పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం, పరిశుద్ధ పొప్ లియో XIV గారి ప్రసంగము, ఆదివారం, 15 జూన్ 2025

 పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం
దివ్యపూజ, దివ్యసత్ర్పసాద ప్రదక్షిణ, ఆశీర్వాదము

పరిశుద్ధ పొప్ లియో XIV గారి ప్రసంగము

సెయింట్ జాన్ లాటరన్ స్క్వేర్
ఆదివారం, 15 జూన్ 2025

 


ప్రియ సహోదరీ సహోదరులారా,

యేసు సన్నిధిలో ఉండటం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. మనం ఇప్పుడే విన్న సువిశేషం ఈ సత్యాన్ని దృఢపరుస్తుంది. దేవుని రాజ్యం గురించిన యేసు బోధనలను వినడానికి, ఆయన రోగులను స్వస్థపరచుట చూడటానికి గంటల తరబడి జనసమూహాలు ఆయనతోనే ఎలా గడిపారో లూకా 9:11 స్పష్టంగా వివరిస్తుంది. ఆ సమయం వారికి ఎంత విలువైనదో కదా! యేసు బాధపడేవారి పట్ల చూపిన కరుణ, మనల్ని రక్షించడానికి ఈ లోకమునకు వచ్చిన దేవుని అనంతమైన ప్రేమను తెలియజేస్తుంది. దేవుని పరిపాలన ఎక్కడ ఉంటుందో, అక్కడ మనం సమస్త కీడుల నుండి విముక్తి పొందుతాం. అయితే, యేసు ప్రకటించిన సువార్తను స్వీకరించిన వారికి కూడా కష్టకాలాలు ఎదురవుతాయి. ఆ నిర్జన ప్రదేశంలో, జనసమూహం ‘గురువు’ మాటలు వింటున్న వేళ, ప్రొద్దుగ్రుంకడం ప్రారంభమైంది. అక్కడ తినడానికి ఏమీ లేకుండెను (లూకా 9:12). ఆకలి, ప్రొద్దుగ్రుంకటం - ఇవి ప్రపంచంపై, ప్రతి జీవిపైనా ఆవరించి ఉన్న ఒక పరిమితిని సూచిస్తాయి: ప్రతి మానవుని జీవితం అంతమైనట్లే, పగలు కూడా ముగుస్తుంది. అటువంటి అవసరమైన సమయంలో, చీకటి కమ్ముకుంటున్న వేళలో కూడా యేసు మన మధ్యనే ఉంటారు.

పగలు ముగియు చుండగా, ఆకలి వేసినప్పుడు, ప్రజలను పంపివేయమని అపొస్తలులు యేసును కోరినప్పుడు కూడా, క్రీస్తు తన కనికరంతో మనల్ని ఆశ్చర్యపరుస్తారు. ఆకలితో నున్నవారి పట్ల ఆయన కరుణ చూపి, వారికి ఆహారం అందించమని తన శిష్యులను ఆదేశిస్తారు. ఆకలి అనేది దైవరాజ్య బోధనకు, రక్షణ సందేశానికి కొత్తేమీ కాదు. నిజానికి, అది దేవునితో మన సంబంధాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఐదు రొట్టెలు, రెండు చేపలు ప్రజలందరికీ ఏ మాత్రం సరిపోవని అనిపించడం సహజమే. శిష్యుల లెక్కలు ఎంత సహేతుకంగా ఉన్నప్పటికీ, అవి వారి విశ్వాస లోపాన్ని స్పష్టంగా చాటాయి. ఎందుకంటే, ప్రభువు ఉన్నచోట, మన జీవితాలకు అవసరమైన బలం, నిజమైన అర్థం అన్నీ సమృద్ధిగా లభిస్తాయి.

ఆకలితో అలమటిస్తున్న వారిని చూసి యేసు పంచుకోవడమనే గొప్ప సూచనతో స్పందించారు. ఆయన ఆకాశము వైపు చూసి, రొట్టెలను, చేపలను ఆశీర్వదించి, త్రుంచి ఇవ్వగా, శిశ్యులు అక్కడనున్న వారందరికీ సంతృప్తిగా వడ్డించారు (లూకా 9:16). ప్రభువు చేసిన ఈ పనులు ఏదో సంక్లిష్టమైన మాయాజాలం కాదు; అవి తండ్రి దేవుని పట్ల ఆయనకున్న అపారమైన కృతజ్ఞతను, కుమారుని లోతైన ప్రార్థనను, పరిశుద్ధాత్మ ద్వారా పెంపొందించబడిన సహోదర బంధాన్ని స్పష్టంగా సూచిస్తాయి. యేసు తన వద్దనున్న కొద్దిపాటి రొట్టెలు, చేపలను పంచుకోవడం ద్వారానే వాటిని అద్భుతంగా గుణించారు. ఫలితంగా, అందరికీ సరిపడా ఆహారం లభించడమే కాదు, సరిపడనంత కంటే ఎక్కువే మిగిలింది. అందరూ సంతృప్తిగా భుజించిన తర్వాత, మిగిలిన రొట్టెలను ఏకంగా పన్నెండు గంపల నిండా ఎత్తారు (లూకా 9:17).

యేసు ప్రజల ఆకలిని తీర్చిన విధానం, దేవుని కార్యాన్ని ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా చేయాలని ఆయన మనకూ నేర్పారు. నేటి సమాజంలో, సువార్తలో చెప్పబడిన జనసమూహాల వలె, ప్రజలు కేవలం ఆకలితో కాకుండా, ఇతరుల దురాశ వల్ల ఎక్కువగా బాధపడుతున్నారు. చాలామంది అనుభవిస్తున్న తీవ్ర పేదరికానికి విరుద్ధంగా, కొద్దిమంది చేతిలో సంపద పేరుకుపోవడం అహంకార, నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. ఇది సమాజంలో బాధను, అన్యాయాన్ని సృష్టిస్తోంది. పంచుకోవడానికి బదులుగా, భూఫలాలను, మానవ శ్రమను వృథా చేస్తోంది. ముఖ్యంగా ఈ జూబ్లీ సంవత్సరంలో, ప్రభువు ఉదాహరణ మన కార్యకలాపాలకు, సేవకు మార్గదర్శకం కావాలి. మనం మనకున్న వాటిని పంచుకోవడానికి, ప్రజలలో ఆశను పెంపొందించడానికి, దేవుని రాజ్య ఆగమననాన్ని ప్రకటించడానికి పిలవబడి ఉన్నాము.

ఆకలితో అలమటిస్తున్న జనసమూహాన్ని ఆదుకోవడం ద్వారా, యేసు మరణం నుండి ప్రతి ఒక్కరినీ రక్షిస్తానని చాటారు. ఇది మనం దివ్యసత్ప్రసాద సంస్కారంలో జరుపుకునే విశ్వాసపు రహస్యం. ఆకలి ఈ జీవితంలో మన ప్రాథమిక అవసరాలకు సంకేతం అయినట్లే, రొట్టెను విరవడం దేవుడు అందించే రక్షణ బహుమతికి సంకేతం.

ప్రియ మిత్రులారా, మానవ ఆకలికి క్రీస్తే దేవుని సమాధానం. ఎందుకంటే, ఆయన శరీరం నిత్యజీవానికి ఆహారము: “మీరందరు దీనిని తీసుకొని, భుజింపుడు” అనే యేసు ఆహ్వానం మన దైనందిన అనుభవాన్ని ప్రతిబింబిస్తుంది. సజీవంగా ఉండాలంటే, మొక్కలు, జంతువుల నుండి వచ్చే జీవంతో మనం పోషించుకోవాలి. కానీ చనిపోయిన వాటిని తినడం, మనం ఎంత తిన్నా ఒకరోజు చనిపోతామని గుర్తుచేస్తుంది. మరోవైపు, మనం యేసును, అంటే జీవమున్న, నిజమైన రొట్టెను స్వీకరించినప్పుడు, మనం ఆయన కోసమే జీవిస్తాము. తనను తాను పూర్తిగా అర్పించుకోవడం ద్వారా, సిలువ వేయబడి, పునరుత్థానం చెందిన ప్రభువు స్వయముగా మనలోనికి వస్తారు. ఆ క్షణంలోనే మనం దేవునిలో పాలుపంచుకోవడానికే సృష్టించబడ్డామని గ్రహిస్తాము. మన ఆకలితో కూడిన స్వభావం దివ్యసత్ప్రసాద కృపద్వారా మాత్రమే సంతృప్తి చెందే ఒక లోతైన ఆధ్యాత్మిక అవసరాన్ని కలిగి ఉంది. పునీత అగుస్తీను గారు వర్ణించినట్లుగా, క్రీస్తు నిజంగా panis qui reficit, et non deficit; panis qui sumi potest, consumi non potest” (ప్రసంగము 130, 2) — అంటే, “ఆయన పునరుద్ధరించే రొట్టె, అది ఎప్పటికీ తరిగిపోదు; అది తినగలిగిన రొట్టె, కానీ ఎన్నటికీ అయిపోదు.” దివ్యసత్రసాదం, వాస్తవానికి, రక్షకుని నిజమైన, సజీవమైన, సారవంతమైన ఉనికి (సత్యోపదేశం 1413). ఆయన రొట్టెను తనలోనికి మార్చుకోవడం ద్వారా, మనల్ని కూడా తనలోనికి రూపాంతరం చెందిస్తాడు. ఈ సజీవమైన, జీవమిచ్చే ప్రభువు శరీరం, మనల్ని, అంటే శ్రీసభను, ప్రభువు శరీరంగా మారుస్తుంది.

ఈ కారణంగానే, అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ (1 కొరి 10:17), ద్వితీయ వాటికన్ మహాసభ ఈ విధంగా బోధిస్తుంది: “దివ్యసత్ప్రసాద దివ్య సంస్కారం ద్వారా, క్రీస్తులో ఒకే శరీరంగా మారిన విశ్వాసుల ఐక్యత వ్యక్తమవుతుంది, అది సాకారమవుతుంది కూడా. ప్రపంచానికి వెలుగు అయిన క్రీస్తుతో ఈ ఐక్యతలో చేరడానికి అందరూ పిలవబడ్డారు; ఎందుకంటే, ఆయన నుండే మన ఉనికి ప్రారంభమైంది, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం, మరియు మన జీవితాలను ఆయన వైపునకే నడిపిస్తున్నాం(Dogmatic Constitution Lumen Gentium, 3).

మనం ఇప్పుడు నిర్వహించబోయే దివ్యసత్రపసాద ప్రదక్షిణ అదే ప్రయాణానికి ప్రతీక. కాపరులు మరియు మంద వలె మనం కలిసి, దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరిస్తాం, ఆయనను ఆరాధిస్తాం, ఆపై వీధుల గుండా ఆయనను మోసుకెళ్తాం. ఇలా చేయడం ద్వారా, ఆయనను ప్రజల కళ్ల ముందు, వారి అంతరాత్మల ముందు, మరియు వారి హృదయాల ముందు నిలుపుతాం. ఇది విశ్వసించిన వారి హృదయాలలో విశ్వాసాన్ని మరింత దృఢపరుస్తుంది, అదే సమయంలో విశ్వసించని వారి హృదయాలలో ఉన్న ఆధ్యాత్మిక ఆకలిని, మరియు దానిని తీర్చగల ఏకైక ఆహారము గురించి వారు ఆలోచించేలా చేస్తుంది.

దేవుడు మనకొసగిన ఈ ఆశీర్వదించబడిన ఆహారంతో మనం బలం పుంజుకుని, యేసును అందరి హృదయాల్లోకి తీసుకెళ్దాం. ఎందుకంటే, ఆయన ప్రతి ఒక్కరినీ తన దివ్య బల్ల వద్దకు ఆహ్వానించి, తన రక్షణ కార్యక్రమంలో భాగం చేస్తారు. ఈ గొప్ప ప్రేమకు సాక్షులుగా మారడానికి పిలవబడిన వారందరూ ధన్యులు!

 

మూలము:

https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250622-omelia-corpus-domini.html
[అనువాదం:  గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap
.

No comments:

Post a Comment