పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారము, 14 జూన్ 2026
ప్రియమైన
సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ఆదివారపు
శుభాకాంక్షలు!
నేటి
సువార్త పఠనం (మత్త 9:36–10:8) మనకు ఒక గొప్ప
బహుమతిని అందిస్తుంది. ఎందుకంటే, దీనిని వినే ప్రతి ఒక్కరినీ
ఇది యేసు ప్రభువు యొక్క కరుణా వీక్షణంలోనికి నడిపిస్తుంది. ఈ వాక్య భాగం ఆయన
చూపులోని శ్రద్ధకు సాక్ష్యంగా నిలవడమే కాకుండా, ప్రభువు ఏమి
చూస్తున్నారో కూడా మనకు తెలియజేస్తుంది. నిజానికి, క్రీస్తు “ఆ
జనసమూహములను చూచినప్పుడు, వారు కాపరిలేని గొర్రెలవలె చెదరియున్నందున
వారిమీద కనికరపడెను” (వ. 36) అని మనం చదువుతాము. మనకు
సోదరుడిగా మారిన దేవుని కుమారుడు ప్రజల వైపు, మానవాళి వైపు
చూస్తున్నారు: మనల్ని కృంగదీసే అణచివేతను, మనుషుల శక్తిని
క్షీణింపజేసే హింసను ఆయన చూస్తున్నారు. యుద్ధం వల్ల ఏర్పడిన గాయాలను, వినియోగదారీ సంస్కృతి (భోగలాలసత) వల్ల కలిగే శూన్యతను ఆయన చూస్తున్నారు.
ముసుగులుగా మారిన ముఖాలను, చెడు వల్ల ముక్కలైన కుటుంబాలను,
తప్పుడు ఆశయాల వల్ల దారి తప్పిన యువతను యేసు చూస్తున్నారు. యేసు
చూస్తున్నారు మరియు ప్రేమిస్తున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తూ, మన కోసం, మనతో కలిసి బాధపడుతున్నారు: ఆయన కనికరం
కేవలం సహోదర సాన్నిధ్యాన్ని మాత్రమే కాక, మనలను విముక్తి
చేయాలనే ఆయన తపనను కూడా వ్యక్తపరుస్తుంది.
ఎందుకంటే
ఆయనకు మన హృదయాలు తెలుసు, ఆయన మనల్ని ఆదరిస్తారు. “కాపరిలేని
గొర్రెలవలె” (వ. 36) ఉన్న ఎంతో మంది ప్రజలను చూసి, క్రీస్తు అందరి కోసమూ ఒక మంచి కాపరిగా తన్ను తాను సమర్పించుకుంటారు.
అంతేకాక, కోతకు లోకమనే పొలంలోనికి పనివారిని పంపుతారు (వ. 38).
వారి బాధ్యత ఏమిటి? బాధల్లో ఉన్నవారికి దేవుని
ఆదరణను అందించడం; ఎక్కడైతే దైన్య స్థితి ఉందో అక్కడ ప్రేమను,
ఎక్కడైతే శ్రమ ఉందో అక్కడ నిరీక్షణను, ఎక్కడైతే
అవిశ్వాసం ఉందో అక్కడ విశ్వాసాన్ని వారు చేరవేయాలి.
సువార్తలో
మొదటి పన్నెండు మంది “పనివారి” పేర్లు రాయబడ్డాయి: వారు మొదట శిష్యులుగా ఉండి
అపొస్తలులుగా, అనగా సువార్త ప్రచారకులుగా మరియు
బోధకులుగా మారారు. వారిలో మొదటివాడిగా సీమోను పేతురును మనం చూస్తాము. అలాగే
చిట్టచివరగా యూదా ఇస్కరియోతు పేరును కూడా చూస్తాము. ఒకరు యేసును వెంబడిస్తూనే,
ఆయనకు ద్రోహం కూడా చేయవచ్చని మనకు గుర్తుచేయడానికే అతని పేరు చివరన
ఇవ్వబడింది. అయినప్పటికీ, సువార్త అందరికీ సజీవమైన, నిజమైన వాక్యంగానే నిలుస్తుంది. శతాబ్దాలు దాటినా ఈ శుభవార్త ఎప్పటికీ
నూతనమైనదిగా, తాజాదనంతో మరియు విముక్తి కలిగించేదిగానే
ఉంటుంది: “పరలోకరాజ్యము సమీపించియున్నది” (మత్త 10:7). అవును,
అది సమీపంలోనే ఉంది, ఎందుకంటే యేసుక్రీస్తు
నందు దేవుడు ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి, ప్రతి ప్రజకు మరియు ప్రతి దేశానికి అండగా నిలుస్తున్నారు. ఈ సువార్తను
ప్రకటించి, దాని ప్రకారం జీవించినప్పుడు, చెడు అనేది నశించిపోయే ఒక రోగంలా, తెల్లవారగానే
తొలగిపోయే చీకటిలా, పునరుత్థానుడైన క్రీస్తు చేతిలో ఓడిపోయిన
మరణంలా అంతరించి పోతుంది.
యేసు
యొక్క కరుణా వీక్షణం యథార్థతను ఈ విధంగానే మారుస్తుంది. ప్రేమతో నిండిన ఆయన చొరవ
ఒక నూతన సమాజానికి, అనగా తిరుసభకు
జన్మనిచ్చింది. ఈ తిరుసభ అపొస్తలుల పరిచర్యను ముందుకు తీసుకెళ్లవలసి ఉంది: “ఉచితముగా
పొందితిరి, ఉచితముగా నియ్యుడి” (వ. 8). అవును, యేసు ఇచ్చే బహుమతి పూర్తిగా ఉచితమైనది,
ఎందుకంటే దాని విలువ కొలతలకు అందనిది. దానిని మన స్వంత శక్తితో
సంపాదించుకోవడం లేదా “కొనుక్కోవడం” అసాధ్యం. ఈ కృపయే దేవుని కనికరానికి ఉన్న
అందమైన పేరు. మనం ఎక్కడున్నా అది మనల్ని వెతుక్కుంటూ వచ్చి, ఆయన
వైపునకు తిప్పుకుంటుంది. “కావున తన కోతకు పనివారిని పంపవలెనని కోత యజమానుని
వేడుకొనుడి” (మత్త 9:38)!
ప్రియమైన మిత్రులారా, సువార్త ప్రచార బాధ్యత దేవుని ఉచిత బహుమతి నుండి ఉద్భవిస్తుంది. అది క్రీస్తు నందు లోకానికి పాపక్షమాపణగా, దీనులకు మరియు పేదలకు చేసే సేవగా, మరియు న్యాయం పట్ల చూపే నిబద్ధతగా మారుతుంది. యేసు మనల్ని పిలుస్తున్న ఈ పరిచర్యకు మనం సంతోషంతో, ధైర్యంతో స్పందించేలా, దైవకృపతో నిండిన శాంతి రాజ్ఞి అయిన మరియమాత సహాయాన్ని వేడుకుందాం. ఆమెన్.
No comments:
Post a Comment