26వ సామాన్య ఆదివార వాక్యోపదేశము
యెహెజ్కేలు 18:25-28 | ఫిలిప్పీ 2:1-11
| మత్తయి 21:28-32
“నీ ఇష్టప్రకారము కాక, వినయముతో... దేవుని వాక్కును
అనుసరించి, దేవుని ఆజ్ఞలను పాటించి జీవించు.”
క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! నేడు మనం 26వ సామాన్య ఆదివారములోనికి
ప్రవేశించి యున్నాము! నేటి వాక్యోపదేశానికి మీ అందరికి హృదయపూర్వక ఆహ్వానం! దేవుని
వాక్కు మనం హృది, మదిలో, జీవితంలో ఫలించునుగాక!
సహోదరీ సహోదరులారా! ఈరోజు మనం ధ్యానించబోయే దైవ వాక్యాలు మన జీవిత
గమనాన్ని సరిదిద్దుకోవడానికి ఒక దిక్సూచిలా నిలుస్తున్నాయి. మన ఆలోచనలు, మన ప్రవర్తన దేవుని దృష్టిలో ఏ
విధంగా ఉన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవడానికి నేటి దివ్యగ్రంధ పఠనాలు మనల్ని
ఆహ్వానిస్తున్నాయి.
మొదటి పఠనం – నేటి మొదటి పఠన సందేశం, “ఎవరి క్రియలకు వారే
బాధ్యులు”.
యెహెజ్కేలు గ్రంథము 18:25-28, “కాని మీరు ‘యావే ప్రభువు చేయునది సబబుకాదు’ అని పలుకుదురు.
యిస్రాయేలీయులారా! వినుడు. నా మార్గము సబబైనది కాదా? మీ
మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడుకు పాల్పడి
చనిపోయెనేని, తన దుష్కార్యములవలననే చనిపోయెను. దుష్టుడు తన
పాపకార్యములనుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచిపనులు చేసెనేని, తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలిసికొని తన పాపముల నుండి
వైదొలగెను గనుక చావునకు తప్పి బ్రతుకును.”
మన యెడల దేవుని చిత్తమే అత్యంత సరియైనది. మన సొంత ఆలోచనలు, సొంత చేతలు మనల్ని
దుర్మార్గంలోనికి నడిపిస్తాయి. “నా మార్గమే మంచిది, ఇదే
సరియైనది” అని ఎప్పుడూ గుడ్డిగా ముందుకు సాగకూడదు. దేవుని వాక్కును బట్టి మన
జీవితాన్ని కొనసాగించాలి. మనము మంచి మార్గమును
ఎంచుకోవాలి, అదే దైవ
మార్గము. దేవుని వాక్కును బట్టి మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి.
మన మంచి చెడులు మన తుది తీర్పును ఇస్తాయి. మనం నీతి కార్యాలు చేస్తే నీతిమంతుల గుంపులో
ఉంటాము. మనం దుష్కార్యాలు చేస్తే నరకంలో నెట్టబడే
గుంపులో ఉంటాము. పాపులమై, మారుమనస్సు మరియు పశ్చాత్తాపం లేకుండా జీవిస్తే మన ఆత్మను మనమే నశింప జేసుకుంటాము.
అదే మంచి కార్యములు చేస్తూ, న్యాయవంతమైన
జీవితం జీవిస్తే, నిత్యజీవమును సొంతం చేసుకుంటాము. తుది
నిర్ణయం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. కనుక, ఎవరి క్రియలకు వారే బాధ్యులు!
రెండవ పఠన సందేశం - క్రీస్తు వినయము - మన క్రీస్తానుసరణ
‘క్రీస్తు ప్రభువు యొక్క వినయమును, గొప్పతనమును తెలుసుకొని, మనము కూడా వినయంతో జీవించి
దేవుని కృపను ఏ విధంగా పొందుకోవాలో’ పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. క్రీస్తు
ప్రభువు దైవస్వభావం కలిగియున్నప్పటికీ, దేవునితో తన
సమానత్వాన్ని స్వార్థబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. “నేనూ దైవ సమానుడనే కదా” అని
తన సొంత ఆలోచనలన ప్రకారం జీవించలేదు. అన్ని విషయములలోనూ పరలోక తండ్రి చిత్తాన్నే
తన బాధ్యతగా నెరవేర్చారు. అన్ని విషయములలోనూ తండ్రి దేవునికి ప్రార్ధించారు. అంటే, ప్రతి ఒక్క విషయములో కూడా పరలోక తండ్రి దేవుని ఇష్టప్రకారమే, పరలోక తండ్రి దేవుని ఆధీనంలోనే ప్రతిక్షణం క్రీస్తు ప్రభువు జీవించారు.
క్రీస్తు ప్రభువు దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ‘తనను
తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవమాత్రుడిగా’ జన్మించారు. చివరి వరకు, అంటే మరణ ఘడియ
వరకు కూడా, ఆయన తండ్రి దేవుని యెడల వినయము గలవారై, విధేయుడాయెను.
అందుకే, పరలోక తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును అత్యున్నత
స్థానమునకు లేవనెత్తి, అన్ని నామముల కంటే ఘనమైన నామమును
ప్రభువునకు ప్రసాదించారు. పరలోక భూలోక పాతాళ లోకములయందలి సమస్త జీవులు క్రీస్తు
నామమునకు మోకాలువంచి వినతులు కావలెను. ప్రతి నాలుక దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు
ప్రభువు అని ప్రకటించవలెను. సామెతల
గ్రంధము 15:33లో “వినయము వలననే గౌరవము కలుగును” అని చూస్తున్నాం! పునీత అగుస్తీను
గారు క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన ప్రధాన సుగుణాల గురించి బోధిస్తూ, “మొదటిది
ఏమిటి? వినయం. రెండవది ఏమిటి?
వినయం. మూడవది ఏమిటి? వినయం” అని అన్నారు.
క్రీస్తు జీవితం నుండి మనం తప్పక జీవించాల్సిన రెండు సుగుణాలు, ఒకటి వినయము,
రెండు విధేయత. వినయము అంటే ‘తననుతాను రిక్తునిగా చేసుకోవడం; తగ్గించు
కొనడం; ఏమిలేని వానిగా భావించడం; తండ్రి
దేవునిపై ఆధారపడి జీవించడం; అలాగే ఇతరులపట్ల సేవాభావముతో
జీవించడం. విధేయత అంటే దేవుని చిత్తమును
నెరవేర్చుటకు తనను తాను సమర్పించు కొనుట; మరియతల్లివలె,
“ఇదిగో నేను ప్రభువు దాసుడను/దాసురాలను. నీ చిత్తము చొప్పున
జరుగునుగాక” అని చెప్పడం; ఎల్లప్పుడూ దేవుని సేవకు అందుబాటులో ఉండటం.
సహోదరీ, సహోదరులారా! మరి నువ్వు నేను ఎలా జీవిస్తున్నాం? దేవునికి సమ్మతంగా
జీవిస్తున్నామా, లేదా లూసిఫరులాగా అహంకారంతో జీవిస్తున్నామా?
లూసిఫర్ దేవుని కంటే అధికునిగా ఉండాలని ప్రయత్నించాడు. అందుకే
పడద్రోయబడ్డాడు. ఎల్లప్పుడూ... ‘నా మంచే’ అని
స్వార్థముతో, గర్వముతో, అహంభావంతో జీవిస్తే... లూసిఫర్ మనస్తత్వం, మనది సమానమే! సొంత ప్రయత్నాలతో, సొంత ఆశల కొరకు జీవిస్తే, నరకమే మనకు
ప్రాప్తిస్తుంది. ఈ విధమైన జీవన విధానములను దేవుడు ఇష్టపడరు. ఎల్లప్పుడూ మనం దైవస్వభావమును
కలిగి సాటివారిని ప్రేమిస్తూ, సాటివారి సమస్యలలో తోడుగా,
బాసటగా నిలుస్తూ, యేసుక్రీస్తు వినయము, విధేయత
భావమును మనము కలిగి ఉండి, జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా జీవించకపోతే మనకు పెనుముప్పే
ముందు ఉంది అని గ్రహించి ఇప్పటికైనా పశ్చాత్తాప హృదయంతో, మారుమనస్సు పొందుకొని, మన
తప్పులను సరిచేసుకుందాం. పౌలుగారు ఇచ్చిన ఆధ్యాత్మిక సలహాను పాటిద్దాం, “స్వార్ధముతోగాని,
అహంభావముతోగాని ఎట్టి పని చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటె
అధికులుగా భావింపుడు. ప్రతి ఒక్కరు కేవలము స్వార్ధమునే చూచుకొనక, పరస్పరము ఉపకారులై ఉండవలెను” (ఫిలిప్పీ 2:3-4).
సువిశేష సందేశం - ఇద్దరు కుమారుల ఉపమానము
పునీత మత్తయి గారు వ్రాసిన సువార్త 21:28-32 వచనాలను
ఆలకించుదాం, “ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. అతడు పెద్దవానితో, ‘కుమారా! నేడు నీవు మన ద్రాక్షతోటలోనికి పోయి పనిచేయుము’ అని చెప్పగా,
మొదట అతడు ‘వెళ్ళుట నాకిష్టము లేదు’ అని చెప్పినను, పిమ్మట తన మనస్సు మార్చుకొని వెళ్ళెను. తరువాత తండ్రి రెండవ కుమారునితో
అట్లే చెప్పెను. అపుడు అతడు ‘నేను వెళ్ళుచున్నాను’ అని చెప్పియు వెళ్ళలేదు. ఆ
యిద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు?” అని యేసు ప్రశ్నింపగా
“మొదటివాడు” అని సమాధానము ఇచ్చిరి. అపుడు యేసు వారితో, “సుంకరులును,
జారిణులును మీ కంటెను ముందు దేవుని రాజ్యములో ప్రవేశింపబోవుచున్నారు
అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను మీకు నీతిమార్గము చూపుటకు వచ్చెను
కాని, మీరతనిని విశ్వసింపరైతిరి. సుంకరులు, జారిణులు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయపరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి” అని
పలికెను.
ఈ ఉపమాన సందర్భం ఏమిటంటే, యేసు యేరూషలేము దేవాలయమున ప్రవేశించి
బోధించుచుండగా, ప్రధానార్చకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారముతో నీవు ఈ పనులు అనగా బోధనలు,
స్వస్థతలు, అద్భుతాలు చేయుచుంటివి? నీకు ఈ అధికారమిచ్చిన వాడెవడు? అని ప్రశ్నించారు
(మత్త 21:23). ఈ సందర్భమున, ప్రభువు
మూడు ఉపమానములనుచెప్పాడు. అందులో మొదటిది “ఇద్దరు కుమారుల
ఉపమానము.”
సహోదరీ సహోదరులారా! యేసు ప్రభువు చెప్పిన ఈ “ఇద్దరు కుమారుల ఉపమానము”
మన హృదయాలను తట్టాలి. పెద్ద కుమారుడు, మొదట
“వెళ్ళుట నాకు ఇష్టం లేదు” అన్నాడు, కానీ పిమ్మట ‘మనస్సు మార్చుకొని’ ద్రాక్షతోటకు వెళ్లి తండ్రి ఆజ్ఞ
నెరవేర్చాడు. రెండవ కుమారుడు, “నేను వెళ్ళుచున్నాను” అని చెప్పి అసలు వెళ్లలేదు.
ఈ ఉపమానములో, ప్రధానంగా ఆకర్షించే వాక్యం, “పిమ్మట తన మనస్సు
మార్చుకొని వెళ్ళెను” (మత్త 21:29). మొదటి కుమారుడు మారుమనస్సు పొందిన వారిని
సూచిస్తున్నాడు. తండ్రి ద్రాక్షతోటలోనికి పోయి పనిచేయమన్నప్పుడు మొదట “వెళ్ళుట
నాకిష్టము లేదు” అని చెప్పినప్పటికీ, పిమ్మట తన మనస్సు మార్చుకొని (మారుమనస్సు పొంది) వెళ్ళాడు. ఈ కుమారుడు
పాపాత్ములు, సుంకరులు, హృదయపరివర్తన
చెంది దేవుని వాక్యమును విశ్వసించిన వారిని సూచిస్తున్నాడు. లూకా సువార్త 15:7లో, “హృదయపరివర్తనము
పొంది పాపాత్ముని విషయమై పరలోకమున ఆనందము ఉండును” అని చదువుచున్నాం!
ఇక రెండవ కుమారుడు కపట వేషధారులను సూచిస్తున్నాడు. తండ్రి
చెప్పినప్పుడు “నేను వెళ్ళుచున్నాను” అని చెప్పియు, ఆచరణలో వెళ్ళలేదు. మాటలకు, చేతలకు
పొంతన లేని ప్రధానార్చకులు, పరిసయ్యులు, తమను తాము నీతిమంతులుగా ప్రకటించుకునే కపట వేషదారులను ఈ కుమారుడు
సూచిస్తున్నాడు. లూకా సువార్త 6:45వ వచనంలో ఇలా చదువుచున్నాం, “సజ్జనుడు తన
సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చెను. దుర్జనుడు తన దుష్కోశము నుండి
దుర్వస్తువులను తెచ్చెను. ఏలయన, హృదయ పరిపూర్ణత నుండి
నోటిమాట వెలువడును.” అలాగే యాకోబు 1:22లో, “వాక్యమును
కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసికొనకుడు” అని చదువుచున్నాం!
ఈరోజు మన పరిస్థితి ఏమిటి? మనం కూడా దేవుని వాక్కును వింటున్నాము, ప్రసంగాలు
ఆస్వాదిస్తున్నాము, కానీ ఆచరణలో వెనుకబడిపోతున్నాము. ఈ లోక
జీవితంపై మక్కువతో సాటి మనుషులను మోసపరుస్తున్నాము, హీనపరుస్తున్నాము.
నేడు కుటుంబాలలో ఎన్నో విభేదాలు, విభజనలు, గొడవలు... సమాధానం లేదు, శాంతి లేదు.
బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. బిడ్డలలో
క్రమశిక్షణ ఉండటం లేదు. విలువలతో కూడిన జీవితం జీవించడం లేదు!
మనం కూడా ఆదివారము ప్రార్ధనకు, దివ్యపూజాబలికి
వెళ్తున్నాము, దేవుని
వాక్కును వింటున్నాము, దివ్యసత్ప్రసాదమును స్వీకరిస్తున్నాము, అయినప్పటికీ కూడా మనలో ఉన్న ద్వేషాలను, పాపాలను,
ఈర్ష్యలను, గొడవలను కలిగి జీవిస్తున్నాము.
కేవలం ఆచారాలను మొక్కుబడిగా పాటిస్తే పరలోక రాజ్యం రాదు... కేవలం మాటల్లో ఆరాధన చేస్తే సరిపోదు; దేవుని వాక్కును ఆచరించాలి,
సాటివారిని ప్రేమించాలి, వారి అపరాధాలను మన్నించాలి.
అన్నింటికన్న ముఖ్యంగా మనకు కావలసింది: “మనస్సు మార్చుకోవడం”, మారుమనస్సు చెందడం!
మనం ఈ ఉపమానంలో ఏ కుమారుని వలె జీవిస్తున్నామో ఆత్మపరిశీలన
చేసుకోవాలి. రెండవ కుమారుని వలె దేవున్ని ధిక్కరిస్తే నరక మార్గాన్ని
ఎంచుకున్నట్లే! పెదవులతో “ప్రభూ, ప్రభూ” అని పిలుస్తూ, ఆచరణలో దేవుని ఆజ్ఞలను
నిర్లక్ష్యం చేసే రెండవ కుమారుని వలె జీవించకూడదు. మత్త 7:21లో ఇలా చదువుచున్నాం, “ప్రభూ!
ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కాని
పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును.” కనుక, సహోదరీ సహోదరులారా! దేవుని వాక్యమును
కేవలం వినడమే కాకుండా, మన అనుదిన జీవితంలో ఆచరిస్తూ, మొదటి కుమారుని వలె “మారుమనస్సు పొందుతూ”, తండ్రి చిత్తాన్ని
నెరవేర్చేవారంగా ఉండాలి.
మన జీవితంలో కూడా మనం ఒక్కోసారి దేవుని పిలుపునకు వెంటనే
స్పందించలేకపోవచ్చు! కోపంతోనో, స్వార్థంతోనో ‘ఇది నాకిష్టం లేదు’ అని దూరంగా జరిగిపోవచ్చు! కానీ మారుమనస్సుతో
వెనక్కి వచ్చి దేవుని ద్రాక్షతోటలో పనిచేయడానికి ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి
అని తెలుసుకుందాం!
ముగింపు
మనుషులను మనం మభ్యపెట్టగలము కానీ, సర్వాంతర్యామి అయిన దేవున్ని ఏమాత్రం మోసంచేయలేము. మన ప్రతి క్రియకు మనమే
బాధ్యులము. కనుక, ఇప్పటికైనా మన తప్పులను పశ్చాత్తాప హృదయంతో
సరిదిద్దుకుందాం. క్రీస్తు ప్రభువు చివరి క్షణం వరకు తండ్రి చిత్తానుసారంగా వినయ
విధేయతలతో జీవించినట్లే, మనమూ ఆయన బాటలో పయనిద్దాం.
ప్రార్థన చేసుకుందాం: “సర్వేశ్వరా! మేము ఎల్లప్పుడూ నీ ఆజ్ఞలను
పాటిస్తూ, నీవు మాకు అప్పగించిన
బాధ్యతను ఉపమానంలోని మొదటి కుమారుని వలె నెరవేర్చే కృపను మాకు దయచేయి. సైతాను
పన్నాగాలను మా జ్ఞానంతో తిరస్కరించి, నీ దివ్య వాక్కును
ఆచరిస్తూ పరలోక రాజ్యానికి వారసులుగా జీవించే జ్ఞానాన్ని, యుక్తిని
మాకు అనుగ్రహించండి. ప్రభూ! మా పెదవులతో నిన్ను కీర్తించడమే కాకుండా, మా చేతలతో నీ ప్రేమను చాటుకునే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమెన్.”
No comments:
Post a Comment