లియో XIV
త్రికాల ప్రార్ధన
లిబర్టీ స్క్వేర్ - పియాజ్జా దెల్ల లిబర్తా (కాస్టెల్ గండోల్ఫో)
ఆదివారము, 20 జూలై 2025
ప్రియ
సహోదరీ సహోదరులారా! శుభ ఆదివారం!
నేటి దైవార్చన అబ్రహాము మరియు ఆయన భార్య సారాలు చూపిన ఆతిథ్యాన్ని, ఆ తర్వాత యేసు స్నేహితులైన మార్తమ్మ, మరియమ్మ చూపిన ఆతిథ్యాన్ని ధ్యానించమని మనల్ని ఆహ్వానిస్తుంది (ఆది 18:1-10;
లూకా 10:38-42 చూడండి). మనం ప్రభువు విందుకు ఆహ్వానించబడి,
దివ్యసత్ప్రసాద విందును స్వీకరించిన ప్రతిసారీ, స్వయంగా దేవుడే “మనకు సేవ చేయడానికి వస్తారు” (లూకా 12:37). అయితే, దేవుడు మొదట అతిథిగా ఉండటం అంటే ఏమిటో
తెలుసుకున్నారు. నేటికీ, ఆయన మన ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాడు
(దర్శన 3:20). ఇటాలియన్ భాషలో, “అతిథి”
మరియు “ఆతిథ్యమిచ్చే వ్యక్తి” అనే రెండింటికీ ఒకే పదం ఉపయోగించబడుతుంది. ఈ ఆదివారం,
ఆతిథ్యం ఇవ్వడం మరియు స్వీకరించడం అనే ఈ పరస్పర సంబంధం గురించి మనం ధ్యానిద్దాం.
ఆతిథ్యం ఇవ్వడానికే కాదు, దాన్ని స్వీకరించడానికి
కూడా వినయం అవసరం. ఆతిథ్యానికి మర్యాద, శ్రద్ధ, మరియు నిస్వార్థ గుణం కూడా అవసరం. ఈ క్రమంలో సువార్తలో, మార్తమ్మ కొంత సంతోషాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. యేసును ఆహ్వానించడానికి
ఆమె ఎంతగా మునిగిపోయింది అంటే, ఒక ప్రత్యేకమైన కలయిక
క్షణాన్ని దాదాపుగా పాడుచేసుకుంది. మార్తమ్మ ఉదార స్వభావం కలది, కానీ ప్రభువు ఆమెను ఉదారత కంటే ఎక్కువగా ఉండాలని కోరుతున్నాడు. మార్తమ్మ
తన సన్నాహాలను వదిలిపెట్టి, వచ్చి తనతో సమయం గడపమని యేసు
ఆమెను ఆహ్వానిస్తున్నాడు.
ప్రియ సహోదరీ సహోదరులారా, మన జీవితాలు
వర్ధిల్లాలంటే, మనకంటే గొప్పదైన దానికి, మనకు ఆనందాన్ని మరియు
సంతృప్తిని కలిగించే దానికి మనం మనల్ని మనం తెరిచి ఉంచడం నేర్చుకోవాలి. మార్తమ్మ,
తన సోదరి మరియమ్మ పనులన్నీ తనపై వదిలి, తనను వంటరిగా వదిలి వేసిందని ఫిర్యాదు
చేసింది (లూకా 10:40). కాని మరియమ్మ మాత్రం యేసు బోధలు వినడంలో లీనమై పోయింది. మరియమ్మ
తన సోదరి కంటే తక్కువ ఆచరణాత్మకమైనదీ కాదు, తక్కువ ఉదారమైనదీ
కాదు, కానీ ఆమె అత్యంత ముఖ్యమైనది ఏమిటో గుర్తించింది. అందుకే యేసు మార్తమ్మను మందలించారు. ఆమెకు ఎంతో ఆనందాన్ని
కలిగించే ఒక అద్భుతమైన క్షణాన్ని పంచుకునే అవకాశాన్ని ఆమె కోల్పోతోంది (10:41-42).
మనం ఎలా నెమ్మదించాలో, మార్తమ్మ కంటే మరియమ్మ వలె
మారడం ఎలాగో నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనం కూడా అవసరమైన, ఉత్తమమైన వాటిని
ఎంచుకోవడంలో విఫలమవుతాము. మనం విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలి మరియు ఆతిథ్యం
మెరుగ్గా ఇవ్వటాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ‘హాలిడే పరిశ్రమ’ మనకు రకరకాల
“అనుభవాలను” విక్రయించాలని చూస్తూ ఉంటుంది, కానీ అవి మనం
నిజంగా వెతుకుతున్నవి కాకపోవచ్చు. ప్రతి నిజమైన కలయిక ఉచితం; అది దేవునితో అయినా, ఇతరులతో అయినా, లేదా ప్రకృతితో అయినా ఉచితమే. మనం ఆతిథ్యమును మాత్రమే
నేర్చుకోవాలి, ఇందులో ఇతరులను స్వాగతించడం, మనం కూడా
స్వాగతించబడటానికి అనుమతించడం ఉన్నాయి. మనం ఇవ్వడమే కాదు, పొందవలసింది
కూడా చాలా ఉంది. అబ్రహాము మరియు సారా, వారి వృద్ధాప్యంలో
ఉన్నప్పటికీ, ముగ్గురు సందర్శకులలో ప్రభువును ఆహ్వానించిన
తర్వాత వారు సంతానాన్ని పొందుకొన్నారు. మనం కూడా మన ముందు ఉన్న జీవితాన్ని
స్వాగతించడానికి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి.
పరిశుద్ధ మరియ మాతకు ప్రార్థన చేద్దాం. ఆమె మన ప్రభువును తన గర్భంలో మోసి, యోసేపుతో కలిసి ఆయనకు కుటుంబాన్ని ఇచ్చింది. మరియ మాతలో మన పిలుపులోని అందాన్ని, శ్రీసభ యొక్క పిలుపును చూస్తాం. శ్రీసభ అందరికీ తెరిచిన గృహముగా ఉండాలి. ఈ విధంగా, మన తలుపు తట్టి, లోపలికి రావడానికి అనుమతి అడిగే ప్రభువును ఆహ్వానించాలి.
త్రికాల ప్రార్ధన అనంతరం:
ప్రియ సహోదరీ సహోదరులారా,
ఈ ఉదయం నేను అల్బానో కేథడ్రల్‌లో దివ్య బలిపూజను కొనియాడాను. సంఘ
ఐక్యతకు, మేత్రాసణ సంఘమును కలుసుకోవడానికి
ముఖ్యమైన సమయం. ఈ అద్భుతమైన వేడుకను నిర్వహించడానికి కృషి చేసిన బిషప్ వివా గారికి,
అందరికీ నా ధన్యవాదాలు. మేత్రాసణ సంఘానికి నా శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాను!
ఈ రోజుల్లో మిడిల్ ఈస్ట్ నుండి, ముఖ్యంగా గాజా నుండి
విషాదకర వార్తలు వస్తూనే ఉన్నాయి.
గత గురువారం గాజా నగరంలోని హోలీ ఫ్యామిలీ కతోలిక విచారణపై ఇజ్రాయెల్
సైన్యం జరిపిన దాడిపై నేను తీవ్ర విచారంను వ్యక్తం చేస్తున్నాను. ఈ దాడిలో
ముగ్గురు క్రైస్తవులు మరణించారు, మరికొందరు తీవ్రంగా
గాయపడ్డారు. మరణించిన సాద్ ఇస్సా కోస్తాండి సలామెహ్, ఫౌమియా
ఇస్సా లతీఫ్ అయ్యద్, నజ్వా ఇబ్రహీం లతీఫ్ అబు దౌద్ ల కోసం
నేను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు, మరియు విచారణలోని
విశ్వాసులందరికీ నా సానుభూతిని తెలియ జేస్తున్నాను. ఈ చర్య గాజాలోని పౌరులు మరియు
ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న నిరంతర సైనిక దాడులకు అదనంగా చేరడం చాలా విచారకరం.
యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, శాంతియుత పరిష్కారం కనుగొనాలని నేను మరోసారి పిలుపునిస్తున్నాను.
అంతర్జాతీయ సమాజం మానవతా చట్టాన్ని పాటించాలని, పౌరులను రక్షించే బాధ్యతను గౌరవించాలని, సామూహిక శిక్షలను, విచక్షణారహిత బలప్రయోగాన్ని,
మరియు ప్రజల బలవంతపు స్థానభ్రంశాన్ని నిషేధించాలని నేను
పునరుద్ఘాటిస్తున్నాను.
ప్రియ మిడిల్ ఈస్ట్ క్రైస్తవులారా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఏమీ చేయలేకపోతున్నారని భావించే మీ బాధను
నేను లోతుగా అర్థం చేసుకోగలను. పోప్, మరియు విశ్వ శ్రీసభ
హృదయంలో మీరందరూ ఉన్నారు. మీ విశ్వాస సాక్ష్యానికి ధన్యవాదాలు తెలుపుచున్నాను. [లెవాంట్]
కన్య మరియ, మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక మరియు ప్రపంచాన్ని శాంతి వైపు
నడిపించుగాక.
కాస్టెల్ గాండోల్ఫోలోని విశ్వాసులకు, ఇక్కడ చేరిన యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘కాథలిక్
వరల్డ్‌వ్యూ ఫెలోషిప్’ నిర్వహించిన తీర్థయాత్రలో పాల్గొన్న యువకులకు నేను
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు కొన్ని వారాల ప్రార్థన, శిక్షణ తర్వాత రోమును సందర్శిస్తున్నారు.
“నాయకుల కోసం ప్రార్థనా మారథాన్”ను ప్రోత్సహించిన ఇంటర్నేషనల్ ఫోరం
ఆఫ్ కాథలిక్ యాక్షనుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను: ప్రతి ఒక్కరికీ
అందించిన ఆహ్వానం ఏమిటంటే, ఈ రోజు ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల మధ్య ఒక్క నిమిషం పాటు ప్రార్థన
చేయడానికి సమయం కేటాయించాలి, మన నాయకులను జ్ఞానవంతులను
చేయమని, వారిలో శాంతి కోసం ప్రణాళికలను ప్రేరేపించమని
ప్రభువును కోరాలి.
ఈ వారాల్లో, ఫోకోలారె ఉద్యమంలోని
కొన్ని కుటుంబాలు “న్యూ ఫ్యామిలీస్ అంతర్జాతీయ పాఠశాల” కోసం లోప్పియానోలో ఉన్నాయి.
ఆధ్యాత్మికత మరియు సౌభ్రాతృత్వానికి సంబంధించిన ఈ అనుభవం మిమ్మల్ని విశ్వాసంలో
స్థిరంగా, మరియు ఇతర కుటుంబాలకు ఆధ్యాత్మిక తోడుగా ఉండటంలో
ఆనందంగా ఉంచుతుందని నేను ప్రార్థిస్తున్నాను.
కాథలిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి నేను
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీని ప్రధాన కార్యాలయం ఇక్కడే కాస్టెల్
గాండోల్ఫోలో ఉంది. అగెసి జెలా 3 స్కౌట్ గ్రూపుకు
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఇది ధన్య కార్లో అకుటిస్
సమాధి వద్ద ముగిసే జూబిలీ తీర్థయాత్రలో పాల్గొంటుంది. కాస్టెల్లో ది గోడెగో యువకులకు
కూడా నేను శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను, వీరు రోము కారితాసుతో
సేవా అనుభవంలో పాల్గొంటున్నారు. పాలెర్మో, సార్సినా లలోని విశ్వాసులకు
కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
“ఓ స్టాజ్జో” జానపద బృందం సభ్యులు, అలాగే ఆల్బా ది టోర్మెస్ నుండి వచ్చిన సంగీత బృందం కూడా ఇక్కడ ఉన్నారు.
ఈ రెండు వారాలు నేను కాస్టెల్ గాండోల్ఫోలో బస చేసిన తర్వాత, కొన్ని రోజుల్లో నేను తిరిగి వాటికన్‌కు వెళ్తాను. మీ
ఆతిథ్యానికి మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ సంతోషకరమైన ఆదివార శుభాకాంక్షలు!
మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250720-angelus.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment