ప్రథమ అపోస్తోలిక దీవెన
Urbi et Orbi
పరిశుద్ధ పోప్ లియో XIV
పునీత పేతురు బసిలికా, వాటికన్ నగరం
గురువారము, 8 మే 2025
క్రీస్తు నాథుని శాంతి మీ అందరికీ
కలుగును గాక!
ప్రియమైన
సహోదరీ సహోదరులారా!
“మీకు శాంతి
కలుగును గాక!” అని తన మంద కొరకు తన ప్రాణాలను అర్పించిన మంచి కాపరి, పునరుత్థానుడైన క్రీస్తు పలికిన ప్రథమ మాటలివి. ఈ శాంతి వందనం మీ హృదయాలలో,
మీ కుటుంబాలలో, ప్రజలందరిలో, వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ప్రతి దేశములో, ప్రపంచమంతటా ప్రతిధ్వనించాలని నేను
హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. శాంతి మీతో ఉండును గాక!
ఇది
పునరుత్థానుడైన క్రీస్తు యొక్క శాంతి. నిరాయుధమైన శాంతి. వినయము మరియు పట్టుదలగల
శాంతి. మనందరినీ బేషరతుగా ప్రేమించే దేవుని నుండి ప్రవహించే శాంతి.
ఈస్టర్ ఉదయమున
విశ్వానికి, యావత్ ప్రపంచానికి తన ఆశీర్వాదమును
అందించిన పోప్ ఫ్రాన్సిస్ యొక్క స్వరము మనకు ఇంకా స్ఫూర్తినిస్తూనే ఉన్నది. అదే
ఆశీర్వాదాన్ని నేను మీకు అందిస్తున్నాను. దేవుడు మనలను అమితముగా ప్రేమిస్తున్నాడు.
దుష్టత్వం ఎప్పటికీ విజయం సాధించదు! మనమందరము దేవుని ప్రేమపూర్వకమైన చేతుల్లో
ఉన్నాము. కాబట్టి, భయం లేకుండా, ఐక్యముగా, దేవునితో మరియు ఒకరితో ఒకరు చేయి చేయి
కలిపి ముందుకు సాగుదాం! మనము క్రీస్తు అనుచరులము. క్రీస్తు మనకు మార్గదర్శకుడు.
ప్రపంచానికి ఆయన వెలుగు అత్యంత అవసరం. మానవాళికి - దేవునికి మరియు ఆయన ప్రేమకు
మనలను నడిపించగల వారధిగా క్రీస్తు మనకు అవసరం. సంభాషణ మరియు కలయిక ద్వారా ప్రేమ,
దయ మరియు కరుణతో వారధులు నిర్మించడానికి,
ఒకే మానవ కుటుంబంగా కలిసి, ఎల్లప్పుడూ శాంతితో జీవించడానికి మనందరికీ దేవుడు సహాయం చేయును గాక! ప్రియమైన
పోప్ ఫ్రాన్సిస్ గారికి ధన్యవాదాలు!
పునీత పేతురు వారసుడిగా, మీతో కలిసి ఒక
సంఘముగా, ఐక్యతతో, శాంతి మరియు న్యాయాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తూ, యేసుక్రీస్తుకు విశ్వాసపాత్రులైన వారిగా నిరంతరం జీవించడానికి,
భయము లేకుండా సువార్తను ప్రకటించడానికి,
మిషనరీలుగా ప్రపంచమంతటా ఆయన ప్రేమను చాటడానికి
నన్ను ఎన్నుకున్న నా సోదర కార్డినల్స్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను.
నేను పునీత అగుస్తీను సభకు చెందిన వాడను. పునీత అగస్టీన్ యొక్క
ఆధ్యాత్మిక వారసుడిని. అతను ఒకసారి ఇలా అద్భుతంగా చెప్పాడు, “మీతో నేను ఒక క్రైస్తవుడిని, మరియు మీ కోసం
నేను ఒక బిషప్‌ను.” ఈ స్ఫూర్తితో, మనమందరమూ దేవుడు మన కొరకు సిద్ధము
చేసిన పరలోక రాజ్యము వైపు కలిసి ప్రయాణించవచ్చు.
రోము నగర శ్రీసభకు నా ప్రత్యేకమైన మరియు ఆత్మీయమైన వందనాలు! కలిసి,
మనం ఒక చైతన్యవంతమైన మిషనరీ శ్రీసభగా, ప్రేమతో వారధులు నిర్మించే సంఘముగా, హృదయపూర్వక సంభాషణను ప్రోత్సహించే సమాజముగా, తెరిచిన చేతులతో ప్రతి ఒక్కరినీ స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా
ఉన్న కుటుంబంగా, మన దాతృత్వం, మన ఉనికి, మన సంభాషణ సంసిద్ధత, మరియు మన నిస్వార్థమైన ప్రేమ అవసరమైన వారందరినీ ఆదరించడానికి మరియు
వారికి సహాయం చేయడానికి కొత్త మార్గాలను నిరంతరం అన్వేషించాలి.
అందరికీ మరియు
ముఖ్యముగా నా ప్రియమైన పెరూలోని చిక్లాయో మేత్రాసణమునకు నా ప్రత్యేక శుభాకాంక్షలు!
అక్కడ విశ్వాసముగల ప్రజలు తమ ప్రియమైన బిషప్‌కు అండగా నిలిచారు. వారి అచంచలమైన
విశ్వాసాన్ని పంచుకున్నారు. యేసుక్రీస్తు యొక్క నమ్మకమైన సంఘముగా కొనసాగడానికి
వారు ఎంతో త్యాగం చేశారు మరియు చేస్తున్నారు. వారి
విశ్వాసానికి నా వందనాలు.
రోము, ఇటలీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ అందరికీ,
ప్రియమైన సహోదరీ సహోదరులకు, మనమందరం ఒక
సినోడల్ శ్రీసభగా ఉండాలని నా హృదయపూర్వక ఆకాంక్ష. ముందుకు సాగే సంఘముగా, ఎల్లప్పుడూ శాంతిని గాఢంగా కోరుకునే సమాజముగా, నిరంతరం
దాతృత్వాన్ని ఆచరించే కుటుంబముగా, మరియు ముఖ్యముగా కష్టాలలో నున్నవారికి
ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలని తపించే ఆత్మీయ బంధముగా మనం ఎదగాలని కోరుకుంటున్నాను.
ఈ పవిత్రమైన
రోజు పొంపీ యొక్క అవర్ లేడీకి విజ్ఞాపన ప్రార్థన దినం. మన ప్రియమైన తల్లి మరియ
ఎల్లప్పుడూ మన పక్కన నడవాలని, మనకు దగ్గరగా ఉండాలని, ఆమె శక్తివంతమైన మధ్యవర్తిత్వము మరియు ఆమె మాతృ ప్రేమతో మనకు సహాయం
చేయాలని మనం విశ్వసిద్దాం. కాబట్టి నేను మీతో కలిసి ప్రార్థించాలను కుంటున్నాను. ఈ
నూతన మిషన్ కోసం, విశ్వవ్యాప్త శ్రీసభ కోసం, మరియు ప్రపంచ శాంతి కోసం మనం ముక్త కంఠముతో ప్రార్థిద్దాం. మన ప్రియ
తల్లి అయిన మరియను ఈ ప్రత్యేకమైన దయ కోసం వినయముగా అడుగుదాం. దేవ వర ప్రసాదము చేత ననిండిన మరియమ్మా,
వందనము...
మూలము:
గురుశ్రీ
ప్రవీణ్ గోపు, OFM Cap.
Rector, Vianney College,
Eluru, Andhra Pradesh
No comments:
Post a Comment