పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 28 జూన్ 2026
ప్రియమైన
సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు
శుభాకాంక్షలు!
నేటి
సువార్త పఠనంలో (మత్త 10:37–42), యేసు ప్రభువును
ఎలా అనుసరించాలనే దానిపై, దైవరాజ్యానికి ఎలా సాక్షులుగా
నిలవాలనే దానిపై ఇచ్చిన కొన్ని హెచ్చరికలను మనం వింటాము. ఇది కేవలం బాహ్యమైన
క్రియలకు సంబంధించిన విషయం కాదు, కానీ ఆయనతో ఒక
ప్రేమపూర్వకమైన బంధంలో మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవడానికి సంబంధించినది.
ప్రేమ ఫలించాలంటే కనీసం మూడు విషయాలు అవసరం: అనాసక్తి (బంధాల నుండి విడుదల),
నష్టపోవడం మరియు ఆదరణ (ఆతిథ్యం).
మొదటిది, అనాసక్తి. యేసు ఇలా
సెలవిస్తున్నారు, “నాకంటె తన తండ్రినైనను తల్లినైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకు
పాత్రుడు కాడు; నాకంటె తన కుమారునైనను కుమార్తెనైనను
ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు” (వ. 37). ప్రభువు
తన అపొస్తలులను సువార్త పరిచర్యకు పంపడం ప్రారంభించినప్పుడు, వారు ఎలాంటి బంధనాల నుండి అయినా స్వేచ్ఛగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
అయితే, ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది, ఎందుకంటే ఎంతో ముఖ్యమైన మన బంధాలు కూడా క్రీస్తు మనకు ప్రసాదించే ప్రేమ
ద్వారానే పరిపూర్ణతను పొందుతాయి. ఉదాహరణకు వైవాహిక జీవితాన్ని తీసుకోండి! వివాహ
జీవితానికి కట్టుబడి ఉండటానికి ఒకరు తన తల్లిదండ్రుల ఇల్లు “వదిలిపెట్టినప్పుడే”
(మత్త 19:6) ఆ జీవితాన్ని పూర్తిగా జీవించగలరు. పిల్లల
పెంపకాన్ని కూడా మనం పరిగణించవచ్చు. వారు “తమ స్వంత కాళ్లపై తాము నిలబడటం” మరియు
వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం నేర్పడం ద్వారానే, వారు
జీవితంలో విజయం సాధించడానికి, సంతోషంగా ఉండటానికి మనం సహాయం
చేయగలము. పునీత అగుస్తీను గారు ఇలా అంటారు, “మీరు ప్రేమించే దాని నుండి విడిపోవడం
బాధాకరమే. అయినప్పటికీ, రైతు తాను విత్తిన దానిని
తాత్కాలికంగా నష్టపోతాడు” (ప్రసంగం 330: 2). నేలలో నాటిన ఆ
విత్తనాన్ని “నశించిపోవడం” ద్వారానే, అది మొలకెత్తడం మనం
చూడగలం.
ఈ
కోణంలో, ప్రేమ అంటే నష్టపోవడం కూడా.
దీనిని అర్థం చేసుకోవడం మనకు కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా
నష్టపోవడాన్ని బలహీనతగా భావించే, మరియు సంపాదించడం, కలిగి ఉండటం అనే ధ్యాసలోనే బతికే ఈ లోకంలో ఇది మరింత కష్టం! అయినప్పటికీ,
ప్రేమ కేవలం ఆత్మసమర్పణలో మాత్రమే ఫలిస్తుంది: మరొకరి కోసం మనలో
కొంత భాగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు; ఒక
స్నేహితుని మాట వినడానికి కొద్ది సమయాన్ని కేటాయించినప్పుడు; కష్టాల్లో ఉన్నవారితో పాలుపంచుకోవడానికి మన సౌకర్యాన్ని కొద్దిగా త్యాగం
చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సువార్త ప్రకారం, తన
ప్రాణాన్ని తన కోసమే దాచుకొనువాడు దానిని పోగొట్టుకొనును (వ. 39), ఎందుకంటే, వారు ప్రేమ యొక్క ఆనందానికి తమను తాము తెరచుకోరు, తద్వారా నిష్ఫలులవుతారు. అందుకే యేసు మనల్ని సిలువను ఎత్తుకోమని
ఆహ్వానిస్తున్నారు. ఆయన తనను తాను అర్పించుకున్నారు, తనను
తాను నష్టపరుచుకున్నారు, ఆ విధంగానే మనం ఆయన జీవాన్ని
సమృద్ధిగా పొందగలిగాము. అదేవిధంగా, మనల్ని మనం ఇతరులకు
అర్పించుకునే జీవన విధానాన్ని అలవర్చుకుంటే, మన బంధాలలో
సరికొత్త జీవాన్ని తీసుకురాగలుగుతాము.
చివరిది, ఆదరణ (ఆతిథ్యం). ప్రేమ అనేది ఆచరణాత్మకమైన నిర్ణయాలు మరియు క్రియల ద్వారా వ్యక్తమవుతుంది;
దప్పిక గలవానికి ఒక గిన్నెడు నీళ్లు ఇవ్వడం (వ. 42) వంటి చిన్న చిన్న రోజువారీ క్రియల ద్వారా అది వ్యక్తమవుతుంది. యేసు తన
శిష్యులను ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా ముందుగా పంపారు, తద్వారా వారు ఇతరుల సహాయంపై ఆధారపడటం ద్వారా, వారు
కలిసే వారిలో ఆదరించే గుణాన్ని పెంపొందింపజేశారు. యేసు నామమున వచ్చువారిని ఆదరించడం
ద్వారా, మనం ఆయనను మరియు ఆయనను పంపిన పరలోకపు తండ్రిని ఆదరించుచున్నాము.
నిజానికి, ప్రభువుపై ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ మన సహోదరీ
సహోదరులను ఆదరించడంలోనే ఇమిడి ఉంటుంది.
ప్రియమైన మిత్రులారా, తన కుమారుడిని ప్రేమిస్తూనే, ఒకరోజు ఆయనను కోల్పోతానని తెలిసిన మరియమాతను మనం ప్రార్థిద్దాం. క్రీస్తు ప్రేమకు నమ్రతగల, సంతోషకరమైన సాక్షులుగా నిలవడానికి ఆమె మనకు సహాయం చేయును గాక! ఆమెన్.
No comments:
Post a Comment