పునీతులు పేతురు, పౌలుల మహోత్సవం, త్రికాల జపము, ఆదివారము, 29 జూన్ 2025

 పునీతులు పేతురు, పౌలుల మహోత్సవం
పొప్ లియో XIV
త్రికాల జపము    
పు. పేతురు బసిలికా, రోము నగరము
ఆదివారము, 29 జూన్ 2025

 


ప్రియమైన సహోదరీ సహోదరులారా! మీ అందరికీ శుభ ఆదివారం!

నేడు కతోలిక సంఘం అత్యంత గొప్ప పండుగను కొనియాడుతోంది. అపొస్తలులైన పేతురు, పౌలుల సాక్ష్యముతో ఈ సంఘం ఆవిర్భవించినది. వారి అమూల్యమైన రక్తం, అలాగే ఎందరో వేదసాక్షుల మరణంతో ఈ సంఘం ఫలవంతమైంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా, సువార్తను అనుసరించి, తమ ప్రాణాలను అర్పించడానికి కూడా వెనుకాడని ఉదార, ధైర్యవంతులైన క్రైస్తవులు ఎందరో ఉన్నారు. క్రైస్తవ సంఘాలు సంపూర్ణ సహవాసములో లేనప్పటికీ, వాటి మధ్య ‘రక్త ఐక్యత’ (ecumenism of blood) ఉంది. ఇది కంటికి కనిపించకపోయినా, ఎంతో లోతైన ఐక్యతను కలిగి ఉంది. ఈ పవిత్ర మహోత్సవము రోజున, బిషప్పుగా నా సేవ ఐక్యతకే అంకితం అని చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, పేతురు, పౌలు వంటి పరిశుద్ధులు చిందించిన రక్తం సాక్షిగా, అన్ని సంఘాల ఐక్యత కోసం ప్రేమతో సేవ చేయడానికి కతోలిక రోమన్ సంఘం కట్టుబడి ఉన్నదని నేను స్పష్టం చేస్తున్నాను.

మూలరాయి అయిన క్రీస్తు నుండే పేతురు తన పేరును స్వీకరించాడు. “ఇల్లు కట్టు వారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయెను.” ఈ ప్రాంగణం, పునీత పేతురు, పునీత పౌలు బసిలికాలు ఈనాటికీ ఆ తిరుగుబాటు ఎలా కొనసాగుతోందో తెలియజేస్తున్నాయి. మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నట్లుగా, అవి నగరం వెలుపల,”గోడల ఆవలివైపు” ఉన్నాయి. నేడు మనకు గొప్పగా, మహిమాన్వితంగా కనిపించేది, వాస్తవానికి ఈ లోక ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నందున మొదట్లో తిరస్కరించబడింది, దూరం చేయబడింది. యేసును అనుసరించేవారు అష్టభాగ్యాల మార్గంలో నడవాలి. దీనాత్మత (poverty of spirit), వినమ్రత (meekness), దయ (mercy), నీతి కోసం ఆకలి దప్పులు (hunger and thirst for justice), మరియు శాంతిని నెలకొల్పడం (peace-making) వంటివి తరచుగా వ్యతిరేకతను, హింసను ఎదుర్కొంటాయి. అయినప్పటికీ, దేవుని మహిమ ఆయన స్నేహితులలో ప్రకాశిస్తుంది, మారుమనస్సుకు వెళ్లే మార్గంలో వారిని తీర్చిదిద్దుతూనే ఉంటుంది.

ప్రియమైన సహోదరీ సహోదరులారా, దాదాపు రెండు వేల సంవత్సరాలుగా పుణ్యక్షేత్రాలుగా ఉన్న అపొస్తలుల సమాధులను సనర్శించినప్పుడు, మనం కూడా మారుమనస్సు పొందాలని గ్రహిస్తాము. మనం గొప్ప అపొస్తలులుగా గౌరవించే వారి తప్పులను, కలహాలను, పాపాలను, నూతన నిబంధన ఏమాత్రం దాచిపెట్టదు. నిజానికి, వారి గొప్పదనం క్షమాపణ ద్వారానే రూపుదిద్దుకుంది. పునరుత్థానమైన ప్రభువు వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఒకటికి మించి సార్లు వారిని చేరుకున్నారు. యేసు ఎప్పుడూ ఒక్కసారే పిలవరు. అందుకే మనం ఎల్లప్పుడూ ఆశతో ఉండవచ్చు. జూబిలీ స్వయంగా దీనికి ఒక గొప్ప జ్ఞాపిక.

పరస్పర విశ్వాసం ద్వారానే శ్రీసభలోనూ, సంఘాల మధ్య ఐక్యత వర్ధిల్లుతుంది. యేసు మనల్ని విశ్వసించగలిగినప్పుడు, మనం ఆయన నామమున ఒకరినొకరం ఖచ్చితంగా విశ్వసించగలం. గాయాలతో  నిండిన ఈ లోకాన్ని, అపొస్తలులైన పేతురు, పౌలు మరియు కన్యమరియ మన కొరకు విజ్ఞాపన చేయుదురు గాక! తద్వారా, శ్రీసభ ఎల్లప్పుడూ సహవాసానికి ఒక నివాసముగా, పాఠశాలగా ఉంటుంది.

 

త్రికాల జపము అనంతరం

ప్రియమైన సహోదరీ సహోదరులారా!

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లోని బాంగూయ్‌లో ఉన్న బార్తెలెమీ బోగండా ఉన్నత పాఠశాలలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో ఎంతోమంది విద్యార్థులు మరణించారు, గాయపడ్డారు. ఈ విషాదం తర్వాత, దుఃఖంలో మునిగిపోయిన వారందరికీ నా ప్రార్థనల హామీని అందిస్తున్నాను. ప్రభువు వారి కుటుంబాలను, యావత్ సంఘాన్ని ఓదార్చుగాక!

మీ అందరికీ, ముఖ్యంగా రోము నగర పాలక పునీతుల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను! రోములోని వివిధ విచారణలలో నిస్వార్థంగా సేవలందిస్తున్న విచారణ గురువులను, ఇతర గురువులను ప్రేమపూర్వకంగా గుర్తు చేసుకుంటున్నాను. వారి అంకితభావమైన సేవకు నా కృతజ్ఞతలు. నా ప్రోత్సాహం ఎల్లప్పుడూ వారికి ఉంటుంది.

ఈ పండుగ “పీటర్స్ పెన్స్” (Peters Pence) వార్షిక సేకరణకు కూడా గుర్తుగా నున్నది. ఇది పోప్‌తో మనకున్న ఐక్యతకు, ఆయన అపొస్తలిక సేవలో భాగస్వామ్యానికి సంకేతం. పునీత పేతురు వారసుడిగా నేను వేస్తున్న మొదటి అడుగులకు తమ కానుకలతో మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

పునీతులు పేతురు, పౌలులకు సంబంధించిన రోమునగర ప్రదేశాలలో జరుగుతున్న “క్వో వాదిస్? (Quo Vadis?) కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా ఆశీస్సులు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఇది రోము పాలక పునీతులను గౌరవించడానికి, వారిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి తోడ్పడుతుంది.

పాలియం [ఆర్చ్ బిషప్ అధికారానికి, పోప్‌తో వారి అనుబంధానికి ప్రతీక అయిన ఒక పట్టీ లేదా వస్త్రం] స్వీకరించిన తమ మెట్రోపాలిటన్ ఆర్చ్‌బిషప్‌లతో కలిసి వివిధ దేశాల నుండి వచ్చిన విశ్వాసులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉక్రెయిన్ నుండి వచ్చిన యాత్రికులకు (నేను ఎల్లప్పుడూ ఉక్రేనియన్ ప్రజల కోసం ప్రార్థిస్తూనే ఉంటాను), మెక్సికో, క్రొయేషియా, పోలాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెనిజులా, బ్రెజిల్, ఇండోనేషియా నుండి వచ్చిన సెయింట్స్ పీటర్ అండ్ పాల్ బృందం, అలాగే ఐరోపాలో నివసిస్తున్న ఎరిత్రియన్ విశ్వాసులందరికీ కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా, మార్టినా ఫ్రాంకా, పోంటెడెరా, శాన్ వెండెమియానో, కార్బెట్టా నుండి వచ్చిన బృందాలకు; శాంటా జస్టినా ఇన్ కోల్లె (పాదువా) నుండి వచ్చిన పూజా సహాయకులకు, మరియు సొమ్మరివా దెల్ బోస్కో నుండి వచ్చిన యువతకు నా కృతజ్ఞతలు.

వియా దెల్ల కొన్సిలియాజియోనె మరియు పియాజ్జా పియో XII లవద్ద అద్భుతమైన పూల ప్రదర్శనను ఏర్పాటు చేసిన రోమ్ ప్రో లోకో (Pro Loco) సంస్థకు, అలాగే కళాకారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

సెంట్రల్, దక్షిణ ఇటలీ నుండి వచ్చిన గ్వానెల్లియన్ సహకారులకు (Guanellian Collaborators), చియారి వాలంటీర్ అసోసియేషన్‌కు, ఫెర్మో, వారెసె నుండి వచ్చిన సైక్లిస్టులకు, ఆనీన్ 80 క్రీడా బృందానికి, మరియు “కొన్నెస్సియోన్ స్పిరితువాలే” నుండి వచ్చిన యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

సహోదరీ సహోదరులారా, ప్రతీచోట ఆయుధాల శాంతించి, సంభాషణల ద్వారా శాంతి నెలకొనేలా మనం ప్రార్థిస్తూనే ఉందాం.

అందరికీ శుభ ఆదివారము!

మూలము:

https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250629-angelus.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

No comments:

Post a Comment