వివాహం:
దేవుని ప్రణాళికలో ప్రేమ మరియు ఐక్యత
ప్రియమైన సోహోదరీ సోహోదరులారా,
తెలుగులో ఒక సామెత ఉంది, “పెళ్లి ఒక వింత
ముచ్చట, చూస్తే కాసేపే గానీ మోస్తే జీవితాంతం”. అనగా, వివాహం యొక్క
బాహ్య ఆర్భాటము కొద్దిసేపే ఉంటుంది కానీ దాని బాధ్యతలు జీవితాంతం ఉంటాయి అని ఈ
సామెత చెబుతుంది.
ఈరోజు
మనం వివాహం అనే పవిత్రమైన అంశం గురించి ధ్యానిద్దాం. కతోలిక విశ్వాసములో, వివాహము కేవలం ఇద్దరు
వ్యక్తుల మధ్య జరిగే ఒక ఒప్పందం మాత్రమే కాదు. అది దేవునిచే స్థాపించబడిన ఒక
దివ్యసంస్కారము. ప్రేమ మరియు ఐక్యత యొక్క శక్తివంతమైన చిహ్నము. దేవుడు మానవున్ని
తన పోలికలో, రూపములో సృష్టించాడు. “నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. అతనికి సాటియైన
తోడును సృష్టింతును” అని పలికాడు (ఆది 2:18). ఈ మాటలు వివాహం
అనేది దేవుని యొక్క ప్రణాళికలో భాగమని స్పష్టం చేస్తున్నాయి. అలాగే, ఇది వివాహం
యొక్క మూలము మరియు ఉద్దేశము (ఆది 1:27-28, 2:18-25). “తోడు”
అనగా సేవకుడు లేదా సేవకురాలు అని కాదు. ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఒకరి బలహీనతలను మరొకరు భర్తీ చేస్తూ, కలిసి జీవించడాన్నిసూచిస్తుంది.
అన్ని విషయాలలో ఇరువురు సమానమే అని అర్ధం. “భార్యాభర్తలది బండి
చక్రాల వంటిది, ఒకటి సరిగా లేకున్నా నడవదు” అంటే, భార్యాభర్తలు ఇద్దరూ సమానముగా
మరియు సమన్వయముతో ఉంటేనే జీవితము సాఫీగా సాగుతుందని అర్ధం.
వివాహము దివ్య సంస్కారము
క్రీస్తు ప్రభువు తన జీవితము మరియు బోధనల ద్వారా
వివాహానికి మరింత ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. కానాలోని వివాహ విందులో ఆయన
చేసిన మొదటి అద్భుతం వివాహ బంధము యొక్క ప్రాముఖ్యతను తెలియ జేస్తుంది. నూతన
నిబంధనలో, అపోస్తలుడు పౌలు వివాహాన్ని
క్రీస్తు మరియు శ్రీసభ మధ్యనున్న ప్రేమ మరియు ఐక్యతకు ఒక గొప్ప సారూప్యంగా
వర్ణించాడు (ఎఫెసీ5:21-33). ఈ కారణముగానే, కతోలిక శ్రీసభ వివాహాన్ని ఏడు దివ్యసంస్కారాలలో ఒకటిగా పరిగణిస్తుంది.
దివ్యసంస్కారముగా, వివాహం కేవలం ఒక బాహ్య ఆచారము కాదు. అది దేవుని యొక్క
అనుగ్రహాన్ని అందించే ఒక సాధనము. పెళ్లి చేసుకునే స్త్రీ పురుషులు తమ ప్రేమను
మరియు నిబద్ధతను వ్యక్తం చేస్తున్నప్పుడు, క్రీస్తు వారి
మధ్య ఉంటాడు మరియు వారి బంధాన్ని బలపరుస్తాడు. ఈ అనుగ్రహము వారికి ఒకరినొకరు
ప్రేమించడానికి, గౌరవించడానికి మరియు పిల్లలను విశ్వాసంలో
పెంచడానికి సహాయ పడుతుంది.
వివాహ బంధము యొక్క లక్షణాలు
కతోలిక బోధన ప్రకారము, వివాహ బంధానికి నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి:
1. స్వేచ్ఛ: స్త్రీ మరియు పురుషుడు ఎటువంటి బలవంతము లేకుండా, పూర్తిగా స్వేచ్ఛగా వివాహము చేసుకోవాలి.
వారి నిర్ణయము వారి స్వంతముగా ఉండాలి. ఇంకో సామెత గుర్తుకొస్తుంది, “పెళ్లి కాని వాడికి
లోకము ఒక ఆటస్థలం, పెళ్లయిన వాడికి అదొక పోరాట స్థలము” అంటే, పెళ్లికి ముందున్న
స్వేచ్ఛను మరియు పెళ్లి తర్వాత వచ్చే బాధ్యతలు, ఒత్తిడులను ఈ సామెత
వివరిస్తుంది.
2. సంపూర్ణ నిబద్ధత / ఐఖ్యత: వివాహము అనేది జీవితాంతము ఉండే శాశ్వతమైన బంధము.
“మరణము మనలను వేరు చేసే వరకు” అనే ప్రమాణము ఈ నిబద్ధతను తెలియ జేస్తుంది. విడాకులు
దేవుని ప్రణాళికకు విరుద్ధమైనవిగా శ్రీసభ బోధిస్తుంది. ఆది 2:24 “నరుడు తన
తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు”. వివాహములో
భార్యాభర్తల మధ్య ఉండే సన్నిహితమైన మరియు విడదీయరాని బంధాన్ని ఇది తెలియ జేస్తుంది.
ఇది శారీరకమైన, భావోద్వేగ పరమైన
మరియు ఆధ్యాత్మికమైన ఏకత్వాన్ని సూచిస్తుంది. అందుకే ప్రభువు మత్త 19:6లో
ఇలా అన్నాడు, “దేవుడు జతపరచిన జంటను మానవ మాత్రుడు వేరుపరప రాదు”. కనుక, వివాహ బంధము
అనేది పవిత్రమైనది మరియు శాశ్వతమైన బంధము. “దేవుడు ఇద్దరినీ
ఒకటిగా చేశాడు, కాబట్టి వారు ఒకరినొకరు విడిచిపెట్ట కూడదు” అని పునీత అగుస్తీను
గారు నొక్కి చెప్పారు. ఇంకో సామెత ఉంది, “మాట తప్పితే మనిషి తప్పినట్లే, పెళ్లి తప్పితే
బ్రతుకే తప్పుతుంది” కాబట్టి, వివాహ బంధమును నిలబెట్టు కోవడానికే ప్రయత్నం చేయాలి.
3. నమ్మకము: భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి. వివాహేతర
సంబంధాలు విశ్వాసానికి ద్రోహము చేస్తాయి మరియు వివాహ బంధాన్ని నాశనము చేస్తాయి.
నమ్మకము లేకపోతే ఆ బంధము బలహీనంగా
ఉంటుంది. నమ్మకము అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఒక భావోద్వేగ బంధం. ఇది నిజాయితీ, విశ్వాసము మరియు గౌరవంపై ఆధారపడి ఉంటుంది. నమ్మకము ఉన్నప్పుడు,
ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సురక్షితముగా మరియు
భరోసాతో ఉంటారు. వారు తమ ఆలోచనలు, భావాలు మరియు బలహీనతలను ఎటువంటి భయం
లేకుండా పంచుకోగలరు. నమ్మకం బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఒకరినొకరు
నమ్మినప్పుడు, వారు మరింత దగ్గరగా ఉంటారు మరియు
ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. నమ్మకము ఉన్న బంధములో, సమస్యలను పరిష్కరించడం సులభము అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరి
ఉద్దేశాలను విశ్వసిస్తారు మరియు కలిసి పరిష్కారము కనుగొనడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ
మీ బంధంలో నమ్మకము
లేకపోతే, దానిని తిరిగి నిర్మించడానికి సమయం పడుతుంది. కాబట్టి ఓపికగా ఉండండి.
నమ్మకము అనేది ఒక బంధాన్ని బలముగా ఉంచే ఒక అమూల్యమైన బహుమతి. దానిని కాపాడుకోవడం
ఇద్దరి బాధ్యత.
4. ఫలవంతం- సంతానోత్పత్తి: వివాహం యొక్క ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి పిల్లలను కనడం
మరియు వారిని క్రైస్తవ విశ్వాసంలో పెంచడం. పిల్లలు దేవుని నుండి వచ్చిన బహుమానాలు
మరియు కుటుంబ ప్రేమకు ప్రతిరూపాలు. ఆది 1:28 “దేవుడు వారిని దీవించి,
సంతానోత్పత్తి చేయుడు” అని ఆజ్ఞాపించాడు. అందుకే, సంతానోత్పత్తి వివాహం యొక్క
ముఖ్యమైన ఉద్దేశాలలో ఒకటిగా చెప్పబడింది. “వివాహం అనేది
పురుషుడు మరియు స్త్రీ యొక్క సన్నిహితమైన కలయిక, ఇది పిల్లలను
కనడానికి మరియు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఉద్దేశించబడింది” అని పునీత థామస్
అక్వినాస్ స్పష్టం
చేసారు. అందుకే పునీత జాన్ క్రిసోస్టోమ్ గారు, “వివాహం ఈ లోకములో
చిన్న శ్రీసభ” అని అన్నాడు. ఇక్కడ భార్యాభర్తలు మరియు పిల్లలు విశ్వాసములో కలిసి
ఎదుగుతారు అని అర్ధము.
వివాహపు విలువలు / వివాహములో భార్యాభర్తల
బాధ్యతలు మరియు సంబంధాలు
(ఎఫెసీ 5:21-33, కొలొస్సీ 3:18-19,
1 పేతురు 3:1-7):
కతోలిక వివాహము అనేక ముఖ్యమైన విలువలను, బాధ్యతలను
కలిగి యుంటుంది:
1. పరస్పర విధేయత మరియు ప్రేమ: ఇది వివాహానికి పునాది. భార్యాభర్తలు ఒకరినొకరు
నిస్వార్థంగా ప్రేమించు కోవాలి. ఒకరి అవసరాలను మరొకరు పట్టించు కోవాలి. ఎఫెసీ
5:21-25, “పరస్పరము విధేయులై
ఉండుడు. భార్యలారా! ప్రభువునకు విధేయులైనట్లే, మీ భర్తలకును విధేయులై ఉండుడు.
శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత
చూపవలెను. భర్తలారా! క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు
అర్పించెనో, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు”. కనుక, ఈ వచనాలు భార్యాభర్తలు
ఒకరినొకరు గౌరవించు కోవాలని, ప్రేమించాలని మరియు ఒకరి
అవసరాలను మరొకరు తీర్చాలని సూచిస్తున్నాయి. భార్య భర్తకు లోబడి యుండటం అనేది
ప్రేమపూర్వకమైన గౌరవాన్ని సూచిస్తుంది, మరియు భర్త తన
భార్యను క్రీస్తు శ్రీసభను ప్రేమించినట్లుగా నిస్వార్థముగా ప్రేమించాలి.
2. గౌరవము: ఒకరి అభిప్రాయాలను,
హక్కులను మరియు వ్యక్తిత్వాన్ని గౌరవించడము చాలా ముఖ్యము. భర్తలు
తమ భార్యలను గౌరవంగా చూడాలని మరియు వారి అవసరాలను అర్థము చేసుకోవాలని, భర్తలు తమ భార్యలను అర్థము చేసుకోవాలని, వారి అవసరాలు, భావాలు, బలహీనతలు, బలాలు తెలుసుకోవాలని, వారిని బలహీనమైన వారిగా కాకుండా విలువైన వారిగా
చూడాలని 1
పేతురు 3:7లో చదువుచున్నాము.
3. సహనము మరియు క్షమాపణ: జీవితములో కష్టాలు మరియు విభేదాలు రావడం సహజం. సహనముతో
ఉండటము మరియు ఒకరినొకరు క్షమించు కోవడము బంధాన్ని బలపరుస్తుంది. భార్యాభర్తలు
ఒకరిపై ఒకరు కోపము చూపకూడదని మరియు ద్వేషించ కూడదని కొలొస్సీ3:19 హెచ్చరిస్తుంది (“భర్తలారా! మీరు మీ భార్యలను ప్రేమింపుడు. వారిపట్ల కఠినంగా ప్రవర్తింపకుడు”). భర్తలు
తమ భార్యలను ప్రేమించాలి. ఈ ప్రేమ కేవలము భావోద్వేగ పరమైనది మాత్రమే కాదు, అది నిబద్ధతతో కూడిన ప్రేమ, త్యాగపూరితమైన
ప్రేమ, మరియు శ్రద్ధ చూపే ప్రేమ. భర్తలు తమ
భార్యల పట్ల కఠినముగా ఉండకూడదు. కఠినత్వము అంటే కేవలం శారీరక హింస మాత్రమే కాదు, అది మాటలతో బాధించడము, నిర్లక్ష్యం
చేయడము, వారి పట్ల అసహనము చూపడము, వారిని నియంత్రించడానికి ప్రయత్నించడము వంటివి కూడా కావచ్చు. భర్తలు తమ భార్యలతో దయగా, మృదువుగా, సహనముతో ప్రవర్తించాలి. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్
గారు, “భార్యాభర్తలు
ఒకరినొకరు సహనముతో భరించాలి మరియు ఒకరి బలహీనతలను క్షమించాలి” అని వివాహ జీవితములో
సహనము మరియు క్షమాపణ ఎంతో ప్రాముఖ్యమైనవని తెలియ జేశారు.
4. సంభాషణ: బహిరంగముగా మరియు నిజాయితీగా ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం
సమస్యలను పరిష్కరించడానికి మరియు సాన్నిహిత్యాన్ని పెంచడానికి సహాయ పడుతుంది.
సంభాషణ ద్వారా భార్యాభర్తలు తమ
సంతోషాలు, బాధలు, భయాలు, ఆందోళనలు మరియు ఆశయాలను ఒకరితో ఒకరు
పంచుకో గలుగుతారు. ఇది ఒకరి మనసులోని విషయాలను మరొకరు అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుంది,
తద్వారా ఒంటరితనము మరియు అపార్థాలు
తొలగిపోతాయి. జీవితములో సమస్యలు తలెత్తినప్పుడు, వాటిని చర్చించడము మరియు కలిసి పరిష్కార మార్గాలను కనుగొనడము చాలా
ముఖ్యము. సంభాషణ ఒక సురక్షితమైన వేదికను కలిగిస్తుంది. ఇక్కడ ఇద్దరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మరియు ఒక ఉమ్మడి
నిర్ణయానికి రావడానికి ఉపయోగ పడుతుంది.
5. ప్రార్థన మరియు విశ్వాసము: కలిసి ప్రార్థించడము మరియు విశ్వాసములో
పాలుపంచు కోవడము భార్యాభర్తలను దేవునికి దగ్గర చేస్తుంది మరియు వారి బంధానికి
ఆధ్యాత్మిక బలాన్నిస్తుంది.
ఆధునిక
సవాళ్లు మరియు కతోలిక ప్రతిస్పందన
నేటి ప్రపంచములో వివాహము అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.
మారుతున్న సాంఘిక విలువలు, ఆర్థిక ఒత్తిళ్లు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడము వంటి
కారణాల వల్ల వివాహ బంధము బలహీన పడుతోంది. విడాకుల సంఖ్య పెరుగుతోంది మరియు చాలామంది
యువకులు వివాహము పట్ల ఆసక్తి కూడా చూపడము లేదు.
ఈ సవాళ్ల నేపథ్యములో, కతోలిక శ్రీసభ వివాహము యొక్క ప్రాముఖ్యతను మరియు దాని పవిత్రతను నొక్కి
చెబుతోంది. వివాహానికి ముందు మరియు తరువాత జంటలకు తగిన శిక్షణ మరియు మద్దతును
అందిస్తుంది. ఆరోగ్యకరమైన మరియు విశ్వాసమైన వివాహ జీవితాన్ని గడపడానికి అవసరమైన
మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. కష్టాల్లో నున్న జంటలకు సహాయం చేయడానికి మరియు
వారి బంధాన్ని పునరుద్ధరించడానికి శ్రీసభ ప్రయత్నిస్తుంది.
ప్రియమైన సహోదరీ సహోదరులారా, వివాహము అనేది దేవుని యొక్క గొప్ప బహుమానం. ఇది ప్రేమ,
ఐక్యత మరియు ఫలవంతమైన జీవితానికి పిలుపు. మనం ఈ పవిత్రమైన బంధాన్ని
గౌరవిద్దాం. దాని విలువలను కాపాడుకుందాం మరియు మన జీవితాల ద్వారా దాని యొక్క
అందాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. క్రీస్తు మనలను ప్రేమించినట్లుగా ఒకరినొకరు
ప్రేమించుకుందాం మరియు మన వివాహాలను దేవుని ప్రేమకు మరియు ఆయన సంఘానికి చిహ్నముగా
నిలుపుకుందాము.
వివాహ వాగ్దానాలు
వాగ్దానాలు (Vows): ఇది వివాహ వేడుకలో అత్యంత ముఖ్యమైన భాగము. పెళ్లి
చేసుకునే స్త్రీ పురుషులు ఒకరికొకరు స్వేచ్ఛగా మరియు బహిరంగముగా తమ ప్రేమను, విశ్వాసాన్ని మరియు
జీవితాంతము కలిసి ఉంటామని వాగ్దానం చేస్తారు. ఈ వాగ్దానాలు వారి బంధానికి పునాది.
ఈవాగ్దానాల ద్వారా, వారు ఒకరినొకరు భార్యాభర్తలుగా అంగీకరిస్తారు. ఇది వారి
స్వచ్ఛందమైన మరియు పూర్తి అంగీకారాన్ని సూచిస్తుంది. కనుక, వివాహములో
వాగ్దానాలు అత్యంత ముఖ్యమైనవి, ఇవి భార్యాభర్తల నిబద్ధతను మరియు ప్రేమను వ్యక్తము చేస్తాయి. ఈ వాగ్దానాలు కేవలము
మాటలు మాత్రమే కాదు, అవి భార్యాభర్తల హృదయ పూర్వకమైన సంకల్పాలు మరియు వారి జీవితాంతము
పాటించవలసిన బాధ్యతలు. ఈ వాగ్దానాల ద్వారానే వారి వివాహము ఒక దివ్యసంస్కారంగా
మారుతుంది మరియు వారు దేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ వాగ్దానాలను నిలబెట్టు
కోవడానికి వారు ఒకరికొకరు సహాయము చేసుకోవాలి, ప్రార్థన చేయాలి.
No comments:
Post a Comment