త్రికాల జపము, ఆదివారము, 05 జూలై 2026

 పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 05 జూలై 2026

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు శుభాకాంక్షలు!

నేటి సువార్త పఠనంలో (మత్త 11:25–30), “భూమ్యాకాశములకు ప్రభువైన” తండ్రిని స్తుతించడంలో తనతో కలిసి పాలుపంచుకోవాలని యేసు ప్రభువు మనలను ఆహ్వానిస్తున్నారు (వ. 25). మానవరూపం దాల్చిన దేవుని కుమారుడు, సృష్టిలోని సమస్త జీవులను ఈ కృతజ్ఞతా స్తుతిలో భాగం చేయడం ద్వారా తన ప్రేమను వెల్లడిస్తున్నారు.

ఈ స్వచ్ఛమైన, సంతోషకరమైన ఆరాధన దేవుని కార్యాచరణను తెలియజేస్తుంది: ఆయన తనను తాను “పసిబిడ్డలకు” (నమ్రత గలవారికి) వెల్లడించడానికి ఇష్టపడతారు, కానీ “విజ్ఞులకు, వివేకవంతులకు” తనను తాను మరుగుపరుచుకుంటారు (వ. 25). వారు తమ సొంత ఆలోచనలతో నిండిపోయి ఉండటం వల్ల, తమను దర్శించడానికి వచ్చిన మెస్సయ్య అయిన క్రీస్తు ఉనికిని గుర్తించలేకపోతున్నారు. మానవ జ్ఞానం అలా అహంకారంగా మారుతుంది, వారి బోధలు గర్వానికి దారితీస్తాయి. దానికి భిన్నంగా, దేవుని నిజమైన జ్ఞానం క్రీస్తు అవతారము యొక్క నమ్రతలో వ్యక్తమవుతుంది. ఆయన బోధలు ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారిని ఉద్దేశించినవి: “భారముచే అలసిసొలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు” (వ. 28) అని ప్రభువు సెలవిస్తున్నారు. యేసు వద్దకు రావడం అంటే ఆయన ప్రేమకు స్పందించడం, సిలువ వరకు ఆయన జీవితంలో పాలుపంచుకోవడం అని అర్థం. దీనినే ఆయన స్వయంగా బోధిస్తూ, “నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తికొని నన్ను అనుసరింపవలెను” (మత్త 16:24) అని అన్నారు. ప్రేమతో కూడిన ఈ ఆత్మసమర్పణే యేసు యొక్క “కాడి” (మత్త 11:29). ఇదే ఆయన బోధనల సారాంశం, అందరిపట్ల ప్రేమతో ప్రజ్వరిల్లే ఆయన జ్ఞాన హృదయం.

సహోదరీ సహోదరులారా, సిలువ భారం “సులువుగా”, “తేలికగా” (వ. 30) ఎలా ఉండగలదు? దానికి ఒకే ఒక్క కారణం, ప్రభువు స్వయంగా ఆ భారాన్ని మనతో కలిసి మోస్తారు, మనలను కృంగదీసే ఏ కష్టంలోనూ ఆయన మనలను ఒంటరిగా వదిలిపెట్టరు. ఒక నిజమైన బోధకునిగా, చెడు వల్ల గాయపడిన మానవాళిని స్వస్థపరిచి, ఆదరించడానికి యేసు ఆ భారాన్ని తనపై వేసుకున్నారు. ఆయన మనకు అనుగ్రహించే జ్ఞానం రక్షణ యొక్క ప్రకటన, ఆయన కాడి మనల్ని ప్రతి పతనం నుండి పైకి లేపుతుంది. అందువల్ల, క్రీస్తును అనుసరించే మన ఆధ్యాత్మిక ప్రయాణం మనల్ని హింసించే కఠిన వ్రతం కాదు. బదులుగా, అది మనకు స్వేచ్ఛను నేర్పే ఒక పాఠశాల. అది మానవ చరిత్రలోని కష్టాలను గుర్తిస్తూ, ముఖ్యంగా చీకటి క్షణాలలో దానికి నిరంతరం నిరీక్షణను అందిస్తుంది. నిజానికి, కేవలం యేసు సిలువ ద్వారానే చెడు జయించబడుతుంది; కేవలం ఆయన శ్రమల ద్వారానే మన మరణ భయానికి, అలసటకూ ఆదరణ, విముక్తి లభిస్తాయి.

దాస్యంలో క్రీస్తే విముక్తి. యుద్ధాల సంక్షోభంలో క్రీస్తే నిరీక్షణ. పాపపు ఘడియలో క్రీస్తే క్షమాపణ. ఇదే నిజమైన జ్ఞానం, ఆయన నామంలో శిష్యులుగా ఒక్కటై మనం కలిసి నడవాల్సిన మార్గం. యేసు కుమారునిగా ఉంటూనే, మనకు సోదరుడిగా మారి దీనిని నేర్పిస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన దేవుని గురించి, మానవాళి గురించిన సత్యాన్ని తిరుసభకు వెల్లడిస్తున్నారు, ఎందుకంటే “తండ్రి ఎవరో కుమారునికి తప్ప, కుమారుడు ఎవరికి ఆయనను తెలియజేయాలని నిశ్చయించునో వారికి తప్ప మరి ఎవరికిని తెలియదు” (వ. 27).

ప్రియమైన మిత్రులారా, ప్రభువు మనపై ఉంచిన ప్రేమపూర్వకమైన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తిరుసభ మేలు కొరకు, సర్వలోక శ్రేయస్సు కొరకు విజ్ఞాపన చేయమని శాంతి రాజ్ఞి అయిన మరియమాతను ప్రార్థిద్దాం. ఆమెన్.

No comments:

Post a Comment