లియో XIV
త్రికాల ప్రార్ధన
లిబర్టీ స్క్వేర్ - పియాజ్జా డెల్లా లిబెర్టా (కాస్టెల్ గందోల్ఫో)
15వ సామాన్య ఆదివారము, 12 జూలై 2026
ప్రియమైన సహోదరి సహోదరులారా, శుభ ఆదివారం!
నేటి
పరిశుద్ధ గ్రంథ పఠనంలో, సువార్తికుడైన మత్తయి ప్రభువు
చెప్పిన “విత్తువాని ఉపమానమును” (మత్త 13:1–23) తెలియజేస్తున్నారు.
దేవుడు ఎంతటి ఉదారతతో, నమ్మకంతో తన వాక్యాన్ని మన హృదయాలలో వెదజల్లుతాడో,
ఆయన శక్తి మనలో ఎలా పనిచేస్తుందో ఈ ఉపమానం వివరిస్తుంది.
మన
రక్షణ కోసం తన ప్రాణాన్నే అర్పించి, మానవరూపం దాల్చిన దేవుని
వాక్యమే యేసు క్రీస్తు ప్రభువు. తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో నిరంతరం వెదజల్లుతున్న
విత్తనం యేసు క్రీస్తే. ఆ విత్తనం నశించడం ద్వారా విస్తారముగా ఫలిస్తుంది (యోహాను 12:24).
కొన్నిసార్లు మన హృదయాలు కఠినంగా, ఎలాంటి స్పందన
లేకుండా ఉంటాయనేది నిజమే. త్రోవప్రక్కన నేలలాగా, రాతి
నేలలాగా, లేదా ముళ్లపొదల్లాగా మన మనస్సులు పరధ్యానంలో
మునిగిపోతూ ఉంటాయి. అయినప్పటికీ, మన హృదయాలు దేవుని
వాక్యానికి లోబడేవిగా, సారవంతమైన నేలగా మారే క్షణాలు కూడా
ఉంటాయి. అప్పుడు, సమస్తాన్ని మార్చివేయగల ప్రేమ యొక్క
అద్భుతాలు మనలో మొదలవుతాయి. దీనిని మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా అనుభవించే ఉంటాం.
అందుకే, మన బలహీనత కంటే ఆయన ప్రేమ శక్తి చాలా గొప్పదని (2
కొరి 12:9-10) తండ్రి అయిన దేవునికి తెలుసు
గనుక, ఆయన వాక్యమనే విత్తనాన్ని వెదజల్లడం ఎన్నటికీ ఆపడు.
దేవుని
వాక్యమనే “విత్తనం” గురించి పునీత జాన్ క్రిసోస్టమ్ గారు, “ముళ్లపొదల్లో, రాతి నేలపై లేదా త్రోవ ప్రక్కన వెదజల్లడం సమంజసమేనా? అని ప్రశ్నిస్తున్నారు. విత్తనాలు మరియు నేల విషయంలో అయితే అది
సరికాకపోవచ్చు! కానీ ఆత్మల విషయంలో, దేవుని బోధనల విషయంలో
మాత్రం అది ఎంతో ప్రశంసనీయమైనది” (మత్తయి సువిశేషంపై ప్రసంగం, 44, 5) అని అన్నారు. ఎందుకంటే, దేవుని
చేతుల్లో “రాతి నేల కూడా సారవంతమైన నేలగా మారుతుంది; బాటసారుల
కాళ్ల కింద నలిగిపోయే త్రోవ, దారిన పోయేవారి పాలు కాకుండా
విలువైన, సారవంతమైన నేలగా మారుతుంది; ముళ్లపొదలు తొలగిపోయి,
విత్తనం పూర్తి సంరక్షణతో ఎదుగుతుంది.”
మన పట్ల
దేవుడు చూపించే ఉదారత, అమాయకత్వంతో కూడినది కాదు, అది ఎంతో జ్ఞానంతో కూడినది. కొన్నిసార్లు మనకు కూడా కనిపించని మనలోని
మంచితనాన్ని, నైపుణ్యాన్ని దేవుడు చూస్తారు. అందుకే, మన హృదయాల స్థితి మనకంటే దేవునికే బాగా తెలుసు. దేవుడు మనల్ని ఎప్పుడూ
నమ్ముతూనే ఉంటారు. మనం ఈ రోజు ఎలా ఉన్నాం, రేపు ఎలా మారగలం
అనేది దేవునకు తెలుసు. కనుక, మనం చేయవలసిందల్లా విశ్వాసంతో మనల్ని మనం ఆయనకు
అప్పగించుకోవడమే!
ఈ
విధంగా, విత్తనం ఎంతటి ఉదారతతో, నమ్మకంతో నాటబడుతుందో... దానిని మనం అంతే వినయంతో, హృదయపూర్వకంగా
స్వీకరిస్తే, పరిశుద్ధాత్మ ఫలాలు మనలో పెరిగి ఇతరులకు కూడా
విస్తరిస్తాయి. పునీత పౌలు గారు చెప్పినట్లు ఆ ఫలాలు ఏమిటంటే, “ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత,
సాత్వికత, నిగ్రహము” (గలతీ 5:22). ప్రస్తుత ప్రపంచానికి ఈ ఫలాలు ఎంతో అవసరం. లోకమంతా వీటితో నిండిపోయి,
ఒక కొత్త మార్పు రావాలి!
కాబట్టి, ముఖ్యంగా ఈ కాలములో, దేవుని
వాక్యాన్ని వినడానికి, చదవడానికి, ధ్యానించడానికి
సమయాన్ని కేటాయిద్దాం. విశ్రాంతితో, మంచి వినోదంతో పాటు,
నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకునే అమూల్యమైన క్షణాలను అలవరచుకుందాం.
దీనివల్ల మనం శారీరకంగా, ఆధ్యాత్మికంగా నూతన శక్తిని పొంది,
మళ్లీ మన పనుల్లోకి ప్రవేశిస్తాం. అప్పుడు సువార్తను ప్రకటించడానికి,
దేవుని రాజ్యాభివృద్ధికి మన వంతు కృషి చేయడానికి మరింత
సమర్థులమవుతాము.
అపొస్తలుల
రాజ్ఞి, సువార్తీకరణకు మార్గదర్శి అయిన
మరియమాత, మనకు సహాయం చేయును గాక. ఆమెన్!
No comments:
Post a Comment