లియో XIV
త్రికాల ప్రార్ధన
లిబర్టీ స్క్వేర్ - పియాజ్జా దెల్ల లిబర్తా (కాస్టెల్ గండోల్ఫో)
ఆదివారము, 13 జూలై 2025
ప్రియ
సహోదరీ సహోదరులారా! శుభోదయం!
మీకు ఆదివారం శుభాకాంక్షలు! నేటి సువిశేషం యేసును
అడిగిన ఒక గొప్ప ప్రశ్నతో మొదలవుతుంది: “బోధకుడా,
నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలయును?”
(లూకా 10:25). ఈ మాటలు మన జీవితంలోని నిరంతర కోరికను
వ్యక్తపరుస్తాయి: రక్షణ కొరకు మన తపన, మరియు అపజయం, చెడు,
మరణం లేని జీవితం కోసం మన నిరంతర ఆకాంక్షను ఆ ప్రశ్న తెలియ జేస్తుంది.
మానవ
హృదయపు ఈ నిరీక్షణను “వారసత్వ సంపదగా” పొందాలని
వివరింపబడింది; దీన్ని బలవంతంగా సంపాదించడం కుదరదు,
యాచించి పొందడం సాధ్యం కాదు, లేదా సంప్రదింపులతో సాధించేది కాదు. నిత్య
జీవితాన్ని దేవుడు మాత్రమే ప్రసాదించగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చినట్లే ఇదివారసత్వంగా
దక్కుతుంది.
అందుకే,
మనం దేవుని బహుమతిని పొందాలంటే, దేవుని
చిత్తాన్ని నెరవేర్చాలని యేసు తెలియజేసారు. ధర్మశాస్త్రంలో
ఇలా వ్రాయబడింది: “నీ ప్రభువైన దేవున్ని నీ పూర్ణ హృదయంతో
ప్రేమించాలి,” మరియు “నీ
పొరుగువారిని నిన్నువలె ప్రేమించాలి” (లూకా 10:27; ద్వితీ
6:5; లేవీ 19:18). మనం ఈ రెండు ఆజ్ఞలను పాటించినపుడు, తండ్రి
ప్రేమకు మనం ప్రతిస్పందించినవారమవుతాము. దేవుని
చిత్తమే జీవిత నియమం. దీనిని
తండ్రి అయిన దేవుడు స్వయంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని అనంతంగా
ప్రేమించడం ద్వారా మొదట పాటించారు.
సహోదరీ
సహోదరులారా, మనం యేసు వైపు చూద్దాం! దేవుని పట్ల, ఇతరుల
పట్ల ఉన్న నిజమైన ప్రేమకు అర్థాన్ని ఆయన మనకు చూపుతారు. ఆ
ప్రేమ ఉదారమైనది, స్వార్థపూరితమైనది
కాదు. అది నిస్సంకోచంగా
క్షమించే ప్రేమ, ఇతరులకు చేయూతనిచ్చి,
ఎప్పుడూ విడిచిపెట్టని ప్రేమ. క్రీస్తులో, దేవుడు
ప్రతి స్త్రీ, పురుషుడికి పొరుగువాడు అయ్యాడు. అందుకే మనలో
ప్రతి ఒక్కరూ మనం కలిసే ప్రతి ఒక్కరికీ పొరుగువారు కాగలరు, మరియు
కావాలి. లోక రక్షకుడైన యేసును ఆదర్శంగా తీసుకుని, మనం
కూడా ముఖ్యంగా నిరుత్సాహంగా మరియు నిరాశతో ఉన్నవారికి ఓదార్పును,
నిరీక్షణను అందించడానికి పిలవబడ్డాము.
నిత్యం
జీవించడానికి, మనం మరణాన్ని మోసగించాల్సిన అవసరం లేదు. బదులుగా,
మన జీవితకాలంలో ఇతరులను ప్రేమగా చూసుకోవడం ద్వారా జీవితానికి సేవ
చేయాలి. ఇదే అన్ని సామాజిక నియమాలకు అతీతమైన, వాటికి
అసలైన అర్థాన్ని ఇచ్చే అత్యున్నత
సూత్రం.
దయగల కన్యక అయిన మరియ మాతను మనం వేడుకుందాం. దేవుని చిత్తానికి మన హృదయాలను తెరవడానికి ఆమె మనకు సహాయం చేయుగాక. ఎందుకంటే, ఆయన చిత్తం ఎల్లప్పుడూ ప్రేమతో కూడిన రక్షణ చిత్తమే. ఈ విధంగా, మన జీవితంలో ప్రతిరోజూ మనం శాంతిని స్థాపించే వారంగా మారతాం.
త్రికాల
ప్రార్ధన తరువాత
ప్రియ
సహోదరీ సహోదరులారా,
కాస్టెల్
గండోల్ఫోలో మీ అందరితో కలిసి ఉండటం నాకు చాలా
ఆనందంగా ఉంది. ఇక్కడి పౌర,
సైనిక అధికారులకు నేను
నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే, నన్ను సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ నా ధన్యవాదాలు.
నిన్న,
బార్సిలోనాలో, 1909లో విశ్వాసం పట్ల ద్వేషంతో హత్య చేయబడిన బ్రదర్
లికారియోన్ మే (ఫ్రాంకోయిస్ బెంజమిన్) ధన్యుడిగా
ప్రకటించబడ్డారు. ఈయన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మారిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ది స్కూల్స్’కు
చెందిన మఠవాసి. ప్రతికూల పరిస్థితులలోనూ, ఆయన తన విద్యా, బోధనాపరమైన
బాధ్యతను అంకితభావంతో, ధైర్యంగా నిర్వర్తించారు. ఈ హతసాక్షి వీరోచిత సాక్ష్యం మనందరికీ,
ముఖ్యంగా యువత విద్య కోసం పనిచేసే వారికి స్ఫూర్తినిస్తుందని
ఆశిస్తున్నాను.
పోలాండ్
నుండి వచ్చిన లిటర్జికల్ అకాడమీ వేసవి కోర్సులో పాల్గొంటున్న వారందరికీ, అలాగే
ఈ రోజు చెస్టోచోవా పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రలో పాల్గొంటున్న పోలిష్
యాత్రికులకు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నేటితో
బెర్గామో మేత్రాసన జూబిలీ తీర్థయాత్ర ముగుస్తుంది. తమ బిషప్‌తో కలిసి పవిత్ర
ద్వారం గుండా వెళ్ళడానికి రోముకు వచ్చిన యాత్రికులకు నేను శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాను.
పెరూలోని
చిక్లాయోకు చెందిన కొలెజియో సాన్ అగస్టిన్‌లోని బ్లెస్సెడ్
అగస్టిన్ ఆఫ్ టరానో పాస్టోరల్ కమ్యూనిటీకి నేను
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జూబిలీ వేడుకల కోసం వారు కూడా రోముకు వచ్చారు. అలాగే,
అల్కాలా ది హెనరెస్ మేత్రాసనములోని సాన్
పెడ్రో అపోస్టల్ విచారణ నుండి వచ్చిన యాత్రికులకు (వారు తమ విచారణ స్థాపించి 400
సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్నారు); కొలంబియాలోని
ఉరిబియా-లా గ్వాజిరా నుండి వచ్చిన లీజియొనరీస్
ఆఫ్ మేరీ సభ్యులకు; మెర్సిఫుల్ లవ్ కుటుంబ సభ్యులకు; అగేషి
అల్కామో 1వ స్కౌట్ గ్రూప్‌కు; మరియు
చివరగా, ఇక్కడ హాజరైన ఆగస్టీనియన్
మఠవాసులకు కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఫ్రాన్స్ నుండి వచ్చిన అకాడెమీ మ్యూజికల్ ది లీస్సే బాలల బృందానికి
స్వాగతం పలుకుతున్నాము. మీరు హాజరైనందుకు మరియు గానం, సంగీతం పట్ల మీ నిబద్ధతకు ధన్యవాదాలు.
ఈరోజు వెల్లెత్రి స్కూల్‌లోని కరబినీరీ కోర్సుకు చెందిన 100 మంది క్యాడెట్‌లు మనతో ఉన్నారు. ఈ స్కూల్ గౌరవనీయులైన సాల్వో డి'అక్విస్టో పేరు మీద ఉంది. కమాండర్‌కు, అలాగే ఇతర అధికారులు, నాన్-కమిషన్డ్ అధికారులకు నేను
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దేశానికి, పౌర సమాజానికి సేవ చేయడంలో మీ శిక్షణను కొనసాగించమని మిమ్మల్ని
ప్రోత్సహిస్తున్నాను. ధన్యవాదాలు! వారి సేవకు గాను మనమంతా ఉత్సాహంగా చప్పట్లు
కొడదాం.
వేసవి
నెలల్లో, పిల్లలు మరియు యువత కోసం అనేక కార్యక్రమాలు
జరుగుతాయి. ఈ సేవకు తమను తాము అంకితం చేసుకుంటున్న విద్యావేత్తలకు, నిర్వాహకులకు
నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా, ప్రపంచం
నలుమూలల నుండి యువతను ఒకచోట చేర్చే గిఫోనీ
ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ప్రత్యేకంగా
ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం దాని థీమ్ “మానవత్వం పొందడం”.
సహోదరీ సహోదరులారా, హింస లేదా యుద్ధం కారణంగా బాధలు,
అవసరాల్లో ఉన్న వారందరి కోసం మరియు శాంతి కోసం
ప్రార్థించడం మనం మర్చిపోవద్దు.
మీ అందరికీ ఆదివార శుభాకాంక్షలు!
మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250713-angelus.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment