత్రువుల నుండి రక్షణనిచ్చే దైవిక కాపుదలకు చిహ్నం. ‘రసం తీసే తొట్టి’ దేవుడు మనపై పెట్టుకున్న ఆశకు ప్రతీక. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు కోటలా నిలబడి రక్షిస్తాడు. మరి ఆయన మన నుండి ఆశించే ‘రసం’ అంటే ప్రేమ, సేవ, దయ, కరుణ, మనం ఫలిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి!

అయితే, సహోదరీ, సహోదరులారా! “కాని ఆ తోట పుల్లని కాయలు కాచెను”. యజమానుడు ఎంతో కష్టపడి, మేలైన తీగలను నాటితే, అవి పుల్లని కాయలను కాచాయి. ఇది కేవలం దేవుని ఆగ్రహం మాత్రమే కాదు, ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కలేదన్న ఒక తండ్రి హృదయ వేదన! దేవుడు మనకు సమస్త భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను ఇచ్చి కాపాడుతుంటే, మనం ఆయనకు ప్రేమకు బదులుగా పాపాన్ని, స్వార్థాన్ని ఇస్తున్నప్పుడు ఆ తండ్రి హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో ఒక్కసారి ఆలోచించాలి! ద్రాక్షతీగలమైన మనము, దేవుని అడుగుజాడలలో నడవకుండా, ఆ ద్రాక్షతోటలోని ద్రాక్షతీగలు, పుల్లని కాయలను కాచిన మాదిరిగా... దేవుని ఆజ్ఞలను మీరుతున్నాం. స్వేచ్ఛ, విచ్చలవిడి పాపము వంటి ప్రవర్తన కలిగిన జీవితములను జీవించి దేవునికి మనస్తాపమును కలిగిస్తున్నాం.

దేవుడు మనల్ని న్యాయంగా జీవించమంటున్నారు. నీతిని పాటించమంటున్నారు. సాటివారి పట్ల ప్రేమను, కరుణను, ఉదారతను, చూపుమని తెలియజేస్తున్నారు. కానీ మనలో ఎల్లప్పుడూ స్వార్థమే. దేవుని మార్గము నుండి తప్పించుకొనే తనమే!

కాబట్టి, సహోదరీ సహోదరులారా! పుల్లని కాయల నుండి తీయని ద్రాక్షపండ్లుగా మారాలంటే మనకు కేవలం మాటలు సరిపోవు, ఆచరణ కావాలి. మన మాటలలో తియ్యదనం (ప్రేమ, ఓదార్పు) ఉండాలి కానీ ఇతరులను నొప్పించే మాటలు (పుల్లని కాయలు) ఉండకూడదు. మన చేతలలో న్యాయం, నీతి కనబడాలి. అన్యాయానికి గురైన వారి పట్ల సానుభూతి, తోటివారి పట్ల ఉదారత చూపడమే మనం దేవునికి అందించే అసలైన తీయని ద్రాక్షపండ్లు.

దేవుడు, మొదటి పఠనము నుండి మనల్ని గద్దిస్తున్నారు! అన్యాయమునకు బలియైన దేవుని బిడ్డల ఆక్రందనలు దేవుడు వినిపించుకుంటాడు, వారి యెడల శ్రద్ధ చూపిస్తాడు, అన్యాయముగా జీవించే వారిని శిక్షిస్తారు. మంచి పండ్లను ఇవ్వకుండా... పుల్లని కాయలను కాచిన ద్రాక్షతోటను దేవుడు, కఠినముగా శిక్షిస్తానని అంటున్నాడు. ఈ ద్రాక్షతోట ఇశ్రాయేలు జనులు మాత్రమే కాదు, నీవు, నేను, మనమందరము కూడా దేవుని తిరస్కరించి జీవిస్తే... కఠిన శిక్ష... అంటే నరకము మనకు తప్పదు! దేవునికి దూరమైన, ఆయన సొత్తుమైన మనము పశ్చాత్తాపము, మారుమనస్సు లేకుండా చివరి వరకు జీవిస్తే... దేవుడు మనపై విరుచుకుపడతాడు అనునది వాస్తవం! మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని తోటలో మంచి ఫలములను ఇస్తున్నామా? లేదా పుల్లని కాయలను ఇస్తున్నామా? దేవుడు ఆశించే విధముగా మనము మంచి తీయని ద్రాక్షపండ్లుగా మారుదాం. దేవుని సంతోషపెడదాం.

రెండవ పఠనమును ధ్యానిద్దాం: పునీత పౌలుగారు ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:6-9: “దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కాని, ఆ విధముగా అర్థించునపుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును... నా సోదరులారా! చివరి మాటగా చెప్పుచున్నాను. మంచివియు, స్తుతిపాత్రములైన వానితో మీ మనస్సులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండియు, చేతల నుండియు మీరు గ్రహించిన వానిని, పొందిన వానిని, ఆచరణలో పెట్టుడు. శాంతిని ఒసగు దేవుడు మీకు తోడగునుగాక!”

మన జీవితములలో విచారం లేకుండా, మనకు ఒక్కరోజు, ఒక్క క్షణం కూడా ముందుకు సాగదు. విచారం లేకుండా మనం అస్సలు ఉండలేమేమో! అందుకే పౌలుగారు అంటున్నారు, దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు ప్రార్థనలలో దేవుని అర్థింపుడు అని. పౌలు గారు కేవలం ప్రార్థించమనే అనలేదు, “కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో ప్రార్థింపుడు” అని చెప్పారు. మనకు సమస్యలు, విచారాలు వచ్చినప్పుడు దేవుని ముందు ఫిర్యాదు చేయడం కంటే, ఇప్పటివరకు ఆయన మనకు ఇచ్చిన ఆయురారోగ్యాలను, రక్షణను తలచుకుని కృతజ్ఞతలు చెప్పడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం కృతజ్ఞతతో ప్రార్థిస్తామో, మనలోని సగం ఆందోళనలు అక్కడికక్కడే తొలగిపోతాయి.

కానీ, మనకు కావలసినదే విచారము అన్నట్లుగా మనము జీవిస్తున్నాం! మన విచారము డబ్బులను గూర్చి, కుటుంబము గూర్చి, బిడ్డల భవిష్యత్తు గూర్చి, ఆరోగ్యమును గూర్చి, కుటుంబ కలహములను గూర్చి, ఇరుగుపొరుగు వారితో కలహాలను గూర్చి ఉంటుంది, కాని విచారించి మనం ఏమీ చేయలేము!

ప్రార్థన నుండి, మనల్ని ఇబ్బంది పెట్టే, చాలా వాటి నుండి, మనము విడుదలను పొందుకోవచ్చు. మన విచారము, మన అవగాహన ఏ పాటిది? దేవునికి ప్రార్థించుకుంటే మనకు శాంతి సమాధానములు లభిస్తాయి. దేవునికి మనం పెట్టుకొనే మొరల నుండి, ప్రార్థనల నుండి, చెల్లాచెదరైన మన ఆలోచనలు, మన మనస్సులు, దేవునియందు భద్రపరచబడతాయి. దేవుని సందేశాలలో నుండి, దేవుని బోధనల నుండి, దేవుని వాక్కు నుండి, మనకు శాంతి కలుగుతుంది. ఈ శాంతి మనకు ఎప్పుడు కలుగుతుంది? దేవుని వాక్కును మనం ఆచరణలో పెట్టి, నెరవేర్చితే, ఆ విధంగా నడుచుకుంటే, మనలో శాంతి సమాధానములు కలుగుతాయి. లోకంలో ఉండే శాంతి కేవలం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు మనకు ఇచ్చే శాంతి అటువంటిది కాదు. అది “మానవ అవగాహనకు అతీతమైనది”. అంటే చుట్టూ తుఫానులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, హృదయంలో మాత్రం దేవుడు ఇచ్చే అద్భుతమైన శాంతి ఉంటుంది. ఆ దివ్యశాంతి మన మనసులను, ఆలోచనలను క్రీస్తు యేసులో భద్రపరుస్తుంది.

పౌలుగారి సందేశాన్ని బట్టి, “మనము, మన మనస్సులను శుద్ధిచేసుకుందాం. ఇతరులలో మంచిని చూద్దాం. మనము మంచిని మాట్లాడుదాం. మంచిని పంచుదాం. మనమందరమూ మంచిని నెరవేర్చుదాం. మనలో ఉన్న విచారాలను విడిచిపెడదాం. మన మనస్సుల నిండా, దేవుని వాక్కును నిలుపుకుందాం. మన మనసులో ఉన్న దేవుని వాక్కును బట్టి, మన జీవితములను ముందుకు తీసుకువెళదాం.

సువార్తను ధ్యానిద్దాం. దైవానుసరణలో సరిచేయబడదాం: భూస్వామి – కౌలుదార్లు అను ఉపమానమును ఈరోజు ప్రభువు చెప్పుచున్నారు. పునీత మత్తయిగారు వ్రాసిన సువార్త 21:33-43: “మరియొక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్షతోటను నాటించి, చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి, గోపురము కట్టించి, కాపులకు కౌలుకిచ్చి దూర దేశమునకు వెడలెను. ద్రాక్షపండ్లు కోతకు వచ్చినపుడు, తన భాగమును తెచ్చుటకై కౌలుదార్ల యొద్దకు తన సేవకులను పంపెను. కాని, వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి; ఒకనిని చంపిరి; మరియొకనిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అపుడు ఆ యజమానుడు ముందటి కంటె ఎక్కువమంది సేవకులను పంపెను. కౌలుదార్లు వారిని కూడా అటులనే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి, అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదార్లు ఆ కుమారుని చూచి ‘ఇదిగో ఇతడే వారసుడు. ఇతనిని తుదముట్టింతము రండు. ఈ ఆస్తి మనకు దక్కును’, అని తమలో తాము చెప్పుకొని, వానిని పట్టుకొని ద్రాక్షతోట వెలుపల పడద్రోసి చంపిరి... అందువలన దేవుని రాజ్యము మీనుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఈయబడునని నేను మీతో చెప్పుచున్నాను.”

భూస్వామి – దేవుడైతే; ద్రాక్షతోట - మనము, మన సంఘము, మన కుటుంబము; కౌలుదార్లు - దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మరచిపోయిన మనము.

ప్రియ సహోదరీ సహోదరులారా, ఉపమానంలో భూస్వామి ఎంత ప్రేమగా తోటను తయారు చేశాడో కదా! తోటను నాటించాడు, చుట్టూ కంచె వేశాడు, గానుగ కోసం గోతిని త్రవ్వించాడు, గోపురం కట్టించాడు. వీటి అర్థం ఏమంటే! దేవుడు మనకు అన్నీ సమకూర్చారు. ‘కంచె’ అంటే మనకు వచ్చే ఆపదల నుండి, శత్రువుల నుండి దేవుడు మనకు ఇచ్చే రక్షణ వలయం. ‘గోపురం’ అంటే మనల్ని ఎత్తులో ఉంచి కాపాడే ఆయన నిఘా మరియు కాపుదల. ఈవిధముగా, మనకు ప్రత్యేకమైన జీవితములను, మనకు ప్రత్యేకమైన, కేటాయించబడిన పేరును, కుటుంబమును, గుర్తింపును దయచేశారు. మరి ముఖ్యముగా మనకు దేవుడు, తన కాపుదలను, అండదండలను, నిత్యరక్షణను, నిత్యజీవమును దయచేశారు.

దేవుడు వేసిన పంటను కౌలుదార్లకు అప్పగిస్తే, కౌలుదార్లు ఏం చేశారు? యజమాని పంపిన సేవకులను కొట్టారు, చంపారు... ఆస్తి దక్కుతుంది అనే స్వార్థంతో... చివరికి తన సొంత కుమారుని కూడా, చంపేశారు.

ప్రియ సహోదరీ, సహోదరులారా! ఈ కౌలుదార్లు ఎవరో కాదు! నీవు, నేను, మనమందరమూ! కౌలుదార్లు చంపిన యజమానుని కుమారుడు వేరెవరో కాదు, పరలోక తండ్రి దేవునికి ఏకైక ప్రియ కుమారుడైన “యేసు క్రీస్తు ప్రభువు”. మనము చేసిన పాపములే, క్రీస్తు ప్రభువును, గొర్రెపిల్ల వలె బలి తీసుకున్నాయి.

దేవుడు మనకు అనేక సందేశాలు తన సేవకుల ద్వారా మన వద్దకు పంపుతున్నారు. మనం ఆలకిస్తున్నాం కానీ అనుసరించడం లేదు. నెరవేర్చడం లేదు. నీతిగా, న్యాయంగా మాట్లాడే మాటలను అణచివేస్తున్నాం. మంచివారిని త్రొక్కిపెడుతున్నాం. న్యాయాన్ని రూపుమాపుతున్నాం.

“దేవుని రాజ్యం మీ నుండి తొలగింపబడి, తగిన ఫలములు ఇచ్చు వారికి ఇవ్వబడును” అని యేసు ప్రభువు స్పష్టం చేశారు. దేవుడు మనకు ఇచ్చిన వరాలు, ప్రత్యేకతలు, కుటుంబం, జీవితం, బాధ్యతలు, ఇవన్నీ కూడా మన సొంతం కాదు. మనకు ఈ జీవితమున, కౌలుకు ఇచ్చిన తోట వంటివి. అవన్నీ దేవునికి మనం చివరన లెక్కగా అప్పచెప్పవలసిందే! ఆ లెక్క ఫలింపబడే విధంగా ఉండాలే గానీ, పారవేసే పుల్లటి పండ్ల వలె ఉండకూడదు. కనుక, మనకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా, నమ్మకమైన కాపరులుగా, ఫలించే తీగలుగా జీవిద్దాం.

తీయటి పండ్ల వలె ఫలిస్తూ జీవిస్తే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆశీర్వదిస్తారు. దేవుని ప్రేమ, దేవుని కృప, అనంతమైనది. కనుక మనం స్వార్థపు కౌలుదార్ల వలె కాకుండా, నమ్మకమైన దేవుని సేవకులుగా మారుదాం. దేవుని బిడ్డలుగా, పరలోక తండ్రి దేవుని వారసులముగా, దేవుని రాజ్యములో, నిత్యజీవములో చోటును దక్కించుకుందాం.

ముగింపు: సహోదరీ సహోదరులారా! నేటి వాక్యోపదేశం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనము కేవలం లబ్ధిదారులము కాము; దేవుడు మనకు అప్పగించిన ఈ జీవితానికి, కుటుంబానికి నమ్మకమైన కౌలుదార్లము. మన స్వార్థాన్ని, పాపమును, చెడుప్రవర్తనను విడనాడి, పశ్చాత్తాప హృదయంతో దేవుని వైపు తిరగాల్సిన సమయం ఇది. అపొస్తలుడైన పౌలుగారు గుర్తుచేసినట్లుగా, మన విచారాలన్నింటినీ ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించి, ఆయన ఇచ్చే అద్భుతమైన శాంతి సమాధానాలను మనసారా స్వీకరిద్దాం. దేవుని రాజ్యానికి తగిన మంచి ఫలాలను ఫలిస్తూ, ఆయన ప్రేమలో ఎదిగే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక!

సహోదరీ సహోదరులారా! ఆ దేవాది దేవున్ని పశ్చాత్తాప హృదయముతో ప్రాధేయపడదాం. తప్పకుండా దేవుడు మనల్ని క్షమించి, తన కౌగిట హత్తుకుంటారు. దేవున్ని విశ్వసించి, దేవునికి నమ్మకమైన సేవకులముగా... బిడ్డలముగా... ఆ దేవుని యందు ఎదిగి ఫలించుదాం.

కృపగల దేవునికి ప్రార్థించుకుందాం! దేవా, నా జీవితం పుల్లని ద్రాక్ష వంటిది. మీ భయ భక్తులలో, మీ బాధ్యతలలో ఇమిడిపోయి, తీయగా ఫలిద్దామనుకుంటాను కానీ, వేషధారణ, స్వార్థము, పాపము, విచారము మూలముగా మీ మార్గము నుండి తప్పిపోయి, మిమ్మల్ని మరింత దుఃఖపెడుతున్నాను. దయతో నా అపరాధములను మన్నించుము దేవా. మీ సక్రమమైన మార్గంలో జీవించే భాగ్యమును నాకు అనుగ్రహించుమని వేదనతో, పశ్చాత్తాపముతో... మీకు మొరపెట్టుకుంటున్నాను ప్రభూ. నా ఈ ప్రార్థనలను నీ సన్నిధికి చేర్చుకొనుము దేవా. ఆమెన్.

పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమునకు, మహిమ కలుగునుగాక! ఆమెన్.

26వ సామాన్య ఆదివార వాక్యోపదేశము

 26వ సామాన్య ఆదివార వాక్యోపదేశము
యెహెజ్కేలు 18:25-28 | ఫిలిప్పీ 2:1-11 | మత్తయి 21:28-32

“నీ ఇష్టప్రకారము కాక, వినయముతో... దేవుని వాక్కును అనుసరించి, దేవుని ఆజ్ఞలను పాటించి జీవించు.”
క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! నేడు మనం 26వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి యున్నాము! నేటి వాక్యోపదేశానికి మీ అందరికి హృదయపూర్వక ఆహ్వానం! దేవుని వాక్కు మనం హృది, మదిలో, జీవితంలో ఫలించునుగాక!

సహోదరీ సహోదరులారా! ఈరోజు మనం ధ్యానించబోయే దైవ వాక్యాలు మన జీవిత గమనాన్ని సరిదిద్దుకోవడానికి ఒక దిక్సూచిలా నిలుస్తున్నాయి. మన ఆలోచనలు, మన ప్రవర్తన దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవడానికి నేటి దివ్యగ్రంధ పఠనాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి.

మొదటి పఠనం – నేటి మొదటి పఠన సందేశం, “ఎవరి క్రియలకు వారే బాధ్యులు”.
యెహెజ్కేలు గ్రంథము 18:25-28, “కాని మీరు ‘యావే ప్రభువు చేయునది సబబుకాదు’ అని పలుకుదురు. యిస్రాయేలీయులారా! వినుడు. నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడుకు పాల్పడి చనిపోయెనేని, తన దుష్కార్యములవలననే చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యములనుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచిపనులు చేసెనేని, తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలిసికొని తన పాపముల నుండి వైదొలగెను గనుక చావునకు తప్పి బ్రతుకును.”
మన యెడల దేవుని చిత్తమే అత్యంత సరియైనది. మన సొంత ఆలోచనలు, సొంత చేతలు మనల్ని దుర్మార్గంలోనికి నడిపిస్తాయి. “నా మార్గమే మంచిది, ఇదే సరియైనది” అని ఎప్పుడూ గుడ్డిగా ముందుకు సాగకూడదు. దేవుని వాక్కును బట్టి మన జీవితాన్ని కొనసాగించాలి. మనము మంచి మార్గమును ఎంచుకోవాలి, అదే దైవ మార్గము. దేవుని వాక్కును బట్టి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి.
మన మంచి చెడులు మన తుది తీర్పును ఇస్తాయి. మనం నీతి కార్యాలు చేస్తే నీతిమంతుల గుంపులో ఉంటాము. మనం దుష్కార్యాలు చేస్తే నరకంలో నెట్టబడే గుంపులో ఉంటాము. పాపులమై, మారుమనస్సు మరియు పశ్చాత్తాపం లేకుండా జీవిస్తే మన ఆత్మను మనమే నశింప జేసుకుంటాము. అదే మంచి కార్యములు చేస్తూ, న్యాయవంతమైన జీవితం జీవిస్తే, నిత్యజీవమును సొంతం చేసుకుంటాము. తుది నిర్ణయం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. కనుక, ఎవరి క్రియలకు వారే బాధ్యులు!

రెండవ పఠన సందేశం - క్రీస్తు వినయము - మన క్రీస్తానుసరణ
‘క్రీస్తు ప్రభువు యొక్క వినయమును, గొప్పతనమును తెలుసుకొని, మనము కూడా వినయంతో జీవించి దేవుని కృపను ఏ విధంగా పొందుకోవాలో’ పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభువు దైవస్వభావం కలిగియున్నప్పటికీ, దేవునితో తన సమానత్వాన్ని స్వార్థబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. “నేనూ దైవ సమానుడనే కదా” అని తన సొంత ఆలోచనలన ప్రకారం జీవించలేదు. అన్ని విషయములలోనూ పరలోక తండ్రి చిత్తాన్నే తన బాధ్యతగా నెరవేర్చారు. అన్ని విషయములలోనూ తండ్రి దేవునికి ప్రార్ధించారు. అంటే, ప్రతి ఒక్క విషయములో కూడా పరలోక తండ్రి దేవుని ఇష్టప్రకారమే, పరలోక తండ్రి దేవుని ఆధీనంలోనే ప్రతిక్షణం క్రీస్తు ప్రభువు జీవించారు.

క్రీస్తు ప్రభువు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ‘తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవమాత్రుడిగా’ జన్మించారు. చివరి వరకు, అంటే మరణ ఘడియ వరకు కూడా, ఆయన తండ్రి దేవుని యెడల వినయము గలవారై, విధేయుడాయెను. అందుకే, పరలోక తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును అత్యున్నత స్థానమునకు లేవనెత్తి, అన్ని నామముల కంటే ఘనమైన నామమును ప్రభువునకు ప్రసాదించారు. పరలోక భూలోక పాతాళ లోకములయందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలువంచి వినతులు కావలెను. ప్రతి నాలుక దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రకటించవలెను. సామెతల గ్రంధము 15:33లో “వినయము వలననే గౌరవము కలుగును” అని చూస్తున్నాం! పునీత అగుస్తీను గారు క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన ప్రధాన సుగుణాల గురించి బోధిస్తూ, “మొదటిది ఏమిటి? వినయం. రెండవది ఏమిటి? వినయం. మూడవది ఏమిటి? వినయం” అని అన్నారు.

క్రీస్తు జీవితం నుండి మనం తప్పక జీవించాల్సిన రెండు సుగుణాలు, ఒకటి వినయము, రెండు విధేయత. వినయము అంటే ‘తననుతాను రిక్తునిగా చేసుకోవడం; తగ్గించు కొనడం; ఏమిలేని వానిగా భావించడం; తండ్రి దేవునిపై ఆధారపడి జీవించడం; అలాగే ఇతరులపట్ల సేవాభావముతో జీవించడం. విధేయత అంటే దేవుని చిత్తమును నెరవేర్చుటకు తనను తాను సమర్పించు కొనుట; మరియతల్లివలె, “ఇదిగో నేను ప్రభువు దాసుడను/దాసురాలను. నీ చిత్తము చొప్పున జరుగునుగాక” అని చెప్పడం; ఎల్లప్పుడూ దేవుని సేవకు అందుబాటులో ఉండటం.

సహోదరీ, సహోదరులారా! మరి నువ్వు నేను ఎలా జీవిస్తున్నాం? దేవునికి సమ్మతంగా జీవిస్తున్నామా, లేదా లూసిఫరులాగా అహంకారంతో జీవిస్తున్నామా? లూసిఫర్ దేవుని కంటే అధికునిగా ఉండాలని ప్రయత్నించాడు. అందుకే పడద్రోయబడ్డాడు. ఎల్లప్పుడూ... ‘నా మంచే’ అని స్వార్థముతో, గర్వముతో, అహంభావంతో జీవిస్తే... లూసిఫర్ మనస్తత్వం, మనది సమానమే! సొంత ప్రయత్నాలతో, సొంత ఆశల కొరకు జీవిస్తే, నరకమే మనకు ప్రాప్తిస్తుంది. ఈ విధమైన జీవన విధానములను దేవుడు ఇష్టపడరు. ఎల్లప్పుడూ మనం దైవస్వభావమును కలిగి సాటివారిని ప్రేమిస్తూ, సాటివారి సమస్యలలో తోడుగా, బాసటగా నిలుస్తూ, యేసుక్రీస్తు వినయము, విధేయత భావమును మనము కలిగి ఉండి, జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా జీవించకపోతే మనకు పెనుముప్పే ముందు ఉంది అని గ్రహించి ఇప్పటికైనా పశ్చాత్తాప హృదయంతో, మారుమనస్సు పొందుకొని, మన తప్పులను సరిచేసుకుందాం. పౌలుగారు ఇచ్చిన ఆధ్యాత్మిక సలహాను పాటిద్దాం, “స్వార్ధముతోగాని, అహంభావముతోగాని ఎట్టి పని చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటె అధికులుగా భావింపుడు. ప్రతి ఒక్కరు కేవలము స్వార్ధమునే చూచుకొనక, పరస్పరము ఉపకారులై ఉండవలెను” (ఫిలిప్పీ 2:3-4).

సువిశేష సందేశం - ఇద్దరు కుమారుల ఉపమానము
పునీత మత్తయి గారు వ్రాసిన సువార్త 21:28-32 వచనాలను ఆలకించుదాం, “ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. అతడు పెద్దవానితో, ‘కుమారా! నేడు నీవు మన ద్రాక్షతోటలోనికి పోయి పనిచేయుము’ అని చెప్పగా, మొదట అతడు ‘వెళ్ళుట నాకిష్టము లేదు’ అని చెప్పినను, పిమ్మట తన మనస్సు మార్చుకొని వెళ్ళెను. తరువాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెప్పెను. అపుడు అతడు ‘నేను వెళ్ళుచున్నాను’ అని చెప్పియు వెళ్ళలేదు. ఆ యిద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు?” అని యేసు ప్రశ్నింపగా “మొదటివాడు” అని సమాధానము ఇచ్చిరి. అపుడు యేసు వారితో, “సుంకరులును, జారిణులును మీ కంటెను ముందు దేవుని రాజ్యములో ప్రవేశింపబోవుచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను మీకు నీతిమార్గము చూపుటకు వచ్చెను కాని, మీరతనిని విశ్వసింపరైతిరి. సుంకరులు, జారిణులు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయపరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి” అని పలికెను.

ఈ ఉపమాన సందర్భం ఏమిటంటే, యేసు యేరూషలేము దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా, ప్రధానార్చకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారముతో నీవు ఈ పనులు అనగా బోధనలు, స్వస్థతలు, అద్భుతాలు చేయుచుంటివి? నీకు ఈ అధికారమిచ్చిన వాడెవడు? అని ప్రశ్నించారు (మత్త 21:23). ఈ సందర్భమున, ప్రభువు మూడు ఉపమానములనుచెప్పాడు. అందులో మొదటిది “ఇద్దరు కుమారుల ఉపమానము.”

సహోదరీ సహోదరులారా! యేసు ప్రభువు చెప్పిన ఈ “ఇద్దరు కుమారుల ఉపమానము” మన హృదయాలను తట్టాలి. పెద్ద కుమారుడు,  మొదట “వెళ్ళుట నాకు ఇష్టం లేదు” అన్నాడు, కానీ పిమ్మట ‘మనస్సు మార్చుకొని’ ద్రాక్షతోటకు వెళ్లి తండ్రి ఆజ్ఞ నెరవేర్చాడు. రెండవ కుమారుడు, “నేను వెళ్ళుచున్నాను” అని చెప్పి అసలు వెళ్లలేదు.
ఈ ఉపమానములో, ప్రధానంగా ఆకర్షించే వాక్యం, “పిమ్మట తన మనస్సు మార్చుకొని వెళ్ళెను” (మత్త 21:29). మొదటి కుమారుడు మారుమనస్సు పొందిన వారిని సూచిస్తున్నాడు. తండ్రి ద్రాక్షతోటలోనికి పోయి పనిచేయమన్నప్పుడు మొదట “వెళ్ళుట నాకిష్టము లేదు” అని చెప్పినప్పటికీ, పిమ్మట తన మనస్సు మార్చుకొని (మారుమనస్సు పొంది) వెళ్ళాడు. ఈ కుమారుడు పాపాత్ములు, సుంకరులు, హృదయపరివర్తన చెంది దేవుని వాక్యమును విశ్వసించిన వారిని సూచిస్తున్నాడు. లూకా సువార్త 15:7లో, “హృదయపరివర్తనము పొంది పాపాత్ముని విషయమై పరలోకమున ఆనందము ఉండును” అని చదువుచున్నాం!

ఇక రెండవ కుమారుడు కపట వేషధారులను సూచిస్తున్నాడు. తండ్రి చెప్పినప్పుడు “నేను వెళ్ళుచున్నాను” అని చెప్పియు, ఆచరణలో వెళ్ళలేదు. మాటలకు, చేతలకు పొంతన లేని ప్రధానార్చకులు, పరిసయ్యులు, తమను తాము నీతిమంతులుగా ప్రకటించుకునే కపట వేషదారులను ఈ కుమారుడు సూచిస్తున్నాడు. లూకా సువార్త 6:45వ వచనంలో ఇలా చదువుచున్నాం, “సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చెను. దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చెను. ఏలయన, హృదయ పరిపూర్ణత నుండి నోటిమాట వెలువడును.” అలాగే యాకోబు 1:22లో, “వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసికొనకుడు” అని చదువుచున్నాం!

ఈరోజు మన పరిస్థితి ఏమిటి? మనం కూడా దేవుని వాక్కును వింటున్నాము, ప్రసంగాలు ఆస్వాదిస్తున్నాము, కానీ ఆచరణలో వెనుకబడిపోతున్నాము. ఈ లోక జీవితంపై మక్కువతో సాటి మనుషులను మోసపరుస్తున్నాము, హీనపరుస్తున్నాము. నేడు కుటుంబాలలో ఎన్నో విభేదాలు, విభజనలు, గొడవలు... సమాధానం లేదు, శాంతి లేదు. బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. బిడ్డలలో క్రమశిక్షణ ఉండటం లేదు. విలువలతో కూడిన జీవితం జీవించడం లేదు!

మనం కూడా ఆదివారము ప్రార్ధనకు, దివ్యపూజాబలికి వెళ్తున్నాము, దేవుని వాక్కును వింటున్నాము, దివ్యసత్ప్రసాదమును స్వీకరిస్తున్నాము, అయినప్పటికీ కూడా మనలో ఉన్న ద్వేషాలను, పాపాలను, ఈర్ష్యలను, గొడవలను కలిగి జీవిస్తున్నాము. కేవలం ఆచారాలను మొక్కుబడిగా పాటిస్తే పరలోక రాజ్యం రాదు... కేవలం మాటల్లో ఆరాధన చేస్తే సరిపోదు; దేవుని వాక్కును ఆచరించాలి, సాటివారిని ప్రేమించాలి, వారి అపరాధాలను మన్నించాలి. అన్నింటికన్న ముఖ్యంగా మనకు కావలసింది: “మనస్సు మార్చుకోవడం”, మారుమనస్సు చెందడం!
మనం ఈ ఉపమానంలో ఏ కుమారుని వలె జీవిస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండవ కుమారుని వలె దేవున్ని ధిక్కరిస్తే నరక మార్గాన్ని ఎంచుకున్నట్లే! పెదవులతో “ప్రభూ, ప్రభూ” అని పిలుస్తూ, ఆచరణలో దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసే రెండవ కుమారుని వలె జీవించకూడదు. మత్త 7:21లో ఇలా చదువుచున్నాం, “ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును.” కనుక, సహోదరీ సహోదరులారా! దేవుని వాక్యమును కేవలం వినడమే కాకుండా, మన అనుదిన జీవితంలో ఆచరిస్తూ, మొదటి కుమారుని వలె “మారుమనస్సు పొందుతూ”, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి.

మన జీవితంలో కూడా మనం ఒక్కోసారి దేవుని పిలుపునకు వెంటనే స్పందించలేకపోవచ్చు! కోపంతోనో, స్వార్థంతోనో ‘ఇది నాకిష్టం లేదు’ అని దూరంగా జరిగిపోవచ్చు! కానీ మారుమనస్సుతో వెనక్కి వచ్చి దేవుని ద్రాక్షతోటలో పనిచేయడానికి ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి అని తెలుసుకుందాం!

ముగింపు
మనుషులను మనం మభ్యపెట్టగలము కానీ, సర్వాంతర్యామి అయిన దేవున్ని ఏమాత్రం మోసంచేయలేము. మన ప్రతి క్రియకు మనమే బాధ్యులము. కనుక, ఇప్పటికైనా మన తప్పులను పశ్చాత్తాప హృదయంతో సరిదిద్దుకుందాం. క్రీస్తు ప్రభువు చివరి క్షణం వరకు తండ్రి చిత్తానుసారంగా వినయ విధేయతలతో జీవించినట్లే, మనమూ ఆయన బాటలో పయనిద్దాం.

ప్రార్థన చేసుకుందాం: “సర్వేశ్వరా! మేము ఎల్లప్పుడూ నీ ఆజ్ఞలను పాటిస్తూ
, నీవు మాకు అప్పగించిన బాధ్యతను ఉపమానంలోని మొదటి కుమారుని వలె నెరవేర్చే కృపను మాకు దయచేయి. సైతాను పన్నాగాలను మా జ్ఞానంతో తిరస్కరించి, నీ దివ్య వాక్కును ఆచరిస్తూ పరలోక రాజ్యానికి వారసులుగా జీవించే జ్ఞానాన్ని, యుక్తిని మాకు అనుగ్రహించండి. ప్రభూ! మా పెదవులతో నిన్ను కీర్తించడమే కాకుండా, మా చేతలతో నీ ప్రేమను చాటుకునే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమెన్.”
 

త్రికాల జపము, గురువారము, మరియ మాతృత్వ మహోత్సవం, 1 జనవరి 2026

మరియ మాతృత్వ మహోత్సవం
59వ ప్రపంచ శాంతి దినోత్సవం

పొప్ లియో XIV
త్రికాల జపము    
సెయింట్ పీటర్స్ స్క్వేర్
గురువారము, 1 జనవరి 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

గడిచే నెలల కాలచక్రం పునరావృతమవుతున్నప్పటికీ, ప్రజలందరి మధ్య శాంతి, మైత్రి పూర్వకమైన ఒక నూతన యుగాన్ని చివరకు ప్రారంభించడం ద్వారా మన కాలమును నూతనపరుచుకోవాలని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మేలు చేయాలనే ఈ ఆశ గనుక లేకపోతే, క్యాలెండర్ పేజీలు తిప్పడంలో గానీ, మన డైరీలను నింపడంలో గానీ ఎటువంటి అర్థం ఉండదు.

త్వరలో ముగియనున్న “కరుణామయ జూబ్లీ” (మహా పవిత్ర సంవత్సరం), ఒక నూతన లోకం కోసం నిరీక్షణను ఎలా పెంపొందించుకోవాలో మనకు నేర్పింది. తప్పులను క్షమాపణగా, బాధను ఆదరణగా, మరియు పుణ్య తీర్మానాలను సత్క్రియలుగా మార్చుకోవడానికి మన హృదయాలను దేవుని వైపునకు మళ్లించడం ద్వారా మనం దీనిని చేస్తాము. ఈ విధంగా, దేవుడు స్వయంగా మానవ చరిత్రలో నివసిస్తూ, దానిని విస్మృతి నుండి రక్షిస్తారు; మరియు మన విమోచకుడైన యేసుక్రీస్తును లోకానికి అనుగ్రహిస్తారు. ఆయన మనకు సోదరుడిగా మారిన దేవుని ఏకైక కుమారుడు. లోకంలోనికి వచ్చే ప్రతి పురుషుడు మరియు స్త్రీ కొరకు భవిష్యత్తును ఒక ఆదరణకరమైన ఇల్లుగా మనం నిర్మించేలా, సన్మనస్కులైన ప్రజల మనస్సాక్షులను ఆయన వెలిగిస్తున్నారు.

ఈ విషయంలో, నేటి క్రిస్మస్ పండుగ మన చూపును మరియమాత వైపునకు తిప్పుతుంది, ఎందుకంటే క్రీస్తు హృదయ స్పందనను మొదటగా అనుభవించినది ఆమెయే! ఆమె కన్యత్వ గర్భపు నిశ్శబ్దంలో, జీవవాక్యము దైవకృప యొక్క హృదయ స్పందనగా మనకు వ్యక్తమవుతుంది.

మంచి సృష్టికర్త అయిన దేవునికి మరియమాత హృదయము మరియు మన హృదయాలు ఎల్లప్పుడూ తెలుసు. ఆయన మానవుడిగా మారడం ద్వారా, తన హృదయాన్ని మనకు తెలియజేశారు. అందువల్ల, యేసు హృదయం ప్రతి ఒక్కరి కోసమూ స్పందిస్తుంది; గొర్రెల కాపరుల వలె ఆయనను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారి కోసమూ, మరియు హేరోదు వలె ఆయనను వద్దనుకునే వారి కోసమూ అది స్పందిస్తుంది. తన పొరుగువాని పట్ల హృదయం లేని వారి పట్ల కూడా ఆయన హృదయం ఉదాసీనంగా ఉండదు: నీతిమంతులు తమ సేవా నిరతిలో కొనసాగేలా వారి కోసం, అలాగే అవినీతిపరులు తమ జీవితాలను మార్చుకొని శాంతిని పొందేలా వారి కోసం కూడా అది స్పందిస్తుంది.

రక్షకుడు ఒక స్త్రీకి జన్మించడం ద్వారా ఈ లోకంలోనికి వచ్చారు. పరమ పవిత్ర మరియమాతలో ప్రకాశిస్తూ, జన్మించబోయే ప్రతి బిడ్డలోనూ ప్రతిబింబిస్తూ, మన మానవత్వంలో ముద్రించబడిన దైవ స్వరూపాన్ని వెల్లడిస్తున్న ఈ అద్భుత ఘట్టాన్ని మనం కాసేపు ఆరాధిద్దాం.

ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా, మనమందరం కలిసి శాంతి కోసం ప్రార్థిద్దాం: మొదటిగా, యుద్ధాలు, శ్రమల వల్ల రక్తసిక్తమైన దేశాల మధ్య శాంతి కొరకు, అలాగే హింస లేదా బాధల వల్ల గాయపడిన మన కుటుంబాల మధ్య శాంతి కొరకు ప్రార్థిద్దాం. మన నిరీక్షణ అయిన క్రీస్తు ఎన్నటికీ అస్తమించని నీతి సూర్యుడని నిశ్చయముగా నమ్ముతూ, దైవమాత, మరియు తిరుసభ మాత అయిన మరియమాత విజ్ఞాపన సహాయాన్ని మనం నమ్మకంతో వేడుకుందాం. ఆమెన్.

త్రికాల జపము, ఆదివారము, 14 జూన్ 2026

 పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 14 జూన్ 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు!

నేటి సువార్త పఠనం (మత్త 9:36–10:8) మనకు ఒక గొప్ప బహుమతిని అందిస్తుంది. ఎందుకంటే, దీనిని వినే ప్రతి ఒక్కరినీ ఇది యేసు ప్రభువు యొక్క కరుణా వీక్షణంలోనికి నడిపిస్తుంది. ఈ వాక్య భాగం ఆయన చూపులోని శ్రద్ధకు సాక్ష్యంగా నిలవడమే కాకుండా, ప్రభువు ఏమి చూస్తున్నారో కూడా మనకు తెలియజేస్తుంది. నిజానికి, క్రీస్తు “ఆ జనసమూహములను చూచినప్పుడు, వారు కాపరిలేని గొర్రెలవలె చెదరియున్నందున వారిమీద కనికరపడెను” (వ. 36) అని మనం చదువుతాము. మనకు సోదరుడిగా మారిన దేవుని కుమారుడు ప్రజల వైపు, మానవాళి వైపు చూస్తున్నారు: మనల్ని కృంగదీసే అణచివేతను, మనుషుల శక్తిని క్షీణింపజేసే హింసను ఆయన చూస్తున్నారు. యుద్ధం వల్ల ఏర్పడిన గాయాలను, వినియోగదారీ సంస్కృతి (భోగలాలసత) వల్ల కలిగే శూన్యతను ఆయన చూస్తున్నారు. ముసుగులుగా మారిన ముఖాలను, చెడు వల్ల ముక్కలైన కుటుంబాలను, తప్పుడు ఆశయాల వల్ల దారి తప్పిన యువతను యేసు చూస్తున్నారు. యేసు చూస్తున్నారు మరియు ప్రేమిస్తున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తూ, మన కోసం, మనతో కలిసి బాధపడుతున్నారు: ఆయన కనికరం కేవలం సహోదర సాన్నిధ్యాన్ని మాత్రమే కాక, మనలను విముక్తి చేయాలనే ఆయన తపనను కూడా వ్యక్తపరుస్తుంది.

ఎందుకంటే ఆయనకు మన హృదయాలు తెలుసు, ఆయన మనల్ని ఆదరిస్తారు. “కాపరిలేని గొర్రెలవలె” (వ. 36) ఉన్న ఎంతో మంది ప్రజలను చూసి, క్రీస్తు అందరి కోసమూ ఒక మంచి కాపరిగా తన్ను తాను సమర్పించుకుంటారు. అంతేకాక, కోతకు లోకమనే పొలంలోనికి పనివారిని పంపుతారు (వ. 38). వారి బాధ్యత ఏమిటి? బాధల్లో ఉన్నవారికి దేవుని ఆదరణను అందించడం; ఎక్కడైతే దైన్య స్థితి ఉందో అక్కడ ప్రేమను, ఎక్కడైతే శ్రమ ఉందో అక్కడ నిరీక్షణను, ఎక్కడైతే అవిశ్వాసం ఉందో అక్కడ విశ్వాసాన్ని వారు చేరవేయాలి.

సువార్తలో మొదటి పన్నెండు మంది “పనివారి” పేర్లు రాయబడ్డాయి: వారు మొదట శిష్యులుగా ఉండి అపొస్తలులుగా, అనగా సువార్త ప్రచారకులుగా మరియు బోధకులుగా మారారు. వారిలో మొదటివాడిగా సీమోను పేతురును మనం చూస్తాము. అలాగే చిట్టచివరగా యూదా ఇస్కరియోతు పేరును కూడా చూస్తాము. ఒకరు యేసును వెంబడిస్తూనే, ఆయనకు ద్రోహం కూడా చేయవచ్చని మనకు గుర్తుచేయడానికే అతని పేరు చివరన ఇవ్వబడింది. అయినప్పటికీ, సువార్త అందరికీ సజీవమైన, నిజమైన వాక్యంగానే నిలుస్తుంది. శతాబ్దాలు దాటినా ఈ శుభవార్త ఎప్పటికీ నూతనమైనదిగా, తాజాదనంతో మరియు విముక్తి కలిగించేదిగానే ఉంటుంది: “పరలోకరాజ్యము సమీపించియున్నది” (మత్త 10:7). అవును, అది సమీపంలోనే ఉంది, ఎందుకంటే యేసుక్రీస్తు నందు దేవుడు ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి, ప్రతి ప్రజకు మరియు ప్రతి దేశానికి అండగా నిలుస్తున్నారు. ఈ సువార్తను ప్రకటించి, దాని ప్రకారం జీవించినప్పుడు, చెడు అనేది నశించిపోయే ఒక రోగంలా, తెల్లవారగానే తొలగిపోయే చీకటిలా, పునరుత్థానుడైన క్రీస్తు చేతిలో ఓడిపోయిన మరణంలా అంతరించి పోతుంది.

యేసు యొక్క కరుణా వీక్షణం యథార్థతను ఈ విధంగానే మారుస్తుంది. ప్రేమతో నిండిన ఆయన చొరవ ఒక నూతన సమాజానికి, అనగా తిరుసభకు జన్మనిచ్చింది. ఈ తిరుసభ అపొస్తలుల పరిచర్యను ముందుకు తీసుకెళ్లవలసి ఉంది: “ఉచితముగా పొందితిరి, ఉచితముగా నియ్యుడి” (వ. 8). అవును, యేసు ఇచ్చే బహుమతి పూర్తిగా ఉచితమైనది, ఎందుకంటే దాని విలువ కొలతలకు అందనిది. దానిని మన స్వంత శక్తితో సంపాదించుకోవడం లేదా “కొనుక్కోవడం” అసాధ్యం. ఈ కృపయే దేవుని కనికరానికి ఉన్న అందమైన పేరు. మనం ఎక్కడున్నా అది మనల్ని వెతుక్కుంటూ వచ్చి, ఆయన వైపునకు తిప్పుకుంటుంది. “కావున తన కోతకు పనివారిని పంపవలెనని కోత యజమానుని వేడుకొనుడి” (మత్త 9:38)!

ప్రియమైన మిత్రులారా, సువార్త ప్రచార బాధ్యత దేవుని ఉచిత బహుమతి నుండి ఉద్భవిస్తుంది. అది క్రీస్తు నందు లోకానికి పాపక్షమాపణగా, దీనులకు మరియు పేదలకు చేసే సేవగా, మరియు న్యాయం పట్ల చూపే నిబద్ధతగా మారుతుంది. యేసు మనల్ని పిలుస్తున్న ఈ పరిచర్యకు మనం సంతోషంతో, ధైర్యంతో స్పందించేలా, దైవకృపతో నిండిన శాంతి రాజ్ఞి అయిన మరియమాత సహాయాన్ని వేడుకుందాం. ఆమెన్.

త్రికాల జపము, ఆదివారము, 21 జూన్ 2026

 పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 21 జూన్ 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు!

నేటి సువార్త పఠనంలో (మత్త 10:26-33), యేసు ప్రభువు తన శిష్యులను పరిచర్యకు పంపుతూ ఈ విధంగా హెచ్చరిస్తున్నారు: “చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్ల మీరు వెలుతురులో బోధింపుడు; చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుదు” (వ. 27).

మనం ఏకాంతంలో, అనగా మన హృదయ అంతరంగంలో వినేదానికి మరియు అందరికీ మనం ప్రకటించవలసిన దానికి మధ్య ప్రభువు ఒక పోలికను చూపుతున్నారు. సువార్తను ప్రకటించడం అంటే మొదటగా ప్రభువుతో మనకు ఏర్పడిన వ్యక్తిగత అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడమేనని, అది మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకమైనదని మనకు గుర్తుచేస్తున్నారు.

ఏదైనా ఒక దైవ పరిచర్య యొక్క బలం — పద్ధతులు, సాధనాలకు అతీతంగా — మనలో పరిశుద్ధాత్మ చేసే కార్యం ద్వారా మరియు మనం చూపే నిజాయితీ గల స్పందన ద్వారానే లభిస్తుంది. పునీత థామస్ అక్వినాస్ గారు ‘బోధన’ (ప్రసంగం) గురించి మాట్లాడుతూ, మనం ధ్యానించిన దానిని ఇతరులకు అందించడమే బోధన అని అన్నారు: “contemplata aliis trader” (మనం ధ్యానించిన సత్యాలను ఇతరులకు పంచడం).

దైవధ్యానం లేదా ఏకాంత ప్రార్థన అనేది కేవలం కొద్దిమంది సాధువులకు, సన్యాసులకు లేదా మునులకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక అనుభవమని మనం అనుకోకూడదు. మన దైనందిన జీవితంలోని పనుల మధ్య, దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా గడపడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన సంతోషాలను, ఆందోళనలను ఆయనకు అప్పగించడానికి, మరియు మన జీవితాలను ఆయనతో కలిసి పునఃసమీక్షించుకోవడానికి ప్రశాంతమైన క్షణాలను కేటాయించడం ద్వారా మనమందరం దీనిని చేయవచ్చు. ఇది మన విశ్వాసాన్ని మరింత దృఢంగా, స్పష్టంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి స్థలంలోనూ సువార్త వెలుగును ప్రతిబింబింపజేయడానికి, అలాగే సువార్త విలువలను అర్థం చేసుకోని లేదా అంగీకరించని చోట కూడా దానికి సాక్ష్యంగా నిలవడానికి, నమ్మకమైన మరియు స్వేచ్ఛ గల శిష్యులుగా ఉండటానికి ఇది మనకు తోడ్పడుతుంది.

మనం పైన పేర్కొన్న బైబులు భాగాన్ని రాసిన పునీత మత్తయి — కష్టాలతో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్న సమాజాల కొరకు దీనిని రాశారు. నేడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చాలా మంది క్రైస్తవులు ఎదుర్కొంటున్నట్లే, నాటి వారు కూడా శత్రుత్వాన్ని, హింసను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయంలో నిరాశకు గురవడం, అలసట లేదా భయానికి లోనవడం వంటి శోధనలు ఎంతో ఎక్కువగా ఉండేవి.

అప్పటిలాగే ఇప్పుడు కూడా, యేసు బోధనలకు నమ్మకంగా ఉండటం మరియు ఆయన వాక్యాన్ని ప్రకటించడం ఒక సవాలుగా మారింది: ద్వేషానికి ప్రేమతో, అహంకారానికి నమ్రతతో, మరియు నిరాశకు పట్టుదలతో స్పందించడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం, ఆయనతో మనకున్న ఆత్మీయ బంధంలో మన విశ్వాసపు పునాదులను, మన పరిచర్యను మరింత లోతుగా నాటుకోవాలి (పాప్ ఫ్రాన్సిస్, “ఎవాంజెలి గౌదియమ్”, 8). మనము నిరాశ చెందకుండా, ప్రతి పరిస్థితిలోనూ ఆయన నిరీక్షణ, ప్రేమ మరియు శాంతి సందేశాన్ని అందరితో పంచుకోవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. ప్రస్తుత లోకానికి ఇది ఎంతో అవసరం!

మనలో ప్రతి ఒక్కరం మన పిలుపుకు తగినట్లుగా, యేసు ప్రభువు యొక్క సువార్త సాక్షులుగా జీవించడానికి మరియమాత మనకు సహాయం చేయును గాక! ఆమెన్.