లియో XIV ప్రసంగము, ఆల్బానో కేథడ్రల్, 20 జూలై 2025 (16 C)

 పవిత్ర దివ్య పూజాబలి
పరిశుద్ధ పోప్ లియో XIV ప్రసంగము
ఆల్బానో కేథడ్రల్
16వ సామాన్య ఆదివారం, 20 జూలై 2025

 


ప్రియ సహోదరీ సహోదరులారా,

ఈ అందమైన ఆల్బానో కథడ్రల్‌లో నేటి దివ్యపూజాబలిని కొనియాడుట చాలా సంతోషంగా ఉంది. మీకు తెలిసిన విధంగా, నేను మే 12 ఇక్కడకు రావలసి ఉంది, కానీ పరిశుద్ధాత్మ వేరే విధంగా నన్ను నడిపించారు. నేడు, సహోదరభావంతో, క్రైస్తవ ఆనందంతో మీతో కలిసి ఉండటం నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న మీ అందరికీ, మేత్రానులకు, అధికారులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

దివ్యపూజాబలిలో, మొదటి పఠనం మరియు సువార్త పఠనం రెండూ కూడా ఆతిథ్యం, సేవ మరియు దేవుని వాక్యాన్ని వినడం (ఆది 18:1-10; లూకా 10:38-42) గురించి ధ్యానించమని మనలను ఆహ్వానిస్తున్నాయి.

ఆదికాండము 18:1-2లో చెప్పబడినట్లుగా, ముందుగా దేవుడు “మధ్యాహ్నపు ఎండలో” అబ్రాహాము గుడారము దగ్గరికి వచ్చి సందర్శించారు. ఈ సన్నివేశాన్ని ఊహించడం చాలా సులభం: మండుతున్న సూర్యుడు, ఎడారి నిశ్శబ్దం, భరించలేని వేడి, మరియు ఆశ్రయం కోసం చూస్తున్న ముగ్గురు అపరిచితులు. అబ్రాహాము “తన గుడారము వాకిట” కూర్చుని ఉన్నాడు. ఆ సందర్శకులలో అబ్రాహాము దేవుని ఉనికిని గుర్తించి, లేచి, వారిని పలకరించడానికి పరిగెత్తిపోయి వారి యెదుట సాగిలపడి వేడుకున్నాడు. మధ్యాహ్నపు నిశ్శబ్దం ప్రేమపూర్వకమైన పనులతో సాగిపోయింది. అబ్రాహాముతో పాటు, అతని భార్య సారా మరియు సేవకులు అందరు కలిసి భోజనాన్ని సిద్ధం చేసారు. అతిధులు భుజించుచుండగా అబ్రాహాము వారికి సేవలు చేయుటకు తాను అక్కడే చెట్టు క్రింద నిలుచున్నాడు (ఆది 18:8). దేవుడు అబ్రాహామునకు అత్యుత్తమ వార్తను అందించాడు: “నీ భార్య సారాకు ఒక కుమారుడు కలుగును” (ఆది 18:10).

ఈ సంఘటనను బట్టి, దేవుడు సారా, అబ్రాహాముల జీవితాల్లోకి ప్రవేశించడానికి, వారు ఎప్పటినుంచో ఆశించి, చివరికి ఆశ వదులుకున్న సమయములో బిడ్డను ప్రసాదిస్తానని ప్రకటించడానికి, దేవుడు ఆతిథ్య మార్గాన్ని ఎలా ఎంచుకున్నాడో మనం ధ్యానించవచ్చు. అనేక కృపా సమయాల్లో వారిని ఇంతకుముందు సందర్శించిన దేవుడు, ఇప్పుడు ఆతిథ్యాన్ని, నమ్మకాన్ని కోరుతూ వారి తలుపు తట్టడానికి తిరిగి వచ్చారు. వృద్ధ దంపతులు ఏమి జరగబోతుందో పూర్తిగా అర్థం చేసుకోకపోయినా, సానుకూలంగా స్పందిస్తారు. వారు ఆ అజ్ఞాత సందర్శకులలో దేవుని ఆశీర్వాదాన్ని మరియు సాన్నిధ్యాన్ని గుర్తించి, తమ వద్ద ఉన్నదంతా వారికి సమర్పించారు: భోజనం, సాంగత్యం, సేవ మరియు చెట్టు నీడ. దీనికి ప్రతిఫలంగా, వారికి కొత్త జీవితం మరియు సంతానం యొక్క వాగ్దానం లభించింది.

పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ, నేటి సువార్త, దేవుని కార్యాచరణ విధానాన్ని మనకు బోధిస్తుంది. యేసును మార్త, మరియమ్మల ఇంటిలో అతిథిగా చూస్తున్నాము. అయితే ఈసారి, ఆయన మొదటి పఠనంలోవలె అపరిచితుడు కాదు: ఆయన తన స్నేహితుల ఇంటికి పండుగ వాతావరణంలో వచ్చారు. అక్కచెల్లెళ్లలో ఒకరు ఆయనకు సేవ చేస్తూ స్వాగతం పలుకగా, మరొకరు శిష్యురాలు గురువును వింటున్నట్లుగా ఆయన పాదాల వద్ద కూర్చుని ఉన్నారు. మార్తమ్మ తన పనులలో సహాయం కావాలని చేసిన ఫిర్యాదు సందర్భమున, యేసు, దేవుని వాక్యాన్ని వినడం యొక్క విలువను గుర్తించమని తెలియ జేశారు (లూకా 10:41-42 చూడండి).

అయితే, ఈ రెండు వైఖరులను పరస్పరం విరుద్ధమైనవిగా చూడటం లేదా ఈ ఇద్దరు స్త్రీల యోగ్యతలను పోల్చడం సరికాదు. సేవ చేయడం మరియు వాక్యాన్ని వినడం, రెండూ కూడా ఆతిథ్యం యొక్క ప్రధాన అంశాలు.

దేవునితో మన సంబంధానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మన విశ్వాసాన్ని ఆచరణాత్మక పనుల ద్వారా, మన జీవన స్థితికి, పిలుపుకు అనుగుణంగా మన విధులను నమ్మకంగా నిర్వర్తించాలి. అయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత, పరిశుద్ధాత్మ మన హృదయాలకు ఏమి చెబుతుందో విన్న తర్వాత మాత్రమే అలా చేయడం అత్యవసరం. దీని కొరకు, నిశ్శబ్దానికి, ప్రార్థనకు మనం సమయాన్ని కేటాయించాలి. శబ్దాలు, ఇతర పరధ్యానాలను తగ్గించి, హృదయపూర్వక సరళతతో దేవుని సన్నిధిలో మనం ఏకాగ్రత వహించాలి. క్రైస్తవ జీవితంలో ఈ కోణం వ్యక్తిగతంగా, సామాజికంగా ఒక విలువగా మారాలి, అలాగే మన కాలానికి ఒక ప్రవచనాత్మక సూచనగా నిలవాలి. దీన్ని మనం ఈ రోజు తిరిగి పొందడం చాలా ముఖ్యం. మాట్లాడే తండ్రిని వినడానికి, “రహస్యంగా చూసే” (మత్త 6:6) దేవునకు మనం స్థానం కల్పించాలి. ఈ వేసవి కాలంలో, దేవునితో మన సంబంధం యొక్క అందాన్ని, ప్రాముఖ్యతను అనుభవించడానికి, అది ఇతరుల పట్ల మనం ఎంతగా బహిరంగంగా, స్వాగతించేలా ఉండటానికి సహాయపడుతుందో తెలుసుకోవాలి.

వేసవి కాలంలో మనకు ఎక్కువ విశ్రాంతి సమయం ఉంటుంది. ఈ సమయంలో మనం ఆలోచించుకోవచ్చు, ధ్యానం చేయవచ్చు, ప్రయాణించవచ్చు, ఒకరితో ఒకరు గడపవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. పనుల ఒత్తిడిని, చింతలను పక్కన పెట్టి, కొన్ని ప్రశాంతమైన క్షణాలను, ధ్యానాన్ని ఆస్వాదిద్దాం. అలాగే, ఇతర ప్రదేశాలను సందర్శించడానికి, ఇతరులను చూసి ఆనందాన్ని పంచుకోవడానికి సమయం కేటాయిద్దాంనేను ఈ రోజు ఇక్కడ చేస్తున్నట్లుగా. వేసవి కాలాన్ని ఇతరుల పట్ల శ్రద్ధ వహించడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, సలహాలు ఇవ్వడానికి, ఓపికగా వినడానికి ఒక అవకాశంగా మలుచుకుందాం. ఎందుకంటే ఇవి ప్రేమకు వ్యక్తీకరణలు, మనందరికీ అవసరమైనవి. ధైర్యంగా ఇలా చేద్దాం. ఈ విధంగా, సంఘీభావం ద్వారా, విశ్వాసాన్ని, జీవితాన్ని పంచుకోవడం ద్వారా, మనం శాంతి సంస్కృతిని ప్రోత్సహించడానికి సహాయపడతాము. మన చుట్టూ ఉన్నవారు విభేదాలను, శత్రుత్వాన్ని అధిగమించి, వ్యక్తులు, ప్రజలు మరియు మతాల మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి మనం సహాయపడతాము.

పోప్ ఫ్రాన్సిస్ ఇలా అన్నారు: “మనం జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలంటే, ఈ రెండు మార్గాలను అనుసరించాలి. ఒకవైపు, యేసు పాదాల వద్ద ఉండి, ఆయన మనకు ప్రతిదాని రహస్యాన్ని వెల్లడించినప్పుడు వినాలి; మరోవైపు, ఆయన విశ్రాంతి, స్నేహపూర్వక సహవాసం అవసరమైన స్నేహితుని రూపంలో మన తలుపు తట్టినప్పుడు, ఆతిథ్యం అందించడంలో శ్రద్ధగా, సిద్ధంగా ఉండాలి” (ఏంజెలుస్, జూలై 21, 2019). ఈ మాటలను కరోన మహమ్మారి వ్యాప్తి చెందడానికి కొన్ని నెలల ముందు చెప్పారు. మనం ఇంకా గుర్తుంచుకుంటున్న ఆ సుదీర్ఘమైన, కష్టతరమైన అనుభవం, ఈ మాటలలోని సత్యాన్ని మనకు ఎంతో స్పష్టంగా చూపింది.

ఖచ్చితంగా, ఇదంతా ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది. సేవ చేయడం, వినడం ఎప్పుడూ సులభం కాదు; వాటికి కఠోర శ్రమ, త్యాగ నిరతి అవసరం. ఉదాహరణకు, కుటుంబాన్ని పెంచే క్రమంలో నమ్మకమైన, ప్రేమగల తల్లిదండ్రులుగా ఉండటానికి, వినడానికి, సేవ చేయడానికి కృషి అవసరం. అలాగే, పిల్లలు ఇంట్లో, పాఠశాలలో తల్లిదండ్రుల శ్రమకు ప్రతిస్పందించడానికి కూడా కృషి కావాలి. అంతేకాదు, అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, తప్పులు జరిగినప్పుడు క్షమించడానికి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు సహాయం చేయడానికి, దుఃఖ సమయాల్లో ఒకరికొకరు ఓదార్పునివ్వడానికి కూడా ప్రయత్నం అవసరం. అయితే, సరిగ్గా ఈ ప్రయత్నం ద్వారానే జీవితంలో విలువైన వాటిని నిర్మించగలం. ప్రజల మధ్య బలమైన, నిజమైన సంబంధాలను ఏర్పరచడానికి, వాటిని పెంపొందించడానికి ఇదే ఏకైక మార్గం. ఈ విధంగా, దైనందిన జీవితపు పునాదులతో, దేవుని రాజ్యం వృద్ధి చెందుతుంది మరియు దాని ఉనికిని వ్యక్తపరుస్తుంది (లూకా 7:18-22).

పునీత అగుస్తీను, మార్తమ్మ మరియు మరియమ్మల కథను తన ఉపన్యాసాలలో ఒకదానిలో వివరిస్తూ ఇలా అన్నారు: “ఈ ఇద్దరు స్త్రీలు రెండు రకాల జీవితాలకు ప్రతీకలు: వర్తమాన జీవితం, భవిష్యత్ జీవితం; కష్టాలతో కూడిన జీవితం, విశ్రాంతి మయమైన జీవితం; ఒకటి బాధలతో నిండినది, మరొకటి దీవించబడినది; ఒకటి తాత్కాలికమైనది, మరొకటి శాశ్వతమైనది" (ప్రసంగం 104, 4). మార్తమ్మ పనిని గురించి ఆలోచిస్తూ అగుస్తీనుగారు ఇలా అన్నారు: “ఇతరులను చూసుకోవాల్సిన బాధ్యత నుండి ఎవరు తప్పించుకోగలరు? ఈ పనుల నుండి ఎవరు విశ్రాంతి తీసుకోగలరు? మనం వాటిని ప్రేమతో, ఎవరూ తప్పుపట్టని విధంగా చేయడానికి ప్రయత్నిద్దాం... అలసట తీరిపోతుంది, విశ్రాంతి వస్తుంది, కానీ మనం చేసిన ప్రయత్నం ద్వారా మాత్రమే అది లభిస్తుంది. ఓడ ప్రయాణించి తన గమ్యస్థానానికి చేరుకుంటుంది; కానీ ఓడ ప్రయాణం ద్వారా తప్ప గమ్యస్థానాన్ని చేరుకోలేము” (ప్రసంగం 104, 6-7).

నేడు, అబ్రాహాము, మార్తమ్మ, మరియమ్మలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు: వినడం మరియు సేవించడం అనేవి రెండు పరస్పరం సహకరించే వైఖరులు. ఇవి మనల్ని, మన జీవితాలను ప్రభువు ఆశీర్వాదాలకు తెరవడానికి సహాయపడతాయి. వారి ఉదాహరణను బట్టి, మనం ధ్యానాన్ని మరియు కార్యాన్ని, విశ్రాంతిని మరియు కష్టాన్ని, నిశ్శబ్దాన్ని మరియు మన దైనందిన జీవితంలోని హడావిడిని, జ్ఞానం, సమతుల్యతతో సమన్వయం చేసుకోవాలి. ఎల్లప్పుడూ యేసు ప్రేమను మన కొలమానంగా, ఆయన వాక్యాన్ని మన వెలుగుగా, మరియు మన సొంత శక్తికి మించి మనల్ని నిలబెట్టే ఆయన కృపను మన బలంగా తీసుకుందాం (ఫిలిప్పీ 4:13).

No comments:

Post a Comment