క్రీస్తురాజు మహోత్సవము (Year B)
నేడు క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడు చున్నాము. ఈ పండుగను 1925వ
సం.లో 11వ భక్తినాధ జగద్గురువులు స్థాపించారు. ఈ పండుగను స్థాపించడానికి మూడు
కారణాలు ఉన్నాయి: ఒకటి, భూలోక అధికారముపై క్రీస్తు మహిమాన్విత అధికారమును
ప్రకటించుటకు. రెండు, క్రీస్తుకు క్రైస్తవులు చూపించే విశ్వసనీయత, విధేయత గురించి
గుర్తుచేయుటకు. క్రీస్తు తన మనుష్యావతారము వలన, త్యాగపూరిత సిలువ మరణము వలన మనలను
దేవునకు దత్తపుత్రులుగా చేసెను, అలాగే పరలోకరాజ్య వారసులను చేసెను. మూడు, క్రీస్తు
ఒక్కడే నిజరాజు, సర్వలోకానికి క్రీస్తే రాజు అని అప్పటి నిరంకుశ భూలోక పాలకులకు [ముస్సోలిని,
హిట్లర్, స్టాలిన్] తెలియ జేయుటకు. క్రీస్తు మన ఆధ్యాత్మిక రాజు, పాలకుడు. ఆయన
సత్యము, ప్రేమతో మనలను పాలించును. 381వ సం.లో నూతనముగా రచించిన నైషియన్ విశ్వాస
సంగ్రహములో “ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అని జత చేయడం జరిగింది. ఈవిధముగా క్రీస్తు
రాజు అని మన విశ్వాసములో ప్రకటిస్తున్నాము.
క్రీస్తు రాజు. రాజులకు రాజు. సర్వ సృష్టికి రాజు. ఈ భూలోక సంబంధమైన
రాజు కాదు. సత్యము, న్యాయము, ప్రేమ, శాంతి గల రాజు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన
రాజ్యము కాదు. ఆయన రాజ్యము ఆయనను విశ్వాసముగా అనుసరించు వారి హృదయాలలో కొలువై
యున్నది. నేటి సువిశేషము యోహాను 18:33-37లో, యేసు “నా రాజ్యము ఈ లోక సంబంధమైనది
కాదు” అని స్పష్టముగా తెలియ జేశాడు. ఆయన రాజ్యము అధికారము, బలము, యుద్ధాలు, పోరాటాలతో
కూడినది కాదని స్పష్టముగా తెలియ జేశాడు.
ఆయన సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని అని స్పష్టం చేసాడు. కనుక,
ఆయన మా హృదయాలకు, మన జీవితాలకు, మన విశ్వాస జీవితానికి రాజు. సత్యము, ప్రేమతో
నడిపింపబడు ఆయన రాజ్యములో, విశ్వాసులము అయిన మనమందరము కూడా ఆ రాజ్య పౌరులమే!
మొదటి పఠనము దానియేలు
7:13-14లో దానియేలు ప్రవక్త “నరపుత్రుని” గూర్చిన దర్శనమును గాంచాడు. ఆ నరపుత్రుడు
శాశ్వత జీవి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధి కారమును బడసెను. సకల
దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది.
అతని రాజ్యమునకు అంతమే లేదు అని దానియేలు ప్రవక్త తన దర్శనములో ఈ సందేశాన్ని
పొందాడు. ఈ ప్రవచనం క్రీస్తు
రాజుకు వర్తిస్తుంది. ఎందుకన క్రీస్తు రాజ్యం శాశ్వత రాజ్యము, మరియు సకల జాతులకు
సంబంధించిన రాజ్యము. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దములో బబులోనయా రాజు యేరూషలేమును
ముట్టడించి, ఇశ్రాయేలు రాజును, అనేకమందిని బానిసత్వములోనికి కొనిపోయాడు. వారిలో
దానియేలు కూడా ఉన్నాడు. ఈ సందర్భములో దానియేలు తన దర్శనాల ద్వారా ప్రజలను ఊరట పరచి
వారిలో నమ్మకం, ధైర్యాన్ని నింపాడు. దేవుడు మెస్సయ్య రాజ్యాన్ని స్థాపించ
బోతున్నాడని ప్రవచించాడు. క్రీస్తు పూర్వం
రెండవ శతాబ్దములో యూదులు గ్రీకుల చేత పొందిన వేదహింసలలో రాయబడిన ఈ గ్రంథము
వారికి ఎంతగానో ఊరటను, నమ్మకాన్ని కలిగించినది.
రెండవ పఠనము దర్శన గ్రంథము 1:5-8లో, యేసుక్రీస్తు విశ్వాస పాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రధమ పుత్రుడు, భూపాలురకు ప్రభువు అని యోహాను తన దర్శనములో వివరించిన దానిని వింటున్నాము. క్రీస్తు రాజు తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజకరాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడు, శక్తిమంతుడు అని ఆలకిస్తున్నాము. యోహాను కూడా దర్శన గ్రంధమును క్రైస్తవ వేదం హింసల నేపధ్యములో, వారి విశ్వాసాన్ని బలపరచడానికి రచించాడు. ఉత్థాన క్రీస్తు మేఘ మండలము నుండి, ‘ఆల్ఫా, ఓమేగ’, ఆదియును అంతముగా వచ్చును. ప్రతి నేత్రము ఆయనను చూచును.
క్రీస్తు లోకమునుజయించెను, క్రీస్తు ఇప్పుడు లోకమును పాలించును, క్రీస్తు మహిమతో పాలించును. సిలువ శక్తి ద్వారా, మూడవ రోజున ఉత్థానము ద్వారా యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించాడు. సిలువ క్రీస్తు రాజు కిరీటం. కొండమీద ప్రసంగం క్రీస్తు రాజు శాసనం, ఆయన పరిపాలన చట్టం, నియమం. ఆయన రాజ్య పౌరులు, “దేవున్ని పూర్ణ శక్తితో ప్రేమించాలి, నేను మిమ్ములను ప్రేమించునటుల, మీరు తోటివారిని ప్రేమించాలి” అనే ఆజ్ఞను తప్పక పాటించాలి. క్రీస్తు రాజు మిషన్, ప్రేషితత్వం, మనలను సకల దాస్యములనుండి రక్షించడం. తద్వారా మనం ఈ లోకములో శాంతి సమాధానములతో జీవించగలము. అలాగే, మనకు నిత్యజీవ రాజ్యమును ఒసగునని వాగ్దానం చేసాడు.
సువిశేష పఠనము యోహాను 18:33-37లో యేసుక్రీస్తు పిలాతు యెద్ద తాను రాజు అని నొక్కి చెప్పాడు. అలాగే, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని స్పష్టం చేసాడు. పిలాతుకు ఎంతమాత్రమును అర్ధము కాలేదు. ఇతరులపై అధికారమును చెలాయించక, వారికి సేవ చేస్తూ తాను రాజుగా పరిపాలించును. క్రీస్తు అధికారము, భౌతిక శక్తిలోగాక, సత్యములో నెలకొని యున్నది. మరియు దైవరాజ్యము అష్టభాగ్యాలపై ఆధారపడి యున్నది.
యేసుక్రీస్తు రాజు అని పాతనిబంధన గ్రంథములోని మెస్సయ్య ప్రవచనాలలో, ముఖ్యముగా సమూవేలు, యెషయ, యిర్మియా, దానియేలు గ్రంధాలలో స్పష్టం చేయబడినది. నూతన నిబంధనములో, మొదటిగా, “యేసుజనన సూచన-దూత ప్రకటన”లో లూకా 1:32-33లో “ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువ బడును. ప్రభువగు దేవుడు తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అని చూస్తున్నాము. వాస్తవానికి, ప్రభువు బోధనలలో దైవరాజ్యము ప్రాధాన్యం. రెండవదిగా, మత్తయి 2:2లో తూర్పు దిక్కునుండి యెరూషలేమునకు వచ్చిన జ్ఞానులు “యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును చూచి మేము ఆరాధింప వచ్చితిమి” అని పలికారు. మూడవదిగా, లూకా 19:38లో యేసు పుర ప్రవేశ సమయములో, “ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింప బడునుగాక!” అని యూదులు దేవుని స్తుతించారు. నాలుగవదిగా, నేటి సువిశేషం యోహాను 18:33లో “నీవు యూదుల రాజువా?” అని పిలాతు యేసును ప్రశ్నించాడు. దానికి సమాధానముగా యేసు, 37వ వచనములో, “నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీనికొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్యసంబంధులందరు నా మాటనాలకింతురు” అని సామాధాన మిచ్చారు. ఐదవదిగా, యోహాను 19:19లో, పిలాతు “నజరేయుడగు యేసు, యూదుల రాజు” అను బిరుదమును వ్రాయించి యేసు సిలువపై పెట్టించెను. ఆరవదిగా, మత్తయి 20:27-28లో యేసు తన శిష్యులకు, “మీలో ఎవడైన ప్రధముడు కాదలచిన, అతడు మీకు దాసుడై ఉండవలయును. అట్లే మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు” అని భోదించాడు. చివరిగా, మత్తయి 25:31లో, తుది తీర్పున “మనుష్యకుమారుడు సమస్త దూత సమేతముగా తన మహిమతో వచ్చునపుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును” అని చదువుచున్నాము.
ప్రియ సహోదరీసహోదరులారా! ఇంతకు ‘దైవరాజ్యం’ అనగా ఏమిటి? ఏ కుటుంబములోనైతే, ప్రేమ ఉంటుందో, అక్కడ దైవరాజ్యం ఉంటుంది. ఏ దేశమైతే, బలహీనులపట్ల శ్రద్ధవహిస్తుందో అక్కడ దైవరాజ్యం ఉంటుంది. ఏ విచారణ అయితే అవసరతలోనున్న వారికి చేరువవుతుందో, అక్కడ దైవరాజ్యం ఉంటుంది. ఎప్పుడైతే, ఆకలిగొన్న వారికి ఆహారం ఇవ్వబడుతుందో, ఆశ్రయం లేనివారికి ఆశ్రయం కల్పించ బడుతుందో,నిర్లక్ష్యం చేయబడినవారిపట్ల శ్రద్ధ చూపబడుతుందో, అక్కడ దైవరాజ్యం నెలకొంటుంది. అన్యాయపు చట్టాలు రద్దుచేయబడతాయో, అన్యాయం, న్యాయముగా మార్చబడుతుందో, యుద్ధం నివారించబడుతుందో, అచ్చట దైవరాజ్యం నెలకొంటుంది. పేదరిక నివారణ, అజ్ఞానమును రూపుమాపుటలో, విశ్వాసాన్ని అందించుటలో చేతులు కలుపుతారో అచ్చట దైవరాజ్యం నెలకొంటుంది.
యేసును ఆలకించని యెడల, ప్రేమ-సేవ లేని యెడల, ఆయన నడిపించు మార్గములో అనుసరించని యెడల, యేసుక్రీస్తు మనకు రాకు కానేరడు. క్రీస్తుతో నడచినప్పుడే, సువార్తానుసారముగా జీవించినప్పుడే, క్రీస్తు రాజ్యమునకు చెందిన కారము అవుతాము.
క్రీస్తు మన జీవితాలకు రారాజు. మనలను పరిపాలించు వెసలుబాటు మనం ఆయనకు ఇవ్వాలి, అనగా మనం ఆయనకు లోబడి, ఆయన ఆజ్ఞలు, బోధనల ప్రకారం జీవించాలి.
రారాజు క్రీస్తు వినయముగల సేవ, సత్యముగల జీవితాన్ని ఆదర్శముగా అనుసరించాలి. ఆయన సేవించుటకే ఈ లోకమునకు వచ్చియున్నాడు. సత్యమునకు సాక్ష్యమీయ వచ్చానని ప్రభువు చెప్పియున్నారు. ఆ సత్యమునకు మనము కూడా సాక్ష్యమీయవలయును.
క్రీస్తు ఒసగిన ప్రధాన ఆజ్ఞను మనం పాటించాలి: దైవప్రేమ మరియు సోదరప్రేమ.
No comments:
Post a Comment