మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా
వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం
పాల్గొనేవారికి పొప్ లియో XIV సందేశం
సాన్ డమాసో ప్రాంగణం,
గురువారం, 26 జూన్ 2025
త్రిత్వస్తోత్రముతో ప్రారంభిద్దాం: పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమెన్. ప్రభువు శాంతి మీతో ఉండునుగాక!
మీ అందరికీ స్వాగతం! ఎండ అంత తీవ్రముగా లేదని ఆశిస్తున్నాను... దేవుడు గొప్పవాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. మీరు విచ్చేసినందుకు ధన్యవాదాలు!
ప్రియ సహోదరీ సహోదరులారా, శుభోదయం మరియు స్వాగతం!
ఈ సమావేశాన్ని సాధ్యం చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది అనేక విధాలుగా మనల్ని జూబిలీ ప్రధాన ఉద్దేశ్యం వైపు నడిపిస్తుంది. ఇది కృపతో నిండిన సంవత్సరం. ఈ సంవత్సరంలో, కోల్పోయిన లేదా నిరాకరించబడిన గౌరవం అందరికీ తిరిగి లభిస్తుంది. ఆశ అనేది చరిత్ర కలిగిన పదం; ఇది కేవలం ఒక నినాదం కాదు, కానీ ఎంతో కృషి తర్వాత తిరిగి పొందిన ఒక కాంతి. హృదయాన్ని మార్చే ఆ పలకరింపును నేను మీకు మరోసారి చెప్పాలనుకుంటున్నాను: “మీ అందరికీ శాంతి కలుగును గాక!” ఈస్టర్ సాయంత్రం, యేసు తన శిష్యులను పై గదిలో ఇలాగే పలకరించారు. వారు ఆయనను విడిచిపెట్టారు, ఆయనను శాశ్వతంగా కోల్పోయామని నమ్మారు, భయపడ్డారు, నిరాశ చెందారు, కొందరు అప్పటికే వెళ్లిపోయారు. అయితే, యేసు తిరిగి వారిని కనుగొన్నారు, వారిని వెతుక్కుంటూ వచ్చారు. మూసి ఉన్న తలుపుల వెనుక వారు సజీవంగా సమాధి చేయబడినట్లున్న ప్రదేశంలోకి ఆయన ప్రవేశించారు. ఆయన శాంతిని ఒసగారు, క్షమాపణతో వారిని పునఃసృష్టించారు, శ్వాసను వారిపై ఊదారు - అంటే, ఆయన పవిత్రాత్మను ప్రసాదించారు, అదే మనలో దేవుని శ్వాస. శ్వాస లేనప్పుడు, ఆశలు లేనప్పుడు, మన గౌరవం వాడిపోతుంది. పునరుత్థాన యేసు ఇప్పటికీ వస్తారని, తన శ్వాసను ఒసగుతారని మర్చిపోవద్దు! ఆయన తరచుగా మన మూసి ఉన్న తలుపులను దాటి వచ్చే వ్యక్తుల ద్వారా అలా చేస్తారు. ఏమి జరిగినప్పటికీ, ఆ వ్యక్తులు మనం కోల్పోయిన లేదా నిరాకరించబడిన గౌరవాన్ని తిరిగి ఒసగుతారు.
ప్రియ మిత్రులారా, మీరిక్కడ సమావేశమవడం స్వేచ్ఛకు నిదర్శనం. పోప్ ఫ్రాన్సిస్ ఒకప్పుడు, అలాగే తన చివరి పవిత్ర గురువారం నాడు కూడా, జైలును సందర్శించినపుడు, ఆయన ఎప్పుడూ, “ఎందుకు వారే, నేను ఎందుకు కాదు?” అని ప్రశ్న వేసుకొనేవారు. డ్రగ్స్, వ్యసనం కనిపించని జైలు లాంటివే. వాటితో మీరు వివిధ రకరకాలుగా పోరాడారు. అయితే, మనమందరం స్వేచ్ఛకు పిలవబడినవారమే. మిమ్మల్ని కలుస్తున్నప్పుడు, నా మరియు ప్రతి మానవ హృదయంలోని లోతుల గురించి ఆలోచిస్తున్నాను. బైబిల్‌లోని కీర్తన (కీర్తనలు 63:7) మనలో నివసించే ఈ రహస్యాన్ని “అగాధం” అని వర్ణిస్తుంది. పునీత అగుస్తీను గారు తన హృదయంలోని అశాంతి, క్రీస్తులో మాత్రమే శాంతిని పొందిందని అంగీకరించారు. మనం శాంతిని, ఆనందాన్ని వెతుకుతాం, వాటి కోసం తపిస్తాం. ఈ అన్వేషణలో అనేక మోసాలు మనల్ని భ్రమపెట్టి, బంధించగలవు.
మన చుట్టూ ఒకసారి చూద్దాం. ఒకరి ముఖాల్లో మరొకరు ఎప్పటికీ ద్రోహం చేయని పదాన్ని చదువుకుందాం: అదే ‘కలిసి యుండటం’. మనం చెడును కలిసి జయిస్తాం. ఆనందాన్ని కలిసి పొందుతాం. అన్యాయాన్ని కలిసి ఎదుర్కొంటాం. మనలను సృష్టించి, ప్రతి ఒక్కరినీ ఎరిగిన దేవుడు, మనము కలిసి ఉండటానికి సృష్టించాడు. అయితే, కొన్ని బంధాలు బాధ కలిగిస్తాయి, స్వేచ్ఛ లేని మానవ సమూహాలు కూడా ఉన్నాయి. కానీ వీటిని కూడా ‘కలిసి’ మాత్రమే అధిగమించగలం. మన బాధల నుండి లాభం పొందకుండా, స్వార్థరహిత శ్రద్ధతో మనల్ని కలిసే వారిని, మనం కలిసే వారిని నమ్మినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
సహోదరీ సహోదరులారా, నేడు మనం ఒక యుద్ధంలో నిమగ్నమై ఉన్నాము. మన చుట్టూ ఇంకా ఎవరైనా వివిధ రకాల వ్యసనాలకు బానిసలుగా ఉన్నంతవరకు ఈ పోరాటాన్ని వదిలిపెట్టలేము. డ్రగ్స్, మద్యం, జూదం వంటి వ్యసనాల ద్వారా అపారమైన వ్యాపారం చేసేవారిపైనే మన పోరాటం. భారీ స్థాయిలో ప్రయోజనాలను కేంద్రీకరించే, విస్తృతమైన క్రిమినల్ సంస్థలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. బాధితులపై పోరాడటం చాలా సులభం. తరచుగా భద్రత పేరుతో, పేదలపై యుద్ధం చేసి, మరణం యొక్క గొలుసులోని చివరి లంకె అయిన వారితో జైళ్లను నింపుతున్నారు. అయితే, ఈ గొలుసును చేతుల్లో పట్టుకున్న వారు మాత్రం పలుకుబడిని, శిక్షనుండి మినహాయింపును పొందుతున్నారు. మన నగరాలను అణగారిన వర్గాల నుండి కాదు, అణగదొక్కబడటం నుండి విముక్తి చేయాలి; నిరాశ్రయుల నుండి కాదు, నిరాశ నుండి విముక్తి చేయాలి. “పక్షవాతానికి గురిచేసే అపనమ్మకాన్ని అధిగమించి, విభిన్న వ్యక్తులను కలుపుకొని, ఈ ఏకీకరణనే కొత్త అభివృద్ధికి మూలంగా మార్చే నగరాలు ఎంత అందంగా ఉంటాయి! వాటి నిర్మాణ రూపకల్పనలో కూడా, సంబంధాలను పెంచే, మరియు ఇతరులను గుర్తించడానికి అనుకూలమైన ప్రదేశాలతో నిండిన నగరాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి!” (ఫ్రాన్సిస్, అపోస్టోలిక్ ఎక్స్‌హోర్టేషన్, ఎవంజెలీ గౌదియుం, 210).
జూబిలీ, సురక్షితమైన మార్గంగా కలిసికట్టుగా ఉండే సంస్కృతిని సూచిస్తుంది. ఇది అన్యాయంగా కూడబెట్టిన సంపదను తిరిగి ఇవ్వాలని, పంచాలని కోరుతుంది. ఇది వ్యక్తిగత, సామాజిక సయోధ్యకు మార్గం. “పరలోకమందు వలె భూలోకములో కూడా” అనే నినాదం, దేవుని నగరం మానవుల నగరంలో ప్రవచనానికి మనల్ని నిబద్ధులను చేస్తుంది. ఇది - మనకు తెలుసు - నేడు మరణానికి కూడా దారితీయవచ్చు. అనేక ప్రాంతాల్లో, డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడటం, పేదల మధ్య విద్యా బోధనకు కట్టుబడటం, స్థానిక వర్గాలు, వలసదారుల రక్షణ, అలాగే శ్రీసభయొక్క సామాజిక సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం వంటివి విద్రోహకరమైన చర్యలుగా పరిగణించబడుతున్నాయి.
ప్రియ యువత, మన అత్యవసరమైనఈ పునరుద్ధరణకు మీరు కేవలం ప్రేక్షకులు కారు, మీరు ముఖ్య పాత్రధారులు. చెడు నుండి ఆయన విముక్తి చేసిన వారితో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. క్రైస్తవులకు ఎంతో ప్రియమైన మరో కీర్తన ఇలా చెబుతోంది: “ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను” (కీర్తనలు 118:22). యేసు నగరం వెలుపల నిరాకరించబడి, సిలువ వేయబడ్డాడు. దేవుడు ప్రపంచాన్ని పునర్నిర్మించే మూలరాయి ఆయనే. ఆయనపై ఆధారపడి, మీరు కూడా ఒక కొత్త మానవత్వాన్ని నిర్మించడంలో ఎంతో విలువైన రాళ్ళ వంటివారు. నిరాకరించబడిన యేసు, మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు. మీరు ఎప్పుడైనా తిరస్కరించబడినట్లు, నిరుపయోగంగా భావించినా, ఇప్పుడు మీరు అలా కాదు. మీ తప్పులు, మీ బాధలు, అన్నిటికంటే ముఖ్యంగా జీవించాలనే మీ కోరిక, మార్పు సాధ్యమని చాటి చెప్పే బలమైన సాక్షులుగా మిమ్మల్ని నిలబెడతాయి.
శ్రీసభకు మీరు అవసరం. మానవాళికి మీరు అవసరం, విద్య, రాజకీయాలకు మీరు అవసరం. మనమందరం కలిసి, ప్రతి వ్యక్తిలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన గౌరవాన్ని, ఏ వ్యసనానికీ లొంగకుండా కాపాడతాం. దురదృష్టవశాత్తు, ఆ గౌరవం దాదాపు పూర్తిగా కోల్పోయినప్పుడు మాత్రమే కొన్నిసార్లు ప్రకాశిస్తుంది. అలాంటి సమయాల్లో ఒక కుదుపు వచ్చి, తిరిగి నిలబడటం జీవన్మరణ సమస్యగా మారుతుంది. నేడు సమాజం మొత్తానికి అలాంటి కుదుపు, మీ సాక్ష్యం, మీరు చేస్తున్న గొప్ప పని అవసరం. నిజానికి, మనందరికీ స్వేచ్ఛగా, మానవీయంగా జీవించాలనే పిలుపు ఉంది; శాంతి కోసం జీవించాలనే పిలుపు ఉంది. ఇదే అత్యంత దైవికమైన పిలుపు. కాబట్టి, నయం చేసే, కలిసే, విద్యాబోధన చేసే ప్రదేశాలను పెంచుకుంటూ ముందుకు సాగుదాం. వీధి స్థాయి నుండి ప్రారంభమయ్యే పాస్టోరల్ మార్గాలు, సామాజిక విధానాలు ఎవరినీ కోల్పోయినట్లుగా వదిలిపెట్టవు. నా సేవ ప్రజల ఆశకు, సేవ చేయడానికి ఉపయోగపడాలని మీరు కూడా ప్రార్థించండి.
మీ అందరినీ అత్యంత పవిత్రమైన మరియా మాతృత్వ మార్గదర్శకత్వానికి అప్పగిస్తున్నాను. మీ అందరకు నా హృదయపూర్వక ఆశీస్సులు. ధన్యవాదాలు!
మీ అందరికీ ధన్యవాదాలు! ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి!
మూలము:
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment