మరియ మాతృత్వ మహోత్సవం
59వ
ప్రపంచ శాంతి దినోత్సవం
పొప్ లియో XIV
త్రికాల జపము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
గురువారము, 1 జనవరి 2026
ప్రియమైన
సహోదరీ సహోదరులారా, మీ అందరికీ నూతన సంవత్సర
శుభాకాంక్షలు!
గడిచే
నెలల కాలచక్రం పునరావృతమవుతున్నప్పటికీ, ప్రజలందరి మధ్య శాంతి,
మైత్రి పూర్వకమైన ఒక నూతన యుగాన్ని చివరకు ప్రారంభించడం ద్వారా మన
కాలమును నూతనపరుచుకోవాలని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మేలు చేయాలనే ఈ ఆశ
గనుక లేకపోతే, క్యాలెండర్ పేజీలు తిప్పడంలో గానీ, మన డైరీలను నింపడంలో గానీ ఎటువంటి అర్థం ఉండదు.
త్వరలో
ముగియనున్న “కరుణామయ జూబ్లీ” (మహా పవిత్ర సంవత్సరం),
ఒక నూతన లోకం కోసం నిరీక్షణను ఎలా పెంపొందించుకోవాలో మనకు
నేర్పింది. తప్పులను క్షమాపణగా, బాధను ఆదరణగా, మరియు పుణ్య తీర్మానాలను సత్క్రియలుగా మార్చుకోవడానికి మన హృదయాలను దేవుని
వైపునకు మళ్లించడం ద్వారా మనం దీనిని చేస్తాము. ఈ విధంగా, దేవుడు
స్వయంగా మానవ చరిత్రలో నివసిస్తూ, దానిని విస్మృతి నుండి
రక్షిస్తారు; మరియు మన విమోచకుడైన యేసుక్రీస్తును లోకానికి
అనుగ్రహిస్తారు. ఆయన మనకు సోదరుడిగా మారిన దేవుని ఏకైక కుమారుడు. లోకంలోనికి వచ్చే
ప్రతి పురుషుడు మరియు స్త్రీ కొరకు భవిష్యత్తును ఒక ఆదరణకరమైన ఇల్లుగా మనం
నిర్మించేలా, సన్మనస్కులైన ప్రజల మనస్సాక్షులను ఆయన
వెలిగిస్తున్నారు.
ఈ
విషయంలో, నేటి క్రిస్మస్ పండుగ మన చూపును
మరియమాత వైపునకు తిప్పుతుంది, ఎందుకంటే క్రీస్తు హృదయ స్పందనను
మొదటగా అనుభవించినది ఆమెయే! ఆమె కన్యత్వ గర్భపు నిశ్శబ్దంలో, జీవవాక్యము దైవకృప యొక్క హృదయ స్పందనగా మనకు వ్యక్తమవుతుంది.
మంచి
సృష్టికర్త అయిన దేవునికి మరియమాత హృదయము మరియు మన హృదయాలు ఎల్లప్పుడూ తెలుసు. ఆయన
మానవుడిగా మారడం ద్వారా, తన హృదయాన్ని మనకు తెలియజేశారు.
అందువల్ల, యేసు హృదయం ప్రతి ఒక్కరి కోసమూ స్పందిస్తుంది;
గొర్రెల కాపరుల వలె ఆయనను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారి కోసమూ,
మరియు హేరోదు వలె ఆయనను వద్దనుకునే వారి కోసమూ అది స్పందిస్తుంది.
తన పొరుగువాని పట్ల హృదయం లేని వారి పట్ల కూడా ఆయన హృదయం ఉదాసీనంగా ఉండదు:
నీతిమంతులు తమ సేవా నిరతిలో కొనసాగేలా వారి కోసం, అలాగే
అవినీతిపరులు తమ జీవితాలను మార్చుకొని శాంతిని పొందేలా వారి కోసం కూడా అది
స్పందిస్తుంది.
రక్షకుడు
ఒక స్త్రీకి జన్మించడం ద్వారా ఈ లోకంలోనికి వచ్చారు. పరమ పవిత్ర మరియమాతలో
ప్రకాశిస్తూ, జన్మించబోయే ప్రతి బిడ్డలోనూ
ప్రతిబింబిస్తూ, మన మానవత్వంలో ముద్రించబడిన దైవ స్వరూపాన్ని
వెల్లడిస్తున్న ఈ అద్భుత ఘట్టాన్ని మనం కాసేపు ఆరాధిద్దాం.
ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా, మనమందరం కలిసి శాంతి కోసం ప్రార్థిద్దాం: మొదటిగా, యుద్ధాలు, శ్రమల వల్ల రక్తసిక్తమైన దేశాల మధ్య శాంతి కొరకు, అలాగే హింస లేదా బాధల వల్ల గాయపడిన మన కుటుంబాల మధ్య శాంతి కొరకు ప్రార్థిద్దాం. మన నిరీక్షణ అయిన క్రీస్తు ఎన్నటికీ అస్తమించని నీతి సూర్యుడని నిశ్చయముగా నమ్ముతూ, దైవమాత, మరియు తిరుసభ మాత అయిన మరియమాత విజ్ఞాపన సహాయాన్ని మనం నమ్మకంతో వేడుకుందాం. ఆమెన్.
No comments:
Post a Comment