సాధారణ సమావేశం, లియో XIV జగద్గురువులు, బుధవారం, 18 జూన్ 2025

 లియో XIV జగద్గురువులు
సాధారణ సమావేశం
సెయింట్ పీటర్స్ స్క్వేర్, బుధవారం, 18 జూన్ 2025

ఉపదేశం - జూబిలీ 2025. యేసుక్రీస్తు మన నిరీక్షణ. II. యేసు జీవితం. స్వస్థతలు 10. పక్షవాత రోగిని స్వస్థపరచుట. “యేసు ఆ రోగిని చూచి , వాడు బహు కాలము నుండి అచట ఉన్నాడని గ్రహించి, ‘నీవు స్వస్థత పొందగోరు చున్నావా?’ అని అతనిని అడిగెను” (యోహాను 5:6).
 
ప్రియ సహోదరీ సహోదరులారా,

యేసు స్వస్థపరిచే విధానంపై మనం దృష్టి సారిస్తూనే, కొన్నిసార్లు మన జీవితములో మనకు ఎదురయ్యే నిస్సహాయ పరిస్థితులను గురించి ఆలోచిద్దాం. వాస్తవానికి, కొన్ని సందర్భాలలో ఆశను వదులుకోవడం చాలా సులభంగా అనిపిస్తుంది. మనలో నిరాశ ఆవహించి, పోరాడాలనే సంకల్పం సన్నగిల్లిపోతుంది. సువార్తలలో ఈ స్థితిని పక్షవాతం అనే రూపకంతో చాలా స్పష్టంగా వర్ణించారు. అందుకే ఈరోజు మనం యోహాను సువార్త 5:1-9 వచనాలలో వివరించబడిన పక్షవాత రోగి స్వస్థతను ధ్యానిద్దాం.

యూదుల పండుగ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళారు. ఆయన నేరుగా దేవాలయానికి వెళ్ళకుండా, బలుల కోసం గొర్రెలను శుభ్రపరిచే “గొర్రెల వాకిలి” వద్ద ఆగారు. ఆ ద్వారం పక్కనే అనేకమంది రోగులు ఉన్నారు. గొర్రెలకు భిన్నంగా, వీరు అపవిత్రులుగా భావించబడి దేవాలయం నుండి వెలివేయబడినవారు! అలాంటి బాధలో నున్నవారి చెంతకు యేసు స్వయంగా వచ్చారు. [ఇది యేసు ప్రేమకు, కరుణకు స్పష్టమైన నిదర్శనం. సమాజం నుండి వెలివేయబడిన వారిని, నిస్సహాయులను ఆయన ఎంతగా పట్టించుకుంటారో ఈ సంఘటన తేటతెల్లం చేస్తుంది. స్వస్థత కేవలం శారీరక రోగాలకు మాత్రమే కాదని, సామాజికంగా బహిష్కరించబడినవారిని కలుపుకోవడం కూడా అన్న సందేశాన్ని యేసు తన చర్యల ద్వారా బోధించాడు]. ఈ ప్రజలు తమ జీవితాన్ని మార్చగల ఒక అద్భుతం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ ద్వారం పక్కనే ఒక కోనేరు ఉన్నది [హీబ్రూ భాషలో ‘బెత్సతా’]. దాని నీటికి స్వస్థపరిచే శక్తి ఉందని, అంటే అద్భుతమైనదని ప్రజలు నమ్మేవారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించేవారు. ఆకాలపు నమ్మకం ప్రకారం, నీరు కదలగానే, మొదట అందులో దిగిన వారు ఎటువంటి వ్యాధి నుండి యైనను స్వస్థత పొందుతారని ప్రచారంలో ఉండేది.

ఈ పరిస్థితిని గమనిస్తే, అక్కడ “పేదల మధ్య పోటీ” లాంటి వాతావరణం నెలకొన్నదని స్పష్టమవుతుంది. స్వస్థత పొందాలనే ఆశతో, ఆ రోగులు ఎంత అలసటతో, నిస్సహాయంగా ఆ కోనేరులోకి తమను తాము ఎలా ఈడ్చుకుంటూ వెళ్లారో మనం ఊహించుకోవచ్చు! ఆ కోనేరు పేరు ‘బెత్సతా’, దీనికి “కరుణగల గృహం” అని అర్థం. ఇది బహుశా శ్రీసభకు ఒక చక్కటి ఉదాహరణగా ఉంటుంది. ఎలాగైతే ‘బెత్సతా’ వద్ద రోగులు, నిస్సహాయులు గుమికూడతారో, అలాగే శ్రీసభ’లో కూడా రోగులు, పేదలు ఒకచోట చేరతారు. అక్కడ ప్రభువు వారికి స్వస్థతను అందించి, ఆశను చిగురింప జేస్తారు.

యేసు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ప్రత్యేకంగా పిలిచారు. నీళ్లు కదిలినప్పుడు కోనేటిలోకి దిగడం అతనికి సాధ్యం కాకపోవడంతో (5:7), అతను తీవ్ర నిరాశకు లోనై ఉన్నాడు. నిజానికి, చాలాసార్లు మనల్ని ఏ పనీ చేయకుండా కదలనీయకుండా చేసేది నిరాశే. దీనివల్ల మనం నిరుత్సాహపడి, ఏ పని చేయాలన్న ఆసక్తి లేకుండా ఉదాసీనతలోకి జారిపోయే ప్రమాదం ఉంది.

యేసు ఆ పక్షవాత రోగిని “నీవు స్వస్థత పొందగోరు చున్నావా?” (5:6) అని అడిగారు. ఈ ప్రశ్న పైకి అనవసరం అనిపించినా, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, చాలా సంవత్సారాలుగా ఒకే స్థితిలో ఉండిపోయినప్పుడు, స్వస్థత పొందాలనే కోరిక కూడా సన్నగిల్లిపోవచ్చు. కొన్నిసార్లు మనం అనారోగ్యంతోనే ఉండటానికి ఇష్టపడతాం. ఎందుకంటే, అది ఇతరులు మనలను చూసుకోవడానికి ఒక కారణంగా మారవచ్చు. మన జీవితంలో ఏమి చేయాలో నిర్ణయించుకోకుండా తప్పించుకోవడానికి కూడా ఇది ఒక సాకుగా ఉపయోగపడుతుంది. కానీ యేసు మాత్రం, ఆ వ్యక్తిని అతని నిజమైన, లోతైన కోరికను తిరిగి కనుగొనేలా చేశారు.

ఆ వ్యక్తి యేసు ప్రశ్నకు మరింత వివరంగా సమాధానం ఇస్తూ, జీవితం పట్ల తనకున్న నిజమైన దృక్పథాన్ని వెల్లడించాడు. ముందుగా, నీరు కదిలినప్పుడు తనను కోనేటిలోకి దించడానికి ఎవరూ లేరని అతను చెప్పాడు. అంటే, తప్పు తనది కాదని, తనను పట్టించుకోని ఇతరులదే అని అతని ఉద్దేశ్యం. ఈ వైఖరి బాధ్యతను తప్పించుకోవడానికి ఒక సాకుగా మారింది. అయితే, అతనికి సహాయం చేయడానికి నిజంగా ఎవరూ లేరా? దీనికి పునీత అగుస్తీను గారు జ్ఞానోదయం కలిగించే సమాధానం ఇచ్చారు, “నిజంగా అతని స్వస్థత కోసం ఒక ‘మనుష్యుడు’ అవసరమయ్యాడు. కానీ, ‘మనుష్యుడు’ దైవత్వంతో కూడినవాడు... కాబట్టి, అవసరమైన ఆ మనుష్యుడు వచ్చాడు; స్వస్థత ఎందుకు ఆలస్యం కావాలి?” [పునీత అగుస్తీను గారి మాటలు మనకు గొప్ప నిరీక్షణను ఇస్తాయి కదూ? మన కష్టాల్లో మనకు సహాయం చేయడానికి దైవశక్తి గల వ్యక్తి ఉన్నారని గుర్తుచేస్తున్నాయి.]

పక్షవాత రోగి అప్పుడు తాను కోనేటిలోకి దిగడానికి ప్రయత్నించినప్పుడల్లా, తనకంటే ముందు మరొకరు వెళ్తున్నారని చెప్పాడు. ఈ మాటలు అతని జీవితం పట్ల ఉన్న నిర్లక్ష్య ధోరణిని స్పష్టం చేస్తాయి. మనకు జరిగే చెడు అంతా దురదృష్టం వల్లేనని, విధి మనకు వ్యతిరేకంగా ఉందని మనం కొన్నిసార్లు భావిస్తాం కదా. ఈ వ్యక్తి కూడా నిరుత్సాహపడి, జీవిత పోరాటంలో తాను ఓడిపోయానని భావించాడు.

కానీ యేసు ఆ వ్యక్తికి తన జీవితం తన చేతుల్లోనే ఉందని తెలియ వచ్చేలా చేసారు. తన దీర్ఘకాలిక స్థితి నుండి లేచి నిలబడమని, తన పరుపు/పడకను (5:8) ఎత్తుకొని నడవమని అతనితో చెప్పారు. ఆ చాపను వదిలివేయడం లేదా పారవేయడం కాదు. అది అతని అనారోగ్యం, అతని చరిత్రకు ప్రతీక. అప్పటి వరకు, ఆ గతమే అతన్ని అడ్డుకుంది; చనిపోయిన వ్యక్తిలా అచేతనముగా ఉండేట్లు చేసింది. ఇప్పుడు ఆ చాపను తీసుకుని తనకు నచ్చిన చోటికి మోసుకెళ్ళేది అతడే. అతను తన చరిత్రతో ఏమి చేయాలో నిర్ణయించుకోగలడు! నడవడం, ఏ మార్గం ఎంచుకోవాలో నిర్ణయించుకునే బాధ్యత తీసుకోవడం. ఇదంతా యేసు కృప వల్లే సాధ్యమైంది!

ప్రియ సహోదరీ సహోదరులారా, మన జీవితం ఎక్కడ నిలిచిపోయిందో అర్థం చేసుకునే వరాన్ని ఒసగుమని ప్రభువును వేడుకుందాం. స్వస్థత పొందాలనే మన కోరికను స్పష్టంగా వ్యక్తపరుద్దాం. పక్షవాతానికి గురైనట్లు భావిస్తున్న వారందరి కోసం, దిక్కుతోచని స్థితిలో నున్న వారందరి కోసం ప్రార్థిద్దాం. క్రీస్తు హృదయంలో తిరిగి నివసించడానికి వేడుకుందాం, ఎందుకంటే అదే నిజమైన కరుణ గల గృహం!
 
విజ్ఞప్తి

ప్రియ సహోదరీ సహోదరులారా,

ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్, మరియు గాజా వంటి యుద్ధంతో అతలాకుతలమైన ప్రాంతాల నుండి వెలువడుతున్న ఆక్రందనలను చూసి శ్రీసభ హృదయం బద్దలై పోవుచున్నది. మనం ఎప్పటికీ యుద్ధానికి అలవాటు పడకూడదు! నిజానికి, శక్తివంతమైన, అధునాతన ఆయుధాలను ఆశ్రయించాలనే ప్రలోభాన్ని మనం తిరస్కరించాలి. నేడు, “ఆధునిక విజ్ఞానం సృష్టించిన ప్రతి రకమైన ఆయుధం యుద్ధంలో ఉపయోగించబడుతున్నప్పుడు, యుద్ధపు క్రూరత్వం, పోరాట యోధులను గత యుగాల కంటే చాలా అధికమైన అనాగరికత వైపు నడిపిస్తుంది” (రెండవ వాటికన్ కౌన్సిల్, పాస్టోరల్ కాన్స్టిట్యూషన్ గౌదియుం ఎత్ స్పెస్, 79). మానవ గౌరవం మరియు అంతర్జాతీయ చట్టం పేరిట, బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారికి పోప్ ఫ్రాన్సిస్ తరచుగా చేసిన హెచ్చరికను నేను పునరుద్ఘాటిస్తున్నాను: యుద్ధం “ఎల్లప్పుడూ ఓటమే!” మరియు పన్నెండవ భక్తినాధ పొప్ గారు చెప్పినట్లు: “శాంతితో ఏమీ కోల్పోరు. యుద్ధంతో అన్నీ కోల్పోవచ్చు.”
 
ప్రత్యేక శుభాకాంక్షలు

నేడు ఈ సమావేశంలో పాల్గొంటున్న ఆంగ్ల భాష మాట్లాడే యాత్రికులకు, సందర్శకులకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఉత్తర ఐర్లాండ్, నార్వే, కామెరూన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన బృందాలకు ప్రత్యేక స్వాగతం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ సంవత్సరంలో సయోధ్యను మరియు శాంతిని ప్రోత్సహించడానికి “ఫ్లేమ్ ఆఫ్ హోప్” యాత్రను ప్రారంభించిన “HOPE80” [హోప్ 80] అంతర్జాతీయ ప్రతినిధి బృంద సభ్యులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు.

దైవిక ప్రేమ మరియు సౌభ్రాతృత్వపు కాంతి మానవ కుటుంబంలోని ప్రతి ఒక్కరి హృదయాలలో ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి.

మీ అందరిపై, మరియు మీ కుటుంబాలపై, జ్ఞానం, బలం, ఆనందం అనే ప్రభువు వరాలు కురవాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక.
 
పరిశుద్ధ జగద్గురువు మాటల సారాంశం:

ప్రియ సహోదరీ సహోదరులారా,

“యేసుక్రీస్తు మన నిరీక్షణ” అనే జూబిలీ ప్రధాన అంశంపై ధ్యానాన్ని కొనసాగిస్తూ, బెత్సతా కోనేరు వద్ద యేసు పక్షవాత రోగిని అద్భుతంగా స్వస్థపరచిన సంఘటనను ఇప్పుడు పరిశీలిద్దాం. స్వస్థత పొందాలనే ఆశతో చాలా మంది శారీరక వికలాంగులు అక్కడ స్నానం చేయడానికి వచ్చేవారు. అయితే, యేసు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతూ, కోనేరులోకి తానుగా దిగలేని వ్యక్తిని చూసారు. యేసు అతనిని అడిగిన “నీవు స్వస్థత పొందగోరు చున్నావా?” అనే ప్రశ్న చాలా లోతైనది. ఇది పక్షవాత రోగిలోని నిస్సహాయతను, నిరాశను సవాలు చేసి, తన జీవితం మారగలదనే ఆశను అతనిలో కలిగించడానికి దోహదపడింది. యేసు అతనితో, “లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము” అని చెప్పారు. ఆ చాప వాస్తవానికి ఆ వ్యక్తి యొక్క గత శారీరక, ఆధ్యాత్మిక పక్షవాతానికి ప్రతీక. ఇప్పుడు అతను దానిని అంగీకరించి, విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించగలడు. ఈ నిరీక్షణ జూబిలీ సంవత్సరంలో, బాధపడుతున్న మరియు నిరుత్సాహానికి గురయ్యే ప్రలోభానికి లోనైన వారందరినీ మన ప్రార్థనలలో గుర్తుంచుకుందాం. జీవితంలో ఎలాంటి సమస్యలు లేదా ఎదురుదెబ్బలు ఎదురైననూ, మనం యేసు వైపుకు తిరుగుదాం. స్వస్థత కోసం మన కోరికను వ్యక్తపరచి, ఆయన వాగ్దానం చేసిన స్వేచ్ఛను, నూతన జీవితాన్ని స్వీకరిద్దాం.
 
మూలము:

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

No comments:

Post a Comment