పొప్ లియో XIV, రేజీనా చెలీ, ఆదివారము, 11 మే 2025

 పొప్ లియో XIV
రేజీనా చెలీ
పు. పేతురు బసిలికా, రోము నగరము
ఆదివారము, 11 మే 2025

 

ప్రియమైన సహోదరీ సహోదరులారా! మీ అందరికీ ఆదివారం శుభాకాంక్షలు!

         రోమ్ పీఠానికి బిషప్‌గా నా సేవలో ఇది మొదటి ఆదివారం. ఈ రోజు, మనము పాస్క నాలుగవ ఆదివారాన్ని, అనగా “మంచి కాపరి” ఆదివారాన్ని జరుపు కుంటున్నాము. ఇది నిజముగా దేవుని అనుగ్రహముగా నేను భావిస్తున్నాను. నేటి దివ్యపూజలో, మనం యోహాను సువార్త యొక్క 10వ అధ్యాయం నుండి ఆలకిస్తున్నాము. యేసు ప్రభువు తనను తాను మంచి కాపరిగా వెల్లడించారు. ఆయన తన గొర్రెలను ఎరిగి, వారిని ప్రేమిస్తాడు మరియు వారి కోసం తన ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.

         ఈ ప్రత్యేకమైన ఆదివారమున, గత అరవై రెండు సంవత్సరాలుగా మనము దైవ పిలుపుల కొరకు ప్రార్థన దినోత్సవాన్ని కూడా జరుపు కుంటున్నాము. అంతేకాకుండా, రోమ్ నగరం ఈరోజు బాండ్స్ మరియు పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ జూబ్లీకి ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడకు విచ్చేసిన యాత్రికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. వారి సంగీతం మరియు ప్రదర్శనల ద్వారా, వారు పరిశుద్ధాత్మతో శ్రీసభకు మార్గనిర్దేశము చేసే మంచి కాపరి యొక్క ప్రాముఖ్యతను సజీవముగా ఉంచుతున్నారు. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.

సువార్తలో, యేసు ప్రభువు స్పష్టంగా తెలియ జేస్తున్నారు, తాను తన గొర్రెలను ఎరుగుదునని మరియు వారు ఆయన స్వరాన్ని విని ఆయనను అనుసరిస్తారని (యోహాను 10:27 చూడండి). నిజానికి, పోప్ పునీత గ్రెగొరీ ది గ్రేట్ బోధించినట్లుగా, ప్రజలు “తమను ప్రేమించే వారి ప్రేమకు ప్రతిస్పందిస్తారు” (ప్రసంగం, 14:3-6).

ప్రియమైన సహోదరీ సహోదరులారా! ఈరోజు మీతో మరియు దేవుని ప్రజలందరితో కలిసి దైవ పిలుపుల కొరకు, ముఖ్యముగా యాజక మరియు మఠవాస పిలుపుల కొరకు ప్రార్థించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీసభకు వారి అవసరం ఎంతో ఉన్నది! వారి దైవ పిలుపు ప్రయాణములో, యువతీ యువకులు తమ సమాజములో ఆమోదం, మద్దతు, శ్రద్ధ మరియు ప్రోత్సాహాన్ని పొందడం చాలా ముఖ్యం. అంకితభావం మరియు విశ్వసనీయత కలిగిన వారి ఆదర్శం వారికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది

పోప్ ఫ్రాన్సిస్ ఈరోజు తన సందేశములో [దైవ పిలుపుల కొరకు 62వ ప్రపంచ దినోత్సవ సందర్భముగా పొప్ ఫ్రాన్సిస్ సందేశము] మనకు వదిలి వెళ్ళిన ఆహ్వానాన్ని మనము స్వీకరిద్దాం. అదేమిటంటే, యువకులను ప్రేమతో ఆహ్వానించి వారికి తోడుగా ఉండటం మరియు ఒకరికొకరు సేవ చేసుకుంటూ జీవించడం. ప్రతి ఒక్కరూ తమ జీవిత స్థితికి అనుగుణంగా, ఆయన హృదయానుసారమైన కాపరులుగా (యిర్మీయా 3:15 చూడండి) ప్రేమ మరియు సత్యములో నడవడానికి ఒకరికొకరు సహాయము చేసుకోవాలని మన పరలోకపు తండ్రిని ప్రార్థిద్దాం. యువతీ యువకులారా! “భయపడకండి! శ్రీసభ మరియు ప్రభువైన క్రీస్తు యొక్క ఆహ్వానాన్ని స్వీకరించండి!”

ప్రభువు పిలుపుకు తన జీవితాంతం ప్రతిస్పందించిన కన్య మరియ, యేసును అనుసరించడంలో మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక!

రెజీనాచెలీ తరువాత:

ప్రియమైన సహోదరీ సహోదరులారా! రెండవ ప్రపంచ యుద్ధం అరవై మిలియన్ల మందిని బలిగొన్న తర్వాత ఎనభై సంవత్సరాల క్రితం, మే 8న ముగిసింది. పోప్ ఫ్రాన్సిస్ అనేకసార్లు చెప్పినట్లుగా, ముక్కలు చేయబడిన మూడవ ప్రపంచ యుద్ధం యొక్క నేటి భయానక దృష్టాంతంలో, నేను కూడా ప్రపంచ నాయకులను ఉద్దేశించి, ఎప్పటికీ సమయోచితమైన విజ్ఞప్తిని పునరావృతం చేస్తున్నాను, ఇక ఎప్పటికీ యుద్ధం వద్దు!” 

ఉక్రేనియన్ ప్రజల బాధలను నా హృదయంలో నింపుకున్నాను. వీలైనంత త్వరగా నిజమైన, న్యాయమైన మరియు శాశ్వతమైన శాంతిని నెలకొల్పడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. ఖైదీలందరినీ విడుదల చేయాలి. చిన్నారులు వారి స్వంత కుటుంబాలకు తిరిగి వెళ్లాలి.

గాజా స్ట్రిప్‌లో జరుగుతున్న దానికి నేను చాలా బాధపడుతున్నాను. తక్షణమే కాల్పుల విరమణ జరగాలి! బాధిత పౌరులకు మానవతా సహాయం అందించాలి. బందీలందరినీ విడుదల చేయాలి.

మరోవైపు, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనను నేను సంతోషంగా స్వాగతిస్తున్నాను. రాబోయే చర్చల ద్వారా శాశ్వతమైన ఒప్పందం త్వరలో కుదురుతుందని ఆశిస్తున్నాను.

కానీ ప్రపంచంలో మరెన్నో సంఘర్షణలు ఉన్నాయి! వీటిని శాంతికి రాణి అయిన మరియ తల్లికి నా హృదయపూర్వక విజ్ఞప్తిని అప్పగిస్తున్నాను, తద్వారా ఆమె దానిని ప్రభువైన యేసుకు సమర్పించి మనకు శాంతి అనే అద్భుతాన్ని ప్రసాదిస్తుంది.

ఇప్పుడు నేను రోమ్‌లోని ప్రజలను మరియు వివిధ దేశాల నుండి వచ్చిన యాత్రికులందరినీ ఆప్యాయంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా, బ్రిటిష్ మరియు ఫారిన్ బైబిల్ సొసైటీ సభ్యులను, గ్రానడ (స్పెయిన్) నుండి వచ్చిన వైద్యుల బృందాన్ని, మాల్టా, పనామా, డల్లాస్ (టెక్సాస్), వల్లడోలిడ్, టోరెలోడోన్స్ (మాడ్రిడ్), మోంటెసిల్వానో మరియు సినిసి (పలెర్మో) విశ్వాసులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

జీవితాన్ని ఎంచుకుందాం” అనే ప్రదర్శనలో పాల్గొనే వారికి మరియు రెజియో ఎమిలియాలోని బ్లెస్డ్ మేరీ ఇమ్మాక్యులేట్ మరియు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి యొక్క సోదర బృందానికి చెందిన యువకులకు నా అభినందనలు.

ఈరోజు ఇటలీలో మరియు ఇతర దేశాలలో మనం 'మాతృ దినోత్సవాన్ని' జరుపుకుంటున్నాము. తల్లులందరికీ మరియు ఇప్పటికే స్వర్గస్థులైన వారికి నా ప్రార్థనలతో కూడిన హృదయపూర్వక శుభాకాంక్షలు!

తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!

అందరికీ ధన్యవాదాలు మరియు శుభ ఆదివారము!

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/events/event.dir.html/content/vaticanevents/en/2025/5/11/regina-caeli.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు, OFM Cap.

Rector, Vianney College, Eluru, Andhra Pradesh

No comments:

Post a Comment