పరిశుద్ధ
పొప్ సందేశము
5వ ప్రపంచ తాత/మ్మలు, వృద్ధుల
దినోత్సవం 2025
27
జూలై 2025
“నమ్మకముతో జీవించు నరుడు ధన్యుడు” (సీరా 14:2)
ప్రియ సహోదరీ, సహోదరులారా,
మనం జరుపుకుంటున్న
ఈ జూబిలీ సందర్భముగా, నిరీక్షణ
(ఆశ) అనేది వయస్సుతో సంబంధం లేకుండా, నిరంతరం
ఆనందాన్ని పంచుతుందని గ్రహించాలి. సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో, నిరీక్షణ
కష్టాలను తట్టుకొని నిలబడినప్పుడే నిజమైన
ఆనందాన్ని ఇస్తుంది.
బైబులులో
ఎంతో మంది స్త్రీపురుషుల ఉదాహరణలు ఉన్నాయి. వారందరినీ ప్రభువు వారి జీవిత చరమాంకంలో తన రక్షణ
ప్రణాళికలో భాగస్వాములను చేశారు. అటువంటి వారిలో అబ్రాహాము,
సారా గొప్ప ఉదాహరణ. వయస్సు మీద పడినప్పటికీ, దేవుడు
వారికి బిడ్డను వాగ్దానం చేసినప్పుడు, వారు నమ్మలేకపోయారు. వారికి పిల్లలు
లేకపోవడం భవిష్యత్తుపై ఎలాంటి ఆశ లేకుండా చేసింది.
బప్తిస్త
యోహాను జననం గురించిన దూత ప్రకటనను విన్నప్పుడు జెకర్యా స్పందన కూడా భిన్నంగా ఏమీ
లేదు. “ఇదెట్లు జరుగును? నేనా ముసలి వాడను. నా భార్యకు
కూడ వయస్సు వాలినది” (లూకా 1:18) అని దేవదూతతో పలికాడు. వృద్ధాప్యం,
గొడ్రాలుతనం, భౌతిక క్షీణత, జీవితంపై సంతానంపై గల ఆశను అడ్డుకుంటాయని వారు భావించారు. “నూతనంగా జన్మించడం” గురించి యేసు నికోదేముతో
మాట్లాడినప్పుడు, నికోదేము, “వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింప గలడు? అతడు
తల్లి గర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింప గలడా?” అని
యేసును ప్రశ్నించాడు (యోహాను 3:4). అయినప్పటికినీ,
ఎప్పుడైతే మన పరిస్థితులు మారవని భావిస్తామో, సరిగ్గా అప్పుడే ప్రభువు తన రక్షణ
శక్తితో మనల్ని ఆశ్చర్యపరుస్తారు.
వృద్ధులు, నిరీక్షణకు సంకేతాలు
బైబులులో,
దేవుడు జీవిత చరమాంకంలో ఉన్న వ్యక్తులను ఎంచుకోవడం ద్వారా, తన దైవిక
సంరక్షణను పదేపదే తెలియ జేశారు. అబ్రాహాము, సారా,
జెకర్యా, ఎలిశబెతమ్మ విషయములో మాత్రమే
కాదు, మోషే విషయంలో
కూడా ఇదే జరిగింది; దేవుడు తన ప్రజలను విడిపించడానికి మోషేను పిలిచినప్పుడు అతనికి
అప్పటికే ఎనభై సంవత్సరాలు (నిర్గమ 7:7). దీని ద్వారా దేవుని దృష్టిలో
వృద్ధాప్యం అనేది ఆశీర్వాదం మరియు కృపతో కూడిన కాలం అని మనకు బోధపడుతుంది. అంతేకాకుండా,
దేవుని దృష్టిలో వృద్ధులు నిరీక్షణకు ప్రథమ సాక్షులుగా ఉన్నారు. పునీత
అగుస్తీను గారు, “వృద్ధాప్యం అంటే ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు, దేవుడే
ఆ ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారని చెబుతాడు, “మీ బలం క్షీణించనివ్వండి, తద్వారా
నా బలం మీలో నివసిస్తుంది, అప్పుడు మీరు అపోస్తలుడైన పౌలుతో “నేను ఎప్పుడు
బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అని
చెప్పగలరు (2 కొరి 12:10). వృద్ధుల సంఖ్య పెరుగుదల అనేది మనం వివేకంతో అర్థం చేసుకోవాల్సిన ఒక కాలపు సూచన, తద్వారా చరిత్రలోని ఈ క్షణాన్ని సరిగ్గా వివరించగలం.
శ్రీసభ మరియు ప్రపంచము యొక్క జీవితాన్ని తరాల ప్రవాహం వెలుగులోనే అర్థం చేసుకోగలం.
వృద్ధులను అక్కున చేర్చుకోవడం ద్వారా జీవితం వర్తమానం మాత్రమే కాదని, కేవలం పైపై పరిచయాలు, క్షణిక సంబంధాలతో వృథా చేయకూడదని అర్థం
చేసుకుంటాం. అలాగే, జీవితం నిరంతరం
మనల్ని భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ఆదికాండంలో, వృద్ధుడైన యాకోబు తన మనవలకు, యోసేపు
కుమారులకు దీవెనలిచ్చిన హృదయాన్ని కదిలించే ఘట్టాన్ని మనం చూస్తాం. భవిష్యత్తును ఆశతో చూడమని, దేవుని వాగ్దానాలు నెరవేరే సమయంగా భావించమని చేసిన విజ్ఞప్తిగా
యాకోబు మాటలను చూస్తున్నాము (ఆది 48:8-20). వృద్ధుల
బలహీనతకు యువత శక్తి అవసరం అనేది నిజమైతే, భవిష్యత్తును
జ్ఞానంతో నిర్మించడానికి యువత అనుభవరాహిత్యానికి వృద్ధుల సాక్ష్యం అవసరం అనేది
కూడా అంతే నిజం. ఎన్నిసార్లు మన తాతలు మనకు విశ్వాసం, భక్తి, పౌర ధర్మం, సామాజిక నిబద్ధతకు, కష్టాలలో జ్ఞాపకశక్తికి, పట్టుదలకు ఉదాహరణలుగా నిలిచారు! వారు ఆశతో, ప్రేమతో
మనకు అందించిన అమూల్యమైన వారసత్వం ఎల్లప్పుడూ కృతజ్ఞతకు మూలం, పట్టుదలకు ఒక
పిలుపు.
వృద్ధులకు నిరీక్షణ సంకేతాలు
బైబులు
కాలం నుండి, జూబిలీ, విమోచన
సమయంగా అర్థం చేసుకోబడింది. ఈ సమయంలో, బానిసలు స్వేచ్ఛ పొందారు, అప్పులు
రద్దు చేయబడ్డాయి, భూమి అసలు యజమానులకు తిరిగి ఇవ్వబడింది. జూబిలీ అనేది దేవుడు
కోరుకున్న సామాజిక క్రమం తిరిగి స్థాపించబడే సమయం, సంవత్సరాలుగా
పేరుకుపోయిన అసమానతలు, అన్యాయాలు సరిదిద్దబడే సమయం. నజరేతులో ప్రార్థనా
మందిరంలో, యేసు పేదలకు సువార్తను, గ్రుడ్డివారికి
చూపును, ఖైదీలకు, అణగారినవారికి స్వాతంత్ర్యాన్ని
ప్రకటించినప్పుడు, ఆ విమోచన క్షణాలను గుర్తుచేశారు (లూకా 4:16-21).
జూబిలీ
స్ఫూర్తితో వృద్ధులను చూసినప్పుడు, వారికి విమోచనను, ముఖ్యంగా
ఒంటరితనం, నిర్లక్ష్యం నుండి విమోచనను అనుభవించేలా తోడ్పడాలి. అలా చేయడానికి ఈ
జూబిలీ సంవత్సరం సరియైన సమయం. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడంలో చూపే విశ్వసనీయత,
వృద్ధాప్యంలో ఒక దివ్యమైన ఆనందం ఉందని
మనకు బోధిస్తుంది. ఇది నిజమైన సువార్త ఆనందం. వృద్ధులు
తరచుగా తమను తాము బంధించుకునే నిర్లక్ష్యం
(ఉదాసీనత) అనే అడ్డుగోడలను బద్దలు కొట్టడానికి మనకు
స్ఫూర్తినిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మన సమాజాలు, జీవితంలో
అత్యంత ముఖ్యమైన, సుసంపన్నమైన వృద్ధులను విస్మరించడానికి, వారిని
పక్కన పెట్టడానికి అలవాటు పడుతున్నాయి. ఇది చాలా ఆందోళన
కలిగించే పరిణామం.
ఈ
పరిస్థితిలో, శ్రీసభ వృద్ధుల పట్ల బాధ్యతను
తీసుకోవడం ఎంతో అవసరం. ప్రతి విచారణ,
సంఘం, ప్రతీ సమూహం వృద్ధుల
విషయములో కీలక పాత్ర పోషించాలి. వృద్ధులను క్రమం తప్పకుండా సందర్శించడం, వారికి
వారికి మద్దతు ఇవ్వడం, ప్రార్థనల సమూహాలను ఏర్పాటు చేయడం, వారికి ఆశ, గౌరవాన్ని తిరిగి
తీసుకురాగల సంబంధాలను పెంపొందించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. క్రైస్తవ నిరీక్షణ
ఎల్లప్పుడూ మనల్ని మరింత ధైర్యంగా ఉండమని, గొప్పగా ఆలోచించమని, ప్రస్తుత
పరిస్థితులతో సంతృప్తి చెందకుండా ఉండమని ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంలో, వృద్ధులకు
లభించాల్సిన గౌరవం, ఆప్యాయతను తిరిగి
తీసుకురాగల మార్పు కోసం మనం కృషి చేయాలి.
అందుకే పోప్ ఫ్రాన్సిస్, ప్రపంచ
తాతలు, వృద్ధుల దినోత్సవాన్ని ముఖ్యంగా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులతో కలిసి
జరుపుకోవాలని కోరారు. ఈ కారణంగా, ఈ పవిత్ర జూబిలీ సంవత్సరంలో రోముకు తీర్థయాత్ర
చేయలేని వారు “ఒంటరిగా ఉన్న వృద్ధులను సందర్శిస్తే జూబిలీ ఇండల్జెన్స్
పొందవచ్చు... ఒక రకంగా, వారిలో ఉన్న క్రీస్తు వద్దకు తీర్థయాత్ర చేయడమే”
(మత్త 25:34-36) (అపోస్టోలిక్ పెనిటెన్షియరీ, జూబ్లీ
ఇండల్జెన్స్ మంజూరుకు సంబంధించిన నిబంధనలు, III). ఒక
వృద్ధుడిని సందర్శించడం అనేది యేసును కలుసుకోవడానికి ఒక మార్గం, ఇది
మనల్ని ఉదాసీనత మరియు ఒంటరితనం నుండి విముక్తి చేస్తుంది.
సిరాకు
గ్రంథం (14:2) ఆశను కోల్పోని వారు ధన్యులు అని చెబుతుంది.
బహుశా, మన జీవితం సుదీర్ఘంగా ఉంటే, భవిష్యత్తు
వైపు కాకుండా గతం వైపే చూసేందుకు మనం ప్రలోభపడవచ్చు. అయినప్పటికీ, పోప్
ఫ్రాన్సిస్ తన చివరి దశలో ఆసుపత్రిలో ఉండగా ఇలా వ్రాసారు, “మన శరీరాలు బలహీనంగా ఉన్నప్పటికీ, ప్రేమించకుండా,
ప్రార్థించకుండా, మనల్ని మనం అర్పించుకోకుండా, ఒకరికొకరు
తోడుగా ఉండకుండా, విశ్వాసంతో ఆశకు ప్రకాశవంతమైన చిహ్నాలుగా ఉండకుండా ఏదీ మనల్ని నిరోధించదు” (త్రికాల
ప్రార్ధన, మార్చి 16, 2025). ఏ
కష్టమూ దూరం చేయలేని ప్రేమించే, ప్రార్థించే స్వేచ్ఛ మనకు ఉంది. ప్రతి
ఒక్కరూ, ఎల్లప్పుడూ, ప్రేమించగలరు,
ప్రార్థించగలరు.
మన
శక్తులు సన్నగిల్లినా, ప్రియమైన
వారిపై, భార్య లేదా భర్తపై, పిల్లలపై, ప్రకాశవంతం
చేసే మనవలు, మనవరాళ్లపై మనకున్న ప్రేమ తగ్గదు. నిజానికి,
వారి ప్రేమ తరచుగా మనలో శక్తిని
పునరుజ్జీవింప జేస్తుంది, ఆశను, ఓదార్పును కలిగిస్తుంది.
దేవునిలో మూలాలున్న ఈ ప్రేమకు సంబంధించిన సూచనలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. “భౌతికముగ క్షీణించుచున్నను, ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము” (2 కొరి 4:16) అని ఆ సూచనలు మనకు గుర్తుచేస్తాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ, ప్రభువుపై నమ్మకంతో ముందుకు సాగుదాం. ప్రార్థనలోనూ, పవిత్ర దివ్యబలిపూజలోనూ ఆయనతో మన కలయిక ద్వారా ప్రతిరోజూ మనం నూతనపరచబడతాం.
వాటికన్, 26 జూన్ 2025
గురుశ్రీ
ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment