విచారణలో గురువుల, మఠవాసుల పాత్ర

 విచారణలో గురువుల, మఠవాసుల పాత్ర

గురువులు పీటాధిపతుల ప్రతిష్టలో మరియు ప్రేషిత కార్యంలో భాగస్వాములు. పీటాధిపతులకు సహకారులు (ccc 1562), మద్దతుదారులు, దేవుని ప్రజలకు సేవలందించడానికి పిలుపునందుకున్నవారు. ఒక విచారణ లేదా స్థానిక విశ్వాసుల సంఘానికి, నమ్మకంతో, ఉదారత్వంతో, తాము సహకరించే పీటాధిపతులకు ప్రాతినిధ్యం వహిస్తారు (ccc 1567). గురువులు ఒక విచారణ సంఘానికి ఆధ్యాత్మిక నాయకులు. వారు శ్రీసభకుశిరస్సు అయిన క్రీస్తు స్థానంలోప్రతినిధులుగా పనిచేస్తారు. క్రీస్తు పరమరహస్యాన్ని ప్రకటిస్తారు. క్రీస్తు సువార్త సేవను వారు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే, మఠవాసులు, మఠకన్యలు, దైవాంకిత జీవితం ద్వారా, సువార్త సేవకు, దేవునికి సంపూర్ణముగా అంకితమై, పరలోక రాజ్యానికి శక్తివంతమైన సాక్ష్యాన్ని ఇస్తూ, సువార్త సేవలో తమ సహకారాన్ని అందిస్తుంటారు.

పవిత్ర అభిషేకం పొందిన గురువు యొక్క పాత్ర, లేదా సేవ మూడు ప్రధాన కర్తవ్యాలుగా ఉంటుంది: ఒకటి, పవిత్రపరచడం, రెండు బోధించడం, మూడు నిర్వహించడం. సేవ వారికి అభిషేకం ద్వారా లభిస్తుంది. సేవా బాధ్యత ద్వారా, గురువులు క్రీస్తు యొక్క ఏకైక గురుత్యంలో భాగస్వామ్యాన్ని పొందుతారు. బాధ్యతలను ఇతర గురువుల, డీకనుల సహకారంతో, క్రీస్తు విశ్వాసుల సహాయంతో నేరవేర్చగలరు (క్యానన్ 519). మూడు బాధ్యతల గురించి తెలుసుకుందాం:

పవిత్రపరచడం: మొదటి కర్తవ్యం, ప్రాధమిక విధి, పవిత్రత. సంఘాన్ని ఆధ్యాత్మిక పధంలో నడిపించడం. క్రైస్తవ జీవితానికి మూలం మరియు శిఖరంఅయిన దివ్య సత్ప్రసాదాన్ని లేదా దివ్యపూజా బలిని నిర్వహించడం ద్వారా, కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటారు. అభిషేకం పొందిన గురువులు మాత్రమే, చట్టబద్ధంగా దివ్యపూజా బలిని మరియు పాపసంకీర్తన దివ్యసంస్కారాన్ని నిర్వహించగలరు. అలాగే గురువులు జ్ఞానస్నానాలు ఇస్తారు. జ్ఞాన వివాహాలను జరిపిస్తారు. అవస్థ అభ్యంగాన్ని ఇస్తారు. వారి అనుదిన శ్రీసభ ప్రార్ధనల ద్వారా, వారి ప్రార్ధనా జీవితానికి కట్టుబడి ఉంటారు. వారి ప్రార్ధనల ద్వారా దేవునికి, ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటారు.

బోధించడం: సువార్తను ప్రకటించడం గురువుల ప్రాథమిక విధి. క్రీస్తు బోధన పరిచర్యలో భాగస్తులు అవుతారు. ప్రసంగాలు, ఉపదేశాలు, సత్యోపదేశం, ఇతర విశ్వాస కార్యక్రమాల ద్వారా, దేవుని వాక్యాన్ని అందరికీ సంపూర్ణతలో ప్రకటించడం గురువుల బాధ్యత. సువార్తను బోధించడం అనేది ఆకర్షణీయమైన కర్తవ్యం, ఒక ఉత్తేజకరమైన అనుభవం.

నిర్వహించడం: మేత్రాసన పీటాధిపతుల అధికార పరిధిలో, విచారణ సంఘానికి సముచితమైన కాపరిగా, గురువు ఆధ్యాత్మిక పరిచర్యను, నాయకత్వంను నిర్వహిస్తారు (క్యానన్ 519). సంఘాన్ని అన్నివిధాల పెంపొందిస్తారు. విశ్వాసులను, ముఖ్యంగా పేదలు, రోగులు, ఒంటరిగా ఉన్నవారికి మద్దతు, ప్రోత్సాహం ఇస్తారు. విచారణ కార్యకలాపాలను, ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తారు. సామాన్య ప్రజల పాత్రను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తారు. విచారణ కార్యాలలో, సలహా కమిటీలలో వారి భాగస్వామ్యాన్ని, సహకారాన్ని ప్రోత్సహించడం గురువుల విధి.

అపోస్తులుల కార్యములు 10:42-43లో, “జీవితులకును, మృతులకును తీర్పరిగా దేవుడు నియమించినవాడు ఈయనయే అని, ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు, సాక్ష్యమీయవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయనయందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరు పలికినది ఈయన గురించియేఅని పేతురు తన ప్రసంగంలో చెప్పారు. క్రీస్తు ప్రభువు సర్వ మానవాళి రక్షణకై చేసిన త్యాగమును, దేవుని విశ్వాసులైన ప్రజలకు ప్రకటించాలి. పేతురు గారు ప్రకటించినట్లు, సాక్ష్యమిస్తున్నట్లు, గురువులు మఠవాసులు సువార్తను ప్రకటించాలి, క్రీస్తుకు సాక్ష్యమివ్వాలి.

సువార్త పరిచర్య విస్తృతంగా సాగాలంటే, విచారణలోని ప్రజలను పరామర్శించాలి, వ్యక్తిగతముగా మాట్లాడాలి. కష్టసుఖాలను ఆలకించి, దేవుని ప్రేమలో బలపరచాలి. విచారణలో ఉన్న ప్రతి కుటుంబముతో సన్నిహితంగా ఉండాలి. ప్రజలకు సన్నిహితంగా ఉంటే, దైవానుసరణకు మరింత దగ్గర చేయొచ్చు. మొబైల్ ఫోన్స్ వలన, ప్రేమలు, యోగక్షేమాలు, పలకరింపులుపరామర్శలు..  కరువైన రోజుల్లో, ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, వారి కష్టసుఖాలను ఆలకిస్తూ, కష్టాలలో, వ్యాధి బాధలలో, బలపరుస్తూ, దేవాలయమునకు/ దైవసన్నిధికి మరింత దగ్గర చేయాలి. అప్పుడు వారి మనసులకు ఎంతో ధైర్యము, మానసిక ఆనందము చేకూరి ప్రశాంతంగా జీవించడానికి, దేవుని యందు భక్తితో, ప్రార్ధనలో జీవిస్తారు. దేవుని యందు విశ్వాసముతో జీవించే దేవుని ప్రజల పాపములు దేవుని నామమైనయేసు నామములోక్షమింపబడునని, వారికి ప్రత్యేకంగా తెలియజేయడం రోజుల్లో ఎంతో అవసరం!

మఠవాసుల పాత్ర (బ్రదర్స్ మరియు సిస్టర్స్)

మఠవాసులు, పేదరికం, బ్రహ్మచర్యం, విధేయత అనే సువార్త ప్రమాణాలను వాగ్దానం చేసి, శ్రీసభ ఆమోదించిన ఒక స్థిరమైన సంఘంలో దేవునికి అంకితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు! దైవాంకితులు శ్రీసభ జీవమునకు, పవిత్రతకు అత్యవసరం! ప్రధానంగా సంఘంలో, వారి దైవాంకిత జీవితానికి సాక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. వారి జీవితాలు దేవుని ప్రేమకు జీవిత సాక్ష్యాలు. పరలోక రాజ్యాన్ని భూలోకంలోనే తలపించే శక్తివంతమైన జీవితాలు వారివి! అష్టభాగ్యాల స్ఫూర్తి లేకుండా లోకం మారదని వారి జీవితాల ద్వారా మనకు నిరూపిత మవుతూ ఉంటుంది!

దైవాంకిత జీవితానికి సాక్ష్యమిస్తూనే, వారు మిషనరీ, సేవా కార్యాలు చేపడుతూ ఉంటారు. తద్వారా, శ్రీసభ సేవకు అంకితమై ఉంటారు. వారివారి సంస్థలు, సభల యొక్క నిర్దిష్ట ఆధ్యాత్మిక మరియు నియమావళికి అనుగుణంగా కట్టుబడి ఉంటూ, సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు.

మఠవాసులు చేసే వివిధ రకాల సేవలు ఏమిటంటే, విద్య (పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో బోధన), వైద్య (ఆసుపత్రి పని, రోగులను పరామర్శించడం), దాతృత్వం, సామాజిక న్యాయం (పేదలు మరియు బాధిత ప్రజలతో పనిచేయడం). మఠవాసులు సమాజంలో ఎన్నో సేవలను అందిస్తున్నారు. స్కూల్స్ ద్వారా, హాస్పిటల్స్ ద్వారా, వివిధ సామాజిక సేవలు చేయుచున్నారు. ఎంతో ఓర్పు, సంకల్పం ఉంటేనే, సేవలను చేయగలరు. చిరునవ్వుతో చిన్న పలకరింపు చాలు మనిషి జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. ముఖంపై చిరునవ్వు‌, మాటలలో దైవప్రేమ మరింతగా ఏర్పరచుకోవాలి! ప్రజలకు దగ్గరై, దేవుని ప్రేమను గూర్చి తెలియపరిస్తే, వారు దేవునికి మరింత చేరువవుతారు. మఠకన్యలు, స్త్రీలకుసమీపంగా ఉండాలి. స్త్రీ బాధ్యతగా నడుచుకుంటే, కుటుంబం, బలపడుతుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రవర్తన దైవానుసరణలో సంస్కారవంతంగా ఉంటుంది. మఠకన్యలు చేతనయినంతవరకు కుటుంబాలలోని స్త్రీలతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలి. సమయం కుదిరినప్పుడల్లా స్త్రీలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. వారి హృదయాలలో ఉన్న బాధలను అడిగి తెలుసుకోవాలి! దేవుని వాక్కు ద్వారా ఊరటను కలిగించాలి. పాతకాలంలో మఠకన్యలు గ్రామాలలో క్యాంపులకు వెళ్లి, స్త్రీలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సాధక బాధలను విని, వారిని ధైర్యపరచి, దేవుని ప్రేమకు దగ్గర చేసేవారు. మఠకన్యలు, కుటుంబాలను దర్శిస్తే కుటుంబాలు దైవ ప్రేమలో దేవునికి మరింత చేరువవుతాయి!

మనందరికీ తెలిసిన విధంగా, మఠవాసులు, మఠకన్యలు, విచారణ సంఘానికి మద్దతుగా ఉంటారు. విచారణ సంఘాలలో పనిచేస్తూ, విచారణ గురువులకు సహాయం చేస్తారు, అది బాధ్యత, శ్రీసభ ఆజ్ఞ కూడా! సత్యోపదేశాన్ని బోధించడంలో, దివ్యసంస్కారాలకు సిద్ధం చేయడంలో, వివిధ విచారణ పండుగలకు, మీటింగులకు, క్యాంపులకు, మొదలగు విచారణ స్థాయి కార్యక్రమాలలో, విచారణ గురువులకు సహాయంగా ఉండటం వారి బాధ్యత!

సువార్త సేవలో ముఖ్యమైన విషయాలు

1. ఆత్మీయ అనుబంధం ద్వారా సువార్త ప్రకటన: మనం ఎన్ని సేవలు చేసిన, అంతిమ లక్ష్యం, క్రీస్తును ప్రకటించడం, క్రీస్తుకు సాక్ష్యమివ్వడం. సువార్త ప్రకటన అనేది ఉత్తేజకరమైన, మరియు వ్యక్తిగత అనుబంధం ద్వారా జరగాలి. వ్యక్తిగత సంబంధంలో ఎంతటి గాఢత, ఆత్మీయత కలిగి ఉంటారో, అంతగా అద్భుతాలు చేయగలరు. విద్య, వైద్య సేవలు మనల్ని నిరంతరం అనేకమందిని కలిసేలా చేస్తాయి. కాబట్టి, మన విద్యా సంస్థలను, వైద్య కేంద్రాలను వ్యక్తిగత కలయికలకు, మంచి అనుబంధాలకు కేంద్రాలుగా మార్చడం చాలా ముఖ్యం. ప్రజలకు అందుబాటులో ఉంటే, మనం ఎక్కడికి వెళ్లినా త్వరలోనే కొత్త సంబంధాలను ఏర్పరచుకోగలం. గ్రామ సందర్శనలు చేస్తే, చాలా మంది ప్రజలను కలవడానికి మంచి అవకాశం లభిస్తుంది. కతోలికేతరులైన పొరుగువారిని, స్కూలు పిల్లల తల్లిదండ్రులను కలుసుకోవడానికి, రోగులకు సేవ చేయడానికి, వారి గురించి, వారి పిల్లల పురోగతి గురించి తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇలాంటి సందర్శనల వలన కలిగే ఆత్మీయతలు పరస్పర అనుబంధ భావాన్ని కలిగిస్తాయి. కతోలిక సంఘంపై ఆసక్తిని కలిగిస్తాయి, తరచుగా విశ్వాసం వైపుకు ప్రేరేపిస్తాయి. మనం ఇతరులపై ఆసక్తి చూపిస్తే, వారు మనపై, మనం దేనికోసం పాటుబడుతున్నామో దానిపై ఆసక్తి చూపుతారు!

2. తరచుగా గ్రామ సందర్శనలు: తరచుగా గ్రామాలను సందర్శించడం చాలా ముఖ్యం. అనేక ప్రాంతాలలో, పద్ధతి కనుమరుగవుతోంది. గురువు గురునిలయంలోనే వేచి ఉండి, ప్రజలు తమ వద్దకు రావాలని, తమను పిలవాలని ఆశిస్తున్నారు. దీనివల్ల విచారణ కేంద్రాలు పూర్తిగా సంస్థాగతమైనవిగా మారిపోతున్నాయి. దీనికి విరుద్ధంగా, గురువులు అందరికీ అందుబాటులో ఉండటం, గ్రామాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండటం రోజుల్లో ఎంతో అవసరం! విచారణ కేంద్రం కేవలం పరిపాలనా విభాగం కాదు, అది విశ్వాసుల సహవాసం యొక్క స్ఫూర్తి కేంద్రం కావాలి! విచారణ గురువు, తన సహాగురువులతో కలిసి కేవలం నిర్వాహకులుగా కాక, ఆధ్యాత్మిక ప్రేరేపకులుగా, సంఘ ఐక్యతకు సాధనాలుగా మారాలి.

ప్రతి కాన్వెంటులో ఇద్దరు సిస్టర్స్ ఎప్పుడూ గ్రామ పర్యటనల కోసం అందుబాటులో ఉండేలా చూస్తే ఎంతో బాగుంటుంది. వారు గ్రామాలను సందర్శిస్తూ, పిల్లలకు సత్యోపదేశం బోధించవచ్చు! యువతకు స్పూర్తినివ్వవచ్చు! పెద్దలకు ఉపదేశం చేయవచ్చు! రోగులను పరామర్శించవచ్చు! విశ్వాసం నుండి దూరమైన వారిని చేరుకోవచ్చు! కుటుంబాలలో శాంతిని నెలకొల్పుటకు సహాయం చేయవచ్చు! ఇలా మరెన్నో సేవలను అందించవచ్చు! అలాగే క్రైస్తవేతరుల గృహాలను కూడా సందర్శించవచ్చు!

3. క్రైస్తవ విద్యాసంస్థలలో, బోర్డింగులలో, పవిత్ర బైబిలును గ్రంథమును ధ్యానించి, దేవుని వాక్కును అనుసరించడమును ప్రోత్సహించాలి: ఈనాటి బాలలే రేపటి పౌరులు”. ఈనాటి పసి బాలలే రేపటి నిత్యజీవ వారసులుగా తీర్చిదిద్దాలి. చిన్న ప్రాయము నుండే, దైవానుసరణలో జీవించడం, దేవుని వాక్కును పటించడం, ధ్యానము చేయడం, వాక్కును అర్థం చేసుకోవడం విధంగా జీవించడం ఈనాటి బాలబాలికులకు ఎంతో అవసరం ప్రధానం. విద్యార్థుల జీవిత అనుసరణ  దైవానుసరణలో నడిపింప చేయడం ఎంతో ప్రధానం. విద్యార్థులు బాలలుగా ఉన్నప్పుడే, వారికి నీతి, న్యాయం, నియమం, విచక్షణా జ్ఞానం, పవిత్ర జీవితం, సంస్కారం అలవరచేటట్లు మన క్రైస్తవ విద్యాసంస్థలలో, యాజమాన్యం మంచి నిర్ణయం తీసుకొని విద్యాసంస్థలను, బోర్టింగులను విధంగా నడిపించాలి. దిశగా కృషి చేయడం నేడు సంస్కారమంతమైన యువతరాన్ని తయారు చేయడం  ఎంతో అవసరం!

4. స్థానిక దైవ పిలుపులను ప్రోత్సాహించాలి: గురుత్వ జీవితానికి లేదా మఠవాస జీవితానికి స్థానిక దైవపిలుపులను ప్రోత్సహించడం నేడు ఎంతో అవసరం.

5. డిజిటల్ సువార్తా సేవ: నేటి కాలంలో, ప్రజలు సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాలలో ఎక్కువ చురుకుగా ఉంటున్నారు కనుక, గురువులు, మఠవాసులు డిజిటల్ ప్లా మాధ్యమాలను ఉపయోగించి క్రైస్తవ సందేశాన్ని, మంచి నీతిని, సువార్త సత్యాన్ని ప్రజలకు అందించడం అత్యవసరం.

6. లౌకికవాదం మరియు భిన్న మతాలు: సవాళ్లను ఎదుర్కొంటూ, గురువులు, మఠవాసులు తమ బోధనలో బైబులు సత్యాలతో పాటు, తార్కిక, దాంతపరమైన వివరణలను ఇస్తూ, విశ్వాసం మరియు తార్కికం మధ్య సమన్వయాన్ని తెలియ జేయాలి.

7.శిక్షణ: విచారణ సంఘాలలో, సమాజ నాయకులకు, సత్యోపదేశ బోధకులకు, ఉపదేశులకు, వివిధ కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం గురువుల, మఠవాసుల ముఖ్య బాధ్యత.

No comments:

Post a Comment