పొప్ లియో XIV
త్రికాల జపము
పు. పేతురు బసిలికా, రోము నగరము
ఆదివారము, 15 జూన్ 2025
ప్రియమైన
సహోదరీ సహోదరులారా! శుభోదయం!
[జూబిలీ
ఆఫ్ స్పోర్ట్స్] క్రీడా జూబిలీ మహోత్సవ సందర్భంగా [జూబిలీ ఆఫ్ స్పోర్ట్] జరిగిన ప్రత్యేక ప్రార్థనలు ముగించుకున్నాము. ఇప్పుడు,
అన్ని వయసుల, వివిధ నేపథ్యాల నుండి విచ్చేసిన క్రీడాకారులందరికీ
నేను కొన్ని మాటలు చెప్పదలచుకున్నాను. మీరు ఏ క్రీడలోనైనా, అది
పోటీ క్రీడ అయినను, కాకపోయినను, ఎల్లప్పుడూ సహృదయంతో పాల్గొనాలి.
ఆటను కేవలం ఒక కాలక్షేపంగా కాకుండా, అత్యున్నత అర్థంలో “పునఃసృష్టి”గా
భావించాలి. ఎందుకంటే, ఈ ఆరోగ్యకరమైన కార్యములో నిమగ్నమవడం
ద్వారా, మనం ఏదో ఒక విధంగా మన సృష్టికర్తను పోలి ఉంటాము.
క్రీడలు మన శారీరక, మానసిక వికాసానికి దోహదపడటమే కాకుండా,
మనలో దైవిక లక్షణాలను పెంపొందిస్తాయని గుర్తుంచుకోండి.
క్రీడలు
కేవలం శారీరక వ్యాయామం లేదా వినోదం మాత్రమే కాదు, అవి శాంతి స్థాపనకు అద్భుతమైన మార్గం. క్రీడా మైదానం న్యాయానికి, ఇతరుల పట్ల గౌరవానికి ఒక పాఠశాల లాంటిది. ఇక్కడ మనం కలిసి ఆడటం ద్వారా,
ఒకరినొకరు అర్థం చేసుకుని, సోదరభావాన్ని,
స్నేహాన్ని పెంపొందించుకుంటాం. సహోదరీ సహోదరులారా, హింసకు, బెదిరింపులకు వ్యతిరేకంగా గళమెత్తి, ఈ స్ఫూర్తిని మీరు ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలని మిమ్మల్ని
ప్రోత్సహిస్తున్నాను. క్రీడల స్ఫూర్తితో మనం మరింత దగ్గరై, ఐక్యతను
చాటి, ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేద్దాం.
నేటి
ప్రపంచానికి ఈ సందేశం అత్యంత ఆవశ్యకం. దురదృష్టవశాత్తు, అనేక ప్రాంతాలలో ప్రస్తుతం సాయుధ పోరాటాలు
కొనసాగుతున్నాయి. ఉదాహరణకు, మయన్మార్‌లో కాల్పుల విరమణ
అమలులో ఉన్నప్పటికీ, ఘర్షణలు ఆగడం లేదు. దీనివల్ల సాధారణ
పౌరుల మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో,
శాశ్వత శాంతికి ఏకైక మార్గం అన్ని వర్గాల మధ్య సమగ్ర సంభాషణ మాత్రమేనని
నేను అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. క్రీడలు మనకు నేర్పే సహకారం, పరస్పర గౌరవం, నిష్పక్షపాత వైఖరి వంటి విలువలు యుద్ధ
రహిత ప్రపంచ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తాయి. ఈ క్రీడా స్ఫూర్తితోనే
ఘర్షణలకు ముగింపు పలికి, శాంతియుత పరిష్కారాలను కనుగొనాలని
ఆశిస్తున్నాను.
గత జూన్
13-14 తేదీల మధ్య రాత్రి, నైజీరియాలోని బెన్యూ రాష్ట్రం, గౌమాన్ ప్రాంతంలోని యెల్వాటా
నగరంలో అత్యంత భయంకరమైన మారణకాండ జరిగింది. ఈ దారుణమైన ఘటనలో సుమారు రెండు వందల
మందిని క్రూరంగా హతమార్చారు. మరణించిన వారిలో అధిక శాతం మంది
స్థానిక కతోలిక మిషన్ సెంటరులో తలదాచుకుంటున్న నిరాశ్రయులే కావడం మరింత హృదయ
విదారకం. ఇప్పటికే అనేక రకాల హింసలతో సతమతమవుతున్న నైజీరియాలో భద్రత, న్యాయం, శాంతి నెలకొనాలని మనస్ఫూర్తిగా
ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా, బెన్యూ రాష్ట్రంలోని గ్రామీణ
క్రైస్తవ సమాజాలు నిరంతరం హింసకు గురవుతున్నాయి కాబట్టి, వారి
భద్రత కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ దారుణ ఘటనపై ప్రపంచ సమాజం దృష్టి
సారించి, బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా, భవిష్యత్తులో ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు
తీసుకోవాలని ఆశిస్తున్నాను.
గత
రెండు సంవత్సరాలకు పైగా హింసాగ్నిలో చిక్కుకొని అట్టుడుకుతున్న రిపబ్లిక్ ఆఫ్
సుడాన్ పరిస్థితి నా హృదయాన్ని కలచివేస్తోంది. ఇటీవల జరిగిన బాంబు దాడిలో ఎల్ ఫాషర్
విచారణ గురువు ఫాదర్ ల్యూక్ జుము మరణవార్త నన్ను తీవ్రంగా కలతపెట్టింది. ఆయనకు మరియు
ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన బాధితులందరికీ నా ప్రార్థనలు నిరంతరం
కొనసాగుతాయి. యుద్ధం చేస్తున్న పక్షాలు తక్షణమే హింసను విడనాడాలని, అమాయక పౌరులను రక్షించాలని, శాంతియుత
సంభాషణల ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని నా విజ్ఞప్తిని మరోసారి బలంగా
పునరుద్ఘాటిస్తున్నాను. ఈ తీవ్రమైన మానవతా సంక్షోభం వల్ల తీవ్రంగా ప్రభావితమైన
ప్రజలకు కనీసం ప్రాథమిక సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం తమ ప్రయత్నాలను మరింత
ముమ్మరం చేయాలని నేను కోరుతున్నాను. సుడాన్‌లో త్వరలో శాంతి, సుస్థిరత తిరిగి నెలకొనాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.
మధ్యప్రాచ్యంలో, ఉక్రెయిన్‌లో మరియు ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని
మన ప్రార్థనలను నిరంతరం కొనసాగిద్దాం.
ఈ
మధ్యాహ్నం, ‘సెయింట్ పాల్ అవుట్‌సైడ్ ది
వాల్స్’ బసిలికాలో, యువ కాంగో అమరులు ఫ్లోరిబేర్ట్ బ్వానా
చుయ్ ధన్యునిగా ప్రకటించబడతారు. కేవలం ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులోనే హత్య చేయబడిన
ఆయన, ఒక క్రైస్తవుడిగా అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి,
నిస్సహాయులను, పేదలను రక్షించడానికి తన
ప్రాణాలను త్యాగం చేశారు. ఆయన త్యాగం, ఆయన సాక్ష్యం డెమోక్రటిక్
రిపబ్లిక్ ఆఫ్ కాంగో యువతకు, యావత్ ఆఫ్రికా యువతకు ధైర్యాన్ని,
ఆశను ప్రసాదించుగాక!
మీకందరికీ
ఈ ఆదివారం అద్భుతంగా సాగాలని ఆశిస్తున్నాను! యువతకు ప్రత్యేకంగా, మరో నెలన్నరలో జరగనున్న యువజన మహోత్సవం (Jubilee
of Youth) వద్ద మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను!
సమాధాన రాజ్ఞి అయిన కన్యమరియ మనందరి కోసం మధ్యవర్తిత్వం చేయుగాక.
త్రికాల జపము...
మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250615-angelus.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment