ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నైతికత, కార్పొరేట్ గవర్నెన్స్‌ - రెండవ వార్షిక సదస్సులో పాల్గొనేవారికి - పోప్ లియో XIV సందేశం (17 జూన్ 2025)

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నైతికత, కార్పొరేట్ గవర్నెన్స్‌ - రెండవ వార్షిక సదస్సులో
పాల్గొనేవారికి పోప్ లియో XIV సందేశం
[పలాజ్జో పియాచెంతిని (వియా వెనెతో, ఎంటర్’ప్రైజెస్ మరియు మేడ్ ఇన్ ఇటలీ మంత్రిత్వ శాఖ (మిమిట్) ప్రధాన కార్యాలయం మరియు సాలా రేజియా, అపోస్టోలిక్ ప్యాలెస్, జూన్ 19-20, 2025]

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జరుగుతున్న ఈ రెండవ వార్షిక రోము సదస్సులో పాల్గొంటున్న వారందరికీ నా ప్రార్థనాపూర్వక శుభాకాంక్షలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉన్న నైతిక కోణం, దాని బాధ్యతాయుతమైన పాలన గురించి లోతైన ఆలోచన, నిరంతర చర్చ ఎంత అవసరమో మీ హాజరు స్పష్టం చేస్తుంది. సదస్సు రెండవ రోజు అపోస్టోలిక్ ప్యాలెస్‌లో జరుగుతుందని తెలిసి నేను సంతోషిస్తున్నాను. ఇది మన మానవ జాతి ప్రస్తుత, భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేసే ఈ చర్చలలో శ్రీసభ భాగస్వామ్యం కావాలనే కోరికకు స్పష్టమైన సంకేతం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవజాతికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, దాని వేగవంతమైన అభివృద్ధి కొన్ని లోతైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ముఖ్యంగా, నిజమైన, న్యాయబద్ధమైన, మానవీయమైన ప్రపంచాన్ని నిర్మించడంలో ఈ సాంకేతికతను ఎలా సరిగ్గా ఉపయోగించాలి అనేది ప్రధాన ప్రశ్న. ఈ దృష్టితో చూస్తే, AI నిస్సందేహంగా మానవ మేధస్సుకు ఒక గొప్ప ఆవిష్కరణ అయినప్పటికీ, ఇది “అన్నింటికంటే మించి ఒక పనిముట్టు మాత్రమే” అని పోప్ ఫ్రాన్సిస్ G7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో (జూన్ 14, 2024) ప్రసంగిస్తూ అన్నారు. పనిముట్లు వాటిని తయారుచేసిన మానవ మేధస్సును సూచిస్తాయి, వాటి నైతిక విలువ వాటిని వాడే వ్యక్తుల ఉద్దేశాల నుండే వస్తుంది. కొన్నిసార్లు, AIని ఎక్కువ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి మంచి, నిజంగా గొప్ప పనులకు వాడారు. కానీ, దీన్ని ఇతరుల నష్టానికి స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. అంతకంటే దారుణంగా, గొడవలు, దూకుడును రెచ్చగొట్టడానికి కూడా ఇది ఉపయోగపడవచ్చు.

శ్రీసభ తన వంతుగా, ముఖ్యమైన ప్రశ్నలపై ప్రశాంతమైన, సరైన సమాచారంతో కూడిన చర్చకు సహకరించాలని కోరుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా, “మానవ వ్యక్తి, సమాజం యొక్క సంపూర్ణ అభివృద్ధిని” (ఆంటికా ఎత్ నోవా, 6) దృష్టిలో ఉంచుకొని AI పరిణామాలను జాగ్రత్తగా అంచనా వేయాలని నొక్కి చెబుతోంది. దీనిలో, మనిషి శ్రేయస్సును కేవలం శారీరకంగానే కాకుండా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా కూడా చూడాలి. ప్రతి వ్యక్తి గొప్ప గౌరవాన్ని కాపాడటం, ప్రపంచంలోని ప్రజల సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద, వైవిధ్యాన్ని గౌరవించడం దీని ఉద్దేశ్యం. చివరికి, AI వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలను ఉన్నతమైన నైతిక విలువలతోనే ఖచ్చితంగా లెక్కించాలి.

దురదృష్టవశాత్తు, దివంగత పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్లుగా, నేడు మన సమాజాలు “మానవత్వం అనే భావనను కొంతవరకు కోల్పోవడం, లేదా కనీసం దానిని మరుగుపరచడం” అనే స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇది మనందరం మన మానవ గౌరవం యొక్క నిజమైన స్వభావం, దాని ప్రత్యేకత గురించి మరింత లోతుగా ఆలోచించేలా సవాలు చేస్తోంది (G7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో ప్రసంగం, జూన్ 14, 2024). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ముఖ్యంగా జనరేటివ్ AI, ఆరోగ్య సంరక్షణ పరిశోధనలు, శాస్త్రీయ ఆవిష్కరణలు వంటి అనేక రంగాలలో కొత్త అవకాశాలను తెరిచింది. అయితే, ఇది సత్యం, సౌందర్యం పట్ల మానవ ఆలోచనలు, వాస్తవికతను అర్థం చేసుకోగల, విశ్లేషించగల మన ప్రత్యేక సామర్థ్యంపై దాని ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళన కలిగించే ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. AI పాలన కోసం సరైన నైతిక నియమావళిని చర్చించేటప్పుడు, మానవ వ్యక్తికి ప్రత్యేకమైన లక్షణాలను గుర్తించడం, గౌరవించడం చాలా ముఖ్యమైనది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వల్ల పిల్లలు, యువత మేధోపరమైన, నాడీ సంబంధిత అభివృద్ధిపై చూపే ప్రభావాల గురించి మనమందరం ఖచ్చితంగా ఆందోళన చెందుతున్నాం. మన యువత వారి పరిణతి, నిజమైన బాధ్యత దిశగా సాగే ప్రయాణంలో సహాయం పొందాలి, అంతే తప్ప అడ్డుకోబడకూడదు. వారు మన భవిష్యత్తుకు ఆశాకిరణాలు. సమాజ శ్రేయస్సు అనేది వారికి దేవుడిచ్చిన బహుమతులు, సామర్థ్యాలను పెంపొందించుకునే అవకాశం కల్పించడంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, స్వేచ్ఛాయుతమైన, ఉదారమైన స్ఫూర్తితో కాలానుగుణ అవసరాలకు, ఇతరుల కోర్కెలకు స్పందించే సామర్థ్యాన్ని వారికి అందించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఇప్పుడు అందుబాటులో ఉన్నంత సమాచారానికి ఏ తరానికి కూడా ఇంతకు ముందు ఇంత వేగంగా ప్రాప్యత లభించలేదు. అయితే, డేటా అందుబాటులో ఉండటం అది ఎంత విస్తృతంగా ఉన్నప్పటికీ దాన్ని తెలివితేటలుగా పొరబడకూడదు. ఎందుకంటే తెలివితేటలు “మనిషి జీవితంలోని అంతిమ ప్రశ్నల పట్ల తెరిచి ఉండటాన్ని కలిగి ఉంటాయి, అలాగే సత్యం, మంచి పట్ల ఒక ధోరణిని ప్రతిబింబిస్తాయి” (ఆంటికా ఎత్ నోవా, నం. 29). అంతిమంగా, నిజమైన వివేకం అనేది కేవలం డేటా లభ్యతతో కాకుండా, జీవితపు నిజమైన అర్థాన్ని గుర్తించడంతోనే ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది.

ప్రియమైన మిత్రులారా, ఈ నేపథ్యంలో, మీ చర్చలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తరాల మధ్య జరగాల్సిన అభ్యాసం (intergenerational apprenticeship) కోణంలో కూడా పరిశీలిస్తాయని ఆశిస్తున్నాను. ఇది యువతకు సత్యాన్ని వారి నైతిక, ఆధ్యాత్మిక జీవితంలోకి ఇముడ్చుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా వారి పరిణతి చెందిన నిర్ణయాలకు మార్గదర్శకమై, మరింత సమైక్యత, ఐక్యతతో కూడిన ప్రపంచం వైపు మార్గాన్ని సుగమం చేస్తుంది (ఆంటికా ఎత్ నోవా, నం. 28).

మీ ముందున్న పని తేలికైనది కాదు, కానీ అది అత్యంత కీలకమైనది. మీ ప్రస్తుత, భవిష్యత్ ప్రయత్నాలకు ధన్యవాదాలు తెలుపుతూ, మీకు, మీ కుటుంబాలకు జ్ఞానం, ఆనందం, శాంతి అనే దైవిక ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 వాటికన్ నుండి, జూన్ 17, 2025

 పోప్ లియో XIV

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/messages/pont-messages/2025/documents/20250617-messaggio-ia.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

No comments:

Post a Comment